ఆధార్ ద్వారా రూపొందించిన డిజిటల్ గుర్తింపు కార్డును కృత్రిమమేధ(ఏఐ)తో మేళవించి, ఫేషియల్ అథెంటికేషన్‌కు ఉపయోగించడం ద్వారా మెరుగైనా సంక్షేమ ఫలితాలు సాధిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం దేశవిదేశాలలో డప్పు కొట్టుకుంటుంది. కానీ క్షేత్రస్థాయి అనుభవాలకు, ప్రభుత్వ ప్రచారానికి మధ్య పొంతన కుదరడం లేదు. అలాగని పెన్షన్‌దారులు ఫేషియల్ అథెంటికేషన్‌ను తిరస్కరిస్తే, ఏకంగా పెన్షనే ఆగిపోతుంది.
రాజస్థాన్: రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో దేవగఢ్ పంచాయితీ పరిధిలో విజయపుర ఒక గ్రామం. ఆ గ్రామంలో ఘీసీ దేవి- 2006నాటికే 70 ఏళ్ల వృద్ధురాలని ఆమె ఓటరు గుర్తింపు కార్డు చెపుతుంది. అంటే, ఇప్పటికీ కాస్త అటుఇటుగా ఆమెకు 90 ఏళ్లు ఉంటాయి. కానీ, ఆధార్‌తో లింకైన ఆమె బయోమెట్రిక్ వివరాలతో కూడిన గుర్తింపు కార్డు ప్రకారం- ప్రస్తుతం ఆమెకు 92 సంవత్సరాలు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పదేళ్ల ముందే- అంటే, 1933 జనవరి 1న ఆమె జన్మించినట్టుగా ఆధార్ కార్డు చెపుతుంది.
ఘీసీ దేవి జీవితాంతం వ్యవసాయకూలీగా పనిచేసింది. కానీ, గత ఏడాది కాలంగా అనారోగ్యంతో మంచమెక్కింది. 20252 నవంబర్ పగటివేళ స్థానిక కమ్యూనిటీ కార్యకర్త ఒక ఎలక్ట్రానిక్ మెషిన్‌తో ఆమె ముఖాన్ని ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా, ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ డిజిటల్ ఫొటో కోసం ఆమె నిటారుగా కూర్చోవడానికి యాతన పడుతోంది.
ఆమె నివాసం ఓ చిన్న గది. గదిలో ఒక మంచం, మూలన ఓ గోధుమ పిండి బస్తా, కొన్ని వంట సామాన్లు, ఖాళీగా ఉన్న అల్మారాలలో కనిపించే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు. బయట సూర్యుడు మండుతున్న గదిలో మాత్రం చిమ్మచీకటి అలుముకుని ఉన్నది.
తన మొబైల్ ఫోన్ కెమెరా వంక చూస్తూ- కళ్లు మూసి తెరవమని ఘీసీ దేవికి కమ్యూనిటీ కార్యకర్త నికేష్ కుమార్ చెప్తున్నాడు. వయోభారంతో వచ్చిన వినికిడి లోపం కారణంగా నికేష్ చెప్పేది ఆమెకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఫోన్ కెమెరా వంక అయోమయంగా చూస్తుంది.
ఆమె మొఖాన్ని ఫోన్ కెమెరాతో స్కాన్ చేయడం నికేష్‌కు సాధ్యం కావడంలేదు. నికేష్ అనేక సార్లు ప్రయత్నం చేశాడు. చుట్టూ జనం పోగయ్యారు. కెమెరా వంక చూస్తూ కన్ను మూసి తెరిస్తేనే ప్రభుత్వమిచ్చే వృద్ధాప్య పింఛను ఆమె ఖాతాలో పడుతుందని బిగ్గరగా అరుస్తూ చెప్తున్నారు. దీంతో చికాకు పడ్డ ఘీసీ దేవి తన గదిలో నుంచి అందరినీ బయటకు వెళ్లమని కేకలు పెట్టింది.
ఘీసీ దేవిలాంటి పేదలు 55 ఏళ్లు నిండితే రాష్ట్ర ప్రభుత్వమిచ్చే 1500 రూపాయల వృద్ధాప్య పింఛనుకు అర్హులు. కానీ, ఈ వృద్ధులందరూ తమ బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించి ఆధార్‌తో అనుసంధానిస్తేనే పింఛనుకు అర్హులవుతారని 2016- 17లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందు పింఛను నగదును పోస్టుమ్యాన్ ఇంటికి తెచ్చిచ్చేవాడు.
