న్యూఢిల్లీ: భారతదేశంలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లైన మోలిటిక్స్, నేషనల్ దస్తక్ సహా ప్రముఖ హాస్యనటుడు రాజీవ్ నిగమ్‌లకు చెందిన ఫేస్బుక్ పేజీలను నిషేధించారు.
భారత ప్రభుత్వం & చట్ట అమలు సంస్థల నుంచి వచ్చిన నోటీసుల ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘మెటా’ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఫలితంగా ఈ ఫేస్బుక్ పేజీలు ఇప్పుడు భారతదేశంలో వీక్షించడానికి వీలు లేకుండా పోయాయి.
మీడియా కథనాల ప్రకారం, స్థానిక చట్టాల ఉల్లంఘనల నెపంతో కంటెంట్‌పై ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి అనుమతించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ఈ నిషేధం విధించబడింది.
ఫలితంగా, ఈ ఫేస్బుక్ పేజీలలోని కంటెంట్ భారతదేశంలో ఇకపై అందుబాటులో ఉండదు.
మోలిటిక్స్, నేషనల్ దస్తక్ స్పందన
ఈ చర్య అనంతరం తన ఎక్స్ ఖాతాలో “ఐటీ చట్టం పేరుతో, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చేసిన భారతదేశంలోని ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది ఒత్తిడి, భయంతో కూడిన సమయం కావచ్చు, కానీ మా గొంతును నొక్కేయలేరు. నిజం ప్రజలకు చేరడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, బహుశా మేము నిజాన్ని చూపించడమే ఇప్పుడు నేరంగా మారింది. అందుకే భారతదేశంలో మా ఖాతాను నిషేధించారు”అని మోలిటిక్స్ పేర్కొన్నది.
ఈ పరిణామంపై స్పందిస్తూ, “అధికారంలో అగ్రస్థానంలో ఉన్నవారికి సత్యం ఇబ్బందిగా అనిపిస్తే, పాత్రికేయ స్తంభం కూలిపోవడం మొదలవుతుందని అర్థం. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నదే. కానీ ఇప్పుడు ఆ దాడుల వేగం పెరిగింది” అని ఎడిటర్ నీరజ్ ఝా అన్నారు.
అదే సమయంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకే భారతదేశంలో తమ ఫేస్బుక్ పేజీని నిషేధించినట్టు నేషనల్ దస్తక్ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
నేషనల్ దస్తక్ సంపాదకుడు శంభు కుమార్ ఈ చర్యను దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు.
అణగారిన వర్గాల ప్రజల గొంతు ప్రజలకు చేరకూడదని కోరుకునే కొందరు సంఘ్ వ్యక్తుల ఫిర్యాదు మేరకే ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
తమ వేదిక సమాజంలోని బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని, వారి సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని, అయితే ఈ చర్య ద్వారా దానిని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర వేదికలపైనా ఆంక్షలు..
గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గతంలో 4PM యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌ను కూడా మూసివేశారు.
ఆ తర్వాత, తమ యాంకర్ ఫైజా ఇన్స్టాగ్రామ్ రీల్‌ను తొలగించారని, తమ ఫేస్బుక్ పేజీని కూడా నిలిపివేశారని ఆ ఛానెల్ తెలియజేసింది. “ఒక్కొక్కటిగా, ప్రతి ప్లాట్‌ఫారమ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో అంత భయపడటానికి ఏముంది?” అని ఆ ఛానెల్ తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రశ్నించింది.
ఖండిస్తున్న జర్నలిస్టులు..
తాజా కేసులో, ప్రభుత్వ చర్యపై చాలా మంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు.
సీనియర్ జర్నలిస్ట్ రవిష్ కుమార్ దీనిని ఖండిస్తూ “ప్రతిరోజూ ఒక కొత్త ఛానల్, ఒక కొత్త సైట్ మూతపడుతోంది.
ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంలో విఫలమవుతున్నట్టుంది, అందుకే ఇదంతా జరుగుతోంది” అని అన్నారు.
మరో జర్నలిస్ట్ రణ్విజయ్ సింగ్, “ఈరోజు భారతదేశంలో అనేక ఫేస్బుక్ పేజీలను మూసివేశారు. మోలిటిక్స్, నేషనల్ దస్తక్, రాజీవ్ నిగమ్, ఇంకా మరెన్నో ఫేస్బుక్ పేజీలు ప్రభుత్వ చర్యలకు బలి అయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను ప్రదర్శించిన పేజీలే. ప్రశ్నలు లేవనెత్తే పేజీలు, ఖాతాలను ప్రభుత్వం నిరంతరం నిషేధిస్తోంది. కొన్ని రోజుల క్రితం ట్విట్టర్లో కూడా అనేక ఖాతాలను నిషేధించారు” చెప్పారు.
