
భారత దేశ చరిత్రలో 1925వ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రెండు భిన్న భావాలకు చెందిన సంస్థలు లేదా పార్టీలు ఆ ఏడాదే పురుడు పోసుకున్నాయి. ఆ రెండూ ఈ ఏడాది(2025) నూరు వసంతాలు పూర్తి చేసుకుంటున్నాయి. వాటిలో ఒకటి ప్రస్తుతం విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తుంటే, మరొకటి షేర్ మార్కెట్ ఇండెక్స్లా పడుతూ లేస్తూ ఉంది. మొదటిది ఆర్ఎస్ఎస్గా పిలువబడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రెండవది సీపీఐగా పిలువబడే భారత కమ్యూనిస్టు పార్టీ(తదనంతర కాలంలో దాని నుంచి వేరుపడ్డ ఇతర వామపక్ష పార్టీలు).
1925 సెప్టెంబర్ 27న కేబీ హెగ్డేవార్ సారథ్యంలో హిందూత్వ ప్రాతిపదికగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటయింది. కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సాధన కోసం 1925 డిసెంబర్ 26న భారతదేశంలో రాజకీయ పార్టీ సీపీఐను స్థాపించారు.
స్వాతంత్య్రానికి పూర్వం- అనంతరం..
స్వాతంత్య్రానికి పూర్వం ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి పాదాక్రాంతమైంది. సంఘీయులు ఆరాధించే వీర దామోదర్ సావర్కార్‌ను స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషర్స్ అరెస్టు చేసి అండమాన్ జైలులో ఉంచారు. ఈ క్రమంలో బ్రిటిషర్స్ను బ్రతిమలాడుతూ లేఖ రాసి బయటకు వచ్చిన చరిత్ర సావర్కర్‌కు ఉంది. మరో పక్క వామపక్ష భావాలు జీర్ణించుకున్న భగత్ సింగ్ లాంటి యువకులు ధైర్యంగా ఉరికొయ్యను ముద్దాడిన సంగతి మనకందరకూ తెలిసిన చరిత్రే.
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటీషర్స్ స్వాతంత్య్రమయితే ఇచ్చారు. కానీ మత ప్రాతిపదికన దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విడగొట్టి పోయారు. ఆ రోజు వారు పెట్టిన చిచ్చు నేటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఈ చిచ్చులోంచి సిగరెట్ వెలిగించుకున్నట్టు ఆర్ఎస్ఎస్ దానిని బూచిగా చూపి దానంతటికీ కారణం మహాత్మ గాంధీ అని భావించి స్వాతంత్య్రం వచ్చిన ఐదు నెలలకే, 1948 జనవరి 30న ఆయనను హత్య చేసింది.
ఈ ఘటన ద్వారా ఆర్ఎస్ఎస్ దేశ ప్రజల్లో ఒక విలన్లా ముద్ర వేసుకుంది. దాంతో ఇప్పుడు సంఘీయులు భుజాలకు ఎత్తుకుని, గుజరాత్లో అత్యంత ఎత్తున విగ్రహం పెట్టిన అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు. తర్వాత తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని గోల్వాల్కర్ హామీ ఇవ్వడంతో 1959 జూలై 11న బ్యాన్‌ను ఎత్తివేశారు.
తొలి ముసుగు జనసంఘ్..
గాంధీ హత్యాపాతకాన్ని చెరిపి వేసుకుని, జాతి జనుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలంటే ఆర్ఎస్ఎస్కు ఒక కొత్త ముసుగు అవసరమైంది. ఎందుకంటే, అంతిమంగా దాని లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి. రాజ్యాధికారం సాధించి అఖండ భారత్ స్థాపనే దాని ధ్యేయం కాబట్టి. అందులో భాగంగానే 1951 అక్టోబర్ 21న ఆర్ఎస్ఎస్ తన మానస పుత్రికగా భారతీయ జనసంఘ్‌ను ఏర్పాటు చేసింది.
అయితే, స్వాతంత్య్ర సమరంలో గణనీయమైన పాత్ర పోషించిన కాంగ్రెస్ రాజ్యాధికారం చేజిక్కించుకుంది. జవహర్ లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధాని అయ్యారు. స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. అందుకే 1952లో జరిగిన మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించగా, కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టులు ఇతర సామ్యవాద, లౌకిక పార్టీలతో ఐక్య సంఘటన ఏర్పాటు చేసి గణనీయమైన సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. తెలుగు వారైన పుచ్చలపల్లి సుందరయ్య మొట్టమొదటి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు.
