రష్యా నుంచి ఇంధన దిగుమతులను నిలిపివేస్తున్నట్టుగా తనకు భారత ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ట్రంప్ విలేకరులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మోడీ మీద ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు.
న్యూఢిల్లీ: భారతదేశం ఇక మీద రష్యా నుంచి ఏమాత్రం ఇంధన కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇంతకు ముందు చేసిన ప్రకటనను ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. దీని మీద సరిగా న్యూఢీల్లీ స్పందించలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమర్ జెలెన్స్కీతో ట్రంప్ వైట్‌హౌస్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రష్యా ఇంధన ప్రధాన కొనుగోలుదారుల గురించి ట్రంప్‌ను జెలెన్స్కీ ప్రశ్నించారు.
“భారత్, హాంగేరీ అని మీరన్నారు? అదొక ఆసక్తికరమైన కలయిక. అయితే, ఇక రష్యా నుంచి ఇంధనాన్ని భారతదేశం ఏమాత్రం కొనుగోలు చేయబోదని చెప్పారు. హాంగేరీ మాత్రం చిక్కుకుంది. ఈ దేశానికి సంవత్సరాల తరబడిగా ఒకే పైప్‌లైన్ ఉంది. అది కూడా భూమిలోపల. వారికి సముద్రం లేదు. హంగేరీ కీలక నేతతో నేను మాట్లాడాను. మరీ వారికి ఇంధనం దొరకాలంటే చాలా కష్టమని మీకు తెలుసు కదా” అన్నారు.
“రష్యా నుంచి ఇంధనాన్ని భారత్ కొనుగోలు చేయబోదు. వారు ఇప్పటికే కొనుగోలు చేయడం తగ్గించేశారు. ఎంతో కొంత నిలిపివేశారు. వారు తిరుగు ముఖం పట్టారు. సుమారు 38శాతం ఇంధనాన్ని కొనుగోలు చేశారు. ఇక నుంచి ఆ పని చేయరు”అని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడానని “యుద్ధ ముగింపు” గురించి ఆలోచిస్తున్నట్టుగా జెలెన్స్కీకు ట్రంప్ తెలియజేశారు.
‘ఇదొక పెద్ద ముందడుగు’
ఈ నేపథ్యంలో రష్యన్ ఇంధన దిగుమతికి ఇక ముగింపు పలుకుతామని ప్రధాని మోడీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని ట్రంప్ విలేకరులకు తెలియజేశారు.
“భారతదేశం రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపట్ల నేను సంతోషంగా లేను. అయన(మోడీ) రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయబోమని ఈరోజు నాకు హామీ ఇచ్చారు. “ఇదొక పెద్ద ముందడుగు”, అంతేకాకుండా “ఇదో బ్రేకింగ్న్యూస్”అని పేర్కొన్నారు.
సమయం మార్పుతో కూడుకున్నదని ట్రంప్ చెప్పారు. “మార్పు వెంటనే చోటుచేసుకోదు. దానికి కాసింత ప్రక్రియ అవసరమవుతుంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కాబోతుంది”అని అదనంగా చెప్పుకొచ్చారు.
రష్యా ఇంధన కొనుగోలుపై ట్రంప్ చేస్తున్న వాదనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆచితూచి స్పందించింది. ట్రంప్ వాదనలను ధృవీకరించలేదు, అలాని ఖండించలేదు. కానీ, తన సరఫరాదారులను భారతదేశం మాత్రం వైవిధ్యభరితం చేసింది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రనధీర్ జైస్వాల్ అన్నారు.
“మన ఇంధన విధానం రెండు ఉమ్మడి లక్ష్యాలను కలిగి ఉంది. అదేంటంటే సుస్థిర ఇంధన ధరలు– సురక్షితమైన సరఫరాతో పాటు మార్కెట్ పరిస్థితులను ఎదుర్కోనే విధంగా ఉండడం. ఇంధన సురక్షిత వైవిద్యభరితం చేయడం” జైస్వాల్ అన్నారు.
