
12 వేలమంది ఉద్యోగులను 2025 జూలై 27న దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ తొలగించింది. ఇది లక్షలాది ఐటీ ఉద్యోగుల గుండెలలో భయాందోళనను పుట్టిస్తోంది. ఈ భయం టీసీఎస్ ఉద్యోగుల వరకే పరిమితం కాదు. ఇటు దేశంలో, విదేశాలలో పేరుమోసిన పెద్ద ఐటీ సంస్థలు కూడా వరుసగా ఇదే తరహా చర్యలను చేపడుతున్నాయి. భారతదేశ ఐటీరంగంలో కొంత మెరుగైన ఉద్యోగ భద్రత కల్పించే సంస్థగా పేరొందిన టీసీఎస్ చేపట్టిన చర్య సహజంగానే ఉద్యోగ వర్గాలను ఒకింత ఎక్కువ భయాందోళనకు కూడా గురిచేస్తోంది. అందుకే టీసీఎస్ వరకే పరిమితం కాకుండా ఇదో ఐటీరంగ సార్వత్రిక సమస్యగానే మారుతోంది.
సాఫ్ట్వేర్ రంగంలో ఇలా తొలగింపులు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2008 ఆర్ధిక సంక్షోభంలో, కోవిడ్- 19 కాలంలో ఇలాంటి తొలగింపులు చోటుచేసుకున్నాయి. కొన్నిసార్లు కొంతమేరకు సామూహిక తొలగింపు చర్యలను కూడా చేపట్టారు. ఈ తొలగింపు ప్రక్రియ కొత్తది కాకపోయినా గతంతో పోల్చితే భిన్నమైనది. ప్రత్యేకంగా ‘కృత్రిమ మేధ’ ఫలితంగా ఏర్పడ్డ సమస్య. దీన్ని గడిచిన సందర్భాల కంటే భిన్నమైన దృష్టికోణంతో విశ్లేషించాల్సి ఉంటుంది.
గతంలో ఐటీ రంగంలో ఉద్యోగుల ఉద్వాసనకు పూనుకున్న సమయాల్లో సీనియరు ఉద్యోగులపై తొలి వేటు పడకుండా ఓ మేరకు ‘సీనియారిటీ’ కవచంగా కాపాడింది. జూనియర్ ఉద్యోగుల మీద తొలి వేటు పడేది. ఉద్యోగుల ఉద్వాసనకు ‘లాస్ట్ వన్ ఫస్ట్ గో’ అనే ఫార్ములా ఇంతవరకూ సాధారణంగా ఉనికిలో ఉన్నది. అయితే, ఖర్చు తగ్గింపు ప్రక్రియలో భాగంగా తొలి వేటు సీనియర్ల మీద వేసే కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉండేవి.
పింకు కార్డుతో ఉద్వాసన చెప్పినా లేదా జీతాలను చెల్లిస్తూ బెంచి మీద కూర్చోపెట్టినా ఇదే ఫార్ములా సాధారణంగా వర్తించేది. ఈ సారి గత సాధారణ నియమం తప్పింది. జూనియర్ల మీద కాకుండా సీనియర్ల మీద మొదటిసారి మొదటి వేటు పడింది. దీనికి కారణం కృత్రిమ మేధ. అందుకే గతంలోలా మూస దృష్టికోణంతో కాకుండా కొత్త చూపుతో తాజా సమస్యను విశ్లేషించాలి.
భౌతిక పరిస్థితుల్లో మౌలిక మార్పు..
అనుభవం, దక్షతలు గల సీనియర్ ఐటీ నిపుణుల మనస్సులో ఇంతవరకూ ఐటీ రంగ ఒడిదుడుకుల వల్ల తమ ఉద్యోగాలకు ప్రమాదం రాదనే భావన వుండేది. ఏ కుదుపులు వచ్చినా తమది సురక్షిత స్థానం(సేఫ్ జోన్) అనే మానసిక నమ్మకమది. ఇప్పుడది వమ్మయినది. ఐటీ రంగంలో తొలిసారి పరిస్థితి తారుమారైంది.
