ఆదివాసి- ఆధునిక మానవవుని మూలవాసి. ఆ మానవుడే, అతని జీవనశైలే ముందు తరాలకు మార్గదర్శి. ప్రపంచంలో రెండు నాగరికతలు విశ్వఖ్యాతిని పొందాయి.
అందులో ఒకటి మెసపటోమియా, మరోటి హరప్పా మొహంజదారో. ఈ భూగోళంపైనా మానవుడు దినదిన వృద్ధిని నమోదు చేసిన చారిత్రక ఆనవాళ్ల కేంద్రస్థానాలివి.
తారీఖులు, దస్తావీజులు ఇవి చరిత్రకాదన్నారు శ్రీశ్రీ. నిజమే, దానికి మించిన సజీవ ప్రయాణంలో అది ఇటుకల రూపంలో, శిథిల నిర్మాణాల రూపంలో గత కాలపు వైభవాన్ని వ్యక్తీకరిస్తున్నది.
ఇదంతా నేటి నాగరికత ప్రపంచానికి మూలాధారమైనది. అక్కడే, ఆనాడు తన మనోభావాలను వ్యక్తీకరించిన మానవుని అక్షరమే నేటి ఆదివాసీ సాంస్కృతిక జీవన శైలికి ప్రతీక.
సింధూ నాగరికతలో లభించిన మట్టి పలకల అక్షరాల నమూనాలు- భావనలోనూ, భాషలోనూ నేటి ఆదివాసీల లిపికి సరిపోలుతున్నాయి.
అవనిపై అతిపెద్ద ఆదివాసి జాతర
మనకు తెలిసినంత వరకు, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు- ఇప్పటి వరకు ఒక పుస్తక ప్రదర్శనను జాతరలో ఏర్పాటు చేయలేదు.
ప్రస్తుతం సరికొత్తగా ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టానికి మేడారం కేంద్రస్థానమైంది.
యుద్ధ వీరుల, వీర నారీమణుల అజరామర త్యాగాల చిహ్నంగా మేడారం జాతర సాగుతూ ఉన్నది. ఉత్తుంగతరంగంలా, ఉగ్ర గోదావరి ప్రవాహంలా జన వాహిని జాతరకు పోటెత్తుతున్నది.
అలనాటి వీరోచిత యుద్ధ ఖడ్గాల మధ్య అక్షరాల పొందిక తొట్టతొలిసారి అమరింది అక్కడ.
తెలంగాణ పబ్లికేషన్స్ సంస్థ అధినేత కోయ చంద్రమోహన్ అక్కడ తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సాంస్కృతిక మూలాల పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
పరంపరలో భాగమైన పుస్తకం
నేటి వరకు ఈ మహా ఆదివాసి కుంభమేళ గురించి లిఖిత ఆధారాలు బహుతక్కువ. 1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేడారాన్ని అధికారిక జాతరగా గుర్తించారు.
ఆనాటి నుంచి ఈ జాతర ప్రాముఖ్యం దినదిన ప్రవర్థమానమై వందలూ, వేలూ, లక్షలూ, కోట్లాది మంది భక్తులకు దర్శనియ స్థలమైంది.
ఆదివాసీ అంటే, నిష్కల్మషమైన- నిష్కపటమైన జీవన రీతికి నిలువుటద్దం. మహాద్భుతమైన ఈ చారిత్రక పరంపరను అనేక అంశాల మేళవింపులో ఇప్పుడు పుస్తకం ఒక భాగమైంది.
అక్షర వ్యాపారంగా కాకుండా- తొలి అడుగుల, పలుకుబడుల తాత్విక చింతనను అచ్చు రూపంలో నేటి- రాబోయే తరాలకు అందించడంలో ఒక భాగంగా ఈ పుస్తక ప్రదర్శనను చూడాలి.
సార్థకం చేసుకుంటున్న ముద్రణా సంస్థ
తెలంగాణ పేరుతో జనబాహుళ్యంలో ఉన్న ఒక ముద్రణా సంస్థ తన పేరును సార్థకం చేసుకుంటూ, జంపన్న వాగు- అశేష జనబాహుళ్యం మధ్య అక్షర తోరణాలను ఆవిష్కరించింది. ఆ జాతరకు వచ్చే వారు- భూమిని నమ్ముకున్నవారు, మొలకలను హత్తకునే వారు, భోళాతనాన్నే జీవితంగా ఆవిష్కరించుకున్నవారు, మట్టి వేళ్లతో మహా తల్లులను పూజింజేందుకు వచ్చినవారు.
ఇలాంటి వారికి పుస్తకాల అమ్మడం ఎందుకని కొందరన్నరు. దండగ ఖర్చు తప్పా, ప్రయోజనం ఉండదని మరికొందరన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా అక్షరం, దాని శక్తిని ఇతరులకు చెప్పాలనే తలంపే తమ ముఖ్యోద్దేశ్యమని సంస్థ పేర్కొంది.
తెలంగాణను ప్రతిబింబించే పుస్తకాలు
మేడారం జాతరలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ జీవ నాడిని పట్టుకున్న పుస్తకాలున్నాయి.
సమక్క సారక్కల నుంచి సామ్రాజ్ఞి రుద్రమ్మ దేవి వీరోచిత ఆవిష్కరణలను చేసిన మహా రచయితలు- పరిశోధకులైన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, జూలూరు గౌరీశంకర్, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఊర్మిలా పింగ్లే, ప్రొఫెసర్ లక్ష్మణ్, ద్యావనపల్లి సత్యనారాయణ, కట్టా శేఖర్‌రెడ్డి తదితరుల పుస్తకాలతో పాటు; తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ నందిని సిధారెడ్డి, శ్రీరామోజు, ప్రొఫెసర్ ముత్యం, తగుళ్ల గోపాల్, నర్రా ప్రవీణ్‌రెడ్డి తదితరుల పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
చారిత్రక, సాంస్కృతిక పుస్తకాలు
అంతేకాకుండా తెలంగాణ సాహిత్యాన్ని, జీవన సారాన్ని బలంగా వ్యక్తీకరించిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నో గ్రంథాలు వెలువరించారు.
