French workers general strike in 2025
కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీని మీద భారత కార్మిక వర్గం వెంటనే స్పందించింది. కార్మిక సంఘాలన్నీ 2026 ఫిబ్రవరిలో జాతీయ సమ్మె చేయాలని నిర్ణయించాయి. డిసెంబర్ 22న జరుగనున్న ట్రేడ్ యూనియన్ల సమావేశంలో సమ్మె తేదీ కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించన్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న సమ్మె విస్తృత స్థాయిలో సన్నహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడి కేవలం భారత దేశంలోనే జరుగుతున్నదా? దీని అసలు మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవటం అవసరం ఎంతైనా ఉంది.
2025 డిసెంబర్ 11న పోర్చుగీస్ కార్మిక వర్గం అత్యంత జయప్రదంగా దేశవ్యాప్త సమ్మె చేసింది. అంతకు ముందు నవంబర్ 28, 29 తేదీలలో ఇటలీ కార్మిక వర్గం రెండు రోజులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించింది. అంతకంటే ముందు అక్టోబర్ 2న ఇటలీ, ఫ్రాన్స్ లలో సమ్మెలు జరిగాయి. అక్టోబర్ 1, 14 తేదీలు రెండు రోజులు గ్రీస్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మె చేసింది. ఈ కాలంలోనే అనేక ఇతర దేశాలలో పెద్ద ఎత్తున సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నాయి.
వీటన్నింటిలో పూసలో దారంలాగా కలిపి ఉంచే ముఖ్యమైన అంశం కార్మిక చట్టాలలో మార్పులు చేయడం, పని గంటలు పెంచడం, శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికమైన ఎలాంటి సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేని ఉద్యోగాల నియామకం; ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెరుగుదల లేకపోవడం, ప్రజలపై పన్నుల భారం పెంచి కార్పొరేట్లకు పన్నుల రాయితీలు కల్పించడం. ఇవే అన్ని దేశాలలో జరిగిన, జరుగుతున్న ఆందోళనలలో కీలకమైన సమస్యలు.
ఈ నేపథ్యంలోనే భారతదేశంలో లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయని మనం గుర్తించాలి. దీనికి మూలం ప్రపంచీకరణ.
సోవిఎట్ యూనియన్, తూర్పు దేశాలలో సోషలిస్ట్ వ్యవస్థలు పతనమైన తర్వాత ఏక ధృవ ప్రపంచం పేరుతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంపై దాడి, కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడి స్వేచ్ఛ ఇవ్వడం కీలకమైన మలుపు. అది నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరున శరవేగంతో ప్రపంచీకరణ విధానాలు అమలు జరుపుతున్నారు. పార్లమెంటులో వామపక్షల బలం బాగా పడిపోవటం మోడీ ప్రభుత్వానికి మరింత అవకాశాన్ని ఇచ్చింది.
నేడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉన్నది. అమెరికాతో సహా చిన్న, పెద్ద తేడా లేకుండా పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు అమలు జరుపుతున్న దేశాలు అన్నింటిలో కార్మిక వర్గం, మొత్తం ప్రజానీకంపై దాడి పెరిగింది. కార్పొరేట్ శక్తులకు సహజ వనరులతో సహా దేశ సంపద లూటీ కి అవకాశం కల్పించడంతోపాటు కార్మిక వర్గ హక్కులు, వేతనాలపై దాడి చేసి ఇబ్బడి ముబ్బడిగా సంపదను పెంచుకునేందుకు ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కీలకమైన అంశాన్ని మనం అర్థం చేసుకోకుండా, ప్రపంచవ్యాప్త కార్మిక వర్గ పోరాటాలను అర్థం చేసుకోకుండా మన దేశంలో కార్మిక వర్గం తన హక్కులను కాపాడుకోవడం అంత తేలికైన విషయం కాదు.
పోర్చుగీసులో సమ్మె
పోర్చుగీసు ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులను ప్రతిపాదించింది
♦ శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన, ఎలాంటి భద్రత, చట్టబద్ధ సౌకర్యాలు లేకుండా కార్మికులను పనిలో నియమించుకునే స్వేచ్ఛ యజమానులకు ఇవ్వడం
♦ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం మీద నిషేధాలు విధించడం
♦ సంయుక్త బేరసారాల మీద ఆంక్షలు
♦ ప్రసూతి సెలవల కుదింపు
♦ తల్లిదండ్రుల భద్రత సదుపాయాల మీద పై కోత

ఇవి ప్రధానమైన సవరణలు. వీటికి వ్యతిరేకంగా పోర్చుగీసులో అతిపెద్ద ట్రేడ్ యూనియన్- సీజీటీపీ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థ ప్రభుత్వం తలపెట్టిన కార్మిక చట్టాల సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది.
