మధ్యప్రదేశ్‌లోని మూడు పులుల నివాస ప్రాజెక్టుల కోర్ ప్రాంతాలలో బర్నా ఆనకట్టకు సంబంధించిన భూగర్భ నీటి పైప్‌లైన్, మౌలిక సదుపాయాల నిర్మాణానికి జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని రాజాజీ జాతీయ ఉద్యానవన కోర్ ప్రాంతంలో రోప్‌వే ప్రాజెక్టును కూడా ఆమోదించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఫెన్ వన్యప్రాణుల అభయారణ్య పర్యావరణ- సున్నితమైన జోన్లో రెండు బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టులకు ఆమోదం కూడా సిఫార్సు చేసింది.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని పులుల ఆవాసాలలో గ్రేటర్ పన్నా ల్యాండ్‌స్కేప్, సంజయ్ దాబ్రీ టైగర్ రిజర్వ్, రాతాపాణి టైగర్ రిజర్వ్ అనే మూడు ప్రాజెక్టులకు జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అదనంగా, ఉత్తరాఖండ్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలో రోప్‌వే ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, డిసెంబర్ 9న జరిగిన సమావేశం మినిట్స్ ప్రకారం, సత్నా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సున్నపురాయి క్వారీకి అనుమతి ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రాజెక్ట్ ప్రతిపాదన ప్రకారం, పన్నా టైగర్ రిజర్వ్ టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద ఆమోదించబడిన వన్యప్రాణుల కారిడార్ లోపల, చుట్టుపక్కల 266.302 హెక్టార్ల రెవెన్యూ భూమిని లీజుకు ఇవ్వబడుతుంది.
ఈ కారిడార్ పన్నా, బంధవ్‌గఢ్, సంజయ్ టైగర్ రిజర్వ్‌ల ఆవాస ప్రాంతాలను కలుపుతుంది.
మిగతా రెండు పులుల అభయారణ్యాలు- సంజయ్ దాబ్రీ, రాతాపాణి – భూగర్భ నీటి పైప్‌లైన్, బర్నా ఆనకట్టకు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ఆమోదం లభించింది.
అదే సమయంలో, ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్ రిజర్వ్ ప్రధాన ప్రాంతంలో 4.54 హెక్టార్ల భూమిని రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్ నుంచి నీలకంఠ మహాదేవ్ ఆలయం వరకు రోప్‌వే నిర్మాణం కోసం ఆమోదించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో ఉన్న ఫెన్ వన్యప్రాణుల అభయారణ్య పర్యావరణ-సున్నితమైన జోన్లో రెండు బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.
ఈ మైనింగ్ లీజులు రక్షిత ప్రాంతాల కోర్ లేదా బఫర్ జోన్ల పరిధిలోకి రానప్పటికీ- ఫెన్ అభయారణ్యం, కన్హా టైగర్ రిజర్వ్, కన్హా-అచనక్మార్ కారిడార్లకు సమీపంలో ఉన్నందున పర్యావరణ రక్షణలు అవసరమని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
అక్టోబర్‌లో, 266.3 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న AAA రిసోర్సెస్ లిమిటెడ్ సున్నపురాయి క్వారీ లీజును కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మధ్యప్రదేశ్ అటవీ శాఖలతో కూడిన కమిటీ పరిశీలించింది.
ఈ తనిఖీలో కొంత మైనింగ్ లీజు నియమించబడిన టైగర్ కారిడార్ పరిధిలోకి వస్తుందని తేలింది. లీజు దక్షిణ భాగం దట్టమైన అడవులతో కూడుకుని ఉంది. అంతేకాకుండా పులుల సంచారానికి అనువైన మార్గాలను అందిస్తుంది, అయితే ఉత్తర భాగం ముక్కలుగా విభజించబడింది.
ఈ ప్రాజెక్టును సిఫార్సు చేయడంలో, దక్షిణ కారిడార్ ద్వారా పులుల కదలికను నిర్ధారించడం, బలోపేతం చేయడం చాలా అవసరమని కమిటీ పేర్కొన్నది. దీనికి మైనింగ్ కార్యకలాపాలను పరిమితం చేయడంతో పాటు ఆవాస మెరుగుదల చర్యలను అమలు చేయడం అవసరం.
రోప్‌వే ప్రాజెక్టుపై చర్చల సందర్భంగా, ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ పరిరక్షకులు ఈ ప్రతిపాదనను సమర్థించారు. ఇది కన్వర్ యాత్ర సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని, యాత్రికులు ఉపయోగించే అటవీ రహదారిపై వాహనాల ఒత్తిడిని తగ్గిస్తుందని అన్నారు.
పర్యావరణ దృక్కోణం నుంచి ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం విలువైనదని నిపుణుల సభ్యులు రామన్ సుకుమార్ అన్నారు.
ఈ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను వన్యప్రాణుల సంస్థ అధ్యయనం చేయాలని, నిర్మాణ కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడానికి తగు సూచనలు ఇవ్వాలనే షరతుతో ఈ ప్రాజెక్టును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదించింది.
ఇదిలా ఉండగా, అటవీ భూముల ఆక్రమణ కేసులో ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించి దర్యాప్తుకు ఆదేశించింది.
అదే సమయంలో, అటవీ భూముల ఆక్రమణ కేసులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర ప్రభుత్వం, దాని అధికారులను “మౌన ప్రేక్షకులు”గా అభివర్ణించింది. సుమోటో కేసును కోర్టు నమోదు చేసింది.
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన వెకేషన్ బెంచ్ ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిని విచారణ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
“తమ కళ్ల ముందే అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం, రాష్ట్ర అధికారులు మౌనంగా ఉండటం చూసి మేము దిగ్భ్రాంతి చెందాము. దీంతో సుమోటోగా కేసును నమోదు చేస్తున్నాము. నిజనిర్ధారణ కమిటీని ఉత్తరాఖండ్ అటవీ సంరక్షణ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలి. ప్రైవేటు పార్టీలు ఎటువంటి మూడవ పక్ష హక్కులను సృష్టించకుండా నిషేధించబడ్డాయి. నిర్మాణ పనులు అనుమతించబడవు” అని ధర్మాసనం పేర్కొన్నది.
నివాస గృహాలు తప్ప మిగిలిన ఖాళీ స్థలాలన్నింటినీ అటవీ శాఖ స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఉత్తరాఖండ్‌లోని పెద్ద అటవీ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించడంపై అనితా కన్డ్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
