
ఆదివాసి వర్గాలకు వారి హక్కులను పరిరక్షించాల్సిన కౌన్సిల్‌కు మధ్య సంబంధాలను, పర్యావరణపరంగా సున్నితమైన ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో కార్పొరేటు చొచ్చుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య ఉన్న ఘర్షణలను గౌహతి హైకోర్టు చేసిన ఘాటు వాఖ్యలు బట్టబయలు చేశాయి.
ఉంరాంగ్సో/బార్పేట, అస్సాం: అస్సాం ప్రభుత్వం, దిమా హసావో స్వయంప్రతిపత్తి మండలి(డీహెచ్సీ) మీద ఆగస్టు 12న గౌహతి హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మూడువేల బీగాల ఆదివాసి భూమిని మైనింగ్ కోసం కోల్‌కతాకు చెందిన మహాబల్ సిమెంటు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించడంపై తీవ్రంగా విమర్శించింది. ఇది కాస్తా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆదివాసి వర్గాలకు- వారి హక్కులను పరిరక్షించాల్సిన కౌన్సిల్‌కు మధ్య సంబంధాలను, పర్యావరణపరంగా సున్నితమైన ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో కార్పొరేటు చొచ్చుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య ఉన్న ఘర్షణలను కోర్టు చేసిన వాఖ్యలు బట్టబయలు చేశాయి.
ఆరవ షడ్యూల్ కిందికి వచ్చే దిమా హసావో జిల్లాను 1951లో ఏర్పాటు చేశారు. ఇది నార్త్ కాచర్ హిల్స్ అటానమస్ కౌన్సిల్(ఎన్‌సీహెచ్‌ఏసీ) ద్వారా పరిపాలించబడుతోంది. ముఖ్యమైన ఆదివాసి వర్గాల భూములను, స్థానిక పరిపాలనను ఇది పర్యవేక్షిస్తుంది. ఉత్తరాన కర్బీ అంగ్లాంగ్- హోజై, దక్షిణాన క్యాచర్, తూర్పున నాగాలాండ్- మణిపూర్, పశ్చిమాన మేఘాలయ జిల్లాలు ఈ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నాయి. చాలామట్టుకు ఈ ప్రదేశంలో వివిధ గిరిజన, ఆదివాసీ వర్గాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతాల చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, జీవవైవిద్య సంపదతో పాటు టేకు, ఖనిజాలున్నాయి.
దిమాసా, కర్బీ ఇంకా ఇతర అనేక మైదాన ఆదివాసీలు దిమా హసావో జిల్లాలో నివాసిస్తున్నారు. జిల్లా భూభాగంలో 92% జీవవైవిధ్య అటవీ ప్రాంతం ఉంది. అంతేకాకుండా, సర్వే చేసిన- చేయని భూములు జిల్లాలో ఉన్నాయి. సర్వే చేసిన ప్రాంతాలలో భూహక్కులను కౌన్సిల్ చూసుకోగా, సర్వేచేయని ప్రాంతాలలో స్థానికులు సాంప్రదాయ పద్ధతిని అవలంభిస్తున్నారు. అయితే వీటిని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇక్కడ నివసించే ప్రజలు ప్రధానంగా ఝుమ్(షిప్టింగ్) మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.

న్యూస్ లాండ్రి రిపోర్టు ప్రకారం, దిమాహసావో జిల్లాలో పర్యావరణ అనుమతుల అవసరం ఉందా లేదా అన్నది అస్సాం ప్రభుత్వం నిర్థారించుకోలేదు. ఈ క్రమంలోనే ఎలాంటి సర్వే లేకుండా ఏడు సున్నపురాయి గనుల బ్లాక్ వేలానికి 2023 డిసెంబరులో టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
కొత్త మైనింగ్ ప్రాంతాలను ప్రకటించిన వెంటనే, అప్పటికే ఈ ప్రాంతంలో దాల్మియా సిమెంటు కంపెనీ మైనింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ కంపెనీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్ కమిటీని(సీఈసీ) సంప్రదించి, ప్రకటనపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. తాజా టెండర్ డాక్యుమెంట్ల మైనింగ్ సమ్మరీలో, గతంలో తాను చార్జీలను చెల్లించిన ప్రాంతాన్ని “అటవీయేతర” ప్రాంతంగా తెలియజేసినట్టుగా ఉందని పేర్కొన్నది.
