జమ్మూ కాశ్మీర్‌లోని ఒక హైవేపై నమాజ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్‌కు సంబంధించిన ధృవీకరించని వీడియోను ప్రసారం చేసినందుకు జీ న్యూస్‌కు లక్ష రూపాయల జరిమానా విధించబడింది. దీనిని తీవ్రమైన లోపంగా పేర్కొంటూ ‘న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ'(ఎన్బీడీఎస్ఏ), సోషల్ మీడియా కంటెంట్ వినియోగం కోసం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఒక వ్యక్తి ప్రార్థనలు చేయడానికి తన ట్రక్కును హైవే మధ్యలో ఆపి ట్రాఫిక్ జామ్ చేసి తీవ్ర అంతరాయం కలిగించాడని దాదాపు ఏడాది క్రితం జీ న్యూస్ ఆరోపించింది.
అయితే, ఆ డ్రైవర్ ఇతర వాహనాలతో పాటు ఆ జామ్‌లో చిక్కుకున్నారని తరువాత స్పష్టమైంది. ఇప్పుడు, “సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ధృవీకరించని అంశాలను వాడినందుకు” ఆ ఛానెల్‌కు రూ లక్ష జరిమానా విధించబడింది.
ఫిబ్రవరి 17న జారీ చేసిన ఒక ఉత్తర్వులో- అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో జీ న్యూస్ విఫలమైందని, ఇది “స్పష్టమైన- తీవ్రమైన లోపం”అని ఎన్బీడీఎస్ఏ పేర్కొంది. సోషల్ మీడియా వార్తలను ప్రసారం చేయడానికి ఎన్బీడీఎస్ఏ ఆరు కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
“వీడియో ప్రామాణికతను ధృవీకరించలేము”అని చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సరిపోదని అది స్పష్టంగా పేర్కొంది.
ఉత్తర్వుల జారీ..
ఎన్బీడీఎస్ఏ అనేది న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్, డిజిటల్ అసోసియేషన్ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న ప్రవర్తనా నియమావళి.
ప్రసార ప్రమాణాలను అమలు చేసే ఈ స్వీయ-నియంత్రణ సంస్థలో, అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం 125 వార్తా, కరెంట్ అఫైర్స్ ఛానెల్‌లు సభ్యులుగా ఉన్నాయి.
2025 మార్చి 3న ప్రసారమైన జీ న్యూస్ కార్యక్రమానికి వ్యతిరేకంగా దాఖలైన మూడు ఫిర్యాదులను విచారించిన తర్వాత ఎన్బీడీఎస్ఏ చైర్పర్సన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
జమియత్ ఉలేమా-ఏ-హింద్ తరపున న్యాయవాది ఇంద్రజిత్ ఘోర్పాడే, ఉత్కర్ష్ మిశ్రా, సయ్యద్ కబ్ రషీది ఈ ఫిర్యాదులను దాఖలు చేశారు.
జీ న్యూస్ ఆరోపణలు..
ఆ కార్యక్రమంలో ఒక ట్రక్కు డ్రైవర్ తన వాహనం పైకప్పుపై నమాజ్ చేస్తున్న వీడియోను ప్రసారం చేశారు.
తను ట్రక్కును రోడ్డు మధ్యలో నిలిపి ఉంచారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ఆ సమయంలో తను “బాధ్యతారాహిత్యంగా” ఉన్నారని ఛానల్ ఆరోపించింది.
“హైవేకి అవతలి వైపు రోడ్డు పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది, ఎందుకంటే ఈ డ్రైవర్లా అక్కడ ఎవరూ ప్రార్థన చేయడం లేదు” అని యాంకర్ వ్యాఖ్యానించారు.
ప్రార్థన సమయం వచ్చినప్పుడు, డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేయడానికి బదులుగా రోడ్డు మధ్యలోనే ఆపారని కూడా ఆరోపించారు.
‘ఈ వైరల్ వీడియోను జీ న్యూస్ ధృవీకరించలేదు, కానీ సోషల్ మీడియాలో చూసిన వారెవరైనా ఖచ్చితంగా డ్రైవర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తారు’అని యాంకర్ పేర్కొన్నారు.
ధృవీకరణ తర్వాత స్పష్టత..