ఈ తరహా తీవ్ర సంక్షోభ పరిస్థితి ఏర్పడడం వల్ల ఐటీ ఉద్యోగులకు సంఘ నిర్మాణ కర్తవ్యాన్ని ముందుకు తెచ్చింది. అది ఐటీ ఉద్యోగుల వరకు పరిమితం కాకుండా సామాజిక అవసరంగా కూడా మారింది.
ఇప్పుటికే ఐటీ రంగంలో సంఘ నిర్మాణ కృషి బీజ రూపంలో మొదలైంది. బెంగుళూరు కేంద్రంగా, ఈ సామూహిక తొలగింపుల చర్యలను నివారించాలని కోరుతూ కార్మికశాఖకు ఐటీ ఉద్యోగ సంఘం ఫిర్యాదు చేసింది. ఇది సమకాలీన ఐటీ రంగంలో ప్రాధాన్యత గల ఘటనగా చెప్పవచ్చు. ఇది కరోనా నుంచే బీజ రూపంలో చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన ఐటీ కేంద్రాలలో మొదలై కొనసాగుతోంది.
అయితే, ఐటీ రంగంలో ఆనాటికీ ఈనాటికీ భౌతిక పరిస్థితుల్లో చాలా మౌలిక మార్పు చోటుచేసుకుంది. ఉద్యోగ భద్రతకు ఏర్పడ్డ ముప్పు స్వభావంలో కూడా నాటికీ నేటికీ మధ్య పోలిక లేదు. అందువల్ల ఐటీ ఉద్యోగ సంఘం చేపట్టిన తాజా చర్య ఒక మలుపు తిప్పే ఘటనగా మారే వీలుంది. సాధారణ బాధిత ఐటీ ఉద్యోగ వర్గ దృష్టి నేటికీ సంఘ నిర్మాణం వైపు మళ్ళకపోవచ్చు. కానీ వారికి మున్ముందు ఇదొక దారిదీపంగా మారడానికి, దేశ ఐటీ రంగ చరిత్రలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
ఉద్యోగ భద్రత, ఉపాధి పరిరక్షణ కోసం నూతన దృష్టికోణంతో ఐక్యతను సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నాణ్యత, మన్నికలతో కూడిన మెరుగైన సేవల తయారీ పేరిట వేటు వేసే గత దాడి స్వభావం వేరు. కృత్రిమ మేధ(ఏఐ) ఎదిగి అందుబాటులోకి వచ్చిన తర్వాత చేపట్టే నేటి దాడి స్వభావం వేరు. ఈ రెండింటి మధ్య పోలిక లేదు.
ఈసారి లక్షలాది ఐటీ ఉద్యోగ వర్గ జీవనం మీద వ్యవస్థీకృత దాడిగా మారుతోంది. ఐటీ కార్పొరేట్ కంపెనీల ఆధ్వర్యంలో జరిగే ఈ వ్యవస్థీకృత దాడికి వ్యతిరేకంగా ఐటీ మేధో శ్రామికవర్గం కూడా అంతే వ్యవస్థీకృత ఐక్యతను సాధించాలి. ఈ నూతన దృష్టి కోణంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులను సమీకరించి, సంఘటితం చేయడం, జీవనోపాధి పరిరక్షణ కోసం ఉద్యమ నిర్మాణం చేయడం నేటి చారిత్రక ఆవశ్యకతగా మారింది. ఈ సందేశం సామాజిక పురోగామి శక్తుల ద్వారా బాధిత ఐటీ ఉద్యోగ వర్గానికి అందాల్సిన అవసరం కూడా ఏర్పడింది.
చారిత్రక ఆవశ్యకత ఏర్పడినంత మాత్రాన అందుకు తగిన భౌతిక పరిస్థితి ఏర్పడాలనే షరతు లేదు. మార్పుకు కావాల్సిన అనుకూల భౌతిక స్థితిగతులు పరిపక్వమయినంత మాత్రాన, వెంటనే వాటిని సద్వినియోగం చేసుకునే స్వీయాత్మక పరిస్థితి పరిపక్వం అవుతుందనే అవకాశం ఉండదు. ఐటీ రంగంలో సంఘ నిర్మాణ కృషికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.