గ్రామస్తులు దాఖలు చేసిన పిటీషన్లపై కోర్టు అధికారిక డాక్యుమెంట్లను ది వైర్ పరిశీలించగా, బీజేపీ నేతృత్వంలో పని చేస్తున్న దిమా హసావో స్వతంత్ర మండలి, 2024లో ఉంరాంగ్సో సమీపంలో రెండు ట్రాక్‌ల భూమి- 2,000 బీగాలను మార్చిలో, ఆ తర్వాత మళ్లీ 1,000 బీగాల భూమిని ఏప్రిల్‌లో మహాబల్ సిమెంటుకు కేటాయించింది.
గత మార్చిలో కేటాయించిన 2000 బీగాల భూమిని 30 సంవత్సరాల లీజుపై తదుపరి పునరుద్ధరణతో కేటాయిస్తూ, 2024 అక్టోబరులో కౌన్సిల్ ఆర్డర్ జారీ చేసినట్లు గ్రామస్తులు తెలియజేశారు.
2024 నవంబరులో మరో 1,000 బీగాలను కేటాయిస్తూ కౌన్సిల్ మరో ఆర్డర్ జారీ చేసినట్టుగా తమ పిటీషన్లో గ్రామస్తులు పేర్కొన్నారు. 26వ కేఎం క్రుమింగ్లాంగ్దిసా, ఉంరాంగ్సో సమీపాన 29వ కేఎం క్రుమింగ్లాంగ్దిసా మధ్య ఉన్న భూమిని నోబ్ది లాంగుక్రో, చోటో లార్ఫెంగ్ గ్రామాలను కలుపుకొని కౌన్సిల్ కేటాయించింది. ఉంరాంగ్సో ప్రాంతం ఇప్పటికే దాల్మీయా గ్రూపుకు చెందిన కాల్కామ్ సిమెంట్ ఇండియా లిమిటెడ్ సహా అనేక సిమెంటు ఉత్పత్తి ప్లాంట్లకు ఆతిథ్యమిస్తోంది.

నోబ్ది లాంగుక్రో గ్రామంలో చాలా దశ్దాల నుంచి నివాసముంటున్న 40 కుటుంబాల వారు పలు విషయాలను తెలియజేశారు. 2024 మార్చిలో కంపెనీ ప్రతినిధులు భూమి కొలతలకు వచ్చారని, ఆ తర్వాత తమ వ్యవసాయ భూములను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు సిమెంటు కంపెనీకి కేటాయించినట్టుగా తెలిసిందని అన్నారు. భూకేటాయింపుపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని అన్నారు.
హాఫ్లాంగ్కు చెందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాపోజిత్ లాంగ్థాసా మాట్లాడారు. 2024 మేలో సమాచారహక్కు చట్టం కింద ధరఖాస్తును దాఖలు చేసినట్టుగా తెలియజేశారు. భూకేటాయింపు చర్య నష్టపరిహార చట్టం ప్రకారం, పరిహారం పొందే హక్కు ఉందా లేదానే వివరాలను కోరినట్టుగా చెప్పారు. అంతేకాకుండా, భూసేకరణలో పర్యావరణ అనుమతితో పాటు అనేక ప్రశ్నలకు వివరాలను అడిగినట్టుగా చెప్పుకొచ్చారు.
అయితే, ఆయన అడిగిన ప్రశ్నలకు జిల్లా సెటిల్మెంట్, రెవెన్యూ డిపార్టుమెంట్ సమాధానాలను ఇవ్వలేదు. అంతేకాకుండా, కంపెనీకు కేటాయించిన 2,000 బీగాలు “కౌన్సిల్ ముఖ్య భూమి”- భూ యజమానుల పేర్లతో జాబితాను అందజేశారని లాంగ్థాసా వెల్లడించారు.
“కంపెనీ నుంచి కౌన్సిల్ రూ 48 కోట్లు తీసుకుంది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఆ తర్వాత మరో 1,000 బీగాలను కేటాయించింది. ఈ మొత్తం 3,000 బీగాలను కొలిచినట్లయితే, మరిన్ని గ్రామాలు నష్టపోయి ఉండేవ”ని ఆయన అన్నారు.
