27వ రాజ్యాంగ సవరణ పాకిస్తాన్ అణు అధికారం మొత్తాన్ని ‘అసిమ్ మునీర్’అనే వ్యక్తి చేతుల్లో పూర్తిగా కేంద్రీకరిస్తుంది. పాకిస్తాన్ సైన్యానికి, దాంతోపాటు పాకిస్తాన్ రక్షణ దళాల మొత్తానికి, అధిపతిగా కొత్తగా నియమించబడిన అసిమ్ మునీర్ ఇప్పుడు నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్(NSC)కి నాయకత్వం వహిస్తాడు. ఇది నానాటికి పెరుగుతూ ఇప్పటికి 170కి చేరుకున్న పాకిస్తాన్ సామూహిక విధ్వంసక అణ్వాయుధాల(wmd)వ్యూహాత్మక నిల్వల పర్యవేక్షణ బాధ్యతను ఇతనికి కట్టబెడుతుంది.
తన 27వ రాజ్యాంగ సవరణతో- పాకిస్తాన్ తన అణ్వాయుధ సామగ్రిపై ప్రత్యేక నియంత్రణను, తనకంటూ ఒక ప్రత్యేక వ్యవహార శైలి ఉన్న ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు అప్పగించింది. ఎన్నిక కాని ఒక నాయకుడి చేతిలో అధికారం మొత్తాన్ని కేంద్రీకరించడం ఉత్తర కొరియాను గుర్తుకు తెస్తుంది. ఇక్కడ వ్యూహాత్మక ఆయుధాలను ఏమాత్రం జవాబుదారీతనం లేని ఒక సుప్రీంనాయకుడు ఆదేశిస్తాడు.
ఈ నిర్మాణాత్మక సారూప్యతకు మించి, లోతైన చారిత్రక సారూప్యత కూడా ఇక్కడ కనిపిస్తున్నది. ఇస్లామాబాద్, ప్యోంగ్యాంగ్ రెండూ కూడా చైనా నిరంతర సాంకేతిక, ఆర్థిక- దౌత్య మద్దతుతో తమ అణు కార్యక్రమాలను అభివృద్ధి చేసుకున్నాయి. బీజింగ్ దీర్ఘకాలిక మద్దతు సంబంధిత అణు నిల్వలను పెంచుకోవడానికి మాత్రమే కాకుండా వారి అణ్వాయుధాలను, వాటిని ఉపయోగించే వ్యవస్థలను సంసిద్ధం చేయడానికి కూడా సహాయపడింది. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో భారతదేశాన్ని అది లక్ష్యంగా చేసుకుందనే సంగతి అందరికీ తెలిసిందే.
1990లలో పాకిస్తాన్- ఉత్తర కొరియా, ఏక్యూ ఖాన్ ప్రొలిఫరేషన్ నెట్వర్క్ ద్వారా ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకున్నాయి. వీటి కారణంగా పాకిస్తాన్ సైనిక సహాయంతో నోడాంగ్ తరహా బాలిస్టిక్ క్షిపణులకు బదులుగా కీలకమైన అణు సాంకేతికత, సెంట్రిఫ్యూజ్ డిజైన్లు- సాంకేతిక పరిజ్ఞానం ప్యోంగ్యాంగ్కు రహస్యంగా బదిలీ చేయబడ్డాయి.
ఈ అక్రమ మార్పిడికి చైనా కూడా అంతర్లీనంగా మద్దతిచ్చి, ఈ బదిలీలు అంతర్జాతీయ పర్యవేక్షణ దాదాపు లేకుండా కొనసాగడానికి వీలు కల్పించింది. ఇది ఈ రెండు దేశాల అణు కార్యక్రమాలను వేగవంతం చేసింది. అణు విచ్ఛిత్తి పదార్థాన్ని మరింత వేగంగా ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఉత్తర కొరియా, తన వ్యూహాత్మక క్షిపణులను ఉపయోగించే సామర్థ్యాన్ని పాకిస్తాన్ పొందాయి.