కమ్యూనిస్టులు బలంగా ఉండడం, ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ కూడా కొంతమేరకు వామపక్ష అనుకూల భావాలు కలిగి ఉండడం, రష్యాతో సన్నిహిత మైత్రి కలిగి ఉండడం. ఇవన్నీ కూడా జనసంఘ్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యాయి.
1967 ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొంత బలహీనపడడం, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడడం వంటి పరిణామాలు సంభవించాయి. ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి విధానాల ద్వారా పేద ప్రజలకు దగ్గరైంది. దానికి తోడు 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి దానిని ఓడించి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇప్పించడం ద్వారా ఉక్కు మహిళ అనిపించుకుంది.
అదే సమయంలో తన చుట్టూ చేరిన భజన పరుల కారణంగా అపఖ్యాతి పాలయింది. పులి మీద పుట్ర లాగా అలహాబాద్ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వడం, ఈ నేపథ్యంలోనే దేశంలో అల్లర్లను అణగదొక్కడానికి ఇందిర తప్పు మీద తప్పు చేసింది. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించింది.
ఎమర్జన్సీకి వ్యతిరేకంగా బిహార్‌కు చెందిన జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రారంభించి, కాంగ్రెస్‌కు వ్యతిరేక పార్టీలన్నింటిని కూడగట్టి జనతా పార్టీని ఏర్పాటు చేశారు. ఆ కలగూర గంపలో జనసంఘ్ కూడా చేరింది. ఆ రకంగా జనసంఘ్ తొలిసారి రాజ్యాధికారంలో భాగస్వామి అయింది.
ఈ ప్రయోగం మూడేళ్లకే విఫలమై 1980 జనవరిలో ఇందిరాగాంధీ మళ్లీ ప్రధాని అయింది. ఈ దశలో జనసంఘ్ తాననుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఆలస్యమైనా ఒంటరిగానే పోరాటం చేయాలని, అయితే మరో సరికొత్త ముసుగు అవసరమని భావించింది.
మలి ముసుగు బీజేపీ..
ఈ నేపథ్యంలోనే ఇందిర మళ్లీ ప్రధాని అయిన మూడు నెలల తర్వాత 1980 ఏప్రిల్ 6న బీజేపీగా పిలువబడే భారతీయ జనతా పార్టీ ఏర్పాటయింది. అనంతరం 1984లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దేశం మొత్తం మీద కేవలం రెండు సీట్లే గెలిచుకుంది.
అది కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పుణ్యమాని హన్మకొండ నుంచి ఒకరు చందుపట్ల జంగారెడ్డి గెలవగా, మరొకరు గుజరాత్ నుంచి గెలిచారు. ఆనాడు బీజేపీని అందరూ చాలా తక్కువగా అంచనా వేశారు. కాని దాని వ్యూహం దానికి ఉంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే దాని వ్యూహన్ని అమలు పరిచింది. 1992లో బాబ్రీ మసీదు కూలగొట్టడం ద్వారా ఒక్కసారిగా దేశంలో కల్లోలం సృష్టించింది. ఆ పని చేయగలిగిందంటే అంతకు ముందు దాదాపు ఐదేళ్ల పాటు బీజేపీ ముసుగులో ఆర్ఎస్ఎస్, దాని పిల్ల గ్రూపులు అయిన విశ్వ హిందూ పరిషత్, భజరంగదల్ చేసిన గ్రౌండ్ వర్కు ఘనత అది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరసేవకులను అది సమీకరించుకోగలిగింది. దేశ ప్రజల్లో హిందూత్వ విష బీజాలను నాటడంలో అది విజయవంతమైంది. మరో నాలుగేళ్లకు దేశ ప్రధాని పీఠంపై వాజ్‌పేయ్‌ను కూర్చోబెట్టగలిగింది. వాజ్‌పేయ్ ఎంపిక కూడా వ్యూహత్మకమే. కవిగా, ఉత్తమ విలువలున్న రాజకీయ నాయకుడిగా, మితవాదిగా ముద్ర ఉన్న వాజ్‌పేయ్‌ను ముందు పెట్టడం ద్వారా దేశ ప్రజల్లో కొంత సానుకూలత సాధించగలిగింది.
బీజేపీ 2.0..
