ఓటు హక్కును రద్దు చేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడానికి అవకాశమివ్వడం హక్కుల సంరక్షణ కాదు. చేసిన తప్పును ఒప్పుకోవడమే.
ఓటు హక్కు కోసం ఆరున్నర కోట్ల మంది భారతీయులను దరఖాస్తు చేసుకోమని అడగటమంటే, రాజ్యాంగం జన్మతః ప్రసాదించిన హక్కును పదేపదే పునరుద్ధరించుకోవాల్సిన లైసెన్స్‌గా మార్చడమే.
తొమ్మిది రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబరు 25న ఆదేశాలు జారీ చేసింది.
జనవరి మొదటి వారానికి సిద్ధమైన ముసాయిదా ఓటర్ల జాబితాను గమనిస్తే, ఆరున్నర కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారని స్పష్టమవుతోంది. ఇదో భయంకరమైన సత్యం. ఇదేదో నిరంతరం జరిగే ప్రక్రియ కాదు. పరిపాలన చర్య పేరుతో జరుగుతున్న రాజ్యాంగ విచ్ఛిన్నత.
1950లో సార్వత్రిక ఓటు హక్కు అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ఏనాడూ ఈ స్థాయిలో ఓటుహక్కును- ఇన్ని కోట్ల మందికి రద్దు చేయలేదు. యుద్ధాల సమయంలోనూ, కరువు కాటకాల సమయంలోనూ, కోవిడ్‌వంటి విపత్తుల సమయంలో కూడా ఇటువంటి ఉత్పాతం ఎదురు కాలేదు.
ఈ స్థాయిలో జరిగిన ఒటుహక్కు రద్దును సమర్ధించుకునేందుకు ఏ కారణమూ సరిపోదు. అయినా, ప్రజాతంత్రయుతంగా అమలు జరగాల్సిన పారదర్శకత స్థానంలో అధికార వర్గం మౌనాన్ని ఆశ్రయించింది. ఇది పౌరసత్వం గురించి స్పష్టత ఇవ్వకుండా, కుంటి సాకులతో కాలం వెళ్ళబుచ్చడమవుతుంది.
భారత గణతంత్రం ముందున్న ప్రశ్న కేవలం పరిపాలన పద్ధతి, విధానం గురించి కాదు మౌళికమైన దాని గురించి.
ఎటువంటి జనాభా లెక్కలు, పార్లమెంట్లో ఎటువంటి చర్చ, పారదర్శకత, ఎటువంటి చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా కేవలం ఒక పరిపాలనా పరమైన చర్య ద్వారా- 6.5 కోట్ల మంది పౌరులను ఓటర్లు కాదని ప్రభుత్వం తేల్చేయగలిగింది. రాజ్యాంగం ప్రారంభం నుంచి జన్మ హక్కుగా ఉన్న ఓటుహక్కు, కేవలం అలంకారప్రాయమైనదిగా మారిపోయిందా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
అసాధ్యమైన లెక్కలు
ఏ దేశంలోనైనా ఓర్టర్ల సంఖ్య ఈ స్థాయిలో తగ్గిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. సామూహిక మరణాలు, సామూహిక వలసలు లేదా సామూహికంగా ఓటు హక్కు రద్దు.
కానీ భారతదేశంలో ఈ మూడింటిలో ఏ ఒక్క పరిణామము జరగలేదు. అకస్మాత్తుగా 6 కోట్ల మంది ప్రాణాలు పోయే అంటువ్యాధి ఏదీ దేశాన్ని కమ్ముకోలేదు. భారతీయులు ఇంత పెద్ద సంఖ్యలో దేశాన్ని విడిచిపెట్టి వలస కూడా వెళ్లలేదు. ఇంతమందికి ఒకేసారి ఓటు హక్కును రద్దు చేయడం కూడా సాధ్యం కాదు.
కోవిడ్ కాలంలో నిజంగా ఎంతమంది చనిపోయారో అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్లడించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినప్పటికీ, తాజా ప్రమాణంతో పోల్చుకుంటే అప్పటి మరణాలు చాలాచాలా నామమాత్రం.
కోవిడ్ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శించిన కాలం గడిచి చాలా ఏళ్లయింది. కోటా తగ్గింపుకు మరణాలే ప్రధాన కారణమైతే, ఈ తగ్గింపు ఇప్పుడు జరగకుండా 2020లోనే జరిగి ఉండాలి.
దేశీయంగానే కొంతమంది ప్రజలు వలస పోతున్నారన్నది కూడా అర్థమవంతమైన కారణం కాదు.