వాషింగ్టన్లో భారత ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చలు “ఫలప్రధమయ్యాయని” రష్యన్ ఇంధనం దిగుమతుల్లోంచి 50 శాతం దిగుమతులను ఇప్పటికే భారతీయ రిఫైనరీలు కోత విధించాయని వైట్‌హౌస్ అధికారి చెప్పినట్టు రాయిటర్స్ తెలియజేసింది. రష్యన్ ఇంధనం కొనుగోలును భారతదేశం సగానికిసగం తగ్గించేసిందని వైట్‌హౌస్ చెప్పిన వ్యాఖ్యలను భారతాధికారులు ఖండించారు. అలాంటి తగ్గింపులు చోటుచేసుకోలేదని స్పస్టం చేశారు.
రష్యన్ దిగుమతులను తగ్గించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు రాలేదని భారతీయ పారిశ్రామిక వర్గాలు రాయిటర్స్‌కి తెలియజేశాయి. అంతేకాకుండా నవంబరు, డిసెంబరు కార్గోల కోసం రిఫైనరీలు ఇప్పటికే ఆర్డర్లు పెట్టుకున్నాయని అన్నారు. “ఎలాంటి కోత అయినా డిసెంబరు లేదా జనవరి దిగుమతుల సంఖ్యలో అది కనిపిస్తుంది” అని దేశీయ పారిశ్రామిక వర్గాలు చెప్పాయి.
గడిచిన దశాబ్దకాలంగా అమెరికా– భారత్ మధ్య సంబంధాలు బలపడ్డాయని, ఈ రెండు దేశాల మధ్య శక్తి సహకారం విస్తరించిందిని, ప్రస్తుత పరిపాలనలో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని జైస్వాల్ తెలిపారు. “అనేక సంవత్సరాలుగా శక్తి సేకరణను విస్తరిస్తున్నాము. ఈ విస్తరణ గత దశాబ్దకాలంగా బాగా పెరిగింది. ప్రస్తుత పరిపాలన(ట్రంప్) భారత్‌తో బలమైన శక్తి సహకారి పట్ల ఆసక్తితో ఉంది. చర్చలు కొనసాగుతున్నాయి”అని జైస్వాల్ అన్నారు.
తాను మోడీతో మాట్లాడానని ట్రంప్ ఏరోజైతే చెప్పారో ఆరోజు వారి మధ్యన ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని, మంత్రిత్వ శాఖ క్రమంగా జరిగే మీడియా సమావేశంలో రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. “మీరు ప్రశ్నలు వేయడానికి ముందు ప్రధాని మోడి– అధ్యక్షులు ట్రంప్ మధ్యన టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు చెప్పబడుతున్న ప్రకటనను గమనించండి. ఈ ఇద్దరు నాయకుల మద్య సంభాషణ జరిగినట్టు తన దృష్టికి మాత్రం రాలేదని” ఆయన విలేకరులకు చెప్పారు. ట్రంప్ వాఖ్యలపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటనను జారి చేయలేదు.
చివరిసారి ఇద్దరు నాయకులు అక్టోబరు 9న మాట్లాడుకున్నారని, గాజా కల్పుల విరమణ ఒప్పందానికి ట్రంపును మోడీ అభినందించారని, కొనసాగుతున్న వాణిజ్య సంప్రదింపులపై చర్చించుకున్నట్లు అధికార ప్రకటనలు తెలియజేస్తున్నాయి.
“భారత్ తరఫున మాట్లాడుతున్నారు”
మాస్కో నుంచి దిగుమతి చేసుకుంటున్న ప్రధాన శక్తి దిగుమతిదారుల కొనుగోళ్లను నిలిపివేసేందుకు ట్రంప్ పరిపాలన ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దావాను పునరుద్ఘాటించారు. రష్యా ముడిచమురును భారతదేశం కొనుగోలు చేస్తుందన్న నెపంతో, ఆగస్టులో భారత వస్తువులపై 50 శాతం సుంకాలను అమెరికా పెంచింది. ఇది అన్యాయమని వెంటనే భారతదేశం స్పష్టం చేసింది. అనేక పశ్చిమ దేశాలు ఇంకా రష్యా నుంచే ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి. చైనా తర్వాత రష్యా ముడిచమురు కొనుగోలులో భారతదేశం రెండవ అతి పెద్ద కొనుగోలుదారు. అయినా చైనా కొనుగోళ్లపై ఇంతవరకు అమెరికా ఎలాంటి సుంకాలను విధించలేదు.
