అమెరికా బలగాలు హెలికాప్టర్లతో వెనిజులా రాజధాని కరాకస్‌పై మెరుపుదాడిచేసి అధ్యక్షుడు మదూరోని చెరపట్టి, సంకెళ్ళువేసి ఎత్తుకెళ్లిన విషయం కలకలం రేపింది.
ట్రంప్ తలపెట్టిన ఈ దుండగానికి లోకం అదురుపోయినప్పటికీ, ఇది 2001 నుంచి వెనెజులాపై అమెరికా నడుపుతున్న యుద్ధంలో ఇంకొక పర్వమేనని గుర్తుచేసుకోవాలి.
వెనిజులాతో కానీ, తమ పెత్తనం కోల్పోయి పాతికేళ్లుగా గింజుకుంటున్న అక్కడి పాత పాలకవర్గాలతో కానీ అమెరికాకు ఎలాంటి గొడవా లేదు.
హ్యూగో చావేజ్ పాలనలో 2001లో మొదలైన బొలివేరియన్ ప్రక్రియతో, దానిలో భాగంగా రూపొందిన ఆర్గానిక్ హైడ్రోకార్బన్స్ చట్టంతో ఆమెరికాకు, దాని పెట్టుబడిదారులకు మంట.
వెనిజులా చమురు, గ్యాస్ నిల్వలు ప్రజలకు చెందుతాయని ఈ చట్టం తీర్మానించింది.
ఈ చట్టంతో ఎగువపారకంలో(upstream) ఉండే చమురు గాలింపు, వెలితీతను ప్రభుత్వరంగ సంస్థలకు అట్టిపెట్టి, దిగువపారకంలోని చమురుతేర్పు(refining), అమ్మకం వరకు ప్రైవేటు కంపెనీలను(విదేశీవి కూడా) ఉండనిచ్చింది.
ప్రపంచంలోనే ఎక్కువ పెద్ద చమురు నిల్వలున్న వెనిజులా, వాటిని మొదట 1934లో కొంత జాతీయం చేసి, మళ్ళీ 1975లో మరికొంత చేసింది.
అయితే ఐఎంఎఫ్, అమెరికా చమురు కంపానీలు ఒత్తిడితెచ్చి- వెనిజులాపై రుద్దిన కొత్త ఉదారవాద సంస్కరణలతో, చమురు పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రైవేటీకరించబడింది.
చావేజ్ పాలనలో చేసిన చట్టాలతో, చమరు పరిశ్రమ ప్రభుత్వం చేతుల్లోకి తిరిగిరావడంవల్ల- ఈనాడు 80 శాతం విదేశీ ఆదాయాలు చమురు అమ్మకాల నుంచి వస్తున్నాయి.
ఇది యెక్సాన్ మొబిల్, చేవారాన్ వంటి అమెరికా చమురు కంపెనీలకిది కంటగింపుగా మారింది.
వీటి ఒత్తిడికి తలొగ్గిన జార్జిబుష్ ప్రభుత్వం, 2002లో చావేజ్ ప్రభుత్వంపై కూలదోత కుట్రను(coup) నడిపింది.
ఈ కుట్రలో భాగంగా చమురు ఆదాయంపై ఆధారపడ్డ దేశ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించారు.
లంచగొండులైన వెనిజులా చమురు కంపెనీ మేనేజ్మెంట్కు పురిపెట్టి, ఆ కంపెనీని సమ్మెలోకి దింపగా కొన్నాళ్ళకు అక్కడి కార్మికులే మేనేజ్మెంట్ చేతుల్లో నుంచి కంపెనీని లాక్కున్నారు.
మెండైన ప్రజల అండతో కూలదోతకుట్రను చావేజ్ తిప్పికొట్టాడు.
పోయినేడు నోబెల్ శాంతి బహుమతి పొందిన మరియా కొరినా మచాడో ‘కలిసి రండి’(సుమాటే) పేరుతో ఒక గుంపుని కూడగట్టింది.
చావేజ్‌ను గద్దె దించడానికి రిఫరెండం కోసం తగినన్ని సంతకాలు పొగుచేయడమే ఈ గుంపు ఉద్దేశం.
