కోర్టులల్లో పరిష్కారానికి నోచుకోకుండా చాలా కేసులు పెండింగ్‌లో ఉండడంపట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కోర్టులను కలుపుకొని మొత్తం 5.34 కోట్ల కేసులు పరిష్కరించబడకుండా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు కొత్తగా నమోదైనవి కావు, ఏళ్ల తరబడిగా కోర్టులలో పేరుకుపోయాయి.
కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిస్థితిపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం దేశవ్యాప్త అన్ని హైకోర్టులకు ఈ ఏడాది మార్చి 6న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్‌ను జారీ చేసింది. “తమ పరిధిలో ఉన్న సివిల్ కోర్టులలోని పెండింగ్ కేసులను ఆరు నెలల్లోగా పరిష్కరించాలని” ఆదేశించింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తలు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ పంకజ్ మిథాల్‌ల ధర్మాసనం మార్చి 6న జారీచేసిన ఉత్తర్వుల అమలును ఇటీవల సమీక్షించింది. తాము జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత, గడిచిన ఆరు నెలలలో 3,38,685 కేసులు పరిష్కరించబడలేదని ధర్మాసన సభ్యులు గుర్తించారు. అంతేకాకుండా ఇంకా 8,82,578 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టుగా తేల్చారు.
వీటితో పాటు గత నెలాఖరు వరకు సుప్రీం కోర్టులో 88,417 కేసులు పెండింగ్‌లో ఉండగా, అన్ని హైకోర్టులలో 63.8 లక్షలు, కిందిస్థాయి కోర్టుల్లో 4.7 కోట్లు కలిపి ప్రస్తుతం మొత్తం 5.34 కోట్ల కేసులు పెడింగ్‌లో ఉన్నట్టుగా తాజా సమాచారం తెలియజేస్తోంది.
ఇందులో అనేక కేసులు అసలు ఇంతవరకు ధర్మాసనం ముందుకు రాలేదు, విచారణకు నోచుకోలేదు. వీటిలో కొన్ని కేసులు దశాబ్ధాల తరబడిగా పెండింగ్‌లో ఉన్నాయి. బెర్హంపూర్ బ్యాంకు కేసు 1952 నుంచి కోల్‌కతా హైకోర్టులో అలానే మూలుగుతోంది.
ఇక తెలంగాణలో పరిస్థితి చూస్తే: పార్టమెంటుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సమర్పంచిన డేటా ప్రకారం- 2025 ఏప్రిల్ 7వరకు తెలంగాణ హైకోర్టు, జిల్లా, క్రిందిస్థాయి కోర్టులను కలుపుకొని మొత్తం 11.82 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఏళ్ల తరబడిగా పెండంగ్‌లో ఉండటానికి కారణమేంటి?
143 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రజల మధ్య తరచూ ఏదో ఒక వివాదం చోటుచేసుకోవడం సహజం, దీనికి అనేక కారణాలుంటాయి. ఈ వివాదాలను తొందరగా పరిష్కరించడానికి కావల్సిన కోర్టులు భారతదేశంలో ఉన్నాయా? అవసరానికి తగ్గట్టుగా జడ్జిలున్నారాన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మానవ వనరుల సంక్షోభంతో దేశ న్యాయస్థానాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
“నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్(ఎన్‌జేడీజీ), డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్”ప్రకారం- సెప్టంబరు 1నాటికి సుప్రీంకోర్టుతో పాటు సిక్కిం, మేఘాలయ హైకోర్టులు మాత్రమే పూర్తి స్థాయి బెంచ్‌లతో పని చేస్తున్నాయి. ప్రస్తుతం 25 రాష్ట్రాలలో 330 జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో అలహాబాద్ హైకోర్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ కోర్టులో 160 పోస్టులు మంజూరు కాగా 76 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి.
మరోపక్క దేశవ్యాప్త అన్ని హైకోర్టులకు 1,122 జడ్జిల పోస్టులు మంజూరు కాగా, అందులోంచి 792 పోస్టులను భర్తీ అయ్యాయి. మిగితా 330 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో 161 శాశ్వత పోస్టులు, మిగితావి 169 అదనపు జడ్జిల పోస్టులున్నాయి.
రాష్ట్రాల వారిగా మంజూరైన పోస్టులకు భిన్నంగా అతి తక్కువ జడ్జీలతో పని చేస్తున్న హైకోర్టులు; ఆంధ్రప్రదేశ్-7, ముంబాయి-26, ఛతీస్ఘడ్-7, ఢీల్లీ-16, గౌహతీ-5, గుజరాత్-13, హిమాచల్‌ప్రదేశ్-6, జమ్మూకశ్మీర్ లద్దాఖ్-10, జార్ఖండ్-10, కర్నాటక-16, కేరళ-4, మధ్యప్రదేశ్10, మద్రాస్-19, ఒరిస్సా-13, పాట్నా-18, పంజాబ్ హర్యానా-25, రాజస్థాన్-7, తెలంగాణ-13, మణిపూర్-2, ఉత్తరాఖండ్-2, త్రిపురా-1 జడ్జి మాత్రమే ఉన్నారు.
దేశంలో న్యాయస్థానాల, పెండింగ్ కేసుల పరిస్థితి ఇది. న్యాయమూర్తుల- కోర్టు సిబ్బంది లేమితో పని చేస్తున్న న్యాయ స్థానాల నుంచి సత్వర న్యాయాన్ని ఆశించడం కూడా పెద్దనేరంగా భావించే రోజులు రానున్నాయా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