అయితే, కొన్ని రోజుల తరువాత, ‘ఆల్ట్ న్యూస్’ ఒక స్పష్టమైన వీడియోను ఉదహరించింది. అందులో డ్రైవర్ స్వయంగా ట్రాఫిక్ క్యూలో చిక్కుకున్నట్టు కనిపించింది.
ఆ సమయంలో జారీ చేయబడిన ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం, జమ్మూలోని రాంబన్ ప్రాంతంలో సింగిల్ లేన్ ట్రాఫిక్, కొండచరియలు విరిగి పడటం వల్ల అడ్డంకి ఏర్పడిందని నివేదించబడింది.
ధృవీకరించని వీడియోను ప్రసారం చేయడం ద్వారా, ముస్లిం ట్రక్ డ్రైవర్‌పై తప్పుడు నిందలు వేయడం ద్వారా జీ న్యూస్ ప్రవర్తనా నియమావళిని; ప్రసార ప్రమాణాలను ఉల్లంఘించిందని ఫిర్యాదుదారుడు ఘోర్పడే ఆరోపించారు.
ఫిర్యాదులకు ప్రతిస్పందనగా లిఖితపూర్వక వివరణలో, నవంబర్‌లో జరిగిన విచారణలో జీ న్యూస్ ఆ వీడియోను తాము ధృవీకరించలేదని అంగీకరిస్తూనే- ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వాదించింది.
కానీ తన ఉత్తర్వులో, సోషల్ మీడియాలోని ధృవీకరించని విషయాలను వాడడం ప్రసారకర్త స్పష్టమైన, తీవ్రమైన నిర్లక్ష్యం అని; ఇది ఖచ్చితత్వ సూత్రానికి విరుద్ధమని జస్టిస్ సిక్రీ స్పష్టం చేశారు.
“ఉల్లంఘన స్వభావం దృష్ట్యా ఎన్బీడీఎస్ఏ భారీ జరిమానా విధించి ఉండవచ్చు. అయితే, ప్రసారకర్త ఆ వివాదాస్పద వీడియోను అప్పటికే తొలగించారు. దీంతో రూ 1,00,000 జరిమానా విధించాలని నిర్ణయించాం” అని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఆరు మార్గదర్శకాలు జారీ..
ఈ రోజుల్లో ప్రసారకులు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లు రిపోర్టింగ్‌లో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని జస్టిస్ సిక్రీ గుర్తించారు.
అయితే ఇది తప్పుడు సమాచారం, కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా సృష్టించబడిన కంటెంట్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సభ్యుల కోసం ఆరు మార్గదర్శకాలను జారీ చేశారు.
సోషల్ మీడియా నుంచి పొందిన ఏదైనా సమాచారం, చిత్రం లేదా వీడియోను ప్రసారం చేయడానికి ముందు దాని ఖచ్చితత్వాన్ని ధృవీకరించడం తప్పనిసరి.
సాధ్యమైన చోట, అటువంటి కంటెంట్‌ను గ్రౌండ్ రిపోర్టింగ్ ద్వారా లేదా పోలీసు, ప్రభుత్వ అధికారులవంటి విశ్వసనీయ వనరులతో ధృవీకరించాలి.
వీడియోలలో ఎటువంటి ట్యాంపరింగ్, మానిప్యులేషన్ లేదా ఏఐ-జనరేటెడ్ కంటెంట్ లేదని నిర్ధారించుకోవడానికి ఫ్యాక్ట్-చెక్ చేయాలి.
సందర్భానికి భిన్నంగా ఏ విషయాన్ని ప్రస్తావించకూడదు. నిజమైన విషయాన్ని కూడా తప్పుడు సందర్భంలో చూపిస్తే అది తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది.
సైనిక కార్యకలాపాలు, మత హింస, ప్రజా అశాంతివంటి సున్నితమైన పరిస్థితులలో సోషల్ మీడియా కంటెంట్‌ను వాడేటప్పుడు ‘ప్రజా ప్రయోజనం’; ‘ఖచ్చితత్వం’ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని, దాని ప్రామాణికతను నిర్ధారించలేమని చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సాకు కాకూడదు.
ఈ విధంగా, సోషల్ మీడియా కంటెంట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వార్తా సంస్థలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఎన్బీడీఎస్ఏ స్పష్టం చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
