గత వారాంతంలో క్యూబాలో దేశవ్యాప్త విద్యుత్ అంతరాయం రెండవ రోజుకు కూడా కొనసాగడంతో, హవానాలోని జార్జ్ పెరెజ్ అల్వారెజ్ ఆసుపత్రిపై ఒత్తిడి పెరుగుతోంది.
21 ఏళ్ల యువకుడు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల అతని ఊపిరితిత్తులు సొంతంగా గాలిని పంప్ చేయలేవు. తను శ్వాస తీసుకోవడానికి అన్ని వేళలా వెంటిలేటర్ అవసరం.
తన వెంటిలేటర్ బ్యాటరీ బ్యాకప్ ఒక రోజు కంటే ఎక్కువ సేపు పనిచేయాలి. కానీ ఇటీవలి వారాల్లో దేశవ్యాప్తంగా మూడు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు కూడా అది పదేపదే పరీక్షించబడింది.
ఆ మూడు సందర్భాలలోనూ బ్యాటరీ దాని గరిష్ట పరిమితికి చేరుకుంది. పైగా ప్రతిరోజూ గంటల తరబడి కరెంట్ పోవడంతో దాన్ని రీఛార్జ్ చేయడానికి తగినంత సమయం ఉండట్లేదు.
“మనం ఇంకెంతకాలం ఇలా కొనసాగించగలమో నాకు తెలియదు” అని హవానాలోని ఒక పేద ప్రాంతంలో ఉన్న తన కొడుకు పడకగదిలో అతని కృశించిన శరీరం పక్కన నిలబడి తన తల్లి క్సేనియా అల్వారెజ్ అన్నారు. “అతని ప్రాణం విద్యుత్‌పై ఆధారపడి ఉంది” అని చెప్పారు.
క్యూబాపై అమెరికా చమురు దిగ్బంధనం కారణంగా క్యూబా రోగులు మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
కుంగిపోతున్న సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ
జనవరిలో ప్రారంభమైన ఈ మహమ్మారి దేశంలోని ఇంధన నిల్వలను వేగంగా హరించి వేస్తున్నది.
రోజువారీ విద్యుత్ కోతలతో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతున్నది. స్కూల్ తరగతులు రద్దు అవుతున్నాయి. గ్యాలన్ గ్యాస్‌కు దాదాపు 40 డాలర్ల ధరలకు కారణమవుతోంది.
ఇది క్యూబా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కూడా కుంగదీస్తోంది.
ఒకప్పుడు పేద దేశానికి గొప్ప విజయంగా భావించబడిన ఈ ప్రభుత్వ సంస్థ, ఇప్పుడు ప్రాథమిక సంరక్షణను అందించడానికే ఇబ్బంది పడుతోంది.
ఇంటర్వ్యూలలో ఆరుగురు క్యూబన్ వైద్యులు మాట్లాడుతూ, క్యూబా వ్యాప్తంగా ఆసుపత్రులు, క్లినిక్‌లలో వేగంగా క్షీణిస్తున్న పరిస్థితుల కారణంగా, మామూలుగా నివారించగలిగే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.
“ఎన్ని మరణాలు సంభవించాయో నేను చెప్పలేను. కానీ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇప్పుడు కచ్చితంగా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్పగలను” అని హవానాలోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రి చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అలియోత్ ఫెర్నాండెజ్ అన్నారు.
అంతేకాకుండా “షిఫ్ట్ మార్పులు, తోటి ఉద్యోగుల మాటలు, నేను ఆపరేషన్ చేసిన పిల్లలలో దీనిని గమనిస్తున్నాను” అని చెప్పారు.
దిగ్బంధనం ప్రభావాలు వ్యవస్థ అంతటా విస్తరిస్తున్నాయి. వైద్యులు, నర్సులు పనికి రాలేకపోవడంతో శస్త్రచికిత్సలను రద్దు చేసి రోగులను ఇంటికి పంపాల్సి వస్తున్నది.
విద్యుత్ అంతరాయాల కారణంగా కీమోథెరపీ, డయాలసిస్ వంటి చికిత్సలు అందించడానికి క్లినిక్‌లు ఇబ్బంది పడుతున్నాయి.
గ్యాస్ దొరక్క చాలా అంబులెన్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మందులు కొనడానికి ఇబ్బంది పడుతుండటంతో ఫార్మసీలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి.
