The effects of labor codes on workers is the final part of the article.
వేతనాల కోడ్ 2019:
వేతనాల కోడ్ 2019 ఫ్లోర్ వేజ్ అనే భావనను తీసుకొచ్చింది. దీనిని శ్రామికుల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఈ ఫ్లోర్ వేజ్ వివిధ భౌగోళిక ప్రాంతాలను బట్టి మారవచ్చు. దీన్ని నిర్ధారించే ముందు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల సలహాను కోరవచ్చు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే కనీస వేతనాలు ఫ్లోర్ వేజ్ కంటే తప్పనిసరిగా అధికంగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న కనీస వేతనాలు అప్పటికే ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని తగ్గించకూడదు.
ఏమైనాప్పటికీ ఈ నియమాలు అత్యల్ప వేతనానికి స్పష్టమైన హేతుబద్ధతను కాని, లేదా కనీస వేతనానికి, దీనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కాని పేర్కొనలేదు. ఫ్లోర్ వేజ్ మరియు కనీస వేతనం మధ్య ఉన్న తేడాలను నిర్వచించడం, అదేవిధంగా, అత్యల్ప వేతనాన్ని తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశం, ప్రాతిపదికపై స్పష్టమైన అవగాహన కల్పించడంపై వివరణలు ఇవ్వవలసిన అవసరం ఉంది.
కనీస వేతనాన్ని నిర్ణయించడం:
కనీసం వేతనం ఒక ముందడుగు భావన. కనీస వేతన సవరణకు మూలమైన ఏఏ అవసరాలు పరిగణన లోనికి తీసు కోవాలి అనే అంశం నిబంధనలలో విధిగా ఉండాలి. కానీ ప్రస్తుత నిబంధనలలో అది లేదు. ఈ దక్కోణంలో ఈ నియమం కనిపించడం లేదు. కుటుంబ బడ్జెట్ వ్యయంపై నిర్దిష్ట కాల పరిమితిలో నిర్వహించే సర్వే ఆధారంగా కనీస వేతన నిర్ణయానికి మూలమైన అంశాల నిర్ధారణ కొరకు ఈ లేబర్ కోడ్ లలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది.
కాలంతో పాటు వినియమతీరులు మారుతుంటాయి. కొన్ని అవసరాలు ప్రాముఖ్యతను కోల్పోతాయి. కొన్ని కొత్త అవసరాలు వినియోగంలోకి వస్తాయి. తదనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించే ముందు ఈ అవసరాల కు అనుగుణంగా బాస్కెట్ నిర్ణయించాలి. (ఆహారం బట్టలు గృహవసతి వినోదం తదితర అవసరాలను బాస్కెట్ అంటారు). ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కుటుంబ బడ్జెట్ వ్యయ సర్వే నిర్వహించాలి. దాని ఆధారంగా కనీస వేతనాల నిర్ధారణకు మారిన కుటుంబ అవసరాల ప్రాతిపదికన సేకరించి తదనుగుణంగా బాస్కెట్ నిర్ణయించాలి.ఇది తప్పనిసరిగా చేయాలి. అలాకాకుండా, కేవలం కాలానుగుణ కరువు భత్యం సర్దుబాట్ల ద్వారా సవరించే కనీస వేతనాలతో కార్మికులు తమ మనుగడ కొనసాగించడం సాధ్యం కాదు.
ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్లు:
ఇన్స్పెక్టర్లు కమ్ ఫెసిలిటేటర్లు అనే భావనను ఈ కోడ్ లో ప్రవేశపెట్టి, వారి బాధ్యతలు, అధికారాలను నిర్దేశించారు. ఈ అధికారులు యజమానులు, ఉద్యోగులకు తగిన మార్గనిర్దేశనం చేయడం తో పాటు తనిఖీలు నిర్వహించడం అనే ద్విపాత్రను నిర్వహించాలి.
పైగా ఈ కోడ్ వెబ్ ఆధారిత తనిఖీ పద్దతులతో సహా తనిఖీ విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించింది. దీంతో ముఖ్యమైన తనిఖీ విధానం కాస్తా అక్కడక్కడ అరకొరగా తనిఖీలు నిర్వహించే విధంగా ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ షెడ్యూల్ నిర్ణయించుకునేలా నిర్ధారించారు. ఈ విధానం అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్ 81లో నిర్దేశించిన కార్మిక తనిఖీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. సాధారణంగా, ఇన్స్పెక్టర్లు/ఫెసిలిటేటర్లు తాము అవసరమని భావించిన ఏ సంస్థనయినా తనిఖీ చేసే అధికారం స్వతహ సిద్ధంగానే ఉంటుంది. అటువంటి తనిఖీ యంత్రాంగాన్ని ఎట్టి పరిస్థితులలోనూ బలహీనపరచరాదు.
