
మండల్ కమీషన్ సిఫారుసుల అమలుతో దేశవ్యాప్తంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావించాయి. దీంతో పాటు వెనుకబడిన వర్గాలు- కులాల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే నాయకుల ఎదుగుదలకు అవకాశం వచ్చింది.
విస్తృతంగా విస్మృతికిగురైన సాతంత్య్రానంతర పార్లమెంట్ సభ్యుల జీవితాలను, వారి సేవలను వెలికితీసే భాగంలో “ది ఎర్లీ పర్లిమెంటేరియన్స్” ధారావాహికను ది వైర్ ప్రచురిస్తోంది. ప్రస్తుత వ్యాసం ఈ ధారావాహికలో ఒక భాగం. వ్యవస్థలు- సంస్థల ఏర్పాటుకు వారు అందించిన సహాయ- సహకారాలు, జాతి నిర్మాణానికి అందించిన వారి ఆలోచనలు, వారు నిర్వహించిన పాత్ర గురించి తెలియజేయాలన్నది దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం.
తేదీ : ఆగస్టు 6, 1990
స్థలం : ప్రధానమంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ
కార్యక్రమం: కేంద్రమంత్రి వర్గ సమావేశం
ఎజెండా : సాధారణ సమావేశం
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి వీపీ సింగ్‌తో పాటు మంత్రివర్గంలో కొందరు హాజరయ్యారు.
ఉపప్రధాని దేవీలాల్‌కు ప్రధానమంత్రి వీపీ సింగ్‌కు మధ్య అధికార సంఘర్షణ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీపీ సింగ్ మాట్లాడుతూ, “మండల్ కమీషన్ సిఫార్సుల అమలు మన పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగం, ఈ సిఫార్సులను దశలవారిగా అమలు చేయడానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు బీపీ మండల్ సిఫార్సులను మీ ముందు పెడుతున్నాను. అందులో, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ)లకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించడమైంది. దీనికి మీరందరు అంగీకరిస్తారన్న నమ్మకం ఉంది”.
ఫలితం : ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఒక ఇంటిపేరే పెద్ద ఎత్తున రాజకీయ నిఘంటువుగా మారి దుమారం రేపడం చాలా అరుదు. “మండల్” ఇంటి పేరు భూకంపంతో సరిసమానంగా దుమారం రేపి ఒకవైపు వ్యతిరేకులు, మరోవైపు మద్దతుదారులను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ ఉద్యమం అనేకమంది, జీవితాలను కూడా ప్రభావితం చేసింది.
భారతీయ ఓటర్ల సరళిలో మార్పు తీసుకువచ్చిన “మండల్” చివరి పేరు, బాబు బిందేశ్వరీ ప్రసాద్‌కు చెందినది. సాధారణంగా అందరూ బీపీ మండల్‌గా ఆయనను గుర్తిస్తారు. బీహార్‌కు చెందిన ఈ రాజకీయవేత్త, మొదటి నుంచి వెనుకబడిన తరగతుల కోసం పాటుపడేవ్యక్తిగా గుర్తించబడ్డారు. మండల్ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, 1968లో కొన్ని రోజుల వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
బాబు బిందేశ్వరీ ప్రసాద్ మండల్ పార్లమెంట్ సభ్యునిగా రెండవ బీసీ కమీషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ కారణంగా ఆ కమీషన్ పేరు “మండల్ కమీషన్”గా పిలవబడుతోంది.
కేంద్ర సర్వీసులలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కమీషన్ ద్వారా సిఫార్సు చేశారు. తన పాత్రతో మొదటి పేరు ఆ తర్వాత దేశ చరిత్రలో లిఖించబడింది.
వీపీ సింగ్ ప్రతిపాదనను మంత్రి వర్గం ఆమోదించడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ అయోమయానికిగురైయ్యాయి. రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలా? వ్యతిరేకించాలా? అని సందిగ్ధంలో పడిపోయారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చేపట్టిన నిరసనలు వీధులకు చేరాయి. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ– బీసీ విద్యార్థులు, ఇతరులు ర్యాలీలు నిర్వహించడంతో అనేక చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ఒక యువ సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా సాహ్నీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు(ఈ కేసునే ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ప్రభుత్వమని పిలువపడుతోంది).
ఈ పిటీషన్ ఆధారంగా, మండల్ కమీషన్ నోటిఫికేషన్‌పై అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్ర వెంటనే స్టే విధించారు. మూడు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
బీపీ మండల్ ఉత్తరప్రదేశ్ వారణాసిలో 1918 ఆగస్టు 25న జన్మించారు. కులాలతో నిండిన సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఆస్తి ప్రభావం కూడా అంతగా ఉండదని, గట్టిగా ఎదుర్కోవడం ఒక మార్గమన్న వాస్తవాన్ని యుక్త వయసులోనే తెలుసుకున్నారు. ఉత్తర బీహార్‌లోని మాధేపురాలోని సంపన్న యాదవ భూస్వామ్య కుటుంబం నుంచి మండల్ వచ్చారు.