ఫ్యాక్టరీలు డీజిల్‌తో నడుస్తున్నందున మందుల ఉత్పత్తి చాలా వరకు నిలిచిపోయింది.
ఇంధనం కొరత కారణంగా గతంలో వాటిని రవాణా చేసే విమానాలు రద్దు కావడంతో వ్యాక్సిన్ తయారీదారులు కావలసిన పదార్థాల కోసం వెతుకుతున్నారు.
అంతేకాక, విద్యుత్ కోతలు కొనసాగితే రిఫ్రిజిరేటర్లలో ఉంచిన వ్యాక్సిన్ నిల్వలు త్వరలోనే పాడైపోయే ప్రమాదం ఉంది.
“ఇది చిన్న విషయం కాదు. చాలా తీవ్రమైనది” అని ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, గాజాలలో ప్రజారోగ్య చర్యలకు నాయకత్వం వహించిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని ప్రజారోగ్య నిపుణుడు పాల్ స్పీగెల్ అన్నారు.
“ఆసుపత్రులు వాటి కార్యకలాపాలను మార్చుకోవలసి రావడం మీరు ఇప్పటికే చూస్తున్నారు”అని అన్నారు.
ఇతర ప్రాంతాలలో సంక్షోభాల సమయంలో జరిగినట్లే, ఇక్కడ కూడా రోగులను వర్గీకరించాల్సిన విధంగా ఆరోగ్య కార్యకర్తల పరిస్థితులు దిగజారుతున్నాయని తను అన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు తీసుకోవలసిన భయంకరమైన నిర్ణయాలపై ప్రభావ తీవ్రత ఉంటుంది. “ఎవరు ప్రభావితమవుతారనేది ఆ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
ఆంక్షల ఉచ్చులో క్యూబా వైద్య రంగం
చమురు దిగ్బంధనం క్యూబన్ ఆరోగ్య సంరక్షణ సమస్యలను తీవ్రతరం చేస్తోంది.
క్యూబాను ఇతర దేశాలతో ఒంటరిపాలు చేసి తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనానికి గురిచేసినప్పటికీ, ఆ దేశ ఉచిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎప్పటినుంచో ఒక ఆశాకిరణంగా ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, క్యూబా ప్రభుత్వం తన బడ్జెట్లో దాదాపు ఐదవ వంతును ఆరోగ్యంపై ఖర్చు చేయడమే దీనికి ఒక కారణం. ఇది ప్రపంచ సగటుకు దాదాపు రెట్టింపు.
ప్రపంచ బ్యాంకు ప్రకారం, కోవిడ్-19 మహమ్మారికి ముందు వరకు క్యూబాలో సగటు ఆయుర్దాయం, శిశు మరణాల రేట్లు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉండేవి.
అదే సమయంలో వైద్యుడు-రోగి నిష్పత్తి ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండేది.
ట్రంప్ మొదటి దఫా పరిపాలనలో ప్రారంభమైన కఠినమైన అమెరికా ఆంక్షలు క్యూబాకు పెద్ద సవాళ్లను సృష్టించాయి. ఫలితంగా ఆసుపత్రులలో పాతబడిన పరికరాలను మార్చడం కూడా సాధ్యం కాలేదు. అంతర్జాతీయ చెల్లింపులు, లాజిస్టిక్స్‌ను క్లిష్టతరం చేశాయి.
అమెరికా నిబంధనలను ఉల్లంఘించాల్సి వస్తుందనే భయంతో అమెరికన్, యూరోపియన్ వైద్య సరఫరాదారులు ఒప్పందాలను నిలిపివేసేలా ఆంక్షలు దారితీశాయి.
ఈ ఆంక్షల వల్ల ప్రభుత్వానికి బిలియన్ల డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లిందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
అమెరికా ఆంక్షలు, కోవిడ్ మహమ్మారి కలిసి తీవ్రమైన మాంద్యానికి దారితీశాయి. పర్యాటకంపైనా, హోటళ్ల నిర్మాణంపై ప్రభుత్వం పెట్టిన లక్షలాది డాలర్ల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది.
క్యూబన్ పెసో విలువను నాశనం చేశాయి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం నెలకు 13 డాలర్లకు సమానమైన స్థాయికి పడిపోయింది.