కౌన్సిల్ అన్ని చట్టాలను, పర్యావరణ ఆలోచనను తుంగలో తొక్కిందని, ఇది పూర్తిగా కుంభకోణమని లాంగ్థాసా చెప్పారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం కర్బీ అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ సుమారు 1.5 లక్షల బీగాల భూమి కార్పొరేట్లకు కేటాయించింది.
“రాజ్యాంగంలోని మరో పాలనాపరమైన యూనిట్ ఆరవ షెడ్యూల్ కింద ఉంది. ఆరవ షెడ్యూల్ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా కార్పొరేట్లకు ఆదివాసి భూములను కేటాయించడం పెరిగింది” అని లాంగ్థాసా తెలిపారు.
నోబ్ది లాంగుక్రో గ్రామస్తులు దివైర్తో మాట్లాడుతూ, నష్టపరిహార లాభాల కోసం అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తుల పేర్లపై భూమిని కౌన్సిల్ బదిలీ చేసిందని ఆరోపించారు. తాము భూయజమానులమని చెప్పుకుంటున్న వారు, అసలు స్థానికులే కారని పేర్కొన్నారు.
ఎంపిక చేసిన గ్రామస్తులకు అధికారులు అర్థరాత్రి చెక్కులను పంపిణి చేశారని 26వ కేఎం క్రుమింగ్లాంగ్దిసా నివాసి 45 ఏళ్ల వయసు వ్యక్తి చెప్పారు. అలాంటి చెక్కునే పొందిన మరో గ్రామస్తుడు మాట్లాడుతూ, “కొంతమంది రూ 2 లక్షల చెక్కును పొందగా, మరి కొంత మంది రూ 15 లక్షల చెక్కును పొందార”ని అన్నారు. ఇదంతా చూస్తే, ఇదో పెద్ద కుంభకోణంలా అనిపిస్తోందని దాదాపు చాలామంది గ్రామస్తులు ఆరోపించారు.
“గ్రామాలలో బడా బాబుల మద్దతును కూడగట్టుకొని, వారికి భారి మొత్తంలో నగదును నష్టపరిహారిహారంగా అందచేస్తున్నార”ని 45 ఏండ్ల వ్యక్తి చెప్పారు. వైర్‌తో మాట్లాడిన గ్రామస్తులందరూ తమ పేర్లను గోప్యంగా ఉంచాలని కోరారు.
నష్టపరిహారం చెక్కులను తాము స్వీకరించలేదని 26వ కేఎం క్రుమింగ్లాంగ్దిసా సమీపాన ఉన్న చోటో లార్ఫెంగ్ నివాసులు తెలిపారు. నోబ్ది లాంగుక్రోలో సంఘ నాయకులు “సుమారు 30 చెక్కులను తిరిగి ఇచ్చేసినట్టు’‘గా కొంత మంది గ్రామస్తులు తెలియజేశారు. డబ్బు చెల్లింపులను తిరస్కరిస్తే, మొత్తం ప్రభుత్వ నష్టపరిహారాన్ని కోల్పోతారని అధికారులు తమను హెచ్చరించినట్టుగా పేర్కొన్నారు.
2024 అక్టోబరు 30న భూమిని చదును చేయడానికి కంపెనీ ప్రతినిధులు బుల్డోజర్తో స్థలాన్ని సందర్శించారని తమ పిటిషన్లో గ్రామస్తులు తెలిపారు. కౌన్సిల్ కార్యనిర్వాహక సభ్యులు మోంజిత్ నైడింగ్ తన ప్రైవేటు భద్రతా సిబ్బందితో రాగా, గ్రామస్తులు నిరసన మొదలుపెట్టారని, వెంటనే తన సిబ్బంది దగ్గరి నుంచి తుపాకిని తీసుకొని నిరసనకారుల వైపు నైడింగ్ కాల్పులు జరిపారని, ఆ కాల్పుల వల్ల బుల్లెట్ తన కాలుకు తగిలిందని ఒక సాక్షి చెప్పారు.
“మేము ఇప్పటికే నీప్కో ఆనకట్ట వల్ల తీవ్రంగా నష్టపోయాము. ఆనకట్ట నుంచి నీరును విడుదల చేసినప్పుడల్లా మా గ్రామాలు వరదల వల్ల ముంపుకు గురవుతుండడంతో, మేము అక్కడి నుంచి ఇక్కడికి నివాసాన్ని మార్చుకున్నాము. ఇప్పుడు కౌన్సిల్ మాతో ఎటువంటి చర్చలు చేయకుండా, పత్రాలు లేకుండా మా భూములను కంపెనీకి కేటాయిస్తుంది. మేము ఎక్కడికి వెళ్లాలి?” అని గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన తిమ్జోస్ తెరాంగ్(30) తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు.