ఏ విధంగా చూసినా భారతదేశంలో ఇన్స్పెక్టర్ల సంఖ్య అంతర్జాతీయ కార్మిక సంస్థ నియమాల కంటే చాలా తక్కువగా ఉండటమే గాక అర్థరహితంగా ఉంది. 20వేల మంది కి పైగా కార్మికులకు ఒక ఇన్స్పెక్టర్ అనే నిబంధన పనికిమాలినది, ఏ మాత్రం సరైనది కాదు. ఏ విధంగా చూసినా ఇన్స్పెక్టర్లు ఆర్థిక వ్యవస్థలోని ఏ విభాగం లోని అసంఘటిత రంగంలో మాత్రమే అతి కష్టంగా తనిఖీలు నిర్వహించగలరు. ఇన్స్పెక్టర్లు అసంఘటిత రంగ సంస్థలను మాత్రమే తనిఖీ చేయగలిగిన స్థితిలో వారు నిర్దిష్టంగా చట్ట పరిధిలోకి వచ్చే సంస్థలలో వచ్చిన ఫిర్యాదు విషయంలోనే జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అది కార్మికుల సంఖ్య, ఆ సంస్థ ఏ నియమాల కింద రిజిస్టర్ అయింది తదితర అంశాలతో సంబంధం ఉండదు. ఉదాహరణకు చిన్న వర్క్‌షాపులు, రోడ్ల వెంబడి ఉండే తినుబండారాల షాపులు, గృహ పరిశ్రమలు, చిన్న కాంట్రాక్టర్లు, కొంతమేర రాష్ట్రాల నిబంధనలు అనుమతిస్తే ఇంటి పని వారాల విషయంలో మాత్రమే ఇన్స్పెక్టర్లు జోక్యం చేసుకొనగలరు.
ఆహార కేలరీల లెక్కింపు ఆందోళనకరం:
కనీస వేతనాలను నిర్ధారించడం ప్రధానంగా కుటుంబానికి అవసరమైన ఆహార కేలరీలపై ఆధారపడి ఉంటుంది. వేతనాల కోడ్ 2019 ప్రకారం 2700 క్యాలరీల సామర్థ్యం కలిగిన ఆహార వినియోగం ప్రామాణి కంగా తీసుకున్నారు. కార్మికుడితోపాటు జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలు ఒక కుటుంబ యూనిట్ గా నిర్ధారించ బడింది. పురుషుడు 1, భార్య 0.8, పిల్లలు 0.6 కేలరీల ఆహార వినియోగం ఆధారంగా ఒక కుటుంబ యూనిట్ 3 గా నిర్ణయించారు.కానీ వాస్తవంగా భార్య ఒకటి పిల్లలు 0.75 చొప్పున (పిల్లలు ఎదగాలంటే వాళ్లకి ఎక్కువ కేలరీల ఆహారం అవసరమవుతుంది) లెక్కించి ఒక కుటుంబ యూనిట్ 3.5 గా నిర్ధారించాలి. కానీ అందుకు భిన్నంగా కుటుంబము అంటే మూడు యూనిట్లుగా నిర్ణయించారు.
ఆహారేతర వస్తువులకు తక్కువ ప్రాధాన్యత:
ప్రస్తుత పద్ధతి ప్రకారం, ఆహార అవసరాలను ప్రధానంగా తీసుకొని దాని ఆధారంగా ఆహారేతర అవసరాలను తీసుకోవడం జరుగుతోంది. ఆహారేతర అవసరాల వినియోగాన్ని ఆహార అవసరాలలో నాలుగోవంతుగా మాత్రమే తీసుకోవడం జరుగుతున్నది.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా వినిమయ సరళిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఆహారేతర అవసరాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.వాటిని ఆహార అవసరాలకు ఉపకరణగా చూడడానికి వీలు లేదు. ఆహారేతర వస్తువుల అవసరాన్ని విడిగా (స్వతంత్రంగా) లెక్కించి నిర్ణయించాలి.
స్ప్రెడ్ ఓవర్ మరియు పట్టణ-గ్రామీణ వర్గీకరణ:
(విరామ సమయంతో కలిపి మొత్తం పని గంటలను స్ప్రెడ్ ఓవర్ టైం అంటారు). విశ్రాంతి సమయంతో సహా ఒక సాధారణ పని దినంగా పరిగణించబడే పని గంటల సంఖ్య 12 గంటలకు మించకూడదని వేతన కోడ్ రూల్స్ 2019 లో పేర్కొన్నారు. యజమానులు ఈ పెంచిన సమయాన్ని అవకాశంగా తీసుకుని, మూడు షిఫ్టులను రెండు షిఫ్టులకు తగ్గించే అవకాశం ఉంది.
భారత యజమానుల దోపిడీ స్వభావం, అవసరానికి మించి ఎక్కువగా కార్మికులు అందుబాటులో ఉన్న కారణంగా, స్ప్రెడ్ ఓవర్‌తో సహా మొత్తం రోజులో పని గంటలు పదిన్నర గంటల కంటే మించకూడదు. పన్నెండు గంటల పని దినం కార్మికులను అనవసరంగా వేచి ఉండటంతో పాటు పెద్ద ఎత్తున దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుంది. ఈపాటికే అనేక చోట్ల మూడు షిఫ్టులను ఆచరణలో రెండు షిఫ్టులుకు కుదించారు.
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పని ప్రదేశాలను మెట్రోపాలిటన్, నాన్-మెట్రోపాలిటన్ మరియు గ్రామీణ అనే మూడు కేటగిరీలుగా విభజించేందుకు వేతన కోడ్ 2019 నియమావళి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. వాస్తవానికి పట్టణ మరియు గ్రామీణ అనే రెండు రకాలుగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ నాన్ మెట్రోపాలిటన్ అనే రెండు తరగతులను కలిపి మెట్రోపాలిటన్ గా మాత్రమే పరిగణించాలి. లేనిచో ఇది అనవసరపు సమస్యలకు దారితీస్తుంది.ఇతర సమాచారం అంతా కేవలం పట్టణ-గ్రామీణ వర్గీకరణ ఆధారంగా మాత్రమే సేకరించబడుతున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