బీఫ్ వ్యాపారంలో నితిన్ గడ్కరీ కుటుంబ ప్రమేయంతో ముడిపడి ఉన్న కంపెనీలపై ‘ది కారవాన్’ ప్రచురించిన కథనం గురించి ఇటీవల ఒక వీడియో చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ముఖేష్ మోహన్‌కు కూడా రూ 50 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. నాగ్‌పూర్‌లో అతనిపై ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
గతంలో నిరోధించిన ఖాతాలు, వివాదాలు..
ఇటీవల భారతదేశంలో ‘ఎక్స్’కు చెందిన అనేక ఖాతాలను నిరోధించారు. ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న ఖాతాలలో పేరడీ, వ్యంగ్య ఖాతాలు, పాత్రికేయుల హ్యాండిల్స్ ఉన్నాయి.
ఈ ఖాతాలు ప్రభుత్వ విధానాలు, మైనారిటీ సమస్యలు, విదేశాంగ విధానం, ఎల్పీజీ సంక్షోభం, ప్రధానమంత్రిని వ్యంగ్యంగా విమర్శించాయి.
అవి తమ మీమ్స్, కార్టూన్లు, విమర్శనాత్మక పోస్టుల వల్ల బాగా ప్రాచుర్యం పొందాయి.

ప్రధాని మోదీకి సంబంధించిన తన మార్చి 14వ తేదీ ట్వీట్‌ను తొలగించాలని ఆదేశించారని కారవాన్ మ్యాగజైన్ ఎడిటర్ హర్తోష్ సింగ్ బాల్ కూడా చెప్పారు.
గత సంవత్సరం మే నెలలో, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ సమయంలో రఫేల్ విమానాలను కూల్చివేశారన్న ఆరోపణలకు సంబంధించిన ఒక సీఎన్ఎన్ కథనాన్ని ప్రచురించినందుకు, ‘ది వైర్’ వెబ్‌సైట్‌ను 12 నుంచి 15 గంటలకు పైగా నిరోధించారన్నది గమనార్హం.
గత నెల, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వేసిన ఒక వ్యంగ్య కార్టూన్ కారణంగా, ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం భారతదేశంలో ‘ది వైర్’ ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాదాపు రెండు గంటల పాటు నిరోధించారు.
దీనికి తాము బాధ్యులం కాదని మంత్రిత్వ శాఖ ఖండించగా, అది ఒక “పొరపాటు” అని మెటా నివేదించింది.
ముందస్తు ప్రకటన లేకుండా తీసుకున్న ఈ చర్య భావప్రకటనా స్వేచ్ఛ, డిజిటల్ సెన్సార్‌షిప్‌పై ప్రశ్నలను లేవనెత్తింది.
సమాచార హక్కు అభ్యర్థనల తిరస్కరణ..
మరోవైపు గమనించదగ్గ విషయం ఏమిటంటే, గత సంవత్సరం మే 7న ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించిన తర్వాత, పలు వార్తా సంస్థలు, జర్నలిస్టులతో సహా సుమారు 8,000 సోషల్ మీడియా హ్యాండిళ్లను బ్లాక్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతూ చేసిన ఆర్టీఐ(సమాచార హక్కు) అభ్యర్థనలను భారత ప్రభుత్వానికి చెందిన రెండు మంత్రిత్వ శాఖలు తిరస్కరించాయి.
ఈ కాలంలో బ్లాక్ చేయబడిన ‘ఎక్స్’ హ్యాండిల్స్‌లో కశ్మీర్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ అనురాధ భాసిన్, మక్తూబ్(ఒక మీడియా సంస్థ), ఫ్రీ ప్రెస్ కశ్మీర్, ది కశ్మీరియత్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ ఎడిటర్ ముజమ్మిల్ జలీల్ ఖాతాలు ఉన్నాయి.
ఈ విషయంలో, కేంద్రం ఆదేశాల మేరకే తాము ఈ చర్య తీసుకున్నట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వెల్లడించడంతో, విచిత్రంగా దాని సొంత గ్లోబల్ అఫైర్స్ ఖాతాను కూడా కొంతకాలం పాటు బ్లాక్ చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