ఐటీ రంగంలో భౌతిక, స్వీయాత్మక పరిస్థితుల మధ్య నేడు ఇదొక వైరుధ్యంగా ఉంది. చైతన్యయుత కృషిని చేపట్టకుండా ఈ గ్యాప్‌ను పూరించడం సాధ్యం కాదు. ప్రధానంగా ఈ బాధ్యత బాధిత ఐటీ ఉద్యోగ వర్గానిదే. కానీ నేటి నిర్ధిష్ట పరిస్థితులలో వారి కృషికి సహకారంగా పురోగామి సామాజిక, రాజకీయ శక్తుల బాధ్యత కూడా అవసరం. దానిని వాటి భుజస్కందాలపై చరిత్ర మోపింది.
ఆధునిక సామాజిక వ్యవస్థలో అనూహ్యంగా మొలిచి మిన్నంటిన ఐటీ పరిశ్రమ, అంతే అనూహ్య రీతిలో పడిపోనుంది. ఏఐతో ఐటీ సేవల మార్కెట్ అదృశ్యం కాదు. దాని వినియోగదార్లు తెరమరుగు కారు. పైగా మానవ జీవితంలో ఐటీ సేవల ప్రాసంగికత గతం కంటే మరింత పెరిగింది. అందువల్ల ఐటీ పరిశ్రమ అదృశ్యం కాదు. పైగా మరింత వర్ధిల్లుతుంది. పెట్టుబడిదారీ మార్కెట్ సంక్షోభం సంభవిస్తే ఐటీ మార్కెట్ దెబ్బతినవచ్చు. కానీ ఐటీ ఉత్పత్తులకు కాలదోషం పట్టి దెబ్బతినే పరిస్థితి మాత్రం రాదు. అదే సమయంలో ఏఐ వల్ల ఐటీ ఉద్యోగవర్గం, వారి సామాజిక జీవితం ధ్వంసమవుతుంది. కానీ ఐటీ పరిశ్రమ మాత్రం ఏఐ సాయంతో వర్దిల్లుతుంది.
మానవ జీవన విధ్వంసం, సామాజిక విచ్ఛిన్నత..
ఏఐ ద్వారా మానవ జీవిత విధ్వంసం జరిగి, ఐటీ కార్పొరేట్ కంపెనీల లాభాల పంట పండడం గురించి మనం మాట్లాడేది. ఏఐ ద్వారా లాభాలు పెరుగుతాయి. అవి మూడు పువ్వులు ఆరు కాయల పంటగా వున్న ప్రస్తుత స్థితి నుంచి మున్ముందు ఒకే పువ్వు పది కాయల పసిడి పంటగా వర్ధిల్లుతుంది.(ఏఐ సమాజంలో కొనుగోలు శక్తిని మరింత ధ్వంసం చేయుంచి, అదో మహా మాంద్యానికి దారితీసి ఆ పరిశ్రమ సైతం ధ్వంసం కానున్నది. అంతేతప్ప ఆ వస్తు వాడకం లేనందున మాత్రం కాదు. అది మరో సంగతి) ఈ వెలుగులో సాధారణ ఐటీ ఉద్యోగుల మనస్సులలో సంఘ నిర్మాణ ఆలోచనలను వ్యాప్తి చేయాల్సి వుంది. వారికి సరైన సందేశాన్ని అందించే కర్తవ్యాన్ని సామాజిక పురోగామి శక్తులు చేపట్టాలి.