ఆందోళనకు కేంద్రం
ప్రారంభంలో, పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ నిర్మాణంలో సైనిక, రాజకీయ- పౌర వర్గాలకు చెందిన వారు పాత్రవహించి సంస్థాగత విస్తరణతో పాటు పర్యవేక్షణను అందించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ నిర్మాణం క్రమంగా మారుతూ వచ్చింది. జాతీయ అసెంబ్లీ, సెనేట్ల చేత దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించబడి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం కూడా పొందిన; ఈ 27వ రాజ్యాంగ సవరణ దేశ వ్యూహాత్మక ఆస్తులపై పూర్తి అధికారాన్ని 57 ఏళ్ల అసిమ్ మునీర్‌కు అప్పగించింది. అణ్వాయుధాలపై నిర్ణయాధికారం అతడి ఒక్కని చేతిలో కేంద్రీకరించడం ఉత్తర కొరియా నమూనాను తలపిస్తున్నది. ఇప్పటికే అస్థిరతకి నెలవుగా ఉన్న ప్రాంతంలో అటువంటి శక్తిని ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకరించడంపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
1998 మేలో భారతదేశ భూగర్భ అణు పరీక్షలకు ముందు నుంచి కూడా- పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమానికి ఎల్లప్పుడూ భారతదేశమే కేంద్రంగా ఉంది. ఆ తర్వాత, అణ్వస్త్రాలను మొదటిగానైనా ప్రయోగించే దాని విధానం, సాంప్రదాయిక యుద్ధంలో భారతదేశం ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో రూపొందించబడిన విస్తృత శ్రేణి నిరోధక వ్యవస్థగా పరిణామం చెందింది. 60-70 కిమీ పరిధిలో లక్ష్యాలను చేధించగల నాస్ర్/హాట్ఫ్-IX వంటి వ్యూహాత్మక యుద్ధభూమి వ్యవస్థలను కలుపుకొని, సైనిక సైనికేతర లక్ష్యాలపై ఎదురుదాడికి ఉద్దేశింపబడ్డ భారతదేశంలోని స్థలాలనన్నిటినీ లక్ష్యంగా చేసుకోగల దీర్ఘ-శ్రేణి క్షిపణులు ఇందులో ఉన్నాయి.
రెండు క్షిపణి వ్యవస్థలూ పాకిస్తాన్ మనుగడనూ దాని సైన్యం ప్రాధాన్యతనూ కాపాడటానికే రూపొందించబడ్డాయి. అదే సమయంలో ఇవి భారతదేశంతో పరిమిత ఘర్షణలు కూడా అణు యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. అయితే ఈ విధంగా యుద్ధ నియంత్రణను, కార్యాచరణలో అధిక ప్రయోజనాన్ని సాధించగలనని ఇస్లామాబాద్ తలపోస్తున్నది.
దీనికి విరుద్ధంగా, అణ్వాయుధాలను మొదటగా ఉపయోగించరాదనే భారతదేశ అణ్వాయుధ విధానం పౌర నియంత్రణలో స్థిరంగా కొనసాగుతున్నది. అంతిమ అధికారం మాత్రం ప్రధానమంత్రి, న్యూక్లియర్ కమాండ్ అథారిటీల నియంత్రణలో ఉంటుంది. యుద్ధస్థితి గతులను, దాని తీవ్రతను ప్రభావితం చేయడంలో వ్యక్తిగత విచక్షణ పాత్రను నివారించడానికే ఈ ప్రత్యేకమైన వ్యవస్థ రూపొందించబడింది. పాకిస్తాన్ అత్యంత కేంద్రీకృత నమూనాకు పూర్తి విరుద్ధంగా రూపొందించబడ్డ ఈ వ్యవస్థ విశ్వసనీయమైన కనీస నిరోధం, సురక్షితమైన రెండవ-దాడి సామర్థ్యంపై భారతదేశం ఆధారపడటానికి అనుగుణంగానే ఉంది.
ఇక ఈ 27వ రాజ్యాంగ సవరణ పాకిస్తాన్ అణు అధికారం మొత్తాన్ని అసిమ్ మునీర్ చేతుల్లో పూర్తిగా కేంద్రీకరిస్తుంది. పాకిస్తాన్ సైన్యానికి, దాంతోపాటు పాకిస్తాన్ రక్షణ దళాల మొత్తానికి, అధిపతిగా కొత్తగా నియమించబడిన అసిమ్ మునీర్ నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్(NSC)కి నాయకత్వం వహిస్తాడు. ఇది నానాటికి పెరుగుతూ ఇప్పటికి 170కి చేరుకున్న పాకిస్తాన్ సామూహిక విధ్వంసక అణ్వాయుధాల(wmd)వ్యూహాత్మక నిల్వల పర్యవేక్షణ బాధ్యతను ఇతనికి కట్టబెడుతుంది.
