1979లో అయతుల్లా రుహోల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇరాన్లో రాజ్యాధికారం మారినప్పటి నుంచి అమెరికా- ఇరాన్‌ను శత్రుదేశంగానే పరిగణిస్తోంది.
ఇరాన్- అమెరికా సంబంధాలలో వైషమ్యాల దశ దాటి ఘర్షణలతో- చివరకు పశ్చిమాసియా రాజకీయ, ఆర్థిక చిత్రపటాన్ని మార్చివేయగల యుద్ధ మేఘాల స్థాయికి చేరుకున్నాయి. 1979లో సామ్రాజ్య శక్తుల అనుకూల మొహమ్మద్ రెజా పహ్లావిని గద్దె దించి అయతుల్లా రుహోల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికాకు ఇరాన్ శత్రు దేశంగా మారింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అంశాలపై- దౌత్య, దౌత్యేతర రంగాలలో ఇరు దేశాలు ఘర్షణ పడుతునే ఉన్నాయి.
అణ్వస్త్ర సామార్థ్యాన్ని సాధించాలనుకున్న ఇరాన్ ఆకాంక్షలను అడ్డుకోవడానికి 2005- 10 మధ్య అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ద్వారా అమెరికా చేయని ప్రయత్నం లేదు.
మరోవైపు పశ్చిమాసియాలో ఇరాన్‌వంటి శక్తివంతమైన సార్వభౌమ దేశం మనుగడ కొనసాగించడం, ప్రపంచ ఆధిపత్య శక్తులను సవాలు చేయడం- ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్‌కు కంటకప్రాయంగా మారింది.
ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటుందనే ఆరోపణలతో, ఈ మధ్యనే ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడులకు దిగింది.
అయితే, తన ఆరోపణలకు ఇజ్రాయెల్ ఎటువంటి సాక్ష్యాధారాలను చూపలేదు. ఇదే అదనుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యుద్ధానికి కాలు దువ్వారు.
2025 జూన్‌లో, 125 యుద్ధ విమానాలు 75 లక్ష్యాన్ని ఛేదించే బాంబులతో ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌లోని అణ్వస్త్ర ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు చెప్పుకున్నది.
తాజాగా, వెనిజులా అధ్యక్షుడిని అర్థరాత్రి అపహరించుకుపోయినా అమెరికా- ప్రస్తుతం గ్రీన్లాండ్, ఇరాన్‌లను లక్ష్యంగా చేసుకుని సామదానభేద దండోపాయాలకు సిద్ధమవుతుంది.
ఈ నేపథ్యంలో ఇరాన్- అమెరికాల మధ్య గత 75 ఏళ్లుగా మారుతున్న పరిణామాల గురించి తెలుసుకుందాం.
1953: మొసద్దేగ్ ప్రభుత్వ కూల్చివేత
ఆంగ్లో ఇరానియన్ చమురు కంపెనీని జాతీయం చేయడానికి ఇరాన్ మాజీ ప్రధాని మొహమ్మద్ మొసద్దేగ్ పావులు కదిపారు.
ప్రజాతంత్రయుతంగా ఎన్నికలలో నెగ్గి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అతికొద్ది మంది ఇరాన్ రాజకీయ నాయకులలో మొసద్దేగ్ ఒకరు.
1900 సంవత్సరం నుంచి దాదాపు 50 ఏళ్ల పాటు ఇండో ఇరానియన్ ఆయిల్ కంపెనీ ద్వారా బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశంలోని మెజారిటీ చమురు నిల్వలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించారు.
మొసాద్దేగ్ 1923 నుంచి ఇరాన్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 1951లో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన మొసద్దేగ్ తీసుకున్న నిర్ణయాలు బ్రిటన్‌కు ఆగ్రహం తెప్పించాయి.
అధికారానికి రాగానే అప్పటి వరకు ఇరాన్ రాజకీయ ప్రజాస్వామ్య చరిత్రలో లేని విధంగా ప్రజలకు సామాజిక భద్రత, భూపంపకం, సహజ వనరులు, భూములపై గుత్తాధిపత్యం కలిగినవారిపై అధిక పన్నులువంటి పలు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.
దీంతో అమెరికాకు చెందిన సీఏఏతో చేతులు కలిపిన బ్రిటన్ మొసద్దేగ్ను గద్దె దించి మొహమ్మద్ రెజా పహ్లావిని గద్దెనెక్కించింది.
నాటి నుంచి 1973 వరకు ఇరాన్ చమురు వనరులపై అమెరికా ఇంగ్లాండ్‌లు సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చాయి.