దేశంలోనే పౌరులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోరు. కొత్త ప్రాంతాలలో ఓటు హక్కు నమోదు చేసుకోవడం కాస్తంత సంక్లిష్టంగా మారుతుంది. ఎంత సంక్లిష్టంగా మారినా లక్షల కోట్ల మంది ఓటర్లను తొలగించేంత సంక్లిష్టత మాత్రం కాదు.
భారీ స్థాయిలో ఓటర్లను తొలగించాలంటే తదనునుగుణమైన పకడ్బందీ వ్యవస్థను అమలు చేయడం తప్ప మరో మార్గం లేదు.
ఇక మిగిలింది ఒకే ఒక్క వివరణ: రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాను సవరించడం. దీంతో ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఎన్నికల సంఘం ఓటర్లను ఎలా తొలగిస్తుందన్నది కాదు. ఆరున్నర కోట్ల మంది ఓటర్లను తొలగించాలని ఎవరు నిర్ణయించారు? ఏ అధికారంతో నిర్ణయించారన్నదే ప్రశ్న.
సవరింపా లేక సంహారమా ?
ఎన్నికల ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటర్ల జాబితాను సవరించడం, తాజా పరచడం మామూలే. ఈ ప్రక్రియలో కొత్తగా వయోజనమైన వారికి ఓటు హక్కును నమోదు చేస్తూ, చనిపోయిన వారి పేర్లను తొలగిస్తూ ఓటర్ల జాబితాను తాజా పరుస్తారు. ఇది చిన్నా చితక స్థాయిలో జాగ్రత్తగా జరిగే ప్రక్రియ. స్థూలంగా ఓటర్ల సంఖ్యను పెంచే ప్రక్రియ.
తాజాగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసురత్తు ఈ ప్రాథమిక అవగాహనతో తీవ్రంగా విభేదిస్తుంది.
తాజా కసరత్తు ప్రధానంగా ఓటర్లను తొలగించే కసరత్తు. అనూహ్యమైన కసరత్తు. విస్తృతంగా అమలు జరుగుతున్న కసరత్తు.
ఇప్పటివరకు అమలు జరిగిన కసరత్తులో ఒక పౌరుడు ఓటరా కాదాని నిర్ధారించాల్సిన, నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే రాజ్యాంగం ఉంచింది. కానీ తాజా కసరత్తులు ఈ బాధ్యతను పౌరులపైకి నెడుతున్నారు. ఏ ఓటరును ఎందుకు అనర్హుడిగా ప్రకటించాలో నిర్ధారించాల్సిన బాధ్యత నుంచి ఓటర్లే తాము ఇంకా చట్టబద్ధమైన ఓటర్లుగానే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుర్గతి ఈ కసత్తులోని ప్రత్యేకత.
ఇదేదో పరిపాలన యంత్రాంగం ఓ నిర్ణయాన్ని తలకిందులుగా అమలు చేయడం కాదు. ఇది రాజ్యాంగపరమైన విద్రోహం. వయోజన ఓటు హక్కు అన్నది సానుకూల హక్కు. ఒక పౌరుడు వయోజనుడు కాగానే ఓటరుగా నమోదయ్యే హక్కు.
ఒక మనిషి చనిపోయాడా? ఒకే వ్యక్తి ఒకటికి మించి పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటు హక్కును కలిగి ఉన్నాడా? లేక పౌరసత్వాన్ని కోల్పోయాడా అన్నది నిర్ధారించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ సానుకూల హక్కును తాజాగా జరుగుతున్న కసరత్తులు అనుమానించేలా చేస్తున్నాయి. భారతదేశంలో పౌరుడైనంతమాత్రాన ఓటు హక్కు గ్యారెంటీ ఉండదని చెబుతోంది.
ప్రభుత్వం అడిగిన కాగితాలన్నీ పౌరుడు చూపించగలిగినప్పుడు, ప్రభుత్వం దయతలచి ఇచ్చే అవకాశంగా మారింది. ఇవ్వటం ఇవ్వకపోవడమన్నది ఇష్టానుసారమైనప్పుడు- అధికార యంత్రాంగపు విచక్షణ కూడా అంతే మోతాదులో ఉంటుంది.
ప్రభుత్వం నిర్ణయించిన కాలక్రమ పట్టికను అనుసరించి, ఆయా నిర్దిష్ట సందర్భాలలో తమ ఓటు హక్కును రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లు కట్టడం ద్వారా ఇంటికి కరెంట్ సరఫరా కొనసాగేలా చూస్కుంటున్నట్టు. ఫోను బిల్లు కట్టడం ద్వారా ఇతరులతో మాట్లాడే అవకాశాన్ని కొనసాగించుకుంటున్నట్టు. పదేళ్లకొకసారి పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు క్యూలో ఉన్నట్టు.