కనుమరుగైన అడ్డుగోడ
పాకిస్తాన్ సామూహిక విధ్వంసక ఆయుధాల(WMD)కార్యక్రమం తొమ్మిది, ప్రకటిత- అప్రకటిత, అణ్వాయుధ దేశాలలో ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనిపై నానాటికి ఎక్కువగా ఇస్లామీకరణ చేయబడుతున్న సైన్యం ఆధిపత్యం చెలాయిస్తున్నది.
ఈ సవరణ అణు నిర్ణయాత్మక గొలుసులోని అన్ని సంస్థాగత మధ్యవర్తులను తొలగించి, ఒకే నాయకుడిలో కార్యాచరణ- వ్యూహాత్మక అధికారాలను ఏకీకృతం చేయడం ద్వారా, పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తుంది. ఉత్తర కొరియాలో వలె ఇకపై ఏకాభిప్రాయం అవసరం లేదు. సామూహిక విధ్వంసక ఆయుధాల(WMDల) వినియోగం ఇప్పుడు పూర్తిగా మునీర్ వ్యక్తిగత విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
గతంలో ఇస్లామాబాద్ అణ్వాయుధ పర్యవేక్షణను 2000 ఫిబ్రవరిలో స్థాపించబడిన న్యూక్లియర్ కమాండ్ అథారిటీ(NCA) పర్యవేక్షించేది. దీనిలో ప్రధానమంత్రికి నిర్ణయాత్మక ఓటు ఉండేది. ఇంకా ఆర్మీ, వైమానిక దళం, నేవీ చీఫ్‌లు- జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(CJCSC) ఛైర్మన్లకు కూడా భాగస్వామ్యం ఉండేది. మూడు సర్వీసుల నుంచి వంతులవారీ ప్రాతిపదికన నియమించబడిన సీనియర్ ఫోర్-స్టార్ అధికారి CJCSC, అణ్వాయుధ నిల్వలపై సైనిక దళాలకున్న అధికారాన్ని నామమాత్రంగానైనా నియంత్రించేందుకు ఉపయోగపడేవాడు. కానీ సైనిక శక్తి కేంద్రీకరణను నిరోధించడానికి 1976లో సృష్టించబడిన CJCSC పదవి ఈ రాజ్యాంగ సవరణతో పూర్తిగా రద్దు చేయబడింది. దీంతో మునీర్ అధికారానికి ఉన్న ఈ అడ్డుగోడ కూడా కనుమరుగైంది.
పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రిని నిర్వహించడానికి- దాని భద్రత, కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడానికి; పరిపాలనా పర్యవేక్షణను అందించడానికి; 2000 ప్రారంభంలో NCA తర్వాత కొద్దికాలానికే, వ్యూహాత్మక ప్రణాళికల విభాగం(Strategic Plans Division – SPD) స్థాపించబడింది. ఈ SPD నుంచి సాంకేతిక, ఇతర నిపుణులతో పాటు కొంతమంది పౌర ప్రముఖులు కూడా పైన పేర్కొన్న ఎన్సీఏలో చేర్చబడ్డారు.
సంస్థాగత నిర్మాణాన్ని తోసిపుచ్చిన 27వ సవరణ
కార్యనిర్వాహక, సాంకేతిక విభాగంగా NCA పనిచేస్తూ- SPD అణ్వాయుధాలను, వాటి మౌలిక సదుపాయాలను కాపాడింది. అదే సమయంలో ఏకపక్ష చర్యను నిరోధించడానికి సైనిక, పౌర నాయకత్వాల మధ్య సమన్వయానికి దోహదపడింది. సైన్యం ఆధిపత్యాన్ని పూర్తిగా నివారించలేనప్పటికీ, ఈ రెండు అంచెల NCA-SPD వ్యవస్థ సామూహిక విధ్వంసక ఆయుధాల(WMD) వినియోగాన్ని అనుమతించే ముందు పరస్పర చర్చలను తప్పనిసరి చేసింది. అణ్వాయుధాలను ఉపయోగించడం ద్వారా ఉపఖండంలో యుద్ధ ప్రళయం చోటు చేసుకోకుండా కనీసం నామమాత్రపు రక్షణను అందించింది.