ఇదిలా ఉండగా దేశద్రోహం ఆరోపణలతో మొసద్దేగ్ను మూడేళ్లపాటు జైలులో దిగ్బంధించారు.
తర్వాత కూడా బ్రతికినంత కాలం గృహ నిర్బంధాన్ని మొసద్దేగ్ అనుభవించాల్సి వచ్చింది. చివరికి తన మరణానంతరం సొంత ఇంట్లోనే పూడ్చిపెట్టారు.
1954లో కన్సార్టియం అగ్రిమెంట్ కుదుర్చుకుని, ఇరాన్ చమురు నిల్వల వెలికితీత- అమ్మకంపై పశ్చిమ దేశాలకు హక్కులను కల్పిస్తూ తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చిన రెజా పహ్లావి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.
మొసద్దేగ్ను దించి పహ్లావిని గద్దెనెక్కించడంలో అమెరికా ప్రత్యేక్ష జోక్యం ఉందని తొలిసారి 2013లో అమెరికా అంగీకరించింది.
1957: శాంతికోసం అణ్వస్త్రాలు
మొసద్దేగ్ స్థానంలో అధికారానికి వచ్చిన మొహమ్మద్ రెజా పహ్లావి దేశానికి అణ్వస్త్ర సామార్ధ్యం సమకూర్చాలని తహతహలాడారు.
ఈ ప్రయత్నాలకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు సహకరించాయి.
ఈ మేరకు అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్ హోవర్, ఇరాన్ అధ్యక్షుడు పహ్లావి మధ్య “శాంతి కోసం అణ్వస్త్రాలనే” ఒప్పందం కుదురింది.
ఈ ఒప్పందంలో భాగంగా పదేళ్ల తర్వాత ఒక న్యూక్లియర్ రియాక్టర్‌ను, దీంతోపాటు ప్రయోగాలు చేయడానికి కావాల్సిన యురేనియంను అమెరికా సరఫరా చేసింది.
1979: ఇస్లామిక్ విప్లవం
ఇరాన్- అమెరికాల మధ్య సంబంధాలు వికసిస్తూ బలోపేతమవుతున్న తరుణంలో- పహల్వీ నిరంకుశత్వం ధాటికి ఇరాన్ ప్రజలు తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి.
ఇరాన్ ఆర్థిక రంగంలో నానాటికి పెరుగుతున్న పశ్చిమ దేశాల పలుకుబడి, ప్రభావాలను వ్యతిరేకించడం మొదలైంది.
1978 చివరి రోజుల నాటికి నిరసనలు బలమైన ఉద్యమ రూపాన్ని తీసుకోని తిరుగుబాటు స్వభావాన్ని సంతరించుకున్నాయి.
చివరికి 1979 జనవరి నాటికి తిరుగుబాటు విజయవంతమై ప్రవాసంలోని ఇస్లామిక్ మేధావి అయతుల్లా ఖమేనీ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
1980: అమెరికాతో దౌత్య సంబంధాల తెగతెంపులు
ఖమేనీ దేశాధ్యాక్షుడిగా బాధ్యతలు చేపట్టేనాటికి ప్రవాసంలోని పహల్వీ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి ఆ దేశం అనుమతించడంతో టెహ్రాన్‌లో నిరసనలు మొదలైయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై విద్యార్థులు దాడులు చేశారు. 52 మంది అమెరికన్లను అపహరించి 444 రోజులపాటు నిర్బంధంలో ఉంచారు. దీంతో అమెరికా- ఇరాన్‌తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది.
1980- 88: ఇరాక్ చొరబాటులకు అమెరికా మద్దతు
అయతుల్లా ఖమేనీ అధికారాన్ని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సవాలు చేస్తూ, ఇరాన్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.
అప్పటికే ఇరాన్‌తో దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్న అమెరికా ఈ వివాదంలో ఇరాక్‌ను బలపరిచింది. 1988 వరకు ఈ యుద్ధం సాగింది. వేలాదిమంది సైన్యం చనిపోయారు. ఈ యుద్ధంలోనే ఇరాక్- ఇరాన్ భూభాగంపై రసాయన ఆయుధాలను ప్రయోగించింది.
1984: ఉగ్రవాద దేశంగా ఇరాన్‌ను వర్గీకరించిన అమెరికా
ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటించారు.
దీనికి పూర్వం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో, లెబనాన్‌కు మద్దతుగా ఇరాన్ యుద్ధంలోకి దిగింది.