వేలుముద్ర ద్వారానో, వచ్చీరాని సంతకం ద్వారానో తమకు పింఛను ముట్టిన విషయాన్ని లబ్ధిదారులు ధృవీకరించేవారు. కానీ, తాజా నిర్ణయాలతో ఈ వృద్ధులందరూ తాము బతుకున్నామని తమ కళ్లతో మొబైల్ కెమరాకు చెప్తేనే మరుసటి సంవత్సరం పింఛను తీసుకోవడానికి అర్హులవుతారు.
ఘీసీ దేవి వేళ్లు బాగా ముడతలు పడి వంగిపోయాయి. అందువల్ల ఫింగర్ ప్రింట్ ద్వారా తాను బ్రతికే ఉన్నానని ప్రభుత్వానికి చెప్పుకోలేదు. ఆమెకు మొబైల్ ఫోన్ లేదు. దీంతో ఆమెకు వచ్చే ఓటీపీ(ఏక సమయ ధృవీకరణ సంఖ్య) తనకు చేరదు. కాబట్టి ఫేషియల్ అథెంటికేషన్ పథకానికి ప్రభుత్వం తెరతీసింది. కానీ, ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదు.
ఎట్టకేలకు సమీపంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఆమె మనవడు పూరన్ వచ్చి బలహీనంగా ఉన్న ఆమెను భుజాన వేసుకోని గదిలో నుంచి బయటకు తెచ్చాడు. గోడకు ఆనించి కూర్చోబెట్టాడు. మరోసారి ఫేషియల్ అథెంటికేషన్ కోసం తన మొబైల్ కెమరాలో ఆమె మొఖాన్ని బంధించేందుకు నికేష్ ప్రయత్నించాడు.
కణకణ మండే సూర్యకాంతి వెలుగులో మొత్తానికి ఆమె కనురెప్పలు మూసినప్పుడు నికేష్ చేతిలోని కెమరా ఫొటో తీయగలిగింది. దీంతో ఆమె వివరాలు ఫోన్ స్క్రీన్‌లో ప్రత్యక్షమైయ్యాయి. అక్కడున్నవారందరూ అది చూసి నిట్టూర్పు విడిచారు.
“దీంతో మరో పన్నెండు నెలల పాటు లబ్ధిదారు బ్రతికే ఉందని ప్రభుత్వం గుర్తిస్తుంది. మరి ఆ తర్వాత సంగతేంటి?” అని అక్కడున్న సామాజిక కార్యకర్త శుభం బిశ్వాస్ ప్రశ్నించాడు.
డేటా అప్డేట్లోనే గడిచిపోతున్న జీవితం
ఆధార్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2009 నుంచి 140 కోట్ల భారతీయుల వేలిముద్రలు, కళ్ల స్కాన్లు(ఐరిస్), ఫొటో గ్రాఫ్‌లు సేకరించింది. ఇది డిజిటల్ గుర్తింపు కార్డులను ఇచ్చే ప్రాజెక్టులలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. మొదట్లో ప్రజలు ఈ వివరాలను స్వచ్ఛందంగా ఇవ్వవచ్చని, ఇష్టంలేనివారు ఇవ్వకుండా కూడా ఉండవచ్చని అధికారులు పదేపదే ప్రస్థావించారు.
అదే సమయంలో అస్తిత్వం, గుర్తింపు లేని కోట్ల మంది పేదలకు ఈ కార్డు(ఆధార్)ద్వారా గుర్తింపు దక్కుతుందని; దీంతోపాటు ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ పథకాలను అవినీతిరహితంగా అమలు చేయవచ్చని, ఆయా పథకాల ప్రయోజనాలు నేరుగా ప్రజలకు దక్కేలా చేయడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని కూడా చెప్పారు.
ఆహారపు సబ్సీడీ, పింఛన్లు, మెటర్నిటీ బెనిఫిట్స్వంటి 300లకు పైగా పథకాల నుంచి లబ్ధిపొందడానికి ఆధార్ కార్డు అనివార్యం చేశారు. వివిధ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందాలంటే, ప్రజలు ఆధార్ కార్డులో ఇమిడి ఉన్న తమ ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ వివరాలను పంచుకోవాలి. దాని కోసమే, వేలిముద్రలు ఈ మధ్య కాలంలో ముందుకు వచ్చిన ఫేషియల్ అథెంటికేషన్వంటి చర్యలు.