27వ సవరణ ఈ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిగా తోసిపుచ్చి NCA స్థానంలోకి సర్వసత్తాక NSC వచ్చేలా చేస్తుంది. SPD పూర్తిగా మునీర్ అధీనంలోకి వస్తుంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు, మునీర్ అభీష్టానుసారం మాత్రమే, సైన్యం నుంచి NSC నిర్వహణ కోసం పరిపాలనా అధిపతిని నియమించక తప్పని పరిస్థితి కల్పిస్తుంది.
అయితే ఈ 27వ సవరణ, అణ్వాయుధాల అనధికార వినియోగం- ప్రమాదవశాత్తు వాటి పేలుళ్ళు జరగడంలాంటివి నిరోధించడానికి రూపొందించబడిన భద్రతా చర్యలను – ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చర్యలు తీసుకునే నియమం లేదా పర్మిసివ్ యాక్షన్ లింక్స్(PALలు)- ప్రభావితం చేసిందా అనే దాని గురించి దాదాపు బహిరంగంగా ఏమీ తెలియదు. మొదటిది లాంచ్ కోడ్లను సంయుక్తంగా ప్రారంభించడానికి ఒకరి కన్నా ఎక్కువ అనుమతించబడిన సిబ్బంది అవసారాన్ని సూచిస్తుంది. రెండవది PALలు- అంటే ప్రతి వ్యూహాత్మక వార్‌హెడ్‌లో పొందుపరచబడ్డ ఇంటిగ్రేటెడ్ కోడ్-లాక్ వ్యవస్థలు. ఇవి చెల్లుబాటయ్యే నిర్ధారణలు లేకుండా ఆయుధాలు ప్రయోగించబడకుండా చూడటానికి తీసుకున్న జాగ్రత్తలు.
సైన్యానికి పురికొల్పు
అదే సమయంలో, అణ్వాయుధాలపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని ఒకే సైనిక నాయకుడి చేతిలో కేంద్రీకరించడం వల్ల ఉద్రిక్త జనిత, ఆలోచనారహిత, వేగవంతమైన నిర్ణయాల; వ్యక్తిగత వ్యూహాత్మక ఎంపికల ప్రమాదాలు తీవ్రంగా పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాల అపనమ్మకం, శత్రుత్వం, పరిష్కరించబడని సరిహద్దుల కారణంగా భారతదేశం- పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన భావోద్వేగ సంఘర్షణా నేపథ్యంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువ.
అనేక చారిత్రక సంక్షోభాలు- 1947 నుంచి కశ్మీర్ విషయంలో, 1971 యుద్ధంలో తూర్పు పాకిస్తాన్‌ను కోల్పోవడం, కార్గిల్ నుంచి ఇటీవల ఆపరేషన్ సింధూర్ వరకు, కొన్నింటిని పేర్కొంటే- ఎదురైన ప్రతిసారీ భారతదేశం నిర్ణయాత్మకంగా విజయం సాధించడం, పాకిస్తాన్ అభద్రతా భావాన్ని బలోపేతం చేసింది. ఇది పాకిస్తాన్ స్ట్రాటజిక్ కమాండ్ అథారిటీ పై తిరుగులేని పట్టు సాధించి నిస్సంకోచంగా అణు ఖడ్గారావం చేసేలా దాని సైన్యాన్ని పురికొల్పింది.
ఫీల్డ్ మార్షల్ మునీర్ చేతుల్లో అపరిమితమైన అధికారం కేంద్రీకృతమై ఉన్న ఈ నేపథ్యంలో, లభించే సమాచారం బట్టి అతని మానసిక, భావోద్వేగ- వ్యూహాత్మక సరళిని అంచనా వేయడం చాలా అవసరం. ఎందుకంటే అతని వ్యక్తిగత నమ్మకాలే భారతదేశం- పాకిస్తాన్ల భద్రతా అంశాలను; వాటి గురించి తీసుకునే నిర్ణయాలను విశేషంగా ప్రభావితం చేస్తాయి గనుక.