2014 నాటికి వచ్చేసరికి గుజరాత్ మారణహోమ యజ్ఞ మూలకారకుడైన నరేంద్ర మోదీ, ఆయన సహచరుడు అమిత్ షాలను ప్రధాని, హోంమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా బీజేపీ 2.0 పాలన మొదలయింది. ఈ 11 ఏళ్లలో దాని దారుణ ఫలితాలను మనం చవిచూస్తూనే ఉన్నాం. బీజేపీ తన ప్రధాన శత్రువులయిన హేతువాదుల్ని, వామపక్ష తీవ్రవాదుల్ని భౌతికంగా మట్టుబెట్టడం చూశాం.
2026 మార్చి నాటి కల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామంటూ డెడ్‌లైన్ కూడా విధించి మరీ వరుస మారణకాండలు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉన్నాం.
కమ్యూనిస్టుల కింకర్తవ్యం..
భారత దేశంలో 1960వ దశకం సగం వరకు కూడా కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. 1964లో సీపీఐ నుంచి సీపీఎం చీలిపోవడం, 1967లో సీపీఎం నుంచి సీపీఐ(ఎంఎల్) చీలిపోవడం, ఆ తర్వాత నక్సలైట్ గ్రూపులు పుంఖానుపుంఖాలుగా చీలిపోవడంతో కమ్యూనిస్టులు కొంత బలహీన పడ్డారు. అయినప్పటికీ 1990 వరకు బలంగానే ఉన్నారని చెప్పాలి.
1990లో ప్రపంచ కమ్యూనిస్టుల కేంద్రమైన రష్యాలో కమ్యూనిజం అంతం కావడం, ఇండియాలో ప్రపంచీకరణ విధానాలు ప్రవేశపెట్టడంతో, దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతూ వచ్చింది. యువత సోషలిజం భావనలు వదిలి కెరీరిజం తుఫానులో కొట్టుకుపోవడం ప్రారంచారు.
ఈ పరిణామాల కారణంగా కమ్యూనిస్టులకు యువతరం నుంచి కొత్త క్యాడర్ రాకపోవడం, ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావడం, ప్రతి ఒక్కరూ సంపాదనల సుడిగుండంలో కొట్టుకుపోవడం, వ్యక్తుల్లో త్యాగ భావనలు అంతరించడం. ఇవన్నీ కమ్యూనిస్టుల బలం తగ్గడానికి దోహదాలయ్యాయి. అయినప్పటికీ ప్రజల్లో ఇప్పటికీ కమ్యూనిస్టులంటే సదభిప్రాయమే ఉంది. ప్రస్తుతం దేశంలో పెచ్చరిల్లుతున్న హిందూత్వ శక్తులను బలంగా ఎదుర్కోవాలంటే అది కమ్యూనిస్టుల వల్లే అవుతుందన్న నమ్మకముంది.
జేఎన్‌యూ విద్యార్థులే స్ఫూర్తి ప్రదాతలు..
మహాకవి శ్రీశ్రీ అన్నట్టు:
“కొంతమంది యువకులు ముందు యుగం దూతలు
పావన నవజీవన బృందావన నిర్ణేతలు
వారికి మా ఆహ్వానం
వారికి మా లాల్ సలామ్”
దేశమంతటా హిందూత్వ చీకట్లు ముసురుకుంటున్న వేళ మిణుకుమిణుకు మంటూ మిణుగురు పురుగుల్లా మెరుస్తున్న జేఎన్‌యూ విద్యార్థులే ఇప్పడు దేశంలో వామపక్ష శక్తులకు ఆశాదీపాలు.
అయిదు దశాబ్దాల కిందటే జేఎన్‌యూలో ఎస్ఎఫ్ఐ తరఫున స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా గెలిచి సీతారం ఏచూరి వేసిన వామపక్ష బీజాలు వృథా కాలేదు. అవి ఇప్పటికీ మొలకెత్తుతూనే ఉన్నాయి. ఆ ఎర్ర గులాబీలు పరిమళిస్తూనే ఉన్నాయి. ఇంత నిర్బంధ పరిస్థితులలో సైతం తమ గొంతు వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ యువతీ యువకుల స్ఫూర్తితో ఈ కల్లోల కాలంలో మనువాద శక్తులను అంతమొందించటానికి ఎర్రజెండా నీడలో చీలికలు, పేలికలై ఉన్న వామపక్ష శక్తులన్నీ ఏకత్రాటిపైకి వచ్చి సమరశంఖం పూరించాలి. దేశంలో హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న బహుజన, దళిత, లౌకిక శక్తులన్నింటిని కలుపుకొని లాల్ నీల్ నినాదంతో ముందుకు సాగాలి. అప్పడు మోదీషా పాలన అంతమొందించడం అసాధ్యమేమీకాదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.