జరగని జనగణన..
దశాబ్దకాలం పాటు జనగణన జరక్కపోవడం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం. తాజా రాజ్యాంగేతర కసరత్తును సులభ సాధ్యం చేస్తున్న చర్య.
జనగణన ప్రజాస్వామ్యానికి పునాది. ఆచరణాత్మకమైన ఆధారం. జనగణన జనాభా పొందికను వెల్లడిస్తోంది. ఆ పొందిక ఆధారంగానే ప్రజాస్వామిక వ్యవస్థల్లో ప్రాతినిధ్యం, సంక్షేమ వ్యయంలో కేటాయింపుతో పాటు- ఓటరు జాబితా సవరణ లేదా తనిఖీ జరుగుతుంది.
గత పదేళ్లుగా ఈ జనగణనను చేపట్టడానికి నిరాకరించటం ద్వారా- ప్రజాస్వామ్యానికి ఉన్న పునాదిని ఎన్డీఏ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఎన్నికల సంఘం వాదనలను పరిశీలించడానికి అర్ధవంతమైన ప్రాతిపదిక, ఆధారం ఏమీ లేదు.
ఈ పరిస్థితుల్లో నెంబర్ల గురించి అంచనాలు తప్ప ఆధారాలు ఉండవు.
ఇది వికృత వైపరీత్యం. ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఆధారాలు కోరుతున్న ప్రభుత్వం-అటువంటి ఆధారాలు సమకూర్చగానే కావాల్సిన జనగణనను మాత్రం చేపట్టడానికి సిద్ధంగా లేదు.
దేశంలోని ప్రజలందరి నుంచి ఆధారాలు కోరడం లేదు. బలహీనులు, నోరు లేని వారు ప్రజాస్వామ్యానికి వస్తువులు; ప్రశ్నించలేని వారు, తమ అధికార దాహానికి అడ్డంగా ఉంటారనుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఆధారాలు కోరుతుంది ప్రభుత్వం.
ఇక్కడ పత్రాలు నియంత్రణ సాధనాలుగా మారుతున్నాయి తప్ప సత్య నిరూపణకు కాదు.
జనగణన జరగకుండా, ఓటరు జాబితా సవరణ జరిపితే- అది సమర్థవంతంగానూ సమగ్రంగాను ఉండదు.
ఎటువంటి బాధ్యత, జవాబుదారీతనం లేకుండా విచ్చలవిడి రాజ్యాధికారం స్వైర విహారం చేస్తున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. జనాభా పొందిక వాస్తవాలతో సంబంధం లేకుండా రాజకీయ సమూహాలను పునర్విభజించటానికి, పునర్నిర్వచించడానికి రాజకీయ నాయకత్వం చేస్తున్న పని ఇది.
చనిపోయారా? వలస పోయారా? పౌరసత్వాన్ని కోల్పోయారాన్నది ఏది నిరూపించుకుండానే ఓటర్ల జాబితా నుంచి ఆరున్నర కోట్ల మంది ప్రజలను ప్రభుత్వం తొలగించగలిగితే, అటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అజమాయిషీ చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని కుదిస్తోంది.
ముందు మాయమయ్యేది ఎవరు: ఓటు హక్కు నిరాకరణ సామాజిక విశ్లేషణ
ప్రభుత్వ పరిపాలన పరమైన చర్యలు అమలు జరుగుతున్నప్పుడు సామాజిక తటస్థత వాటికి ఉండదు. ప్రతి నిర్ణయానికి ఒక సామాజిక తాత్వికత ఉంటుంది. ఈ సంక్షోభం నుంచి ఎవరు బయటపడతారన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఎవరి దగ్గర పత్రాలు ఉన్నాయి, ఎవరు శాశ్వతమైన అడ్రస్‌లో నివసిస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చే పత్రాలను చదివి అర్థం చేసుకొని నింపగలుగుతారు, పొరపాట్లను ప్రశ్నించే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. ఇటువంటి వాళ్లను మాత్రమే ప్రభుత్వం చట్టబద్ధమైన పౌరులుగా పరిగణిస్తుంది.
ఈ సవరణలో భాగంగా ఎవరి ఓట్లు మాయమవుతాయో స్పష్టంగానే ఊహించవచ్చు.
బతుకు తెరువులో భాగంగా పదేపదే తమ అడ్రస్‌లను మార్చుకోవాల్సి వస్తున్న వలస కార్మికులు, మురికి వాడల్లో నివసిస్తున్న పట్టణ- గ్రామీణ పేదలు, దళితులు ఆదివాసీలు. ఈ దళితులు, ఆదివాసీలు చారిత్రకంగా సామాజికంగా వెలివేతకు గురైనవారు. ఇప్పుడు వారి అస్తత్వం ఒక కాగితంగా మారింది. వీళ్ళతో పాటు ముస్లింలు కూడా ఈ ప్రమాదారంరి ఎదుర్కొంటున్నారు.
