మాడిసన్: 2024లో 9.54 మిలియన్లుగా ఉన్న జననాలు, 2025లో 7.92 మిలియన్లకు పడిపోయాయని చైనా ప్రకటించింది.
ఇది 2016లో “ఏక సంతాన” విధానాన్ని రద్దు చేసినప్పుడు, 14.33 మిలియన్లుగా అంచనా వేసిన సంఖ్యలో దాదాపు సగం మాత్రమే.
వాస్తవానికి, చైనాలో జననాల సంఖ్య 1738 నాటి స్థాయికి పడిపోయింది; ఆ సమయంలో దేశ జనాభా కేవలం 15 కోట్లు మాత్రమే. భయంకరమైన జనాభా వాస్తవికతను చివరకు చైనా అంగీకరించింది.
ఈ నేపథ్యంలో, జననాల సంఖ్య పుంజుకుంటుందని ఆశిస్తూ కొత్త జనన అనుకూల విధానాలను చైనా అధికారులు ప్రవేశపెట్టారు.
కానీ, ఒక కొండపై నుండి దొర్లుతున్న పెద్ద బండలా జనన రేటులో క్షీణత అనివార్యంగా ఏర్పడుతుంది.
దానిని తిరిగి కొండపైకి నెట్టడం అంత త్వరగా జరిగే ప్రక్రియ కాదు.
ఏది ఏమైనప్పటికీ, వివాహాలలో క్షీణత ధోరణిని తిప్పికొట్టడం కష్టం.
ఎందుకంటే, చైనాలో 85% జననాలకు కారణమయ్యే 20-34 సంవత్సరాల మహిళల సంఖ్య 2025లో 105 మిలియన్ల నుంచి 2050 నాటికి 58 మిలియన్లకు తగ్గుతుందని అంచనా.
లింగ అసమానతలు..
ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తూ, చైనా వివాహ మార్కెట్లో తీవ్రమైన అసమతుల్యత నెలకొని ఉంది.
దశాబ్దాలుగా జరిగిన లింగ నిర్ధారణ గర్భస్రావాల వల్ల సంతానోత్పత్తి వయస్సు గల మహిళల కొరత ఏర్పడింది.
అంతేకాకుండా, మహిళల ఉన్నత విద్యా సాధన “మిగిలిపోయిన మహిళలు”(Leftover women) అనే సామాజిక స్థితిని సృష్టించింది.
దీనివల్ల ప్రస్తుతం మగ విద్యార్థుల కంటే ఆడ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
2010లో ఆరేళ్ల పిల్లలలో బాలబాలికలకు మధ్య నిష్పత్తి 119:100గా ఉంది. 2022 నాటికి ఈ వర్గం వారు కళాశాలలో చేరినప్పుడు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలలో ఈ నిష్పత్తి కేవలం 59:100కు పడిపోయింది.
ఫలితంగా, చాలా మంది పురుషులకు వివాహం చేసుకోవడానికి భాగస్వాములు దొరకడం లేదు.
మరోవైపు, ఎక్కువ విద్యావంతులైన మహిళలు తమకంటే ఉన్నత స్థితిలో ఉన్న భర్తలను కోరుకుంటున్నారు.
దీనివల్ల చాలా మంది అవివాహితలుగానే ఉండిపోయే అవకాశం ఉంది.
ప్రతిబింబాలు
జనాభా క్షీణతకు జపాన్ ఇచ్చిన అసమర్థ ప్రతిస్పందనకు చైనా ప్రస్తుత విధానాలు ఒక చిన్న రూపం.
2015లో 1.45గా జపాన్లో ఉన్న సంతానోత్పత్తి రేటు(2.1 ప్రత్యామ్నాయ రేటు కంటే చాలా తక్కువ), 2024 నాటికి 1.15కి పడిపోయింది.
చైనా మరింత తీవ్రమైన నిర్మాణపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నందున, దాని సంతానోత్పత్తి రేటు ఇప్పటికే జపాన్ కంటే తక్కువగా పడిపోవడంలో ఆశ్చర్యం లేదు.
బ్యాక్టీరియా, మొక్కలు, జంతువుల పెరుగుదలను జనసాంద్రత నిరోధిస్తుందనేది ఒక పర్యావరణ నియమం. దీనికి మనుషులు కూడా మినహాయింపు కాదు.
