2026 ఫిబ్రవరి 8న తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం– తాళ్ళవీరప్పగూడెం గ్రామాల మధ్య కృష్ణా నది ఎడమ ఒడ్డున సుమారు మూడు వేల సంవత్సరాల కిందటి ప్రాచీన నగర అవశేషాలను గుర్తించాను.
కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ఇలాంటి పురావస్తు స్థలాలను పూర్వపు పురావస్తు శాఖ ఇప్పటికే నివేదించింది. అయినప్పటికీ, శాఖ వార్షిక నివేదికల్లో ఈ స్థలం లేదని తెలుస్తున్నది.
స్థల అవశేషాల ఆధారంగా ఈ ప్రాంతంలో సుమారు క్రీపూ 1000- క్రీశ 15వ శతాబ్దం మధ్య చారిత్రక ఆధారాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ ప్రాంతంలో ఇనుపయుగానికి చెందిన వందలాది బృహత్శిలా సమాధులు ఉన్నాయి. వీటిని స్థానికులు వీరుల సమాధులుగా భావించడం వల్ల వీరులపాడు, వీరప్పగూడెం అనే పేర్లు ఏర్పడ్డాయి.
ఈ సమాధుల వ్యాప్తి తాళ్ళవీరప్పగూడెం క్రీడా ప్రాంగణం నుంచి కృష్ణా నది అంచు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర విస్తరించింది.
నిధుల వేటలో కనుమరుగయ్యే స్థితి..
అయితే చాలా సమాధులు ఇప్పటికే ధ్వంసమయ్యాయి; కప్పురాళ్లు తొలగించబడి ఉన్నాయి. కొన్నిచోట్ల నాలుగు పక్కల రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
కొన్ని ప్రదేశాల్లో నిలువుగా నిలబెట్టిన మెన్హిర్ రాళ్లు కూడా ఉన్నాయి. విస్తృత సర్వే చేపడితే మాత్రమే కొద్ది సమాధులు సంపూర్ణంగా గుర్తించగలిగే అవకాశముంది.
గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్థానికులు, సమీప సిమెంట్ కంపెనీ ఈ సమాధి రాళ్లను తమ తమ అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తున్నది.
జీవ నదైన కృష్ణా నది సమృద్ధిగా నీరు, చేపలు, ఇతర జీవనాధార వనరులను అందించడంతో ఇక్కడ మానవ ఆవాసం ఏర్పడింది. పలు చోట్ల లభించిన ఇనుప చిట్టాలు ఇక్కడే ఇనుము ఉత్పత్తి జరిగిందని, భారీ రాళ్లపై పనిచేసే సామర్థ్యం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్టు సూచిస్తున్నాయి.
ఈ బృహత్శిలా సమాధులు నాలుగు పెద్ద నిలువు రాళ్లతో నిర్మించి, పైభాగంలో చదునైన కప్పురాయిని ఉంచి నిర్మించబడ్డాయి. స్థానికంగా బంజరు రాళ్లు(పల్నాడు రాళ్లు)గా పిలవబడే ఈ రాళ్ల సమృద్ధి కారణంగానే సుమారు యాభై ఏళ్ల క్రితం ఇక్కడ సిమెంట్ కంపెనీ ఏర్పడింది.
ఆ కంపెనీ కార్యకలాపాలు, స్థానిక వినియోగం, గుప్తనిధుల కోసం జరిగిన ధ్వంసం వల్ల ఈ సమాధులు దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి.
తక్కువగా కనిపిస్తున్న ఆధారాలు..
బృహత్శిలా దశ తరువాత సుమారు వెయ్యేళ్లపాటు నివాస ఆధారాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధ్యయుగ కాలానికి చెందిన(క్రీ.శ. 10–15 శతాబ్దాలు) కోటగోడలు, బురుజు, ధాన్యాగారాలు, శిథిలమైన రెండు ఆలయాలు, పలు శిల్పాలు, బావులు, గృహ పునాదులు కనిపిస్తున్నాయి.
సుమారు 70×70 మీటర్ల చదరపు ఆకారంలో దక్షిణ ద్వారం కలిగిన కోట కృష్ణా నదికి అల్లంత దూరంలో ఉంది. కోట లోపల ఒక ముఖ్య నిర్మాణపు పునాదులు కనిపిస్తున్నాయి. ఆ నిర్మాణం ముఖ్యమైన వ్యక్తి కోసం గానీ, ముఖ్యమైన వస్తువులను నిలువ ఉంచడం కోసం గానీ నిర్మించబడి ఉంటుంది.