2004లో జరిగిన ఆ రిఫరెండంలో 70% శాతం ఓటర్లు పాల్గొనగా, వారిలో ఎక్కువమంది(59%) చావేజ్ కొనసాగాలని ఎంచుకున్నారు.
మచాడో కానీ, ఆమెకు ఊతమిచ్చిన ఆమెరికన్లు కానీ ఇంతటితో ఊరుకోలేదు.
చావేజ్ తెచ్చిన బొలివేరియన్ ప్రక్రియను కూల్చి; అమెరికా చమురు కంపెనీల తొత్తులకు పట్టం కట్టడానికి, 2001 నుంచి ఇప్పటివరకూ అలుపులేకుండా పాటుపడుతూ ఉన్నారు.
వెనిజులాలో జరుగుతున్నది అంతర్జాతీయ వర్గ పోరు.
అక్కడ నేలలోని చమురు, గ్యాస్ నిల్వలు తమ అదుపులో ఉంచుకోడానికై- ప్రజానీకానికి, అమెరికా చమురు కంపెనీలకి నడుమ జరుగుతున్న ఒక పెనుగులాట.
బొలివేరియన్ ప్రక్రియ
1990లలో వెనిజులా రాజకీయాలలో హ్యూగో చావేజ్ అడుగిడిననాటి నుంచే, తాను తలపెట్టిన కార్యక్రమంతో ప్రజలను ఉత్సాహపరచాడు. ఆ పదేళ్ళలో వచ్చిన అధ్యక్షులిద్దరూ, గద్దెనెక్కే ముందు ఐఎంఎఫ్ రుద్దుతున్న కుంచింపు ఆర్ధిక విధానాలకు ముగింపు పలుకుతామని మాటిచ్చి, ఎక్కాక అదే ఐయంఎఫ్ విధానాలకు తలవంచారు.
డెమొక్రాటిక్ యాక్షన్ పార్టీ నుంచి ఎన్నికై- 1989 నుంచి 1993 వరకు అధ్యక్షునిగా ఉన్నకార్లోస్ ఆండ్రెస్ పెరెజ్వంటి సోషల్ డెమొక్రాట్లు కానీ; లేదా క్రిస్టియన్ డెమొక్రాటిక్ పార్టీ నుంచి ఎన్నికై, 1994- 1999 నుంచి అధ్యక్షునిగా ఉన్న మితవాది రఫాయెల్ కాల్డేరా కానీ చేసింది ఇదే.
మోసపు రాజకీయాలతో, పెద్దఎత్తు ఆర్ధిక హెచ్చుతగ్గులతో విసిగిపోయిన జనం చావేజ్‌ను గెలిపించారు.
పాత పార్టీలకు 39 శాతం ఓట్లు, చావేజ్‌కు 56 శాతం ఓట్లు వచ్చాయి.
1999లో పదవిలోకొచ్చి, 2013లో 58 ఏళ్లకే చావేజ్ చనిపోయాడు.
ఆ పద్నాలుగేళ్లూ ఊపులో ఉన్న చమురుధరలు, ఆయన తలపెట్టిన బొలివేరియన్ ప్రక్రియకు దన్నునిచ్చాయి.
చమురు ఆదాయాల్ని తన అదుపులోనికి తెచ్చాక- ఒక ప్రణాళికతో, వాటిని ప్రజాసంక్షేమ పథకాల(మిసియోన్స్) వైపు మళ్లించి, సామాజికంగా చెప్పుకోదగ్గ పెంపును చావేజ్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
చమురు ఆదాయాల్ని, ప్రజల మౌలిక అవసరాలపై వెచ్చించింది.
మిసియోన్ బారియో అడెంట్రో(ప్రాథమిక వైద్యం); మిసియోన్ రాబిన్సన్, మిసియోన్ రిబాస్, మిసియోన్ సుక్రె (రైతాంగ, కార్మిక వర్గాలలో బడి చదువుల పెంపు); మిసియోన్ మెర్కాల్, పీడీవాల్(ఆహార సార్వభౌమత్వం); గ్రాన్ మిసియోన్ వివియెండా(ఇండ్ల కట్టడం) వంటి పథకాలను అమలు చేసింది.