టోక్యోలోని వివిధ ప్రాంతాలలో జన సాంద్రత, సంతానోత్పత్తి రేట్లు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇదే ధోరణి లండన్, న్యూయార్క్, షాంఘైలలో కూడా కనిపిస్తుంది.
టోక్యోలోని సుమారు 6,000/చ.కి.మీ.తో పోలిస్తే, అమెరికాలోని పట్టణ ప్రాంతాలలో సాధారణంగా చదరపు కిలోమీటరుకు 800- 2,000 మంది ప్రజలు ఉంటారు.
కానీ, చైనాలో సగటు జనసాంద్రత 8,900/చ.కి.మీ.గా ఉంది. యువత అధికంగా ఉండే మొదటి, రెండో శ్రేణి నగరాల్లో ఇది 20,000-30,000/చ.కి.మీ వరకు ఉంటోంది.
అధిక జన సాంద్రత గృహ నిర్మాణ ఖర్చులను పెంచుతుంది. ఆదాయానికి, ఇంటి ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవలి సంవత్సరాలలో కెనడా, అమెరికా, యూరోపియన్ దేశాలలో సంతానోత్పత్తి తగ్గడానికి పెరుగుతున్న గృహ ధరలు కూడా ఒక కారణం.
జపాన్ కంటే చైనాలో ఈ ధరల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నందున, అక్కడ గృహ రంగంలో ఒక పెద్ద “బుడగ” (Bubble) ఏర్పడింది. సంతానోత్పత్తి పెరగాలంటే నగరాల సాంద్రతను తగ్గించి, గృహ ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది. అయితే, ఇలా చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే ప్రమాదం ఉంది.
వివాహ వయస్సు – సంతానోత్పత్తి మధ్య సంబంధం
తొలి వివాహ వయస్సు పెరగడం సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని జపాన్ అనుభవం చెబుతోంది.
చైనాలో మొదటి వివాహ సగటు వయస్సు 2010లో పురుషులకు 26, మహిళలకు 24 ఏళ్లు ఉండగా; 2020 నాటికి అది 29, 28 ఏళ్లకు పెరిగింది. 25-29 ఏళ్ల వయస్సు గల అవివాహిత మహిళల శాతం 2000లో 9% ఉంటే, 2023 నాటికి అది 43 శాతానికి చేరుకోవడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థపై వృద్ధాప్య ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా ప్రభుత్వం “కొత్త నాణ్యమైన ఉత్పాదక శక్తుల”విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ, ఇలాంటి వృద్ధి- ప్రోత్సాహక చర్యలు అనివార్యంగా విద్యను పొడిగిస్తాయి. వివాహం, పిల్లలను కనడాన్ని ఇది ఆలస్యం చేస్తుంది. వివాహం కాని వారి నిష్పత్తిని పెంచుతుంది- సంతానోత్పత్తిని మరింత తగ్గిస్తుంది. దీనికి కూడా సులభమైన పరిష్కారాలు లేవని జపాన్ సూచిస్తుంది.
ఆర్థిక సవాళ్లు
వినియోగ పన్నును పెంచడం ద్వారా పిల్లల జననంపై రాయితీలకు నిధులు సమకూర్చింది. కానీ చెప్పినట్టుగా, గొర్రె బొచ్చు నుంచే ఉన్ని వస్తుంది: భారం చివరికి కుటుంబాలపై పడింది. ఇది జీడీపీలో వాటాగా ఉండే వినియోగించదగిన ఆదాయాన్ని తగ్గించింది.
ఇది 1994లో 62% నుంచి 2024 నాటికి 55 శాతానికి పడిపోయింది– ఈ నష్టాన్ని రాయితీలు దాదాపు భర్తీ చేయలేవు. అదేవిధంగా, తైవాన్ జనన రేటు 2000లో 1.68 నుంచి 2025 నాటికి 0.72కి పడిపోయింది. ఇది జీడీపీలో 67% నుంచి 55శాతానికి కుటుంబ ఆదాయ పతనాన్ని పాక్షికంగా ప్రతిబింబిస్తుంది.
రాజకీయ స్వరూపమే మారే అవకాశం
ప్రధాన భూభాగ చైనాలో, కుటుంబ ఆదాయం ఇప్పటికే జీడీపీలో కేవలం 43% మాత్రమే ఉంది. ఇది పిల్లల పెంపకాన్ని మరింత కష్టతరం చేస్తుంది.