దీంతో అనివార్యంగా ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడానికి అమెరికా కూడా యుద్ధ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
బీరూట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 241 మంది అమెరికా సైనికులు చనిపోయారు.
ఇరాన్ సహకారంతో లెబనాన్‌లో సాయుధ చర్యలకు పాల్పడుతున్న హిజ్బుల్లా తీవ్రవాద సంస్థే దీనికి కారణమని అమెరికా ఆరోపించింది.
హిజ్బుల్లా నిర్బంధంలో ఉన్న అమెరికా సైనికులను విడిపించుకోవడానికి రీగన్ ప్రభుత్వం ఇరాన్‌తో తెర వెనుక రాయబారాలను నడిపింది. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో రీగన్ దేశియంగా పెద్ద ఎత్తున్న అప్రతిష్టపాలయ్యారు.
1988: ఇరాన్ విమాన కూల్చివేత
ఇజ్రాయెల్- లెబనాన్ యుద్ధంలో పాత్రధారులుగా మారిన అమెరికా- ఇరాన్‌లు చివరకు పరస్పరం దాడులు చేసుకునే స్థితికి వెళ్లాయి. అమెరికా యుద్ధనౌక ఇరాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, దుబాయ్ వెళ్తున్న ఇరాన్ పౌరవిమానం ఐఆర్ 655ను జూలై 8న కూల్చివేసింది.
ఈ ఘటనలో విమానంలోని 209మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన పొరపాటున జరిగిందని అమెరికా అంగీకరించినప్పటికీ, దౌత్యవేదికలపై, ఇరాన్‌కు నేరుగా క్షమాపణ చెప్పలేదు.
అయితే, ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కుటుంబాలకు అమెరికా 61.8 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించింది.
1995: మరిన్ని ఆంక్షలు
1995- 96 మధ్య అమెరికా ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. అధ్యక్షుడిగా ఉన్న బిల్‌క్లింటన్ అమెరికా కంపెనీలు ఇరాన్‌తో ఎటువంటి లావాదేవీలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపున ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీల పైన, ఇరాన్‌కు ఆధునిక ఆయుధాలు అమ్మే దేశాలు- కంపెనీలపైన ఆంక్షలు విధించడానికి వీలుగా అమెరికా పార్లమెంట్ ఓ చట్టాన్ని కూడా ఆమోదించింది.
ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంలో పురోగమించడం, హిజ్బుల్లా- హమస్వంటి పాలస్తీనా అనుకూల సంస్థలకు ఇరాన్ అండదండలందించడంవంటి పరిణామాల కారణంగా ఈ ఆంక్షలను విధిస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది.
2002: యాక్సెస్ ఆఫ్ ఈవిల్
2002 సెప్టెంబరు 11న వాషింగ్టన్‌లోని జంట భవనాలను అల్‌ఖైదా ఉగ్రవాదులు పేల్చిన తర్వాత, దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇరాక్- ఉత్తర కొరియాలతో పాటు ఇరాన్ కూడా యాక్సిస్ ఆఫ్ ఈవిల్లో భాగంగా జార్జ్ డబ్ల్యూ బుష్ చేర్చారు.
అమెరికాకు ఇరాన్‌కు ఉమ్మడి శత్రువులుగా ఉన్న తాలిబన్, అల్ఖైదాలకు వ్యతిరేకంగా- అమెరికాతో కలిసి దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్న సమయంలో, 2002 చివరి నాటికి ఈ సహకార ప్రయత్నాలు వికటించాయి. ఇదే సమయంలో, అణ్వస్త్ర తయారికీ అవసరమైన వనరులను ఇరాన్ సమకూర్చుకోవడంతో అమెరికా మరిన్ని ఆంక్షలను విధించింది.
2013: ఇరాన్‌తో అణు ఒప్పందం
2002- 2013 మధ్య కాలంలో ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఎన్నో రేట్లు పెంపొందించుకున్నది. ఈ కాలంలోనే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ద్వారా ఇరాన్ అణు ఇంధన కేంద్రాలపై పలు దఫాలుగా తనిఖీలు జరిగాయి. చివరికి, 2013 నుంచి 15 మధ్య కాలంలో ఇరాన్‌తో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శిఖారాగ్ర చర్చలను జరిపారు.
చివరికి ఇరు దేశాలు ఒక ఉమ్మడి సంయుక్త కార్యాచరణ ప్రణాళికకు సిద్ధపడ్డాయి. ఇందులో భాగంగా, తన అణు ఇంధన పరిశోధనలను- ప్రయోగాలను ఇరాన్ నియంత్రిస్తే, దీనికి బదులుగా అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను సడలించాలనేది షరతు.