నేటికీ సాధారణ ఐటీ ఉద్యోగులలో సంఘ నిర్మాణ దృష్టి మొదలు కాకపోవడానికి భౌతిక స్థితి కారణం. అందుకు ఐటీ ఉద్యోగుల తప్పిదం కారణం కాదు. ఇప్పటి వరకూ ఉద్యోగ భద్రత ఉందనే స్థిర మానసిక స్థితితో వున్నారు. వారి మైండ్‌సెట్ అందుకు అనుగుణంగా వుంది. ఇప్పుడు కొత్త భౌతిక స్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్త పరిస్థితి మొదటిసారి ఐటీ ఉద్యోగుల్ని తీవ్ర షాక్‌కు గురిచేస్తుంది. ఇదొక కొత్త మానసిక పరివర్తనకు వారిని గురిచేస్తుంది. ఈ మానసిక స్థితిని మార్చి వారిని సుసంఘటితం చేయగలిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఓపికగా చైతన్యపరిచి, వారిని ఒప్పించి సంఘ నిర్మాణం వైపు మళ్లీస్తే ఓ రాజకీయ సునామీని సృష్టించవచ్చు. నేడు అందుకు తగ్గ సానుకూల భౌతిక పరిస్థితి వుంది.
దేశంలో అరవై లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఏటా ఐదు లక్షల మంది చొప్పున కొత్త ఐటీ నిపుణులు ఐటీ మార్కెట్లోకి వస్తున్నారు. దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు ఐటీ ఆశలతో ఇంజనీరింగ్ కళాశాలల్లో నేడు శిక్షణ గడిస్తున్నారు. ఇది వాటిపై ఆధారపడ్డ ఉపాధిదారులతో కలిపి దాదాపు కోటి మంది సమస్య. వారి కుటుంబాల సభ్యులను కలిసి నాలుగైదు కోట్ల జనాభాకు చేరుతుంది. ఐటీ రంగంపై ఆధారపడి రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం, వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాలు వున్నాయి. వాటి మీద ఆధారపడి అంతకంటే అనేక రెట్ల మంది జీవిస్తున్నారు.
ప్రాణం లేని కృత్రిమ మేధను సజీవ మానవ మేధ సృష్టించింది. కానీ అదే నిర్జీవ మేధ సజీవ మానవ జీవిత విధ్వంస ప్రక్రియకు దిగింది. తీవ్ర నిరుద్యోగ సమస్యని సృష్టిస్తోంది. అది ఐటీ జన జీవితంతో పాటు దానిపై ఆధారపడ్డ జన జీవనాన్ని కూడా తీవ్రంగా ఆందోళనకి గురిచేస్తోంది. ఇంతటి విస్తృత భౌతిక పునాది ఐటీ ఉద్యోగ వర్గానికి ఉండడం ప్రత్యేక విశేషం.
మైండ్‌గేమ్ పట్ల ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి..
ఈ నేపథ్యంలో ఏఐతో త్వరలో రానున్న ప్రమాదాన్ని పసిగట్టి ఐటీ ఉద్యోగవర్గం నిజంగా సంఘటితమై రోడ్డెక్కితే ఏం జరుగుతుందో ఐటీ ఉద్యోగుల కంటే ఐటీ కార్పొరేట్ కంపెనీలకు బాగా తెలుసు. వాటికి కొమ్ముకాసే ప్రభుత్వాలకు మరింత బాగా తెలుసు. ఈ సానుకూల భౌతిక పరిస్థితుల కారణంగా ఐటీరంగ ఉద్యోగవర్గం సంఘటితమైతే, బడా కార్పొరేట్ ప్రభుత్వాల మెడలు వంచగలరు. ఏఐ నియంత్రణ చేయించి తమ ఉద్యోగ భద్రతను కాపాడుకోగలరు.
సామాజిక- భౌతికమైన ఉద్యమాలను ఐటీ ఉద్యోగవర్గం చేయకపోయినా, కనీసం ఆన్లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినా ఫాసిస్టు పాలనా వ్యవస్థ చాలా తీవ్ర రాజకీయ కుదుపుకు గురవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక ఆన్లైన్ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యం తెల్సిందే. కొన్నిసార్లు అవి ప్రభుత్వాలని గద్దె దింపిన సందర్భాలు లేకపోలేదు. ఈ విషయం పురోగామి సామాజిక శక్తుల దృష్టిలో ఉండాలి.