దర్భంగ పాఠశాల హాస్టల్లో చదువుతుండగా అగ్రవర్ణాల పిల్లలకు ముందు వడ్డించి, ఆ తర్వాత తనలాంటి వారికి వడ్డించే వాస్తవ పరిస్థితిని ఆయనను ఎంతగానో ఆలోచింపజేసింది. అంతేకాకుండా, కూర్చోవడానికి బెంచ్ కూడా దొరకలేదు. తన సమూహానికి చెందిన పిల్లలను చేర్చుకొని ఈ ధోరణికి వ్యతిరేకంగా నిరసన మొదలుపెట్టారు. దీంతో పాఠశాల అధికారులు క్షమించరాని ఈ పద్ధతిని మార్చుకోవాల్సి వచ్చింది.
పాట్నా కళాశాల నుంచి ఉన్నత విద్యను మండల్ పూర్తి చేశారు. భాగల్పూర్లో మెజస్ట్రేట్గా నియమితులయ్యారు. 23 ఏళ్ల వయసులో 1941లో భాగల్పూర్ జిల్లా కౌన్సిల్ సభ్యులయ్యారు. జీవితాంతం తనకు తాను రాజకీయ సామాజిక పనులలో భాగస్వాములయ్యారు.
వృత్తిపరంగా వ్యవసాయదారుడైన మండల్‌కు కాంగ్రెస్, సంయుక్త సోషలిస్టు పార్టీ, సోషిత్ దళ్, జనతా పార్టీతో సంబంధం ఉంది. బీహార్ ఉభయ సభలకు నాలుగు సార్లు, లోక్‌సభకు మూడు పర్యాయాలు ఆయన ఎన్నికయ్యారు.
బీహార్ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ టికేట్పై మండల్ మాధేపురా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. సోషలిస్టు పార్టీకి చెందిన భూపేంద్ర నారాయణ్ మండల్‌ను ఓడించారు. 1957 వచ్చేసరికి పరిస్థితులు తారుమారైయ్యాయి. సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపేంద్ర నారాయణ్ మండల్ బీపీ మండల్‌ను ఓడించారు. ఆ తర్వాత బీహార్ సోషలిస్టు ఉద్యమంలో ఇద్దరు కలిసిమెలసి ప్రయాణాన్ని సాగించారు.
ఇద్దరు కూడా వెనుకబడిన యాదవకులానికి చెందినవారు. జిల్లాలో యాదవుల ప్రభావం ఎంతలా ఉందంటే, “రోమ్ పోప్‌కు ఎలానో అలానే గోప్స్(యాదవులు)కు మాధేపురా”.
బీహార్‌లోని ఒక గ్రామానికి చెందిన రాజ్‌పుత్ భూస్వాములు 1954లో కుర్మీ గ్రామంపై దాడి చేయడంతో బీపీ మండల్ వార్తలకు ఎక్కారు. బీసీ ప్రజలపై పోలీసుల దౌర్జన్యాలకు ఈ దాడి దారి తీసింది. అధికార పార్టీకి చెందిన శాసన సభ్యునిగా మండల్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ, దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన అభ్యర్థనను డిమాండ్‌ను విరమించుకోవాలని అధికారపక్షం నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రతిపక్షం వైపు వెళ్లి పోరాటాన్ని కొనసాగించడంతో అధికారపార్టీని ఇరుకున పెట్టింది.
మండల్ నిరసన, పోరాట పటిమ పట్ల ప్రభావితులైన సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా ఆయనను సంయుక్త సోషలిస్టు పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. సంయుక్త సోషలిస్టు పార్టీ టికేట్పై లోక్‌సభకు మండల్ పోటీ చేసి గెలిచారు. బీహార్ మంత్రి వర్గంలో చేరికపై లోహియాతో విబేధాలు ఏర్పడ్డాయి. దాంతో ఆ పార్టీని విడిచిపెట్టి మరి 1967లో “సోషిత్ దళ్” అనే పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
1968 ఫిబ్రవరి 1న బీహార్ 7వ ముఖ్యమంత్రిగా మండల్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ పదవిలో కొనసాగాలంటే, ఆయన శాసనసభ్యుడవ్వడం అవసరం. మండల్ శాసనమండలి సభ్యుడు అయ్యేంత వరకు ఆయన తన బాధ్యతలను తన పార్టీకి చెందిన సతీష్ సింగ్‌ను నాలుగు రోజుల కోసం సీఎంను చేశారు.
బీహార్ చరిత్రలోనే మొదటి సారి అగ్రవర్ణాలు కాకుండా ఓబీసీ ప్రతినిధులతోనే మంత్రివర్గం ఏర్పడింది. ఈ ప్రభుత్వం కేవలం నలభై ఏడు రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది. ఈ పరిణామం దేశరాజకీయాలలో కొత్త ఉత్తేజాన్ని, శక్తిని, ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించింది.
ముఖ్యమంత్రిగా మండల్ కేవలం 30 రోజుల్లోనే రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అనేక మంది మంత్రులకు వ్యతిరేకంగా వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన టీఎల్ వెంకటరామ అయ్యర్ కమిషన్‌ను కాంగ్రెస్ తొలగించడాన్ని నిరసిస్తూ, మండల్ రాజీనామా చేశారు.