అప్పటిదాకా చమురు మిగుళ్ళ నుంచి కార్మిక, రైతాంగ వర్గాలను ఎడంగా ఉంచిన ఏలుబడి(state), చావేజ్ చేతిలో సామాజిక న్యాయాన్ని చేకూర్చే పనిముట్టుగా మారింది. సంక్షేమ విధానాలతోనే ఆగకుండా, ప్రజలను ఏలుబడిలో పాలికాపులను చేయడానికి చావేజ్ ప్రభుత్వం కమ్యూన్లను(కోమునాస్) ఏర్పరచింది. ప్రజా సంప్రదింపు వేదికలుగా(కోన్సెహోస్ కోమునాలెస్) మొదలైన ఇవి, క్రమంగా నిధుల వాడకం, తమ ప్రాంత ఎదుగుదలకు పన్నకాలు వేయడం, తోడ్పాటు బ్యాంకుల ఏర్పాటు, తోడ్పాటు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు వంటి బాధ్యతలను చేపట్టాయి.
హెచ్చుతగ్గులు, పరిమితులు ఉన్నప్పటికీ- సంపన్న వర్గాల ఆధిపత్యానికి మన్నికగల మారుదీటుగా(alternative), ప్రజల చేతుల్లోకి పెత్తనాన్ని తెచ్చిన ఈ కమ్యూన్లు – బొలివేరియన్ ప్రక్రియ మొదలెట్టిన ఒక చారిత్రక రాజకీయ ప్రయోగంగా చెప్పవచ్చు.
సంకర యుద్ధం
2013-14 బొలివేరియన్ ప్రక్రియకు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. పట్టుదలతో దాన్ని ముందుకు నడిపిన హ్యూగోచావేజ్ చావు మొదటి దెబ్బ అయితే, వెనెజులా చమరు ఆదాయాలు కుప్పకూలడం రెండవ దెబ్బ.
చావేజ్ స్థానంలో, ఆయన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉండిన ట్రేడ్ యూనియన్ నేత, నికోలస్ మదురో అధ్యక్షుడయాడు.
2014 జూన్‌లో సుమారు 108 డాలర్ల చమురు బ్యారెల్ వెల- 2015లో 50 డాలర్ల దిగువకు, ఆపై 2016 జనవరిలో 30 డాలర్ల దిగువకు పడిపోయింది.
కుప్పకూలిన చమురు ఆదాయాల నడుమ నడిచిన బొలివేరియన్ ప్రక్రియ, అది చేపట్టిన సామాజిక పంపకాలు ఇబ్బందుల్లో పడ్డాయి. వెనెజులా లోపలే కాదు, పొరుగు దేశాలకు తక్కువ వెలకే చమురు పంపిణీ చేసే పెట్రో కరిబే వంటి ప్రాంతీయ పంపకపు ఏర్పాట్లు కూడా సంకటంలో పడ్డాయి. చమురు గుత్తరాబళ్ళపై ఆధారపడిన ఏలుబడి ఆ వైరుధ్యంలోనే చిక్కుకుపోయింది.
పైగా బొలివేరియన్ ప్రక్రియ పెత్తనపు వర్గాల ఆస్తులు కైవసం చేసుకోలేదు కనుక- ఈ వర్గాలు ఆర్ధికంగానూ, సామాజికంగానూ తమ పట్టును ఏదో రకంగా కొనసాగించడమే కాక, బొలివేరియన్ ప్రక్రియ సామ్యవాద ప్రయత్నం ముందంటా పోకుండా కొంత నిలవరించగలిగాయి.
అమెరికా, దాని తోడుండే ఐరోపా దేశాలు, లాటిన్ అమెరికాలోని పెత్తనపు వర్గాలు, అన్నీ కలిసి వెనిజులాపై తమ సంకరయుద్ధానికి కావాల్సిన పోటుముట్లు 2013కు ముందే సమకూర్చుకున్నాయి.
