రెండో ప్రపంచ యుద్ధం ముగియడంతో సోవియెట్ యూనియన్‌తో పాటు తూర్పు యూరప్‌లో పలు దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి.
దీన్ని బూచిగా చూపి అమెరికా తానే ప్రపంచ దేశాలన్నిటిని కాపాడగలుగుతాననే ఫోజు పెట్టింది.
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులాంటి సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రపంచ వాణిజ్య కరెన్సీగా అమెరికా డాలర్‌ను అన్ని దేశాలతో ఆమోదింపజేసుకుంది.
ఆ విధంగా క్రమంగా ప్రపంచంపై తన పట్టు బిగించ సాగింది.
ప్రపంచ అధినాయక స్థాయిలో ప్రపంచ పోలీసుగా మారింది. పలు దేశాలలో జోక్యం చేసుకుంది.
ప్రపంచంలో ఏ దేశ నాయకుడు అయినా తన మాట విని, లొంగి ఉండకపోతే ఆ దేశాల అంతరంగిక విషయాలలో జోక్యం చేసుకుంది.
పలు దేశ అధినేతలను హతమార్చి, తన తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
ఆ విధంగా ప్రపంచ దేశాలపై అమెరికా సాగించిన దమనకాండ వివరాలను తెలుసుకుందాం.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత- యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ రెండు ప్రధాన అగ్రరాజ్యాలుగా ఎదిగాయి.
ఈ రెండు శక్తుల మధ్య ఉన్న పోటీని ‘శీతల యుద్ధం” అని పిలుస్తారు.
ఇది నాలుగు దశాబ్దాలకు పైగా సాగింది.
ఈ కాలంలో ఆ తర్వాత కూడా, ఇతర దేశాలలో రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయడానికి లేదా మార్చడానికి యునైటెడ్ స్టేట్స్ అనేక చర్యలను చేపట్టింది.
ఇవి ప్రత్యక్ష సైనిక దాడుల నుంచి రహస్య నిఘా కార్యకలాపాలు, ఆర్థిక ఆంక్షలు, వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వరకు ఉన్నాయి. 1950 తర్వాత సుమారు అరవై లేదా అంతకంటే ఎక్కువ జోక్యాలు, లేదా ప్రభుత్వ మార్పు ప్రయత్నాలు జరిగాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
శీతల యుద్ధం, జోక్యాల ప్రారంభం..
ఈ జోక్యాల ధోరణి ట్రూమాన్ అమెరికా అధ్యక్ష కాలంలో ప్రారంభమైంది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ట్రూమాన్ ప్రభుత్వం ‘కంటైన్మెంట్’ సిద్ధాంతాన్ని అనుసరించింది.
ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో ఎక్కడ కమ్యూనిస్టు ప్రభావం ఉన్నా అది పాశ్చాత్య ప్రజాస్వామ్య వ్యవస్థలకు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పుగా అమెరికా పరిగణించింది.
రహస్య తిరుగుబాట్ల యుగం..
ఐసెన్‌హోవర్ పరిపాలనలో, రహస్య నిఘా కార్యకలాపాలు అమెరికా విదేశాంగ విధానంలో ప్రధాన సాధనంగా మారాయి. పెద్ద సైన్యాలను పంపడానికి బదులుగా, ఇతర దేశాల్లో తిరుగుబాట్లు లేదా అస్థిరీకరణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి అమెరికా ‘సీఐఏ’పై ఎక్కువగా ఆధారపడింది. దీనికి ఇరాన్(1953), గ్వాటిమాలా (1954) దేశాలు ప్రధాన ఉదాహరణలు.
1960లలో తీవ్రతరం..
1960వ దశకంలో కెన్నెడీ, జాన్సన్ అధ్యక్షుల హయాంలో జోక్యాలు పెరిగాయి. క్యూబాపై జరిగిన ‘బే ఆఫ్ పిగ్స్’ దాడి విఫలమవ్వడం, విప్లవాత్మక ప్రభుత్వాలను పడగొట్టడానికి చేసే రహస్య సైనిక చర్యలకు ఉదాహరణలు. అదే సమయంలో, వియత్నాం యుద్ధం శీతల యుద్ధంలో అతిపెద్ద సైనిక జోక్యంగా మారింది.
1970లలో వ్యూహాత్మక అస్థిరీకరణ..