మాధేపురా పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలిచి 1968లో మరోసారి మండల్ లోక్‌సభ సభ్యులయ్యారు. 1972లో బీహార్ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు. కానీ, జయప్రకాశ్ నారాయణ్ ఆందోళన సమయంలో 1975లో రాజీనామా చేశారు.
ఆ తర్వాత, జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఆందోళనలో మండల్ చేరారు. దానినే బీహార్ ఉద్యమం(1974- 75) అని కూడా అంటారు. అబ్దుల్ గఫూర్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల్ 1977లో జనతా పార్టీ టికెట్‌పై మాధేపురా నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆ పదవిలో ఆయన 1979 వరకు కొనసాగారు.
మండల్ వర్సెస్ కమండల్..
ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ 1978 డిసెంబర్లో బీసీ కమిషన్‌గా పిలువబడే ఐదుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్‌గా మండల్ నియమించబడ్డారు. కమిషన్ తన నివేదికను 1980లో అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో ఓబీసీలకు రిజర్వేషన్‌ను కల్పించాలని సిఫార్సు చేసింది.
సమాన అవకాశాల గురించి నొక్కి చెపుతూ, సమాజంలో ఎక్కువగా అవకాశాలు దక్కని అత్యధిక వర్గాలను గుర్తించి సామాజిక విద్య, ఆర్ధిక వ్యవస్థలో పెరుగుతోన్న వ్యత్యాసాలను సరిదిద్దాలని సిఫార్సు చేశారు. దీంతో సామాజిక న్యాయ సాధనకు మండల్ కమిషన్ నివేదిక ఒక ఆశాచిహ్నంగా మారింది.
అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్‌కు మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను సమర్పించారు. అయినప్పటికీ దానిని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ(1980- 89) ఆ నివేదికను పార్లమెంట్ ముందు పెట్టలేదు. వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది.
మండల్ సిఫార్సులలో బీసీ కులాల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ముందుకు వచ్చారు. అంతేకాకుండా, అనేక కొత్తరాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి.
ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ యాదవ్, శరత్ యాదవ్, మాయావతి, రాం విలాస్ పాశ్వాన్‌తో సహా అనేకమంది నాయకులు ఉన్నారు. ఆదివాసులు, ముస్లింలు, దళితులు, మహిళలు వంటి బడుగుబలహీన వర్గాలతో సామాజిక ఉద్యమాలు– కలయికలు ఈ సిఫార్సుతో మొదలైయ్యాయి.
అదే సమయంలో, బీసీలను ఎదుర్కోవడానికి అగ్రవర్ణాలు, మితవాద శక్తులు హింసను ప్రేరేపించి మతపరంగా విభజన వాతావరణాన్ని సృష్టించాయి. అనుకున్న విధంగా 1990లో బీజేపీ నేత ఎల్కే అద్వానీ రామజన్మభూమి ఉద్యమం ఊపందుకుంది. దీంతో దేశంలో “మండల్ వర్సెస్ కమండల్”గా పరిస్థితి మారింది.
బీహార్‌లో మండల్‌ను ఆశాకీరణంగా భావించారు. ఆయన స్మారకార్థం విగ్రహాలు, స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫేసర్ డాక్టర్ సందీప్ యాదవ్, “దోపిడికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం బీపీ మండల్ బలంగా నిలబడ్డారు. ధైర్య– సాహసాలు, అంకిత భావమున్న వ్యక్తిగా మండల్ ఉన్నారు. దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు కారణమైన దూరదృష్టి కలవారు. అన్ని వర్గాలు, రైతులు, కూలీలు, వ్యవసాయదారులు, సమ్మిళత సమూహ అభివృద్ధి కోసం ఆయన చేసిన సంస్కరణలు కారణమైయ్యాయి. తమ హక్కులు, గౌరవం కోసం పోరాడుతున్న కోట్లాది మంది ప్రజలకు ఆయన స్ఫూర్తిప్రదాత. భారతదేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దే వారసత్వాన్ని వదిలి వెళ్ళిన ఒక దిగ్గజం ఆయన.”
ఆయన చేసిన సిఫార్సుల చారిత్రకమైన ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఆయనకు అవకాశం లభించలేదు. 1982 ఏప్రిల్ 13న తన నివేదిక అమలుకాకముందే మండల్ చనిపోయారు.
అనువాదం: గంట రాజు
(వ్యాస రచయిత కుర్బాన్ అలీ బహుభాష పాత్రికేయులు. ఆధునిక భారతదేశ ప్రధాన రాజకీయ, సామాజిక, అర్థిక పరిణామాలపై రచనలు చేశారు. భారతదేశ స్వాతంత్య్రోద్యమం పట్ల అమితాసక్తి గలవారు. ప్రస్తుతం ఆయన, సోషలిస్టు ఉద్యమ చరిత్రను డాక్యుమెంట్ చేస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.