మునీర్ సంప్రదాయవాద నేపథ్యం నుంచి వచ్చిన అత్యంత మతపరమైన, క్రమశిక్షణ కలిగిన, మత నమ్మకాల ప్రేరేపిత సైనికుడిగా అనేకమంది చేత భావించబడుతున్నాడు. దేశ విభజన తర్వాత పాఠశాల ఉపాధ్యాయుడు, ఇమామ్ ఐన అతని తండ్రి జలంధర్ నుంచి రావల్పిండికి వలస వచ్చిన తర్వాత, 1968లో రావల్పిండిలో జన్మించిన మునీర్ స్థానికంగా మర్కజీ మదర్సా దార్ ఉల్ తాజ్‌వీద్ మదర్సాలో చదువుకున్నాడు.
అతను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ప్రతిష్టాత్మకమైన పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ నుంచి కాకుండా, 1986లో మంగ్లాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్(ఓటీఎస్) ద్వారా పాకిస్తాన్ సైన్యంలో చేరాడు. పర్యవసానంగా, సంస్థాగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతనిచ్చే సైన్యంలో, హోదాపరంగా ప్రతిష్టాపరంగా తను వెనుకబడి ఉన్నట్టు భావించుకున్న అతను ఈ లోపాన్ని అధిగమించాలని దృఢంగా నిశ్చయించుకున్నట్లు కనిపించింది.
అతను OTS స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌ను గెలుచుకుని ప్రతిష్టాత్మక ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో నియమించబడ్డాడు. అనేక ఫీల్డ్- స్టాఫ్ నియామకాల తర్వాత ర్యాంక్‌లో ఎదిగాడు. అతను ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ& స్ట్రాటజిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లో ఎంఫిల్ సంపాదించాడు. ఇంకా జపాన్, క్వెట్టా, మలేషియాలలో ప్రొఫెషనల్ మిలిటరీ కోర్సులను పూర్తి చేశాడు. యువ అధికారిగా సౌదీ అరేబియాకు నియమించబడ్డ సమయంలో, అతను ఖురాన్‌ను కంఠస్థం చేశాడు. హఫీజ్-ఎ-ఖురాన్ లేదా ఖురాన్ సంరక్షకుడు అనే బిరుదును సంపాదించాడు. ఇంకా ప్రసంగాలు, ప్రజా సందేశాలలో ఇస్లామిక్ గ్రంథంపై తన లోతైన సైద్ధాంతిక జ్ఞానాన్ని, పాండిత్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చే ఏ అవకాశాన్ని కోల్పోడు.
తోటివారు మునీర్‌ను ఆచరణాత్మకమైన వ్యక్తిగా, కానీ ముఖ్యంగా భారతదేశం పట్ల ‘కఠినమైన వైఖరి’ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తారు. అతను తరచుగా రెండు జాతుల సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తాడు. ముస్లింలకు, హిందువుల నుంచి భిన్నంగా ఉండటం వలన, వారి ఇస్లామిక్ గుర్తింపును కాపాడుకోవడానికి పాకిస్తాన్ వంటి ప్రత్యేక దేశం అవసరమని ఇది నొక్కి చెబుతుంది.
ఇటీవలి నెలల్లో, మునీర్ ఈ వైఖరిని అణు సంకేతాలతో బలోపేతం చేశాడు. వ్యూహాత్మక ఆయుధాలు వాడే అవకాశం గురించి స్పష్టమైన హెచ్చరికలు కూడా చేశాడు. ఆగస్టులో అమెరికాలోని టంపాలో పాకిస్తాన్ వ్యాపారవేత్త మునీర్ నిర్వహించిన బ్లాక్-టై విందులో; పాకిస్తాన్ అణ్వాయుధ దేశమని, అది నాశనమవుతున్నట్టు భావిస్తే, సగం ప్రపంచాన్ని- భారతదేశాన్ని ఉద్దేశించి- ఈ సర్వ వినాశక ఆయుధాలతో దానితో పాటే నాశనం చేస్తుందని – ఆయన ప్రకటించాడు. మునీర్ వాడిన భాష, అతను ప్రదర్శించిన భంగిమ చూస్తే, అణ్వాయుధాలు కేవలం యుద్ధం కోసం మాత్రమే కాదు, పాకిస్తాన్ మనుగడకు అవే కీలకమనే అతని నమ్మకాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయని అన్ని వర్గాల విశ్లేషకులు దీనిపై స్పందించారు.
