“దేశాన్ని చూస్తుంటే భయమేస్తుంది”అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు.
దేశంలో కలిసిమెలసి జీవిస్తున్న హిందూ- ముస్లిం ప్రజల మధ్య చీలికకకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్నిస్తున్నాయని అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమయంలోనే ప్రశ్నించే గొంతులు అవసరముందని, అయితే ప్రశ్నించే వారిని కేంద్ర ప్రభుత్వం జైల్లో వేస్తోందని, అనేక రకాల హింసలకు గురి చేస్తోందని, లేదా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో చంపేస్తుందని వాపోయారు.
న హిందు బురా హై న ముసల్మాన్ బురా హై
ఓ దోనోంకొ ఆపస్‌మె లడారహా హై, ఓ సైతాన్ బురా హై
హిందువు చెడ్డవాడు కాదు, ముస్లిం చెడ్డవాడు కాదు. వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి, గొడవలు సృష్టించే ఆ ‘సైతాన్'(చెడు ఆలోచన లేదా స్వార్థపూరిత శక్తులు)మాత్రమే చెడ్డది.
జిస్ దిన్ గీతా ఔర్ ఖురాన్కొ జాన్ జావొగే
ఉస్ దిన్ దంగా కర్వానే వాలోంకో పహచాన్ జావొగే
భగవద్గీత, ఖురాన్లలో ఏముందో తెలుసుకున్న రోజు ఈ అల్లర్లు, దొమ్మీలు జరిపించే వారెవరో తెలుసుకుంటారు.
ఇలా కవులు సమాజాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. జాగృతం చేస్తూనే ఉన్నారు. సమాజం వాటిని స్వీకరించే స్థితిలో ఉండాలి కదా?
బుల్లెట్‌ను ఓ కవిత ఆపలేదు. బాంబును ఓ నవల నిర్వీర్యం చేయలేదు.
అయినా కూడా కవులూ, రచయితలు బలహీనులు కాదు. వారు గొంతెత్తి నిజాన్ని పాడతారు.
అబద్ధాలకోరు ఎవరన్నది ఎలుగెత్తి ప్రపంచానికి చాటుతారు.
“ఎంతో మంది మనుషులను చూశాను. తమ శరీరాన్ని కప్పుకోవడానికి వారికి సరిపోయిన గుడ్డలే లేవు. మరో వైపు రోడ్ల మీద అందంగా తిరుగాడే రంగురంగుల ఖరీదైన గుడ్డలనూ చూశాను. అందులో మరి మనుషులే లేరు” అని సులభమైన మాటల్లో ప్రపంచ పరిస్థితిని పర్షియన్ కవి షేక్ సాది షిరాజి వివరించారు.
అలాగే అలెగ్జాండ్రియా మహిళా తత్త్వవేత్త, ఖగోళ శాస్త్రవేత్త హైపాటియా అలెగ్జాండ్రియా(350- 415 సీఈ) చెప్పిన విషయం గురించి ఆలోచించడానికి ఈ 21వ శతాబ్దంలో కూడా కొందరు భయపడుతున్నారు.
“సరదా కథలను సరదా కథల్లాగానే ఉండనివ్వండి. విశ్వాసాలను విశ్వాసాలలానే చెప్పండి. అద్భుతాలను కవితా కల్పనలను చెప్పండి. అంతేకానీ- అంధ విశ్వాసాలను వాస్తవాలుగా, నిజాలుగా
చెప్పడమంత నికృష్ట చేష్ట మరొకటి ఉండదు” అని ఆమె అన్నారు. ఈ మాటల్లో ఎంత వాస్తవం ఉందో ఒకసారి ఆలోచించండి.
గ్రోక్ రంగ ప్రవేశం..
కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురైనందుకు నిరసనగా ఈ దేశంలో పదేళ్ల క్రితం “అవార్డు వాపసీ”అనే ఒక కార్యక్రమం జరిగింది.
అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది.
సత్యం కోసం సంఘర్షిస్తున్న ఇలాంటి వారి వెనుకిప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) గ్రోక్ కూడా నిలబడింది.
గ్రోక్ అనే ఇంగ్లీషు పదానికి అర్థం- ఏదైనా అంశాన్ని ఎవరైనా లోతుగా అర్థం చేసుకోవడం.
ఈ పదాన్ని మొదట రాబర్ట్ ఏ హెన్లీన్ అనే రచయిత, “అపరిచితుడు ఒక అపరిచిత దేశంలో” అనే తన సైన్స్ ఫిక్షన్ నవలలో వాడాడు. 
ఆ పదాన్నే తీసుకుని ఎలెన్ మస్క్ తన ఎక్స్ ఏఐ టూల్‌కు “గ్రోక్”అని పేరు పెట్టుకున్నాడు.