కుటుంబ ఆదాయ వాటాను పెంచడమే, జనన రేటును పెంచడానికి చైనాకు ఉన్న ఉత్తమ మార్గం. ఇది వినియోగాన్ని కూడా పెంచడంతో పాటు, అదనపు సామర్థ్యాన్ని కూడా గ్రహిస్తుంది. కానీ ప్రభుత్వం ఇటువంటి పెద్ద మార్పును అనుసరించే అవకాశం లేదు. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల దాని స్వంత ఆర్థిక స్థితి, అధికారం బలహీనపడవచ్చు. ఇది చైనా రాజకీయ స్వరూపాన్నే మార్చడానికి దారితీయవచ్చు.
అంతేకాకుండా, చైనా ఉదారమైన సామాజిక ప్రయోజనాలను అందించడం ద్వారా సంతానోత్పత్తిని పెంచుకోగలిగినప్పటికీ, దాని ప్రభావాలు శాశ్వతంగా ఉండవు. అటువంటి జోక్యాలు కుటుంబ నిర్మాణాలను బలహీనపరిచి, పురుషుల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది.
నార్డిక్ దేశాలు ఇలాంటి విధానాలను అనుసరించిన తర్వాత, వివాహం కాకుండా పుట్టిన పిల్లల నిష్పత్తి 50-70 శాతానికి పెరిగింది. దీనిలో పన్ను చెల్లింపుదారులు “ప్రభుత్వ తండ్రులుగా”, “ప్రభుత్వ పిల్లలు” వృద్ధులకు మద్దతు ఇచ్చారు.
ఈ సమిష్టివాద నమూనా – పదిలక్షల మంది మరణాలకు దారితీసిన చైనా గ్రేట్ లీప్ ఫార్వర్డ్(1959-62)ను గుర్తుచేసేది – నిలకడలేనిది.
మనుగడ సంక్షోభం
నార్డిక్ దేశాలలో అత్యంత వేగంగా వృద్ధాప్యం చెందుతున్న ఫిన్లాండ్లో, సంతానోత్పత్తి రేటు 2010లో 1.87 నుంచి 2024లో 1.25కి పడిపోయింది. స్వీడన్లో, ఇది 2016లో 1.85 నుంచి 2024లో 1.43కు తగ్గింది- ఇది వృద్ధుల సంక్షేమం, పుట్టబోయే పిల్లల మనుగడ మధ్య ఉన్న ఉద్రిక్తతను ప్రతిబింబిస్తుంది.
ఒక గొలుసు బలం దానిలోని అత్యంత బలహీనమైన కట్టుపై ఆధారపడి ఉంటుంది. చైనా విషయంలో, అనేక కట్లను బలోపేతం చేయవలసి ఉంది. చైనా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తేనే జనన రేటు పెరగగలదు.
తక్కువ జనన రేటు, జనాభా వృద్ధాప్యం కోసం అనేక దేశాలకు ఆచరణీయమైన పరిష్కారాలు అవసరమైనందున, మానవ హక్కులను ఉల్లంఘించని ఒక ఉదాహరణను చైనా నెలకొల్పుతుందని ఆశిస్తున్నాము. కానీ, బండలను ఎగువకు (పైకి) దొర్లించడం ఎలాగో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారని ఇతర దేశాల అనుభవం సూచిస్తోంది.
విస్కాన్సిన్- మాడిసన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తగా వ్యాస రచయిత యీ ఫుక్సియాన్ సేవలందిస్తున్నారు. చైనా “ఏక సంతాన విధాన” వ్యతిరేక ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. ఫుక్సియాన్ రచించిన ‘బిగ్ కంట్రీ విత్ యాన్ ఎంప్టీ నెస్ట్ ‘ (చైనా డెవలప్మెంట్ ప్రెస్, 2013) అనే పుస్తకం- మొదట్లో నిషేధించబడింది. అయినప్పటికీ, ఇప్పుడు చైనాలో ‘చైనా పబ్లిషింగ్ టుడే’ వారి 2013 సంవత్సరపు 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఈ వ్యాసాన్ని ప్రాజెక్ట్ సిండికేట్ వెబ్సైట్ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