ఐటీ ఉద్యోగ వర్గ బలం ఏమిటో పురోగామి శక్తుల కంటే తిరోగామి శక్తులకే ఎక్కువ తెలుసు. అందుకే ఏఐతో తలెత్తనున్న తీవ్ర సమస్యకు ఐటీ కంపెనీలు తప్పుడు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను సూచిస్తూ మీడియా ద్వారా వ్యూహాత్మక ప్రచారం చేయిస్తాయి. ఐటీ ఉద్యోగులను తెలివిగా పక్కదారి పట్టించే కొత్త వ్యూహాలు పన్నుతాయి. మరోవైపు ఐటి ఉద్యోగ వర్గం పట్ల అపోహలు సృష్టిస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తాయి.
ఈ నేపథ్యంలో ఐటీ కార్పొరేట్ కంపెనీలు ఐటీ ఉద్యోగులతో ఆడే మైండ్‌గేమ్ పట్ల ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా వుండాలి. ఐటీ కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల వ్యూహాలు పన్నుతాయి. వాటి పట్ల సామాజిక పురోగామి శక్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అవి ఐటీ ఉద్యోగులను అప్రమత్తం చేయడానికి తగు కృషి చేయాల్సిన సమయమిది.
ఐటీ కంపెనీలు ఆకాశం ఎత్తుకు ఎదగడానికి ఐటీ నైపుణ్య ఉద్యోగుల మేధో శ్రమ శక్తే ప్రధాన కారణం. తమ నైపుణ్య సాంకేతిక శ్రమను అతి చౌకధరకు అమ్ముకొని ఐటీ కంపెనీలు శక్తివంతంగా తయారయ్యాయి. వారిని ఐటీ కంపెనీలు ఏసీ గదుల్లో కూర్చోబెట్టి కేవలం గాజు బొమ్మలుగా మార్చాయి. మేధో శ్రామిక కూలీలుగా పని చేయించాయి. వారిని కుటుంబాలకు దూరంగా, ఆరోగ్యాల్ని ఖాతరు చేయకుండా, పనిగంటల పరిమితి లేకుండా రాత్రింబవళ్ళు పాటు పడాల్సిన దుస్థితిని కల్పించాయి. అంతటి మేధోజ్ఞానం, సామర్ధ్యం, నైపుణ్యాలు గల మన దేశ ప్రజల ప్రియతమ బిడ్డలను కరివేపాకుగా ఐటీ సంస్థలు వాడుకొని ఈరోజు అవతలకు విసిరేయజూస్తున్నాయి.
ఇటీవల బెంగుళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌కతాలలో ఐటీ కేంద్రాలు వెలిశాయి. అవి సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఐటీ హబ్స్‌గా పేరొందాయి. ఆధునిక సాంకేతిక సేన ఇలా పెరగడం ఒక కొత్త ధోరణి. బట్టలు, జూట్‌తో పాటు ఇంకా చక్కర, సిమెంట్, ఉక్కు, ఇనుము, బొగ్గు వంటి ఉత్పత్తి రంగాల శారీరక కార్మికవర్గంతో ఐటీ వంటి సేవా రంగాల మేధో ఉద్యోగ వర్గాన్ని పోల్చలేము. అయినా ఐటీ సాంకేతిక రంగానికి చెందిన ఉద్యోగులకు కూడా సంఘ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఆచరణలో రుజువవుతోంది. నిజానికి ఐటీ ఉద్యోగుల ఎదుట సంఘ నిర్మాణ భావన వ్యక్తం చేయడం గతంలో కష్టంగా వుండేది. ఆ పరిస్థితి నేడు లేదు. అది క్రమంగా మారుతోంది. ఐటీ ఉద్యోగుల మధురమైన కలలు కరిగిపోతున్న పరిస్థితి ఉంది. కృత్రిమ మేధ(ఏఐ)తో ఆశలన్నీ ఆవిర్లు అవుతున్నాయి. ఈ వెలుగులో భారత కార్మికోద్యమ యవనిక మీద ఐటీ రంగ ఉద్యోగ వర్గానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.