కోటకు ఆగ్నేయ దిశలో ఉన్న ఎత్తైన బురుజును కాపలా గోపురంగా ఉపయోగించి ఉండవచ్చు. కోట ఈశాన్యంలో వనదుర్గ, పోచమ్మ, పోతరాజు, వీరభద్రుడు/భైరవుడు శిల్పాలు, వీర దంపతుల వీరగల్లు, వీరుని మొండెం భాగం కనిపిస్తున్నాయి; వాటి ఆలయాలు ధ్వంసమయ్యాయి.
రాణి రుద్రమదేవి నిర్మాణం..!
వాస్తు–శిల్ప లక్షణాల ఆధారంగా ఈ నిర్మాణాలు కందూరి చోళుల నుంచి రేచర్ల పద్మనాయకుల కాలానికి చెందినవిగా భావించవచ్చు.
స్థానిక కథనాల ప్రకారం, కాకతీయ రాణి రుద్రమదేవి(క్రీ.శ. 13 వ శతాబ్దం) ఈ ప్రాంతాన్ని రహస్య ధాన్య నిల్వ కేంద్రంగా ఉపయోగించిందని చెప్తారు. సుమారు 6 మీటర్ల వ్యాసంతో నిర్మించిన గుండ్రటి ధాన్యాగారాలు డంగు సున్నంతో పూత పూయబడిన అంతర్గత నిర్మాణాలు ఇందుకు దృష్టాంతాలుగా కనిపిస్తున్నాయి.
గృహ వినియోగ మట్టిపాత్రలు పెద్దగా కనిపించకపోవడం వల్ల ఇది నివాస స్థలం కంటే రహస్య రక్షిత ధాన్యాగారంగా ఉపయోగించబడినట్టు భావించవచ్చు.
కోటకు దక్షిణంగా సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో కృష్ణా నది ఒడ్డున రేచర్ల పద్మనాయకుల కాలానికి చెందిన లక్ష్మీ నరసింహాలయం ఉంది.
ముఖ మండపం పూర్తిగా ధ్వంసమై ఉండగా, ద్వారపాలకులతో కూడిన అంతరాళం సమగ్రంగా నిలిచి ఉంది; గర్భగుడి పాక్షికంగా మాత్రమే మిగిలింది. ఆలయ శిఖరం దాదాపు సమతల స్థితిలో ఉంది. నిర్మాణమే అలా చేసినట్టుంది.
డాక్యుమెంటేషన్ అత్యవసరం..
లక్ష్మీ నరసింహ, ఆయన భార్యలు ఆది లక్ష్మి, చెంచు లక్ష్మి, చెన్నకేశవ విగ్రహాల విరిగిన భాగాలను దుండగులు విరగ్గొట్టి పడేయగా నేను వాటిని వెతికి, అతికించి అవి ఫలానా విగ్రహాలు అని గుర్తించాను.
ప్రధాన విగ్రహ పీఠానికి గీసిన గరుడ శిల్పం, సమీపంలో దాసాంజనేయుడి ఫలక శిల్పం కనిపించడం వల్ల ఈ ఆలయ శిల్పాలను నిర్మించింది పద్మనాయక రాజన్యులు అని స్పష్టమవుతున్నది.
బృహత్శిలా సమాధులు వేగంగా ధ్వంసం అవుతున్న నేపథ్యంలో ఈ స్థలంలోని చారిత్రక అవశేషాలపై పురావస్తు నిపుణుల బృందంతో సమగ్ర సర్వే నిర్వహించి, శాస్త్రీయంగా డాక్యుమెంటేషన్ చేయడం అత్యవసరం.
ఈ ప్రాంతంలోని వాడపల్లి, మట్టపల్లి, తంగేడు వంటి సమీప స్థలాల్లో శాసనాలు లభించినట్లే, ఇక్కడ కూడా శాసనాలు లభించే అవకాశముంది. అవి ఈ స్థల చరిత్రపై శాస్త్రీయ వెలుగునిస్తాయి. ఆ పనిని వెంటనే చేయాలని పురావస్తు శాఖకు విజ్ఞప్తి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