“ఈఎంల బెదిరింపులను రికార్డుచేస్తున్న కారణంగా మా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మా ఫోన్లను తీసుకోమని ఉంరాంగ్సో పోలీసు స్టేషన్‌కు మమ్మల్ని పిలిపించుకున్నారు. కానీ, సంవత్సరం గడిచినప్పటికీ మా ఫోన్లు ఇంకా మాకు దక్కలేదు” నోబ్ది లాంగుక్రో గ్రామంలో ఝుమ్ వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబానికి చెందిన 23 ఏండ్ల ఒక నిరసనకారుడు తెలియజేశాడు.
“కౌన్సిల్ కార్యనిర్వాహక సభ్యునికి వ్యతిరేకంగా మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. అయినప్పటికీ, ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇదిలా ఉంటే, మేము కొంతమందితో కలిసి సిమెంటు కంపెనీకి చెందిన కొందరిపై దాడి చేసినట్టుగా మాకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు” తన వివరాలు వెల్లడించకూడదని కోరిన మరో గ్రామస్తుడు తెలియజేశాడు.
బాపోజిత్ లాంగ్థాసా గతంలో గ్రామస్తుల తరఫున గౌహతీ హైకోర్టులో ఒక పిల్(పిల్/49/2024)ను దాఖలు చేశారు. అయితే, 2024 నవంబర్ 20న కంపెనీకి అనుకూలంగా కోర్టు తీర్పును వెలువరించింది. అంతేకాకుండా కంపెనీ తన పనులను ప్రారంభించుకోవడానికి అనుమతించింది. “ఈ సమస్యను కోర్టు పరిగణించిందని కానీ, స్థానికులు మాత్రం తమ పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది”అని లాంగ్థాసా వివరించారు.
2025లో రాజస్థాన్ నివాసి ముఖేశ్ గుర్జార్ కంపెనీ తరఫున ధాఖలు చేసిన రిట్ పిటీషన్(337 2025)లో గ్రామస్తులు తమ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
22 ఏండ్ల సోనేష్ హోజైతో పాటు నోబ్దిలాంగుక్రోకు చెందిన 21 మంది ఒక పిటీషన్(467 2025)ను దాఖలు చేశారు. అంతేకాకుండా పిటీషనర్ల భూములను చట్టవ్యతిరేకంగా కంపెనీ లాక్కుంటుందని చోటా లార్ఫెంగ్ ఆరోపించారు.
2025 ఆగస్టు వరకు ఈ రెండు కేసులపై కనీసం తొమ్మిది సార్లు గౌహాతీ హైకోర్టు వాదనలను విన్నది.
ది వైర్‌కు సోనేష్ హోజై చెప్తూ, “మా భూముల రక్షించుకునే హాక్కు మాకు ఉంది. చట్టవ్యతిరేకంగా మా వ్యవసాయ భూములను లాక్కొని, ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని గెంటివేయడానికి కంపెనీ, కౌన్సిల్ ప్రయత్నిస్తున్నాయి” అని అన్నారు.

కంపెనీ, అధికారుల నుంచి తనతో పాటు తన పొరుగు వారు అనేక సార్లు బెదిరింపులను ఎదుర్కొన్నట్టుగా సోనేష్ వెల్లడించారు. కంపెనీ పనులకు తను విఘాతం కలిగిస్తున్నట్టుగా ఆరోపిస్తూ తనపై అనేక ఫిర్యాదులు చేశారని చెప్పారు. గ్రామస్తులు కంపెనీని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలియజేశారు. “కానీ, మాకందరికీ శాశ్వత ఉద్యోగాలు కావాలని మేము డిమాండ్ చేశాము”అని సోనేష్ చెప్పారు. “ఒకవేళ కంపెనీ మాకు ఏదో ఒక చిన్న పని మాత్రమే ఇచ్చి కొన్ని రోజులకు పనిలో నుంచి తీసేస్తే. ఆ తర్వాత మేము ఏం చేయాలి?” అని సోనేష్ ప్రశ్నించారు.