2023లో భారతదేశం జీ20 దేశాల కూటమికి అధ్యక్షతవహించింది. అప్పటి నుంచి వివిధ దేశాలకు డిజిటల్ పరిపాలన సూత్రాలు ఎగుమతి చేసే శక్తి కలిగిన దేశంగా ప్రచారం చేసుకుంది. దీన్నే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) అని పిలుస్తున్నారు. ఈ డీపీఐకి ఆధార్ కార్డువంటి డిజిటల్ అస్తిత్వాలే పునాది.
కేంద్ర ప్రభుత్వం ఇరుగుపొరుగున ఉన్న శ్రీలంక, మయన్మార్వంటి దేశాలకు డీపీఐ సేవలు అందించే విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వబోతుంది. ఈ సమావేశంలో పలువురు దేశాధినేతలు, ఇతర సంస్థలకు చెందిన ప్రతినిధులు కృత్రిమమేధా భద్రత, పాలనాధక్షత గురించి చర్చించనున్నారు.
ఫిబ్రవరి 2026లో జరిగే ఈ సదస్సు సన్నాహాక సమావేశాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న ఆధార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే సాధనంగా కృత్రిమ మేధను ఉపయోగించుకోవచ్చని ప్రచారం చేస్తోంది.
డిసెంబర్ 5న ఢిల్లీలో జరిగిన అటువంటి సమావేశంలో కేంద్ర క్యాబినేట్ సెక్రటేరియట్‌కు చెందిన సీనియర్ అధికారి సౌరభ్ కే తివారి- నకిలీ లబ్ధిదారులను నిరోధించడానికి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ డేటా బేస్‌లో మెషిన్ లర్నింగ్ ద్వారా ప్రయత్నిస్తుందని తెలిపారు. డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) అమలు కార్యక్రమానికి అదనపు కార్యదర్శిగా కూడా తనే ఉన్నారు.
99శాతం లబ్దిదారులు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగిస్తున్నారని, అందులో ఎక్కువమంది ఫేషియల్ అథెంటికేషన్ కూడా ఉపయోగిస్తున్నారని తెలిపారు. 2023 తర్వాత పది లక్షలకు పైగా లావాదేవీలు ఫేషియల్ అథెంటికేషన్ ద్వారానే జరుగుతున్నాయని ప్రకటించారు.
ఫేషియల్ అథెంటికేషన్ అంటే, ఆధార్ డేటాబేస్‌లోని వ్యక్తిగత వివరాలను పోల్చుకోవడానికి మొబైల్ ఫోన్ కెమరాతో పౌరుల ఫొటో తీసి, సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేయడం.
అందుబాటులోని నివేదికల ప్రకారం, యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆల్గరిథమ్ ద్వారా ఈ ఫొటోలను యూడీఐ డేటాబేస్‌లోని సమాచారంతో పోల్చి సరి చూస్తుంది. ఇందులో భాగంగా కళ్ల మధ్య ఉన్న దూరం, ముక్కు- పెదాల మధ్య ఉన్న దూరం, కళ్లకు- ముక్కుకు మధ్య ఉన్న దూరం వంటి వివరాలను యూడీఐ డేటా పోల్చి చూస్తుంది.
ఆధార్ డేటాబేస్ ఈ యూడీఐ అథారిటీ సంరక్షణలోనే ఉంటుంది. కేవలం పౌరులు తమ అనుమతిచ్చిన తర్వాతనే ఫేషియల్ అథెంటికేషన్ జరుగుతుందని; అదే సమయంలో పౌరులు అనుమతించినా, ఇవ్వకపోయినా ఫేషియల్ వెరిఫికేషన్ జరుగుతుందని పరస్పర విరుద్ధ సమాచారాన్ని అథారిటీ వెల్లడిస్తుంది.
తమ అనుమతి పౌరులు ఇవ్వకపోవటం ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే, ఏ పౌరుడైనా తెలిసో తెలియకో ఈ వెరిఫికేషన్‌ను నిరాకరిస్తే- వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు దక్కకుండా పోతాయి.