ఒక గంట, రెండు గంటలు వారంలో ఒకరోజు సమ్మెలతో ప్రారంభించి నవంబర్ 8న దేశ రాజధాని లెస్బిన్లో లక్షకుపైగా కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించింది.(పోర్చుగీసు దేశ జనాభా ఒక కోటి 70 లక్షలు మాత్రమే). ఆ ప్రదర్శనలో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. కార్మిక చట్టాలలో ప్రతిపాదించిన సవరణలు రద్దు చేయకపోతే డిసెంబర్ 11న సమ్మెకు పోతామని ప్రకటించింది. ఆ రోజు నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి ప్రాంతం, ప్రతి పరిశ్రమలో, ప్రతి షిఫ్ట్‌లోని కార్మికులందరికీ ఈ వివరాలు తెలియజేసి సమ్మెకు వాళ్ళ ఆమోదం తీసుకోవడం ప్రధాన క్యాంపెయిన్‌గా నడిచింది.
సీజీటీపీ నిర్వహించిన ఈ క్యాంపెయిన్ ఫలితంగా మరొక ట్రేడ్ యూనియన్- యూజీటీ కూడా అనివార్యంగా డిసెంబర్ 11న తాము కూడా దేశవ్యాప్త సమ్మెకు వెళుతున్నట్లుగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ విధంగా సమైక్య దేశవ్యాప్త సమ్మె డిసెంబర్ 11న అత్యంత జయప్రదంగా జరిగింది.
తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న కొద్దిమంది కార్మికులు మాత్రమే అనివార్యమైన పరిస్థితులలో విధులకు హాజరయ్యారు. మిగతా కార్మికులంతా నిరసనలో దిగడం వల్ల పోర్టు, రైల్వే, తపాలా, వైద్యరంగం, రోడ్డు రవాణా, దాదాపుగా స్తంభించిపోయాయి. డిసెంబర్ 11 సమ్మె ఒక నిరసన చర్య మాత్రమేనని కార్మిక చట్టాల సవరణ ప్రతిపాదనలు రద్దు ఆయ్యేంతవరకు కార్మిక వర్గం నిద్రపోదని మరోసారి ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఇటలీలో సమ్మె
ఇటలీలో ప్రస్తుతం పచ్చి నియంతృత(నియంత ముసౌలీ వారసులు) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం ఆమోదించిన బడ్జెట్లో
♦ వేతన పెరుగుదలపై నిషేధం
♦ అశాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు
♦ వేతనాలు, పెన్షన్లు ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచకపోవడం
♦ విద్య, వైద్యం, గృహనిర్మాణ, రవాణా రంగాలకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం
♦ రక్షణ రంగానికి భారీగా నిధులు పెంచడం కీలకమైన అంశాలు

వీటికి వ్యతిరేకంగా యూఎస్బీ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక వర్గం పెద్ద ఎత్తున స్పందించి నవంబర్ 28, 29 తేదీలలో రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెను విజయవంత చేసింది. 28వ తేదీన ఎక్కడ సమ్మె చేస్తున్న కార్మికులు 60 నగరాలలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. 29న దేశ రాజధాని రోమ్ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. లక్షకు పైగా కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.(ఇటలీ దేశ జనాభా 5 కోట్ల 90 లక్షలు).
ఫ్రెంచ్ కార్మిక వర్గ సమ్మె
ఫ్రాన్స్ దేశంలో వామపక్ష పార్టీల కూటమి పార్లమెంటు ఎన్నికల్లో అతిపెద్ద శక్తిగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ పొందలేకపోయింది. దీన్ని అదునుగా తీసుకొని వామపక్ష వ్యతిరేక అధ్యక్షుడు మక్రాన్ ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రభుత్వం కార్మిక వర్గం మీద దాడి, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, రక్షణ వ్యాయాన్ని పెంచడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
తాజాగా పెన్షన్ చెల్లింపులో భారీ మార్పులు చేస్తూ ప్రజాహిత రంగాలకు కేటాయింపులను కుదిస్తూ, ప్రజలపై పన్నుల భారం పెంచింది. దానికి వ్యతిరేకంగా వెంటనే దేశవ్యాప్త సమ్మెకు అతిపెద్ద కార్మిక సంస్థ సీజీటీ పిలుపునిచ్చింది. కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ అక్టోబర్ 2 తేదీ అనూహ్యమైన రీతిలో సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో విమానయాన సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొనడంతో అంతర్జాతీయ విమానాలు కూడా వివిధ దేశాల ఎయిర్ పోర్టులలో నిలిచిపోయాయి.
వ్యాసకర్త అక్టోబర్ 3న పారిస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ 80 వ్యవస్థాపక ఉత్సవాలలో పాల్గొనడానికి బ్రిటన్‌లోని బర్మింగ్ హమ్ విమానాశ్రయం నుంచి విమానంలో పారిస్‌కు బయలుదేరారు. ప్రయాణికులు అందరూ ఎక్కి, విమాన తలుపులు మూసివేసి, మరొక నిమిషంలో విమానం బయలుదేరాల్సి ఉండగా ఆకస్మికంగా విమానం నిలిచిపోయింది. ప్రయాణికులందరూ విమానంలో ఉండిపోయారు. కారణం పారిస్‌లో విమానయాన సిబ్బంది సమ్మెలో ఉన్న కారణంగా బ్రిటన్ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమానం పారిస్ విమానాశ్రయంలో దిగడానికి అనుమతి లభించని కారణంగా గంటా పది నిమిషాలు విమానం బర్మిగ్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. అక్టోబర్ రెండో తేదీ సండే రోజు పారిస్‌లో వర్షాన్ని సహితం లెక్కచేయకుండా భారీ ప్రదర్శన జరిగింది.