1998 డిసెంబర్ ఎన్నికలో చావేజ్ గెలుపొందగా, మరుసటేడు ఆయన పదవి చేపట్టే లోపలే, వెనిజులాలో నుంచి పెద్దఎత్తున పెట్టుబడి వెడలుబాటు(capital flight) మొదలయ్యింది. చావేజ్‌ను కూలదోసే కుట్ర, దానికి జతగా జరిగిన చమురు కట్టివేతలతో – దేశ డబ్బువ్యవస్థ నిలకడ సడలింది.
మరోపక్క వెనిజులా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారంతో, దాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేసి, దెబ్బతీయడానికి అమెరికా పూనుకుంది. వీటివల్ల, 2006లో అంతర్జాతీయ అప్పు మార్కెట్లలో వెనిజులాకు అడ్డంకులు ఎదురైయ్యాయి.
అప్పు రేటింగ్ ఏజెన్సీలు, మదుపు బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు వెనిజులాపై వడ్డీ రెట్లు పెంచి- కొత్తఅప్పుల తెచ్చుకోలు, పాతఅప్పుల చెల్లింపు కష్టతరం చేశాయి. ఇదంతా అమెరికా అధికారికంగా ఆంక్షలు పెట్టక ముందలే.
చావేజ్ పోయాక, చమురు దిగజారుతున్నవేళ అమెరికా వెనిజులాపై సంకర యుద్ధాన్ని ముమ్మరం చేసింది. సంకర యుద్ధం అంటే పెద్దఎత్తు ముట్టడి చేయకుండానే- ఆర్ధిక ఒత్తిడి, అంతర్జాతీయ డబ్బువ్యవస్థ నుంచి వెలివేత, ప్రచార యుద్ధం, దౌత్యపరంగా ఒంటరిచెయ్యడం, సందుచూసి చేసే దాడులు మొదలైనవాటితో ఆయా దేశాలలోని రాజకీయ సార్వభౌమత్వపు పూనికలను నీరుకార్చడం.
దేశాన్ని ఆక్రమించడం దీని లక్ష్యం కాదు. సంపదను మందికి పంపకం చేయాలని, పరిశ్రమలను జాతీయం చేయాలని, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నడపాలని చూసే ఏలుబడుల లొంగుబాటే దీని అసలు లక్ష్యం.
మారకంపై దాడులు, ఆంక్షలు, వస్తువుల కొరత, మీడియా కట్టుకథలు, ఎన్జీవోల ద్వారా ఒత్తిడి, చట్టంతో వేధింపులు(Lawfare). పైపెచ్చు పూటకో కొత్త రాజకీయసంక్షోభాన్ని ఎగదోసి, ఏలుబడిని బలహీనపరచి, ప్రజల అండను నీరుగార్చి, సామాజికంగా పొరపొచ్చాలులేవనెత్తాక, ఈ అగచాట్ల వెనకనున్న తమ చేతుల్ని కప్పిపుచ్చి, వాటిని ప్రభుత్వం చేసిన తప్పిదాలుగా ఎత్తి చూపడం -ఇదీ సంకర యుద్ధం.
2017 ఆగస్టులో అమెరికా అడ్డగోలు ఆర్ధిక ఆంక్షలు విధించినప్పటి నుంచీ, ఇవీ వెనిజులాను వెన్నాడుతున్న ఇక్కట్లు.
2018లో రెండోవిడత ఆంక్షలతో పరిస్థితి మరింత దెబ్బతిన్నది. వెనిజులా అంతర్జాతీయ చెల్లింపులు, కొనుగోళ్లు, అమ్మకాలు సన్నగిల్లడమే కాదు, దరిదాపు ఎండిపోయాయి. ఆంక్షల తాకిడిపై నోరెత్తని అంతర్జాతీయ మీడియా – మిన్నంటే ధరలు, కొరతలు, ముమ్మరమైన వలసపోకలు, ఇవన్నీప్రభుత్వ తప్పిదాల వల్లనేనని బాకా ఎత్తి ఊదరకొట్టి, ప్రభుత్వం కూల్చివేతకు సాకులు సమకూర్చింది. వెనిజులా ఆర్ధిక వ్యవస్థ మెడలో అమెరికా బిగిస్తూ వచ్చిన ఈ ఉచ్చు వల్లనే- 2014, 2017ల నడుమ అక్కడి బ్రతుకు-కొలమానాలు(living standards)కుప్పకూలాయి.