వృత్తిపరంగా మునీర్ ఎదుగుదల అసాధారణమైనది. తన కెరీర్ ప్రారంభంలోనే పదవి నుంచి తొలగించబడినప్పటికీ- ఆయన పట్టుదలతో కొనసాగి, 2017లో మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ అయ్యాడు. తరువాత ఎనిమిది నెలల పాటు ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(ISID)కి నాయకత్వం వహించాడు. తరువాత అతను అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి సంబంధించిన అవినీతి ఆరోపణలు లేవనెత్తిన కారణంగా ఆ పదవి నుంచి తొలగించబడ్డాడు. మునీర్ ఈ సంఘటనను తీవ్ర అవమానంగా భావించాడు. ఇది అతనికి ఇమ్రాన్ ఖాన్‌కు మధ్య శాశ్వత శత్రుత్వాన్ని సృష్టించింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నాడు. సమీప భవిష్యత్తులో అతను విడుదలయ్యే అవకాశం కూడా లేదు.
నవంబర్ 2022లో మునీర్ ఐదు సంవత్సరాల కాలానికి ఆర్మీ చీఫ్ కావడానికి ముందు, లెఫ్టినెంట్ జనరల్ హోదాలో కార్ప్స్ కమాండర్; క్వార్టర్ మాస్టర్ జనరల్‌గా పనిచేశాడు. 27వ సవరణ ప్రకారం దీనిని 2030 వరకు పొడిగించారు. ఆయన మే నెలలో ఫీల్డ్ మార్షల్ హోదాను స్వీకరించాడు. ఇంకా ఈ 27వ సవరణ ద్వారా ఇప్పుడు CDFగా నియమితుడయ్యాడు. అంతేగాక పదవిలో తీసుకునే చర్యలకు అన్ని నేర విచారణల నుంచి చట్టపరమైన రక్షణ పొందాడు. పాకిస్తాన్ సైనిక ఆస్తులు, అణ్వాయుధ నిల్వలు, ఇంకా మొత్తం పాలనా యంత్రాంగంపై అతని కార్యాచరణ, వ్యూహాత్మక, రాజకీయ నియంత్రణలను మరింత పటిష్టం చేసుకున్నాడు.
కఠిన మతవాదిగా, సైన్యం ఆధిపత్యాన్ని పునరుద్ధరించడంలో తన భావోద్వేగాన్ని పెట్టుబడి పెట్టిన వ్యక్తిగా మునీర్‌ను విమర్శకులు అభివర్ణిస్తారు. ఈ దృక్కోణంలో, అణ్వాయుధాలపై అతని పూర్తి నియంత్రణను కేవలం వ్యూహాత్మకమైనదిగా మాత్రమే గాక, పాకిస్తాన్ భవితకు అంతిమ సంరక్షకురాలిగా సైన్యాన్ని చూపే ప్రతీకగా కూడా భావిస్తారు.
అందువల్ల అణ్వాయుధాలపై నిర్ణయాధికారం ఇప్పుడు మునీర్ చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నందున, అతని ప్రపంచ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడం కేవలం విద్యాపరమైన లేదా పాత్రికేయ ప్రయత్నం కాదు. ఈ 27వ సవరణ తర్వాత పాకిస్తాన్ అణ్వాయుధ నిర్ణయాలు, అమెరికా నిఘాలో ఉన్నప్పటికీ; ఎలా ఉండబోతున్నాయో అంచనా వేయడానికి ప్రయత్నించడం వ్యూహాత్మక అత్యవసరం. వాస్తవానికి అమెరికా ఇటీవలి విధానాలు, జోక్యాలే మునీర్ ఎదుగుదలకు శక్తినిచ్చాయి.
అనువాదం: శివనాగిరెడ్డి కొల్లి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