నిక్సన్ అధ్యక్ష కాలంలో, జోక్యం తరచుగా బహిరంగ యుద్ధం కంటే రహస్య అస్థిరీకరణ రూపంలో ఉండేది. 1973లో చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అలెన్డేను పడగొట్టడం ఇందులో అత్యంత ప్రధానమైనది. దీనివల్ల ఏర్పడిన సైనిక తిరుగుబాటు పినోచెట్ ఆధ్వర్యంలో సుదీర్ఘ నియంతృత్వ పాలనకు దారితీసింది.
1980లలో ప్రాక్సీ యుద్ధాలు..
1980వ దశకం రీగన్ అధ్యక్షతన ప్రాక్సీ సంఘర్షణలకు పరాకాష్టగా నిలిచింది. అమెరికా సైనికులను నేరుగా పంపే బదులు, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలతో పోరాడే స్థానిక దళాలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించారు. నికరాగ్వాలోని కాంట్రా యుద్ధం, 1983లో గ్రెనడాపై దాడి దీనికి ఉదాహరణలు.


శీతల యుద్ధం తర్వాతి జోక్యాలు..
సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఏకధృవ ప్రపంచం పేర అమెరికా ఆగడాలు హద్దుమిరాయి. జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ హయాంలో 1989లో పనామాపై దాడి, 1991లో ఇరాక్‌పై గల్ఫ్ యుద్ధం జరిగాయి.
క్లింటన్ కాలంలో మానవతా దృక్పథం, బహుపాక్షిక జోక్యాలపై దృష్టి మళ్లింది. సోమాలియా, హైతీ, కొసావోలో ఇవి జరిగాయి.
ఉగ్రవాదంపై యుద్ధం..
ఉగ్రవాదంపై పోరాటం పేరుతో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో అమెరికా విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికి, తాలిబాన్ ప్రభుత్వాన్ని తొలగించడానికి అనే ముసుగులో ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ సైనిక చర్యను ప్రారంభించింది.
రెండేళ్ల తర్వాత, సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను బందీగా తీసుకెళ్ళింది. చివరకు సద్దాంను అమెరికాలో ఉరి తీసింది.
ఆధునిక హైబ్రిడ్ జోక్యాలు
ఇరవై ఒకటో శతాబ్దంలో, జోక్యాలు ఎక్కువగా పరోక్ష రూపాలను తీసుకున్నాయి. ఒబామా హయాంలో లిబియాలో నాటో జోక్యం, సిరియాలో ఉగ్రవాద వ్యూహాలకు వ్యతిరేకంగా చర్యలు జరిగాయి. ఆ తర్వాత ట్రంప్, బైడెన్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దాడుల కంటే ఆర్థిక ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిడి, పరిమిత సైనిక దాడులపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి.
1950 నుంచి అమెరికా జోక్యాల చరిత్ర ప్రపంచ రాజకీయాల సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. అమెరికా చేసిన ఈ దాడులను కొందరు ప్రజాస్వామ్యాన్ని, అంతర్జాతీయ స్థిరత్వాన్ని కాపాడాయని వాదించారు. కానీ వాస్తవంగా ఇవి జాతీయ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశాయని, దీర్ఘకాలిక అస్థిరతకు కారణమయ్యాయని రుజువు అయ్యింది.
ఈ పూర్వ రంగంలోనే పాలస్తీనాను రియల్ ఎస్టేట్‌గా మారుస్తానని, పనామా తనదేనని, కెనడా తన 53 వ రాష్ట్రమని ట్రంప్ రెచ్చిపోయాడు. వెనిజులాపై దాడిచేసి ఆ దేశాధ్యక్షుడిని, దేశాధ్యక్షుడి భార్యను బందీలుగా చేసి అమెరికాకు ఎత్తుకు పోయాడు.
ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయిల్ కలసి చేస్తున్న దాడులు, సృష్టిస్తున్న మారణ కాండను చూస్తున్నాం. ఇదంతా ట్రంప్ వెర్రితనంతో చేస్తున్నాడని కొందరు పొరబడుతున్నారు. కానీ, గతంతో జరిగిన ఘటనలను పరిశీలిస్తే అమెరికాలో అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా అమెరికా చరిత్ర పోలీసు పాత్ర, గూండాగిరి పాత్ర పోషించాయని మనకు రుజువు అవుతున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