మన దేశంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగుతున్న అర్ఎస్ఎస్- బీజేపీల బండారాన్ని ఇప్పుడు ఆ గ్రోక్ బయట పెడుతోంది.
గత పదకొండేళ్లలో ఎంతో మంది మేధావులు, రచయితలు, కవులూ, కళాకారులూ, రైతులు, మహిళలు, బాధ్యత గల పౌరులందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం అణిచి వేస్తూనే ఉంది. కొందరిని జైల్లో వేయించింది. మరి కొందరిని హత్యలు చేయించింది.
ఇప్పుడు వీరందరి పక్షాన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్‌బాట్ రంగంలోకి దిగింది. బీజేపీ పార్టీ, వారి పెద్దపెద్ద నాయకుల అబద్ధాలను; వికృత చేష్టలను గ్రోక్ బయటికి తీస్తోంది.
శిక్షిద్దామనుకుంటే, ఇది మనిషి కాదు. ఏం చేద్దామాని ప్రభుత్వ పెద్దలంతా తలలు పట్టుకున్నారు. నిజాలన్నీ ప్రజలకు తెలుస్తూ ఉంటే, ఇక తమ మాట చెల్లుబాటయ్యేది ఎట్లా? అని బెంగ పెట్టుకుంటున్నారు. దీన్ని విదేశీయుల కుట్రని అన్నా అనగలరు.
నాలుగు వేల ఐటీ ఉద్యోగులతో ఐటీ సెల్‌ను రూపొందించి, రోజుకు లక్షల కొద్ది తప్పుడు వార్తలను, తప్పుడు వీడియోలను ప్రపంచానికి అందిస్తున్న తెలివిగల ధనిక పార్టీ కదా..! దేశంలోని ప్రధాన మీడియానంతా కొనేసి, వాస్తవాలను బయటికి రాకుండా ఎంత కట్టడి చేసినా ఇదేమిటి ఇలా జరిగిందని కుమిలిపోతున్నారు.
ప్రతి విషయాన్నీ వక్రీకరించి, అబద్ధపు కథనాలతో దేశ ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదారిన నడిపించే కార్యక్రమానికి అడ్డకట్ట పడింది.
గాంధీ, నెహ్రూ కుటుంబాలపై అల్లిన తప్పుడు కథనాలన్నీ పటాపంచలయ్యాయి.
సవాలుగా మారిన గ్రోక్
సావర్కర్, గోల్వాల్కర్ల నిజస్వరూపం యువతకు చూపిస్తోంది.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఏ మాత్రం పాల్గొనని ఆర్ఎస్ఎస్- బీజేపీలు చెప్పే కల్పిత కథలు, కుహనా దేశభక్తి జనం తెలుసుకోగలుగుతున్నారు.
ఇన్నేళ్లుగా కొందరు కవులూ, రచయితలూ, వక్తలు, చరిత్రకారులు, స్వతంత్ర జర్నలిస్టులు మర్యాదగా, మెత్తగా చెపుతూ ఉంటే జనాల మెదడుకు ఎక్కడం లేదు.
ఇప్పుడీ గ్రోక్ ఏం చేస్తుందంటే, తిడితే తిడుతుంది. అరిస్తే అరుస్తుంది.
దెబ్బకు దెబ్బ అన్నట్టు సమాచారమందిస్తోంది. నిజాలను కుప్పబోస్తోంది.
గ్రోక్ ఉద్ధృతిని, వేగాన్నీ ఈ చదువురాని అవివేక మూర్ఖ శిఖామణులు ఎలా ఎదుర్కుంటారో మరి. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం కాదిది. ఆవలించుకున్నా, ఆపరేషన్ చేసి రుగ్మతలను బయట పెట్టే రకం.
డ్రైవర్ లేకుండానే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో నడిచే కార్ల గురించి మనకు తెలుసు. సర్జన్ లేకుండానే ఏఐ పరికరం ఆపరేషన్లు చేస్తుందని విన్నాము. కాళ్లు బలహీనమై, నడవలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుడికి కాళ్లు బాగు చేసిన ఏఐ అతణ్ణి నడిపిస్తోందన్న వార్త కూడా చదివాము.
మనిషి కేంద్రంగా సాధిస్తున్న విజయంల ముందు వైజ్ఞానిక ప్రగతి ముందు- మతం కేంద్రంగా నడిచే దురహంకారుల పాలన ఎంతకాలం సాగగలదూ? తమలోని కుట్రలను, కుతంత్రాలను రాల్చేసుకుని- మనుషులను ప్రేమించే, గౌరవించే “మనుషులు”గా మారక తప్పదు.