జాతీయ పౌరసత్వ జాబితా, పౌరసత్వ సవరణ చట్టం వంటి సందర్భాలలో జరిగిన చర్చల నేపథ్యంలో ముస్లింల పౌరసత్వం నిరంతరం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంకా ప్రాథమిక ప్రభుత్వానికి కావాల్సిన కాగితాలు సమకూర్చుకోలేని విశాల ప్రజానీకం కూడా తాజాగా కశ్మీర్లో ఓటరుగా ఉండే హక్కును కోల్పోతారు.
నిజానికి ఇంతకాలం జరిగిన పోరాటం, ఈ సామాజిక తరగతుల ముంగిట్లోకి భారత ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి జరిగినదే. ఈ పోరాటాలే పాలకవర్గానికి, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికి రుచించని వాస్తవాలు. ఈ సామాజిక తరగతులే అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఓటు వేస్తాయి. జాతీయత పేరు మీద జరుగుతున్న రాజకీయ సమీకరణలకు వ్యతిరేకంగా నిలుస్తారు.
ప్రజలను సాధికారతులు చేసే ఉద్దేశంతో కాకుండా, వాళ్ళ ప్రవర్తనను నియంత్రించే లక్ష్యంతో అమలు జరిగే సంక్షేమ పథకాలు- వాళ్ళను పెద్దగా ఉద్ధరించేదేమీ లేదు. వీళ్లే ఓటరు జాబితా నుంచి మొదటగా మాయమయ్యే జనాభా. ఇదేదో కాకతాళీయం కాదు. ఓ పథకం ప్రకారం జరుగుతున్న పని.
కాగితమే ప్రధానంగా జరుగుతున్న కసరత్తు, వలస పాలన కాలం నుంచి జాతీయ పౌరసత్వ జాబితా రూపొందించే కసరత్తు వరకు; ఇటువంటి పర్యవసనాలకు, ఫలితాలకు మాత్రమే దారి తీసింది.
పైకి తటస్థమైన కసరత్తుగానే కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా భారీ సంఖ్యలో ప్రజానీకాన్ని వెలివేసే కసరత్తుగా మారుతుంది.
సామాజికంగా- ఆర్థికంగా వేరువేరు స్థాయిలలోని ప్రజానీకానికి ఒకే సూత్రాన్ని, ప్రమాణాన్ని, ప్రాతిపదికను వర్తింపజేయడమంటే- పద్ధతి ముసుగులో అసమానతను పునరుద్ధరించటం పునర్నిర్మాణం చేయడమే అవుతుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తు కూడా విస్పష్టంగా ఇదే దారిన నడుస్తోంది. ఇవే ఫలితాలను అందించనున్నది.
ఈ కసరత్తులో ప్రభుత్వం అడుగుతున్నది ఏమిటి- నివాసానికి సాక్ష్యం, అడిగిన వెంటనే స్పందించడం, అడిగినన్ని కాగితాలు సమర్పించగలగటం; ఎన్నికల సంఘం రూపొందించిన విధివిధానాలను, పద్ధతులు వంటివి ప్రజలందరూ పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.
ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? ఆస్తిపర వర్గాలు, శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగలిగిన కుటుంబాలు.
బతకడానికి ఒక సీజన్లో ఒకచోట పని చేసి, మరొక సీజన్లో మరొక చోటికి ప్రయాణమయ్యే వలస కార్మికులు ఇవన్నీ సమకూర్చలేరు. దీంతో ప్రభుత్వం దృష్టిలో వీరందరి ఓటు హక్కు ప్రశ్నార్ధకమవుతుంది.
ఈ కసరత్తు తర్వాత మిగిలేది ఓటర్లు మాత్రమే పౌరులు కాదు.
ఇదంతా కాకతాళీయంగా జరుగుతోందని నమ్మాలంటే, పాలకవర్గం ఎలా పనిచేస్తుందన్నది అర్థం చేసుకునే సామర్థ్యం లేకుండానైనా ఉండాలి. లేదా ప్రభుత్వం ప్రజలపై ఎంత అపనమ్మకంతో పనిచేస్తుందో గుర్తించి నిరాకరించడమైన అయివుండాలి.
ఇటువంటి వెలువేతను ఊహించగలిగినప్పుడు, అది రాజకీయంగా పాలకవర్గానికి అనుకూలంగా ఉన్నప్పుడు, భారీ స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఈ ఘోరాన్ని సమర్ధించుకోలేదు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
