గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ‘పునర్విభజన’ జపం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలలో శాస్త్రీయత లోపించడంతో పాటు గందరగోళం, అయోమయం, అస్పష్టత నెలకొన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విభజనతో మొదలు పెట్టి- ఆ తర్వాత నగర పోలీసు విభాగం, ఇప్పుడు జిల్లాల పునర్విభజన ఆలోచనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జిల్లాల పునర్విభజనపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తుల అధ్యక్షతన కమిటీ వేయనున్నట్టు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు.
పునర్విభజన- అస్పష్టత
జీహెచ్ఎంసీ పునర్విభజన ప్రక్రియ మొదలై నెలకు పైగా గడిచినప్పటికీ- నేటికీ అధికారులు, సిబ్బంది మధ్య గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
జీహెచ్ఎంసీలో కొత్తగా 6 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, 27 మున్సిపాలిటీలను విలీనం చేశారు.
పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా విభజించి, వార్డుల సంఖ్యను 300కు పెంచారు.
అసలు జీహెచ్ఎంసీ పునర్విభజన ఎందుకు చేశారు? ఏ ప్రాతిపదికన, ఏ అంశాన్ని కొలమానంగా తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.
నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకోనా; రోడ్లు, డ్రైనేజీ వంటి పౌర సదుపాయాల అభివృద్ధి కోసమా; ట్రాఫిక్ సమస్యల పరిష్కారమా? లేక ‘ఫ్యూచర్ సిటీ’ కోసమా? లేదా భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమా? ఇవేవీకాకుండా తన ముద్రను వేయాలనే తాపత్రయంతో రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారా? అనేది స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో తమ ఇల్లు ఏ వార్డులోకి, ఏ సర్కిల్‌లోకి వస్తుందో తెలుసుకోవడానికే తమ సమయాన్ని ప్రజలు వృథా చేసుకుంటున్నారు.
నాటి ప్రణాళికకు నిదర్శనం
గతంలో 2007లో జనాభా పెరుగుదల, పాలనా సౌలభ్యం కోసం అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి ‘గ్రేటర్'(జీహెచ్ఎంసీ)గా తీర్చిదిద్దింది.
దీంతో 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులతో సంఖ్యలో మార్పు వచ్చింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో నాటి నిజాం ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో నిర్మించిన- రోడ్ల వెడల్పు, పొడవు నేటికీ అలాగే ఉన్నాయి. జనాభా, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగినా, వందల ఏళ్ల నాటి రోడ్ల పరిస్థితి మారలేదు. నాటి నగర నిర్మాణ ప్రణాళికకు ఇదొక నిదర్శనం.
పోలీసు విభాగం పునర్విభజన
ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం నగర పోలీసు విభాగం పునర్విభజన. రెండు దశాబ్దాల క్రితం వరకు నగరానికి ఒకే పోలీస్ కమిషనరేట్ ఉండేది. దాని పర్యవేక్షణలోనే నగరాన్ని దక్షిణ- పాతబస్తీ, ఉత్తర- సికింద్రాబాద్, తూర్పు- దిల్సుఖ్నగర్, పశ్చిమ- మెహిదీపట్నం మండలాలుగా విభజించారు.
ఆ తర్వాత సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సుమారు 2 కోట్ల జనాభా ఉంది. నగర పోలీసు విభాగంలో 17 వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిని లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్ వంటి విభాగాలకు కేటాయిస్తున్నారు.
నగరంలో ప్రస్తుతం 105 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన పునర్విభజన వల్ల ఏ సిబ్బంది ఏ విభాగంలో ఉన్నారు, ఎవరికి ఏ స్టేషన్ కేటాయించారనే విషయంలో స్పష్టత లేక సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.
ప్రజలు కూడా తమ ఏరియా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియక స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాల పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన ఏ ప్రాతిపదికన చేస్తారో చూడాలి. దీనివల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