వయసు పెరిగే కొద్ది ఈ ఫేషియల్ ఫీచర్స్(ముఖ కవళికలు), బయోమెట్రిక్ చిహ్నాలు మారుతూ ఉంటాయని; ఇటువంటి సమయాల్లో ఎప్పుడో ఆధార్ అథారిటీ సేకరించిన ఫొటోలు వివరాలతో తాజా ఫొటోలు, వివరాలు జతకూడనప్పుడు పౌరులకు అందుబాటులో ఉండాల్సిన మౌలిక, సామాజిక సౌకర్యాలు- పథకాలు చేజారిపోయే ప్రమాదముండదాని సామాజిక ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రమాదాన్ని నివారించడానికి ప్రతీ సంవత్సరం డిజిటల్ డేటా వివరాలను తాజా పరుచుకోవాలని కూడా ప్రతిపాదిస్తున్నారు.
“డిజిటల్ వివరాలను తాజా పరుచుకోవడానికి పేదలు ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందడానికి నిజమైన అర్హులు వీరే.
ఒకవేళ ఏ కారణంగానైనా తమ వివరాలను తాజా పరుచుకోలేక పోతే వారికి ప్రభుత్వ పథకాలు అమలుకావు” అని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ నాయకుడు రంజిత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థ చేసిన పోరాటాల ఫలితంగానే 2005లో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించింది.
2005 నవంబర్‌లో రెండు వారాల పాటు జరిగిన నిరసన కార్యక్రమాలలో రంజిత్ సింగ్ కీలక పాత్రధారి. ప్రభుత్వ సేవల అమలులో జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిజానికి డిజిటల్ ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరగాల్సి ఉంది కానీ, ఇక్కడ పరిస్థితి దీనికి భిన్నంగా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
“వేలి ముద్రలు విఫలమైతే, ముఖకవళికలతో బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం చెపుతోంది. కానీ, కొంత వయసు దాటిన తర్వాత ముఖకవళికలలో చాలా మార్పులు వస్తాయి. అప్పుడు తీసే ఫొటోలు డేటా స్టోరేజ్‌లో ఉన్న ఫొటోలతో పోల్చినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితులలో ప్రజలు చేయగలిగేది ఏమీ ఉండదు” అని రంజిత్ సింగ్ అన్నారు.
“రాజస్థాన్‌లో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ, ప్రజలు మాత్రం డిజిటల్ అస్తిత్వాలను కాపాడుకునే ప్రయత్నంలో పదేపదే ఆన్లైన్ వెరిఫికేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతుంటారు. తమ డేటా ఎందుకు మ్యాచ్ కావడం లేదో కారణం ఎవరూ చెప్పరు. ఎప్పుడు పనిచేస్తుందో కూడా తెలియదు”అంటూ రంజిత్ సింగ్ క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యల గురించి ప్రస్థావించారు.
డేటా విషయాలు(సబ్జెక్ట్స్ ఆఫ్ డేటా)
ఘీసీ దేవి నివసించే గ్రామానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని జైపూర్ నగరంలో జాల్నా దూన్గ్రీ ఒక వాణిజ్య కూడలి. అక్కడ నూతన భవన సముదాయాల నడుమ రాష్ట్రంలోని అతిపెద్ద డేటా సెంటర్- భామాషా ఉంది. దీనికి అనుకోని గాజు అద్దాలతో మెరిసే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది.
ఎనిమిది అంతస్తుల భామాషా భవనంలో మూడు అంతస్తులు పూర్తిగా ప్రజల డేటా భద్ర పరచడానికి ఉపయోగిస్తున్నారు. మిగిలిన అంతస్తుల్లో వేర్వేరు కార్యాలయాలు పనిచేస్తున్నాయి.
ఇక్కడికి దగ్గరలోనే కరిగిపోతున్న ఆరావళి కనుమలున్నాయి. ఇక్కడి నుంచే గ్రానెట్, మార్బుల్వంటి విలువైన రాళ్ల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలో పరిపాలన మొత్తాన్ని డిజిటల్ బేస్ ఆధారిత పరిపాలనగా మార్చాలని నిర్ణయించడంతో, డేటా సేకరణకు ప్రాధాన్యత పెరుగుతుంది.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనువాదం: కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
