ఉద్యోగులను గౌరవంగా చూడాలని; వేతనాలు, పింఛన్లు, భత్యాలపై మెమోరాండం త్వరలో ఇవ్వనున్నామని ప్రభుత్వాన్ని జేసీఎం జాతీయ మండలి కోరింది.
సమానత్వం, పారదర్శకత, నిష్పాక్షికత తత్వం పాటింపును నొక్కి చెబుతూ 8వ కేంద్ర వేతన సంఘం లేవనెత్తిన 18 ప్రశ్నలకు జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ(జేసీఎం) జాతీయ మండలి ముసాయిదా కమిటీ ప్రతిస్పందనలను సమర్పించింది.
లిఖితపూర్వక అభ్యర్థనలు, సుదీర్ఘ మెమోరాండాలను నివారించడానికి మొత్తం కార్యకలాపాలను డిజిటలైజ్ చేయాలని కమిషన్ నిర్ణయించింది.
సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించడానికి ఫెడరేషన్లు, యూనియన్లు, వ్యక్తుల నుంచి సమాధానాలను కోరుతూ తన అధికారిక పోర్టల్ ద్వారా 18 ప్రశ్నలను కమిషన్ లేవనెత్తింది. ఒక్కో సమాధానాన్ని 200 పదాలకు పరిమితం చేసింది, అంతకు మించి దాటితే సిస్టమ్ అంగీకరించదు.
జేసీఎం, ఏఐడీఈఎఫ్ ప్రతిస్పందనలు..
వారం రోజుల పాటు జరిగిన మేధోమథనం తర్వాత జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ జాతీయ మండలి (ఎన్సీ-జేసీఎం) ముసాయిదా కమిటీ అన్ని ప్రశ్నలకు తుది సమాధానాలను ఖరారు చేసి ఆన్లైన్ ద్వారా సమర్పించింది.
8వ సీపీపీ పోర్టల్ ద్వారా ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏఐడీఈఎఫ్) కూడా తన సమాధానాలను సమర్పించింది.
“పీపుల్ ఫస్ట్ అండ్ నేషన్ ఆల్వేస్”(ముందు ప్రజలు, ఎల్లప్పుడూ దేశం) అనే విస్తృత సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, ఉద్యోగుల దృక్పథం ద్వారా కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలకు సమాధానాలు ఇవ్వడం జరిగిందని జేసీఎం పేర్కొంది.
ఉద్యోగుల గౌరవం – డిమాండ్లు..
ప్రజా సేవ పట్ల వారి పాత్ర, అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సముచితంగా గౌరవించాలని, ప్రైవేటు రంగం లేదా గిగ్ కార్మికులతో సరిసమానంగా ప్రభుత్వ ఉద్యోగులను చూడరాదని ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
విధి నిర్వహణలో రక్షణ ఉద్యోగులు, రైల్వే కార్మికులు, పారా మిలిటరీ దళాలు, సాయుధ దళాల సిబ్బంది చేసే వెలకట్టలేని అత్యున్నతమైన త్యాగాలను కూడా జేసీఎం నొక్కి చెప్పింది.
కనీస వేతనాన్ని నిర్ణయించడం కోసం ఐదుగురు సభ్యుల కుటుంబం గల ఇంటిని ఒక యూనిట్‌గా తీసుకోవాలని తన సమాధానంలో ఫెడరేషన్ పునరుద్ఘాటించింది.
పెన్షనర్లకు పెన్షన్ల సవరణ, పాత పెన్షన్ పథకం(ఓపీఎస్) పునరుద్ధరణకై కూడా గట్టిగా వాదించింది.
ఆర్థిక భారం కాదన్న జేసీఎం..
శాస్త్రవేత్తలకు మెరుగైన వేతన నిర్మాణం అవసరాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టీకరణ, కార్పొరేటీకరణ, గడువుతో కూడుకున్న ఉపాధిని పూర్తిగా వ్యతిరేకించింది. ప్రభుత్వం బాధ్యత గల యజమానిగా, ఆదర్శంగా పని చేయాలని కోరింది.
పెన్షన్ల సర్దుబాటు, వేతన సవరణ వల్ల ఏర్పడే అదనపు ఖర్చు ప్రభుత్వంపై భారం పడదని, ప్రపంచంలోనే ఇప్పుడు భారత్ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందుతోందని జేసీఎం గుర్తు చేసింది.
సవాళ్లు- తదుపరి ప్రణాళికలు..
పదాల పరిమితి వల్ల ఈ మొత్తం కసరత్తు సవాల్‌గా మారిందని ‘ఇండియన్ పీఎస్‌యూ.కామ్’తో మాట్లాడుతూ ఎన్సీ-జేసీఎం సభ్యులు సీ శ్రీకుమార్ చెప్పారు.
“ప్రశ్నలు కొంత వరకు క్లిష్టమైనవి, 200 పదాలకు కుదించి సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. సమాధానాలు సమగ్రంగా, పటిష్టంగా ఉండే విధంగా గట్టి కృషి చేయాల్సివచ్చింది. ముసాయిదా కమిటీ ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది” అని ఆయన అన్నారు.
పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, క్రీడాకారులు, మహిళా ఉద్యోగుల సమస్యలు, గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రమోషన్ విధానం, ఇంక్రిమెంట్ రేటు, ఫిట్మెంట్ ఫార్ములా, బోనస్, సంక్షేమ చర్యలు, పెన్షన్లు, సౌకర్యాలు, భత్యాలు, వేతనాలు వంటి అంశాలను జోడించి పూర్తి వివరాలతో కూడిన మెమోరాండంను తయారు చేయడం తదుపరి సవాలు అని శ్రీకుమార్ తెలియజేశారు.
“ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయం చేయడానికి, వారి గొంతుకను వినిపించడానికి మా జట్టు బలంగా, సమర్థవంతంగా ఉందని” ఆయన ముగించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