హెల్సింకి ఆధారిత సెంటర్ ఫర్ రీసర్చి ఆన్ ఎనర్జీ అయిండ్ క్లీన్ ఏయిర్(సీఆర్ఈఏ) విశ్లేషణాత్మక నివేదిక ప్రకారం, 2025 సెప్టెంబరులో రష్యా నుంచి భారత్ 3.6 బిలియన్ విలువ చేసే శిలాజ ఇంధనాన్ని కొనుగోలు చేసింది. అందులో సుమారు € 2.5 బిలియన్ విలువ చేసే ఇంధనం ఉంది.
ప్రభుత్వ రిఫైనరీలు జూన్ నుంచి సెప్టెంబరు వరకు రష్యా ఇంధనం కొనుగోలును దాదాపు 45 శాతానికి తగ్గించేశాయి. అదే రిలయన్స్ పరిశ్రమలు, రోస్నెఫ్ట్ అధ్వర్యంలో ఉన్న నయారా ఏనర్జీ వంటి ప్రైవేటు రిఫైనరీలు మాత్రం తమ అవసరాన్ని పెంచాయని ఇటీవల కాప్లర్ షిప్పింగ్ డేటా తెలియజేసింది.
ట్రంప్ దావాలు భారతదేశంలో రాజకీయ విమర్శలకు దారి తీశాయి. “రష్యన్ ఇంధనాన్ని భారత్ కొనుగోలు చేయదని నిర్ణయించి ప్రకటించేందుకు” అమెరికా అధ్యక్షునికి మోడీ అనుమతిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధి అన్నారు. ఇదితప్పని మోడీ బహిరంగంగా చెప్పడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.
ప్రధాని “అనేక కీలక నిర్ణయాలను అమెరికాకు ఔట్‌సోర్సు చేశారు” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ట్రంప్ వాఖ్యలపై కాంగ్రెస్ తన విమర్శలను పునరుద్ఘాటించింది. భారతదేశం తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడేందుకు ప్రధాని అనుమతించారని ఆరోపించింది. “భారత్ కొరకు ఉక్రేయిన్ అధ్యక్షుని ముందు ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు”అని తన X ఖాతాలో కాంగ్రెస్ పేర్కొంది.
“రష్యా నుంచి ఇంధనం కొనుగోలు నిలిపివేతపై నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్‌కు ఎందుకు మోడీ అనుమతించారు” పార్టీ ప్రశ్నించింది. ట్రంప్ వాఖ్యలు “దేశాన్నే కించపర్చడం అవుతుంద”ని అభిర్ణించింది.
వైట్‌హౌస్ వేడుకలో భారత్– పాకిస్తాన్ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా గడిచిన గొడవలపై మాట్లాడుతూ– ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గడానికి తాను సహయం చేశానని అన్నారు.
“నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కంచాను; రవాండా, కాంగోకు వెల్లండి, భారత్ పాకిస్తాన్ గురించి మాట్లాడండి, థాయిలాండ్‌ను చూడండి. మేము పరిష్కరించిన అన్ని యుద్ధాలను చూడండి” అని ట్రంప్ పేర్కొన్నారు.
“పాకిస్తాన్- భారత్‌కు మధ్య వర్తిత్వం వహించి లక్షల మంది ప్రాణాలను కాపాడారని పాకిస్తాన్ ప్రధాని నాతో చెప్పారు. భారత్– పాకిస్తాన్ ఘర్షణ చెడుకుదారి తీసేది. రెండు అణుదేశాలే ” అని యుద్ధ విరమణ విషయంలో మధ్యవర్తిత్వం వహించి సాధించిన విజయాలను ఆయన ఉదహరించారు.
మేలో జరిగిన భారత్– పాకిస్తాన్ల మధ్య నాలుగు రోజుల ఘర్షణలో మధ్యవర్తిత్వం వహించి కాల్పులవిరమణ చేయించానని ట్రంప్ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఆయన వాదనకు పాకిస్తాన్ బలపరుస్తుండగా, రెండు సైన్యాల మధ్య జరిగిన చర్చల వల్ల శతృత్వం నిలిపివేయడమైందని భారతదేశం చెప్తోంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
