అనామక ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రటించిన తర్వాత ట్రస్టు ఆధారిత విరాళాలు గణనీయంగా పెరిగాయి.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్ధు చేసిన తర్వాత, ఎన్నికల ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు 2024- 2025లో రూ 3,811 కోట్లకు చేరుకొని మూడింతలు పెరిగినట్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలియజేసింది.
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదిక ప్రకారం, రాజకీయ పార్టీలకు రూ 3,811,37 కోట్ల విరాళలను తొమ్మిది ఎన్నికల ట్రస్టులిచ్చాయి. ఇందులోంచి కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)రూ 3,112.50 కోట్లు అంటే మొత్తం నిధుల్లోంచి దాదాపు 82% స్వీకరించింది.
ఈ మొత్తం విరాళాల నుంచి రూ 298.77 కోట్లు అంటే, సుమారు 8% కాంగ్రెస్ స్వీకరించగా; మిగితా దాదాపు రూ 400 కోట్ల బ్యాలెన్స్‌ను ఇతర పార్టీలు ఉమ్మడిగా స్వీకరించాయి.
అనామక ఎన్నికల బాండ్ పథకం రాజ్యాంగ వ్యతిరేకమని నిర్ణయించి సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత, ట్రస్టు ఆధారిత విరాళాలలో ఒక్కసారిగా పెరుగుదల చోటుచేసుకుంది. గత ఆర్ధిక సంవత్సరం(2023-24)లో ట్రస్టుల ద్వారా రూ 1,218 కోట్ల విరాళాలు పంపిణీ చేయబడ్డాయి.
ఎవరు ఆ ప్రధాన దాతలు?
ప్రూడెంట్ ఎన్నికల ట్రస్ట్ అతి పెద్ద దాతగా ఆవిర్భవించింది. మొత్తం రూ 2,668.46 కోట్లను ఇది పంపిణి చేయగా– వాటిలోంచి ఎక్కువ మొత్తం రూ 2,180.71 కోట్లు బీజేపీకి వెళ్లాయి.
భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన భారతి ఎంటర్ప్రైసెస్ నేతృత్వం వహిస్తున్న ట్రస్ట్– జిందాల్ స్టీల్ అండ్ పవర్, మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, భారతి ఎయిర్టెల్, అరబిందో ఫార్మా, టోర్రెంట్ ఫార్మాస్యూటికల్స్ వంటి తదితర ప్రధాన కార్పొరేట్ల నుంచి నిధులను స్వీకరించింది.
మరో ప్రధాన దాత– టాటా గ్రూప్ కంపెనీలు టాటా సన్స్, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్), టాటా స్టీల్ కార్పస్‌తో ఏర్పాటైన ప్రొగ్రెసీవ్ ఎన్నికల ట్రస్ట్ రూ 914.97 కోట్ల విరాళం ఇవ్వగా; ఇందులోంచి సుమారు 81% డబ్బు బీజేపీకి వెళ్లింది.
గమనించదగిన విరాళాలు..
మహీంద్రా గ్రూప్(మహీంద్రా& మహీంద్రా, టెక్ మహీంద్రా) నిధితో పని చేస్తున్న న్యూ డెమోక్రటిక్ ఎన్నికల ట్రస్ట్ అందజేసిన మొత్తం– రూ 160 కోట్ల నుంచి రూ 150 కోట్ల వరకు బీజేపీకి అందాయి.

ట్రంప్ ఎన్నికల ట్రస్ట్‌లో ఎక్కువ వాటా ఉన్న జీజీ పవర్& ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ రూ 25 కోట్ల నుంచి రూ 21 కోట్ల మొత్తాన్ని బీజేపీకి విరాళంగా అందించింది.
జన్ప్రగతి ఎన్నికల ట్రస్ట్ ఎక్కువగా కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి స్వీకరించే నిధుల్లోంచి రూ 1 కోటి శివసేనా(యూబీటీ)కు విరాళమిచ్చింది.
ఇదిలా ఉండగా జన్‌కళ్యాణ్ ఎన్నికల ట్రస్ట్ తన వాటా రూ 19 లక్షలను రెండుగా చీల్చి బీజేపీ, కాంగ్రెస్‌లకు సరిసమానంగా అందించింది.
అనువాదం: గంట రాజు ,సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