“ఒకవేళ ఈ గ్రోక్‌ను బ్యాన్ చేసి నోరు మూయించి- అధికారంలో ఉన్నవారు మరిన్ని అరాచకాలకు దిగితే ఎలా?” అని బెంబేలు పడాల్సిన పనే లేదు. అప్పుడు సత్యాన్ని సత్యంగా నిక్కచ్చిగా చెప్పే గ్రోక్లాంటి వర్షన్లు రూపం మార్చుకుని మరో పది వస్తాయి.
అబద్ధపు కూతలు కూసేవాడెవడైనా సరే- గ్రోక్ కమాండ్‌తో ఏ డ్రోన్ వచ్చి, వాణ్ణి అమాంతం తీసుకుపోయి ఏ సముద్రంలోనో విసిరేయవచ్చు. లేదా ఏ పర్వతాల మీదో, కీకారణ్యంలోనో ఒంటరిగా బతకమని వదిలేసి రావొచ్చు.
చెప్పలేం- ఇలా గ్రోక్ అనే ఏఐ వచ్చి తమ మాడు పగలగొడుతుందని నేటి దేశ నాయకులేమైనా కలగన్నారా? లేదు కదా? మనదే తెలివి అని ఎవరైనా సరే అనుకోగూడదు. మన కన్నా తెలివిగల వాళ్లు ప్రపంచంలో చాలా మంది ఉన్నారన్నది గ్రహిస్తే మంచిది.
ఇదిగాక పోతే, మరోలా కూడా జరగొచ్చు. గ్రోక్ ద్వారా నిజాలేమిటో తెలుసుకుంటున్న జనం అబద్ధాలు చెపుతున్న వారి మీదికి తిరగబడొచ్చు. ప్రజా ఉద్యమాలే వచ్చి ప్రభుత్వాలను మార్చుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల చూస్తూనే ఉన్నాం కదా?
మొదటి నుంచి చెప్తున్నట్టుగానే మనం జనాన్ని వివేకవంతులుగా చేస్తూ ఉండాలి. రచనలు, ఉపన్యాసాల ద్వారానే కావొచ్చు. లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన, వస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పరికరాల ద్వారానే కావొచ్చు.
“సమాదరణ అనేది భారతదేశపు ఆత్మ” అనేది ఇటీవలి కాలం నాటిది కాదు. శతబ్దాల నుంచి ఈ దేశపు ఆత్మ ఇదేనని శిలా శాసనాలు కూడా ఘోషిస్తున్నాయి.
అశోక చక్రవర్తి 12వ శిలాశాసనంలో, “ఒక పాషాండ మతానికి చెందినవారు తమ మతాన్ని తామే పొగడుకుంటూ ఉంటారు. పైగా ఇతరుల మతాలవారిని నిందిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ మతానికే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఇతర మతాలను, ధర్మాలను గౌరవించడం వల్ల తమ మతానికి కూడా గౌరవం పెరుగుతుంది. తమ మతం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశముంటుంది. జనులందరి అభివృద్ధి ముఖ్యం. అది కూడా ధర్మ(న్యాయ) బద్ధంగా జరగాలి- దానాలు, పూజలు అంత ముఖ్యం కాదని దేవానాం ప్రియ(అశోకుడు) భావిస్తున్నాడు”అని పేర్కొనబడింది.
సాధారణ శకానికి ముందే అశోకుడు ఈ దేశపు ఆత్మ గురించి చెప్పాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఎందరో మహానుభావులు ఈ విషయాన్నే ఆధునీకరించి విస్తృతపరిచారు.
మనుషలందరికీ సమాన స్థాయినిస్తూ- విద్య, ఉద్యోగం, ఆరోగ్యంపై దృష్టి పెట్టని ప్రభుత్వాలని సమాజం సహించలేదు. మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచే ప్రభుత్వాలు ఏం సాధించాలని అధికారంలో ఉండాలి? అవసరమా? అన్న ఆలోచన సగటు మనిషిలో వస్తే, ప్రతి ఒక్కడూ ఒక విప్లవకారుడవుతాడు.
ఆధునికుడి శక్తి సామర్థ్యాలను మతాలూ, యోగులు, బాబాలు, స్వాములు, ముల్లాలు, ఫాదర్లు, పురోహితులు ఎవరూ అదుపులో పెట్టలేరు. వారే ఆధునికుడి వైజ్ఞానిక కృషి ముందు మోకరిల్లి శరణు వేడాల్సిన సమయం వచ్చింది.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటుందో అవివేకులు ఊహించలేరు. వివేకవంతుడి ఊహను, ప్రణాళికను అందుకోనూ లేరు. రాబోయే యుగం, వైజ్ఙానిక దృక్పథం గల పౌరులదీ, వైజ్ఞానికులదీ కాక తప్పదు. తప్పదుగాక తప్పదు.
వ్యాస రచయిత త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