2018లో క్యూబాలో ప్రతి 1,000 జననాలకు శిశు మరణాల రేటు నాలుగుగా ఉండేది. ఇది యునైటెడ్ స్టేట్స్(అమెరికా) కంటే తక్కువ. అమెరికా విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనంతో ఈ శిశు మరణాల సంఖ్య పెరగడం అత్యంత ఆందోళనకరం.
ప్రజారోగ్యంపై ఆంక్షల ప్రభావాన్ని అధ్యయనం చేసే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ వైద్యులు రూత్ గిబ్సన్ మాట్లాడుతూ, ఆంక్షల పర్యవసానాలు ప్రజా ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపడానికి 10 సంవత్సరాలు పట్టిందని అన్నారు.
చమురు దిగ్బంధనం ప్రభావం బహుశా మరింత తీవ్రంగా ఉంటుందనీ వారు అన్నారు.
నవజాత శిశువులపై తీవ్ర ప్రభావం
క్యూబాలోని ప్రముఖ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసూతి-స్త్రీల వైద్య నిపుణురాలైన డాక్టర్ లిలియం డెల్గాడో పెరుయెరా, జరగాల్సిన నష్టం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
ఆంక్షల కారణంగా ఆసుపత్రిలో యాంటీబయాటిక్స్, మందులు, పరికరాల కొరత ఏర్పడగా, ఆహార కొరత వల్ల తక్కువ బరువున్న గర్భిణీ తల్లులు, నవజాత శిశువుల సంఖ్య పెరిగింది.
ఇప్పుడు ఇంధనం కొరత కారణంగా వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, తల్లులు ఆసుపత్రికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రసూతి గదులు మురికిగా మారడం, ప్రసవాలు చేయడానికి ఆరోగ్య కార్యకర్తల సంఖ్య తగ్గడం, ప్రసవ వేదన ప్రమాదకరంగా ముదిరిన తర్వాత తల్లులు ఆసుపత్రికి చేరుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
“మాకు చాలా తీవ్రమైన కేసులు వస్తున్నాయి” అని డాక్టర్ డెల్గాడో పెరుయెరా అన్నారు. ఫిబ్రవరిలో ముగ్గురు నవజాత శిశువులు మరణించారని, ఒక నెలలో ఇంత ఎక్కువ మంది మరణించడం తాను ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు.
“ముఖ్యంగా ఇటీవలి వారాల్లో, తీవ్రమైన నెలలు నిండని జననాలు మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీశాయి”అని, యాంటీబయాటిక్స్ కొరత కారణంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు కూడా నెలలు నిండని జననాల పెరుగుదలకు పాక్షికంగా కారణమని ఆమె పేర్కొన్నారు.
మందుల కొరత – అంధకారంలో ఆసుపత్రులు
96,400 మంది రోగులు శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్నారని క్యూబా ప్రభుత్వం ఈ నెలలో తెలిపింది. ఇంధన దిగ్బంధనంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇంధన కొరత కారణంగా 30,000 మందికి పైగా పిల్లలకు టీకాలు ఆలస్యమయ్యాయని; దాదాపు 20,000 మంది రోగులకు రేడియేషన్ థెరపీ, కిడ్నీ డయాలసిస్ సక్రమంగా అందడం లేదని ప్రభుత్వం పేర్కొంది.
మందుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ నెలలో, హవానాలోని ఒక ప్రాంతంలో ఉన్న ఫార్మసీని మందులు లేని కారణంగా పనివేళ మధ్యలోనే తాళం వేశారు. కొనుగోళ్లు పరిమితం చేయబడ్డాయని తలుపు మీద చేతితో రాసిన బోర్డులు దర్శనమిస్తున్నాయి.
పట్టణానికి అవతలి వైపున ఉన్న విలియం సోలర్ పీడియాట్రిక్ హాస్పిటల్ భయంకరమైన నిశ్శబ్దంతో ఉంది.
చాలా మంది వైద్యులు, నర్సులు, రోగులు ఎండలో మైళ్ల దూరం నడిచి అక్కడికి చేరుకుంటుండటంతో, ఆ ఆసుపత్రి అతి తక్కువ సిబ్బందితో నడుస్తోంది.
ప్రభుత్వం ఆసుపత్రులకు విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నది. దీనివల్ల చీకటిగా ఉన్నప్పుడు కూడా వాటిలో దీపాలు వెలుగుతూ ఉంటాయి.
అయినప్పటికీ, ఈ నెలలో దేశవ్యాప్తంగా మూడు విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆసుపత్రులు బ్యాకప్ జనరేటర్లపై ఆధారపడవలసి వచ్చింది.
హవానాలోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రికి చెందిన ప్రధాన అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఫెర్నాండెజ్, ఒక 2 నెలల బాలుడికి శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు మత్తులో ఉంచారు.
“జనరేటర్ తిరిగి పనిచేసే వరకు, లైట్లు, శిశువు కీలక సంకేతాలను పర్యవేక్షించే పరికరాలు కొన్ని నిమిషాల పాటు అకస్మాత్తుగా ఆగిపోయాయి” అని డాక్టర్ అన్నారు.
ఆసుపత్రిలోని మరోచోట, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువుల ఊపిరితిత్తులలోకి గాలిని పంపిస్తున్న వెంటిలేటర్ల వద్దకు వైద్యులు, నర్సులు పరుగెత్తారు. ఆ యంత్రాల బ్యాటరీలు పాడైపోయాయి. అందువల్ల జనరేటర్లు పనిచేయడం ప్రారంభించే వరకు శిశువులు శ్వాస తీసుకునేలా చేయడానికి ఆరోగ్య కార్యకర్తలు ఒక రబ్బరు పంపును నొక్కవలసి వస్తుంది.
సన్నగిల్లుతున్న ఆశలు – క్షీణిస్తున్న పరిస్థితులు
ఇంధనం కొరత తీవ్రంగా ఉన్నందున, గ్యాస్ జనరేటర్లు కేవలం తాత్కాలిక ఆశాకిరణం మాత్రమే కావచ్చు.
ఆసుపత్రిలోని నవజాత శిశు విభాగంలో పనిచేసే నర్సులు, ఆసుపత్రిలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఏమి చేయాలో తమ వద్ద ఇప్పటికే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.
క్యూబాకు జనవరి 9 తర్వాత చమురు రవాణా పూర్తిగా ఆగిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపుల తర్వాత పలు దేశాలు చమురు రవాణాను నిలిపివేశాయి. వచ్చే వారం ప్రారంభంలోగా రాగల రష్యన్ ట్యాంకర్‌పై అందరి దృష్టి ఉంది.
దేశ విద్యుత్ గ్రిడ్ అస్థిరంగా ఉందని, పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ పౌరులను హెచ్చరించారు.
ఇంతటి దుర్భర పరిస్థితులలో క్యూబా ప్రభుత్వం స్థానిక ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ హోమ్‌లతో పాటు, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం అవసరమైన 120 మంది అనారోగ్య పిల్లల ఇళ్లపైనా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది.
అయితే దేశంలో కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయి. నీటి పంపులు విద్యుత్ గ్రిడ్‌పై ఆధారపడటం వల్ల కుళాయిలలో నీరు రావడం లేదు. పారిశుధ్యం క్షీణిస్తోంది. క్యూబాలోని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి చెప్పిన దాని ప్రకారం, ఆహారం దొరకడం కూడా కష్టమవుతోంది.
కొత్త తల్లులకు, శిశువులకు క్రమం తప్పకుండా ఆహారం, సప్లిమెంట్లు, మందుల ప్యాకేజీలను అందించడం క్యూబన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒక ముఖ్య లక్షణం.
దీని ఫలితంగా, కోవిడ్ మహమ్మారికి ముందు వరకు క్యూబాలో పిల్లల పోషకాహార లోపం రేటు అత్యల్పంగా ఉండేదని యూనిసెఫ్ తెలిపింది.
నెలవారీ ప్రసవాలు తక్కువ, సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని సిబ్బంది చెప్తున్నారు. హవానాలోని ఒక ప్రాంతంలో కమ్యూనిటీ డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రొక్సానా మార్టినెజ్ రోడ్రిగ్జ్, ఈ సంవత్సరం తన రోగులకు పాలు గానీ, ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు గానీ అందలేదని చెప్పారు.
దీని ఫలితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువుల సంఖ్య పెరుగుతోందని ఆమె అన్నారు.
“మిగతా జనాభా లాగే మాకూ అవే విద్యుత్ కోతలు ఎదురవుతున్నాయి, అవే కొరతలను మేము కూడా ఎదుర్కొంటున్నాము. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా, అది మిమ్మల్ని ప్రభావితం చేయబోతోంది”అని ఆమె అన్నారు.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఎడ్ అగస్టిన్, జాక్ నికాస్లు రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