గ్రీస్ దేశంలో సమ్మె
గ్రీస్ దేశ ప్రభుత్వం బడ్జెట్ కార్మిక ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలు చేసింది
♦ కార్మికుల పనిగంటలను 13 గంటలకు పెంచడం
♦ విద్య, వైద్యం, సామాజిక భద్రత సదుపాయాలకు కేటాయించి నిధులకు బడ్జెట్లో కోత
♦ రక్షణ రంగానికి భారిగా నిధుల పెంపు
♦ సాధారణ ప్రజలపై పన్నుల భారాన్ని పెంచి కార్పొరేట్లకు పన్ను రాయితీలు కల్పన
ప్రజా- కార్మిక వ్యతిరేక ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా గ్రీస్‌లో అతి పెద్ద కార్మిక సంఘం పీఏఎంఈ అక్టోబర్ 1, 14 తేదీలలో రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
వారానికి 5 రోజుల పని, రోజుకు 7 గంటల పని నిర్ణయించాలని; సంయుక్త బేరసారాల ఒప్పందాలకు అవకాశం కల్పించాలని, ధరలకు అనుగుణంగా కనీస అవసరాలు తీరేందుకు సరిపడా కనీస వేతనాలు నిర్ణయించాలని, పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న అమానుషమైన దాడికి మద్దతు ఉపసంహరించుకోవాలనేవీ సమ్మెలోని ప్రధానమైన డిమాండ్లు.
రెండు రోజులసమ్మె అత్యంత విజయవంతంగా జరిగింది. గ్రీస్ దేశంలోని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అందరూ సమ్మెలో పాల్గొన్నాయి. దాదాపుగా దేశం స్తంభించిపోయింది. అంతటితో ఆగలేదు. పార్లమెంటు బడ్జెట్‌కు ఆమోదం తెలిపే డిసెంబర్ 16న మరొక రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పీఏఎంఈ పిలుపునిచ్చింది.
ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగీస్, గ్రీస్ దేశాలలో జరిగిన భారీ సమ్మెలలో కీలకమైన డిమాండ్లు కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడి. ఆ పరంపరలో భాగమే భారత ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుకు నోటిఫికేషన్ జారీ చేయడం. అందుచేత కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడికి, ప్రజలపై మోపబడుతున్న భారాలకు, కార్పొరేట్ సంస్థలకు విచ్చలవిడిగా సహజ వనరులు కట్టబెట్టడంతోపాటు అపరిమిత లాభాలు, సంపద కూడబెట్టడానికి ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే ప్రపంచీకరణ. ఇదే విధానాలు అనుసరిస్తున్న మాజీ సోషలిస్టు దేశమైన బల్గేరియాలో ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మల్కేరియా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.
కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్ మార్క్స్, ఎంగిల్స్లు చెప్పినట్లుగా కార్మిక వర్గం ఏదో ఒక దేశానికి పరిమితం కాదు. “ప్రపంచ కార్మికులారా ఏకంకండి- పోయేదేమీ లేదు- బానిస సంకెళ్లు తప్ప” అని ఇచ్చిన నినాదం, చేసిన విజ్ఞప్తి ఈరోజు ప్రపంచవ్యాప్త పరిణామాలు అక్షర సత్యాలని రుజువవుతున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో జరగనున్న దేశవ్యాప్త సమ్మె ఒక సాధారణ సమ్మెగా చూడడానికి వీలు లేనిది.
యూనియన్ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క కార్మికుడికి లేబర్ కోడ్స్ ప్రమాదం, కార్మిక వర్గంపై జరుగుతున్న దాడి, ప్రపంచీకరణ విధానాలను తెలియజేసి; ప్రతి ఒక్క కార్మికుడు ఇది నిజమని శపథం తీసుకొని సమ్మెలో పాల్గొనే విధంగా భారీ ఎత్తున సన్నాహాలు చేయాలి.
గతంలో సమ్మెల సందర్భంగా కరపత్రాలు, పోస్టర్లు, గేటు మీటింగ్లాంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక గేట్లు, పని స్థలాలు, నివాస స్థలాలు, ప్రతి దగ్గర మారుమోగేలా ప్రచారం నిర్వహించాలి. ఏ ఒక్క కార్మికుడికి ఈ సమ్మె ఎందుకు జరుగుతున్నది, రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాలు ఏంటి తెలియకుండా ఉండటానికి వీలులేని విధంగా ప్రచారం జరగాలి. ఇందులో రవాణా రంగం, ఆర్టీసీ కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఒక కీలకమైన పాత్ర పోషించాలి. రవాణా స్తంభిస్తే మొత్తం ప్రజాజీవనం స్తంభిస్తుంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ కీలకమైన ప్రాధాన్యతని, అవసరాన్ని గుర్తించాలని, విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