“రాజకీయ నాయకులకు, పరిపాలనకు అనేక మంది గ్రామస్తులు భయపడుతున్నారు. నిరంతరంగా బెదిరింపులను ఎదుర్కోవడం వల్ల భయంతో వారు తమ గొంతును తెలియజేయలేకపోతున్నారు.”
ఈ మొత్తం విషయం మీద సిమెంటు కంపెనీ ప్రతినిధి స్పందనను తెలుసుకోవడానికి ది వైర్ ప్రయత్నించింది. వారు స్పందిస్తే ఈ రిపోర్టు అప్డేట్ చేయబడుతుంది.
సాంకేతికయుక్తి..
ఉంరాంగ్సోలోని దాల్మియా సిమెంట్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర సాధికారిక కమిటీ 2025 ఫిబ్రవరిలో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక టీఎన్ గోదవర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు డిసెంబర్ 12, 1996 తీర్పును పట్టించుకోలేదని ఒక రిటైర్డ్ అటవీ అధికారి ఆరోపించారు. ఈ తీర్పులోని “అటవీ” అనే పదాన్ని విశాలదృక్పథంతో అర్థం చేసుకోవాలని, వర్గీకరించని, తగ్గించడం, పునర్సృష్టించే ప్రాంతంగా గుర్తించాలి. దానికి బదులుగా సీఈసీ, అస్సాం ప్రభుత్వం అటవీ నిబంధనలు- 2022ను అమలు చేసింది. ఈ నిబంధనలు అటవీ ప్రాంతాన్ని అతుకులుగా గుర్తించింది. 10 హెక్టార్ల కంటే తక్కువలేని ప్రాంతంలో కనీసం హెక్టార్‌కు 200 చెట్లు ఉండాలి. ఈ సంకుచిత నిర్వచనాన్ని అమలు చేస్తూ సీఈసీ 1,168 హెక్టార్లకు ఆనుకొని ఉన్న వర్గీకరించని అటవీ భూమిని కేవలం 14.53 హెక్టార్లు “అటవీ” ప్రాంతంగా కుదించింది. మిగితా 1,153 హెక్టార్లను “అటవీయేతర” ప్రాంతంగా పునర్విభజించింది.
“ఈ సాంకేతికయుక్తి ఆకస్మాత్తుగా జరిగింది కాదు- ఈ భూములను ఇప్పటికే సున్నపు గనుల బ్లాకులుగా అస్సాం ప్రభుత్వం వేలం వేయడానికి కేటాయించింది” అని ఆమె వైర్‌కు చెప్పారు.
“ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు మార్గాన్ని మరింత ప్రభావంతంగా ఈ పునర్విభజన సరళతరం చేసింది. పర్యావరణ సున్నితమైన ఈ ప్రాంతంలో అటవీ (సంరక్షణ) సవరణ చట్టం- 2023 కింద అటవీ క్లియరెన్స్ అనుమతి అవసరం లేకుండా కంపెనీలకు ఈ భూములను కట్టబెడుతోంది.”
ఆరవ షెడ్యూల్డ్ జిల్లాకు చెందిన ఈ భూమని దోపిడి చేయడాన్ని, ఆదివాసీ వర్గాలపై దాడికి దిగడాన్ని ప్రతిపక్షపార్టీలు- హక్కుల సంఘాలు ఖండించాయి.
“సిమెంట్ కంపెనీలకు స్థానికుల భూములను అప్పగించక ముందు బీజేపీ నేతృత్వంలోని కౌన్సిల్ కనీసం స్థానికులతో సంప్రదించలేదు. ఇది అక్రమమైన చర్య. ఆదివాసీల హక్కులను కాపాడాల్సిన కౌన్సిల్, దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోంది. గిరిజనులను బెదిరిస్తూ- వారి హక్కులను కాలరాస్తోంది” అని ఆరవ షెడ్యూల్డ్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ డేనియల్ లాంగ్థాసా ది వైర్‌కు తెలియజేశారు.
ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్(ఏపీహెచ్ఎల్సీ) నేత డిపెన్ రోంగ్పీ ది వైర్‌తో మాట్లాడుతూ, “ఆరవ షెడ్యూల్డ్‌లోని భూమిని, అడవులను, ఖనిజాలను ఆదివాసీల కోసమే రాజ్యాంగబద్ధంగా పరిరక్షించబడింది. ఇక్కడి భూమని కేవలం ఆదివాసీలే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది- స్థానికేతరులు, గిరిజనేతరులు ఈ ప్రాంతంలోని భూమిని సొంతం చేసుకోరాదు” అన్నారు.
“సిమెంట్ కంపెనీకి 3,000 బీగాలు కేటాయించడం పూర్తిగా రాజ్యంగ విరుద్ధం. కౌన్సిల్ ఈ భూమిని అప్పగిస్తే, గిరిజన ప్రజలను వారి నివాసాల నుంచి వ్యవసాయ భూముల నుంచి ఖాళీ చేయిస్తార”ఆయన చెప్పుకొచ్చారు.
ఇది ఒకరకమైన పరాచికమా..!?
ఈ అంశంపై గౌహతి హైకోర్టులో ఆగస్టు 12న వాదోపవాదనలు జరిగాయి. ఆ సమయంలో జస్టిస్ సంజయ్ కుమార్ మేధి తీవ్రంగా స్పందించారు. మూడువేల బీగాల భూమిని ప్రైవేటు కంపెనీకి కేటాయించడం “అసాధారణ”మైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. కేటాయింపులను సమర్ధిస్తూ రికార్డులను చూపించాలని ఎన్‌సీహెచ్‌ఏసీ కౌన్సిల్‌ను అదేశించారు. ఆరవ షెడ్యూల్డ్ జిల్లాగా నొక్కి చెపుతూ, “దిమా హసావో గిరిజనుల హక్కులు, ఆ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైంది- అంతేకాకుండా వలస పక్షులు, వన్యప్రాణులకు నివాసంగా ఉంది. వీటి ప్రాధ్యాన్యతను గుర్తించాల”ని ఆయన పేర్కొన్నారు.
“3000 బీగాలా! మొత్తం జిల్లా? అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఒక ప్రైవేటు కంపెనీకి 3000 బీగాలు ఇచ్చారా?” కౌన్సిల్ తీసుకున్న చర్యలపై జస్టిస్ మేధి దిగ్భ్రాంతికి గురై ప్రశ్నించారు.
ఈ క్రమంలో మహాబల్ కంపెనీ తరఫు న్యాయవాది జీ గోస్వామి”ఇదంతా పడావు భూమి” అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా న్యాయమూర్తి మేధి, “మాకు తెలుసు అదెలా పడావు భూమో, అయినా కానీ 3000 బీగాలా? ఇది ఏ రకమైన నిర్ణయం? ఇది ఒకరకమైన పరాచకమా? మాకు ప్రైవేటు సంస్థల ఆసక్తి కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యం” అన్నారు.
సెప్టెంబర్ 1న గౌహతి హైకోర్టులో ఈ కేసుపై మళ్లీ వాదనలు ప్రారంభించగా భూబదలాయింపై జడ్డీలు అనేక ప్రశ్నలను లేవనెత్తారు.
“అటవీశాఖ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? మీరు సిమెంట్ ఫ్యాక్టరీని ఎలా మొదలుపెడతారు? ఉమరాంగ్సో అంటే ఏంటి? ఇది పర్యావరణ క్షేత్రం. అక్కడ మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది, 3000 బీగాలా? వీటన్నింటికీ సంబంధించిన రికార్డులను చూపించండి. అన్ని సక్రమంగా ఉంటే, మాకు చెప్పడానికి ఏం లేదు. కానీ, పుస్తకాల్లో రాసిన దాని ప్రకారమే మేము కఠినంగా ముందుకు వెళ్తున్నాము.”
కంపెనీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, కౌన్సిల్ నుంచి ఈ భూమిని రెండు లక్షల చొప్పున ఒక బీగాను కొనుగోలు చేశామని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా ఎవరు ఈ కొనుగోలును చేయించారని మేధి ప్రశ్నించారు. తదుపరి తేదీలోగా భూకేటాయింపు విధానానికి సంబంధించి అన్ని రికార్డులతో కూడిన వివరాలను సమర్పించాలని కంపెనీ న్యాయవాదిని ఆదేశించారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2లోగా కోర్టుకు హాజరై అఫిడవిట్ దాఖలు చేయాలని, అస్సాం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని వివరించాలని కోరారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.