కిరాయి బలగాల దాడులు, విద్యుత్ గ్రిడ్‌పై దొంగదెబ్బలు, ఎక్సాన్ మోబిల్(ExxonMobil) కంపెనీ బాగుకోసం గయానా, వెనిజూలాల నడుమ గొడవలేపడం; మారుదీటు అధ్యక్షుడిగా తొలుబొమ్మనొకణ్ణి(జువాన్ గువైడో) నిలబెట్టడం, సొంత దేశంమీదే దాడికి పిలుపునిచ్చిన ఒకత్తెకి(మచాడో) నోబుల్ శాంతి బహుమతినీయడం; అధ్యక్షుణ్ణి కడతేర్చడానికి కుట్రలు, వెనిజులా చేపల పడవలపై బాంబు దాడులు; వెనిజులా నుంచి చమురు కొనిపోతున్న ట్యాంకర్ల స్వాధీనం, వెనెజులా ఒడ్డు పొడవునా ఓడలదండు మొహరింపు.
ఒకటి కాదు, రెండు కాదు! ఒక్కో ఎత్తుగడతో వెనెజులాలో కలవరం లేవనెత్తి, బొలివేరియన్ ప్రక్రియ వెన్నువిరిచి, దేశ సార్వభౌమత్వానికి పునాదిగా ఉన్న చమురు చట్టాలని తుంగలోతొక్కి, బొలివేరియన్ వెనిజూలాని మళ్ళీ 1998నాటి వెనిజులాగా మార్చడమే అమెరికా లక్ష్యం.
తోటి వెనిజూలావారిపై బాంబులు కురిపించడాన్ని ‘కురిమితో కూడిన చేతగా’(act of love) మచాడో పేర్కొన్నది. వెనిజులా ప్రభుత్వాన్ని కూలదోయచూసే వీరి నినాదం ‘గతంలోకి ముందుడుగు’. మరియా కొరినా మచాడో మాటిచ్చినట్టు 1998నాటి వెనెజులాను తిరిగితేవడం అంటే, 1999 రాజ్యాంగంలో పొందుపరచిన ‘మిసియోన్స్’, ‘కమ్యూనస్’ వంటి ప్రజాస్వామిక ఏర్పాట్లను తుడిచివేయడమే.
గడిచిన అక్టోబర్‌లో కారకాస్‌లోని ఒక సభలో మదురో మాట్లాడుతూ, అమెరికా ప్రజలకు ఇంగ్లీషులో ఇలా పిలుపునిచ్చాడు
‘నేను చెప్పేది వినండి. యుద్ధం వద్దు, శాంతి కావాలి’. ‘ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాలను గుల్ల చేసిన ఎడతెగని అమెరికా యుద్ధాలు, అది చేసే ‘ఏలుబడి మార్పు’(regime change) మాకొద్దు. సీఐఏ పురికొల్పే కూలదోత కుట్రలు మాకొద్దు’ అని నొక్కిచెప్పాడు. “యుద్ధం వద్దు, శాంతి కావాలి” అన్నమదురో నినాదం వెనెజూలా ప్రజల నోట మారుమోగింది.
మదూరోని చెరపట్టినా, వెనిజూలా ప్రభుత్వం పడిపోలేదు. వెనిజూలామీద పూర్తి స్థాయిలో దండెత్తకుండా- చీకట్లో అధ్యక్షుణ్ణి ఎత్తుకుపోవడం, ఓ రకంగా అమెరికా బలహీనతని ఎత్తి చూపుతోంది.
ఎన్ని ఇబ్బందులు పడ్డా, వెనిజులా ప్రజలు అమెరికా చొరబాటును ఒప్పుకోరు. ఇన్ని ఎదురుదెబ్బలు తిని, బ్రతికే ఉన్న 20 ఏళ్ల బొలివేరియన్ ప్రక్రియ, ఈ దెబ్బను కూడా కాచుకుని నిలదొక్కుకుంటుందనడంలో ఎటువంటి అనుమానం లేదు.
ది ట్రైకాంటినెంటల్ వెబ్సైంట్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