చైనా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్లు కూడా ఈ ఒప్పందం కోసం కీలక పాత్ర పోషించాయి.
2018: సంయుక్త కార్యాచరణ ప్రణాళిక నుంచి వైదొలిగిన అమెరికా
2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్, అమెరికా సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ఒప్పందం నుంచి ఏక పక్షంగా వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఇరాన్‌పై వరుసగా మరింత తీవ్రమైన ఆంక్షలను అమెరికా విధించింది. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. ఇదే అదునుగా భావించిన ఇరాన్ అప్పటి వరకు వాయిదా వేసిన అణు ఇంధన సామర్థ్యాన్ని పెంచే ప్రయోగాలను పునరుద్ధరించింది.
2020: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అధినేత హత్య
ట్రంప్ మొదటి అధ్యక్ష కాలం చివరిలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సైన్యాధిపతి జనరల్ ఖాసీం సులేమానీ బాగ్దాద్‌లో హతమార్చబడ్డారు. దీనికంటే ఏడాదికి ముందే ఈ రివల్యూషనరీ గార్డ్స్ సైనిక దళాన్ని కూడా ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది.
ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక శిబిరాలపై ఇరాన్ దాడులు చేసింది.
2025: ఖమేనీకి ట్రంప్ లేఖ
2025 మార్చిలో సరికొత్త అణు ఒప్పందానికి తాము సిద్ధమని, 60 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకునే విధంగా చర్చలు ప్రారంభించాలని ప్రతిపాదిస్తూ- ఇరాన్ దేశాధినేత అయతుల్లా అలీ ఖమేనీకి అమెరికా అధ్యక్షడు ట్రంప్ లేఖ రాశారు. ఈ లేఖను తిరస్కరిస్తూ అమెరికా కోరుకుంటున్నది చర్చలు- సంప్రదింపులు కాదని, డిమాండ్లు పెడుతుందని ఖమేనీ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే అనధికార సంప్రదింపులు ఒమాన్, ఇటలీలోనూ మొదలైయ్యాయి. ఈ సంప్రదింపులలో మరో పశ్చిమాసియా దేశం మస్కట్ మధ్యవర్తిగా వ్యవహరించింది. సంప్రదింపులు చరమాంకంలోకి ప్రవేశించాయని, ఇరాన్‌పై ఎటువంటి దాడులు చేయవద్దని ఇజ్రాయెల్‌ను ట్రంప్ హెచ్చరించారు. చర్చల పురోగతిని గుర్తిస్తూనే ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను ఉపయోగించుకునే హక్కు కోసం ఒత్తిడి తెచ్చింది. ఆరో దఫా చర్చలు జరగడానికి ముందు రోజు ఇరాన్ అణ్వస్త్ర పరిశోధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
2026: తాజా స్థితి
2025 డిసెంబర్- 2026జనవరిలో ఇరాన్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. గత నాలుగు దశాబ్దాలుగా ఇరాన్‌పై అమెరికా విధించిన అనేక ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. ఇరాన్ కరెన్సీ విలువ పడిపోయింది. ధరలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక సమస్యలపై మొదలైన ఆందోళనలు చివరికి రాజకీయ నాయకత్వం మార్పు కోసం ఉద్యమంగా పరిణామం చెందాయి.
ఈ ఉద్యమానికి అమెరికా, ఇజ్రాయెల్‌లు బహిరంగ సమర్ధనను ప్రకటించాయి. ఉద్యమకారులకు అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని కూడా అమెరికా వెల్లడించింది.
ఉద్యమాన్ని అదుపులో పెట్టేందుకు ఇరాన్ అనేక చర్యలకు తీసుకుంటున్నది. చివరికి ఇంటర్నెట్ షట్‌డౌన్, విద్యుత్ సరఫరా నియంత్రణవంటి చర్యలకు ఇరాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటర్నెట్ లేకపోయినా ఈ ఆందోళనలు కొనసాగేందుకు వీలుగా, ఆందోళనకారుల మధ్య సంప్రదింపుల కోసం షాటిలైట్ ఫోన్లను సమకూర్చేందుకు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సిద్ధమవుతున్నాయి. నిరసనోద్యమంపై అణిచివేత ఆపకపోతే ఇరాన్‌పై దాడి చేయడానికి వెనుకాడేది లేదని ట్రంప్ ప్రకటించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