ప్రఖ్యాత సంపాదకులు కే శ్రీనివాస్, జగత్ విఖ్యాతమైన వాగ్గేయకారులు గోరేటి వెంకన్న, నమస్తే తెలంగాణ తొలి సంపాదకులు అల్లం నారాయణ- వీరి సోదరులు అల్లం రాజయ్య, సాహూ, పీ చంద్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి తదితరులు ఈ కోవలోకి వస్తారు. వీరికి సంబంధించిన పుస్తకాలు కూడా తెలంగాణ పబ్లికేషన్స్ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి.
వీరితో పాటు గత- ఆధునిక తెలంగాణ జీవితపు కోణాలను ముందు తరాలకు అందిస్తున్నవారిలో పరవస్తు లోకేశ్వర్, రాజేంద్ర ప్రసాద్, ఏనుగు నరసింహారెడ్డి, కస్తూరి మురళీ కృష్ణ వీరందరి కంటే తొలి వరుసలో చెప్పుకోదగిన వారు పీవీ నరసింహారావు(మాజీ ప్రధాని), వెల్దుర్తి మాణిక్యాలరావు(చరిత్ర పరిశోధకులు) అనంతరం చాలామంది ఆదివాసీల, మైదాన ప్రాంత ప్రజల చారిత్రక అంశాలను వెలుగులోకి తెచ్చారు.
వారిలో మేడారం జాతర గురించి పరిశోధనాత్మక గ్రంథాన్ని దివిటి అంజనీదేవి వెలువరించారు. ఈ ఒరవడిలోనే మహిళా జీవితాల దృక్కోణాన్ని సాహిత్యంలో ఆవిష్కరించారు ఉపాధ్యాయులు దాసరి శాంతకుమారి.
గతం సహాయంతో వర్తమానాన్ని అర్థం చేసుకునేలా- భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేలా వీరి పుస్తకాలను కూడా మేడారం జాతరలో ఏర్పాటు చేసిన స్టాల్లో అందుబాటులో పెట్టారు.
పుస్తక ప్రదర్శన ఓ కొనసాగింపు
ఆధునిక మానవుని కంటే అక్షర జ్ఞానాన్ని అందుకున్న వారు ఆదివాసీలు. వారి జీవితమెంత నిజాయితీగా ఉంటుందో వారి అక్షరపు అడుగుజాడలే చెపుతాయి. ఆదివాసీలలో భిన్నరకాల సమూహాలున్నాయి. కోయలు, కొండరెడ్లు, గోండులు, కోలాములు, చెంచులు తదితర ఆదిమ తెగలున్నాయి. వీరి గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్థావించిన పుస్తకాలు జాతరలోని తెలంగాణ పబ్లికేషన్స్ స్టాల్లో లభిస్తున్నాయి.
వాస్తవానికి జాతర అనేది, సామూహిక భావ ప్రసరణ కేంద్రాల సమ్మేళనం. ఒక్క మాటలో చెప్పాలంటే, అదొక మాస్ మీడియా కేంద్రస్థానం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, ఈ జాతరకు మునుపెన్నడూ లేని విధంగా మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కేసీఆర్ హయాంలో ప్రపంచ గుర్తింపును మేడారం జాతర పొందింది. ప్రస్తుతం, కాంగ్రెస్ హయాంలో రేవంత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గతకాలపు గుర్తులతో ఆధునిక శోభను సంతరించుకుంది.
తెలంగాణ ఉనికి, అస్తిత్వాలకు సింబాలిక్
నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సమక్క సారక్కలు ప్రేరణా అంశాలుగా ఉన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఈ జాతర గురించి, దీనికి సంబంధించిన మూల మౌఖిక సాహిత్యాన్ని బలంగా బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.
అనంతరం ఈ జాతర గురించి ఆదివాసీల జీవితాల గురించి సామాజిక స్పృహకలిగిన తెలంగాణ వాదులు పలు అంశాలను వెలుగులోకి తెచ్చారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటగా, పాటగా, మాటగా- పలువురు కవులు, కళాకారులకు మేడారం ధీరులే సాహిత్య వస్తువులయ్యారు.
తెలంగాణ జనజీవిత భిన్న అంశాల గురించి ప్రస్థావించినవారిలో ప్రఖ్యాత రచయిత, మహా సంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి తొలి వరుసలో ఉంటారు.
తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రకారులు వీరమల్ల ప్రకాశ్, శ్రీధర్ రావు దేశ్ పాండే తదితరులు తెలంగాణ అస్తిత్వ ఉనికిపై అక్షర సమరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆదివాసీల జాతరకు, వారి చైతన్యపు ప్రవాహంలో భాగమైనవారు ఎందరో ఉన్నారు.
తెలంగాణ చరిత్రను ముందు తరాలకు అందించే పుస్తక రూప ప్రదర్శన సరికొత్త నమూనకు తెలంగాణ పబ్లికేషన్స్ తొలి ప్రయత్నపు ముందడుగు.
పుస్తకాలు అమ్మడం కొనడం కాదు, ఆదివాసీల మధ్య అక్షరమూ అగ్రస్థానాన్ని ఆవిష్కరించగలదని నిరూపించింది మేడారం జాతరలో పుస్తక ప్రదర్శన.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
