ఈడీ దర్యాప్తు వార్తల్లో రిపబ్లిక్ టీవీ తనను వ్యక్తిగతంగా దోషిగా చిత్రీకరించిందని, దీనివల్ల తన ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ అనిల్ అంబానీ ఆ ఛానెల్, అర్నబ్ గోస్వామిపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు.
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తన ఆర్థిక లావాదేవీల వార్తలపై రిపబ్లిక్ టీవీ, దాని ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బార్ & బెంచ్ ప్రకారం, ఈ వార్తల వల్ల తన ప్రతిష్టకు పూడ్చలేని నష్టం జరిగిందని అంబానీ పేర్కొన్నారు.
ఈ కేసును బుధవారం జస్టిస్ మిలింద్ జాదవ్ విచారించనున్నారు. రిపబ్లిక్ టీవీ మాతృ సంస్థ ఏఆర్జీ అవుట్లియర్, అర్నబ్ గోస్వామి సహా ఇతర గుర్తుతెలియని పక్షాలపై తాత్కాలిక నిషేధాజ్ఞ జారీ చేయాలని పిటిషన్లో కోరారు.
అభ్యంతరకరమైన కథనాలపై ఆవేదన..
లైవ్ లా కథనం ప్రకారం, ప్రతివాదులు తమ న్యూస్ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేసిన కథనాల వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు అంబానీ పిటిషన్లో తెలిపారు.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన చర్యలకు సంబంధించి ప్రసారం చేసిన వార్తలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ నిర్వహణతో సంబంధం లేదు..
2019 నవంబర్‌లో అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారని, ఆ కంపెనీల్లో ఆయన ఎటువంటి నిర్వాహక, కార్యాచరణ పాత్ర పోషించలేదన్న విషయం రిపబ్లిక్ టీవీకి, గోస్వామికి తెలుసని పిటిషన్లో గుర్తుచేశారు.
ఆ కంపెనీలన్నీ వేర్వేరు సంస్థలని, వాటి రోజువారీ నిర్వహణలో గానీ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో గానీ తనకు ఎలాంటి జోక్యం లేదని అంబానీ స్పష్టం చేశారు.
ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు..
ఈ వాస్తవాలన్నీ తెలిసినప్పటికీ, దురుద్దేశంతో, అబద్ధాలతో, బాధ్యతారహితంగా విచారణలో ఉన్న కంపెనీల ఆరోపణలను తనకు ముడిపెట్టడానికి ప్రయత్నించారని ఆక్షేపించారు.
సంచలనాత్మక శీర్షికలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు, కించపరిచే పరోక్ష సూచనలతో కూడిన రిపోర్టింగ్ ద్వారా ఈ ఆర్థిక అవకతవకలకు తనను వ్యక్తిగతంగా బాధ్యుడిగా చిత్రీకరించారని అంబానీ ఆరోపించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
