బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ బీహార్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, నితీష్ కుమార్ ఇంకా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ మార్చి 30న బీహార్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆయన రాజ్యసభకు ఎన్నికైన రెండు వారాల తర్వాత ఈ రాజీనామా చోటుచేసుకుంది.
బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారావోగి బంకిపూర్ స్థానానికి సంబంధించిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్కు సమర్పించారు.
రాజీనామాను ఆమోదించినట్టు ప్రేమ్ కుమార్ ధృవీకరించినట్లు పీటీఐ తెలిపింది.
బీహార్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిన నితిన్ నవీన్, 2026 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నియోజకవర్గ ప్రజలతో అనుబంధం..
తన ఎక్స్ ఖాతాలో నిర్ణయాన్ని ప్రకటిస్తూ, “గత 20 సంవత్సరాలుగా నా తండ్రి, దివంగత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా సృష్టించిన ఈ ప్రాంతాన్ని ఒక కుటుంబ స్ఫూర్తితో పోషించడానికి, అభివృద్ధి చేయడానికి నేను నిరంతరం కృషి చేశాను. నా ప్రాంతం, బీహార్ అభివృద్ధి కోసం నేను ఎప్పుడూ అంకితభావంతో పనిచేశాను. దాని ఫలితంగా ఇక్కడి ప్రజలు నన్ను వరుసగా ఐదు పర్యాయాలు ప్రతినిధుల సభకు ఎన్నుకోవడం ద్వారా వారికి సేవ చేసే గౌరవాన్ని ఇచ్చారు” అని నవీన్ రాశారు.
అంతేకాకుండా, “ఈ రోజు నేను బంకిపూర్ నియోజకవర్గం నుంచి బీహార్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడిగా రాజీనామా చేస్తున్నాను. పార్టీ నాకు అప్పగించిన ఈ కొత్త పాత్ర ద్వారా, నా నియోజకవర్గం, బీహార్ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను. నా కార్యకర్తలతో, బీహార్ ప్రజలతో నాకు ఉన్న విడదీయరాని బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇది నాకు కొత్త శక్తిని, స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటుంది”అని అన్నారు.

నితీష్ కుమార్ రాజీనామా..
ఇదిలా ఉండగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మార్చి 30న రాష్ట్ర శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారని మండలి ఛైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్ తెలిపారు.
జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ, నితీష్ కుమార్ రాజీనామాను శాసన మండలికి సమర్పించారు. నితీష్ కుమార్ ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నితిన్ నవీన్, జేడీయూ అధినేత ఇద్దరూ మార్చి 16న పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికయ్యారు.
నిబంధనల ప్రకారం, నితీష్ పార్లమెంటుకు ఎన్నికైన 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి ఉంది.
మార్చి 27న, బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్, ముఖ్యమంత్రికి రాజీనామా చేయడానికి మార్చి 30 వరకు గడువు ఉందని తెలిపారు.
చట్టపరమైన నిబంధనలు, ముఖ్యమంత్రి పదవి..
ది హిందూ పత్రికలోని కథనం ప్రకారం– మార్చి 20న బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడారు.
“రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ నితీష్ కుమార్ రాబోయే ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చ”ని అన్నారు.
“ఎంపీగా ఎన్నికైన తర్వాత, 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభలోని ఏ సభ సభ్యత్వానికైనా రాజీనామా చేయాలి. నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేశారు. అయినప్పటికీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం, తర్వాత ఆరు నెలల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు” అని ఆయన అన్నారు.
రాజ్యాంగంలోని 101, 190 అధికరణల కింద రూపొందించిన ‘ఏకకాల సభ్యత్వ నిషేధ నియమాలు, 1950’ ప్రకారం- పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రెండింటికీ ఎన్నికైన వ్యక్తి 14 రోజులలోపు రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
