తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఉపఎన్నికలు సంచలనాలకు కేంద్రమైయ్యాయి. అందులో “సారే” కేంద్ర స్థానం. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో ఉపఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఇక్కడ ప్రచారం చేసేందుకు అధికార- విపక్షాలు సర్వసన్నద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సుమారు రెండేళ్ల పాలనా కాలంలో తామిచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చామనే సవాళ్లకు నిర్దిష్ట సమాధానాలు కాంగ్రెస్ చెప్పలేదు. చెప్పే ప్రయత్నమూ లేదు. గత ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు, నిందలు ఇవే ఈ రెండేళ్ల కాలంగా ప్రజల అనుభవంలోని విషయాలు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గురించి రాహుల్ గాంధీ చాలా బలంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయనా ఏం అనడం లేదు. విపక్షాలు విసురుతోన్న సవాళ్లకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా మౌనమే సమాధానం. ఇది వర్తమాన కాంగ్రెస్ పార్టీ స్థితి.
రాష్ట్రంలో మరో విపక్షమైన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గత కాలపు గందరగోళం నుంచి ఇంకా బయటపడినట్టు లేదు. తాను బలంగా ఉన్నానని పదేపదే చెప్తూ వస్తోన్న ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇందుకిలా? అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నది. అంతేకాదు, ఆ పార్టీ ఈ ఉపఎన్నికను సవాలుగా స్వీకరించిందా లేదా? అనే సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, వెనుకబడిన తరగతులు, ద్విజకులాల మధ్య అధికార పంపిణీలాంటి అపసవ్య చర్యలు కొనసాగుతుండటం గుర్తించాల్సిన అంశం. అయినా, ఆ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. గెలుస్తామని బలంగా చెప్పడం లేదు. కానీ, తమ ఉనికి ఉందని చెప్పుకుంటున్నారనే ఒక భావనను జనంలో కలిగిస్తున్నారనే అభిప్రాయం ప్రజలలో ఉన్నది.
అన్నీ తానై వ్యవహరిస్తోన్న కేటీఆర్, హరీష్ రావు..
మరో బలమైన విపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్). ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే ధీమాను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్నది. కేటీఆర్, హరీష్ రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీపై సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు నాయకులు విడివిడిగా, కలివిడిగా డివిజన్ల వారిగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. తమ పార్టీ దిగువశ్రేణి నాయకత్వానికి తామున్నామనే భరోసానిస్తున్నారు. సమయానుకూలంగా స్పందిస్తూ ఓటర్లలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో గెలుపెవరిదని ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినా, భవిష్యత్తు తమదేననే భావనతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలోకి దూకారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరీ ఈ ఉపఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీల అధ్యక్షులు వస్తారా లేరా? అనే ఆసక్తి ప్రజలలో ఉన్నది.
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచార ప్రణాళికను జనబాహుళ్యంలో ఉంచాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి వస్తారా? లేరా? అనేది తెలియడం లేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు, బహుశా ఆయన రాకపోవచ్చని కొందరు అంటున్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆయనే రంగంలోకి దిగుతారని మరికొందరు భావిస్తున్నారు. సారు ఎన్నికల ప్రచారంలోకి వస్తారా లేదా అనే విషయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి అగ్రనేతలు ఇప్పటికి స్పష్టతనివ్వలేదు.
“సారూ.. అందుబాటులో లేరూ..” అనే ప్రచారమే, 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బలంగా ప్రభావితం చేసింది. గడిచిన పదేళ్ల కాలపు బీఆర్ఎస్ పాలన గురించి జనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో జనాభిప్రాయ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. మరిప్పుడు ఈ విషయాలను గమనంలో ఉంచుకొని ఆ పార్టీ నాయకలు సార్ను జనం మధ్యలోకి తెస్తారని చాలామంది భావిస్తున్నారు.
ఉద్యమ సందర్భంలో తెలంగాణ సమాజం స్పందించిన తీరు వేరు, ఇప్పుడు తన అభిప్రాయాన్ని మరో రూపంలో వ్యక్తీకరిస్తోంది. ఈ మార్పును బీఆర్ఎస్ అధినాయకత్వం గుర్తిస్తున్నదా లేదా? అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఆ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ జనం మధ్యలో ఉన్నప్పటికీ కవిత రూపంలో వారికి సవాళ్లు ఎదురవుతున్నాయి. విపక్షాల కంటే ఆమె సంధిస్తున్న సవాళ్లే వారిని మరింత ఇరుకున పెడుతున్నాయి.
ఒక పార్టీ అధినేతగా సొంత కూతురునే పార్టీ నుంచి బహిష్కరించిన కేసీఆర్ తన మార్క్ నిర్ణయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. బంధాలు- బంధుత్వాల కంటే పార్టీ ముఖ్యమని చెప్పకనే చెప్పారు.
2001 నుంచి 2009 వరకు కేసీఆర్ పాత్ర ఒకరకంగా ఉన్నది. 2009 నుంచి 2014 వరకు ఆయన పట్ల జనాభిప్రాయం మరో రకంగా ఉన్నది. 2014 నుంచి 2018 వరకు ఆయన పాలనాతీరుకు జనం జేజేలు పలికారు. 2018 నుంచి 2023 వరకు జరిగిన పరిణామాలు, ప్రచారాలు, ఉప ఎన్నికలు, వాటి ఫలితాలు బీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టడం ప్రారంభించాయి. ఈ విషయాన్ని బహుశా నాయకత్వం గుర్తించనట్టే ఉన్నది.
గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారానికి సారు తప్పకుండా వస్తారని చాలా మంది అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన రాకున్నా బీఆర్ఎస్ గెలుస్తుందనే ధీమాను ఆ పార్టీ నాయకులు వ్యక్తీకరిస్తున్నారు.
ఎన్నికలు- ఉపఎన్నికలంటూ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ నాడు జనంలో జనంతో ఉన్నారు. ఇప్పుడు గ్యాప్ ఉందని, దాన్నే భర్తీ చేయాలని ఆయన శ్రేయోభిలాషులు పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరీ ఆయన ఈ ఉపఎన్నిక ప్రచారానికి వస్తారా లేదా అనేది నిర్దిష్టంగా తెలియడం లేదు. గతంలో సారు మాట్లాడినా వార్తే… మౌనంగా ఉన్నా వార్తే… ఇప్పుడు అలా కాదు. సారు రావాల్సిందే జనంతో ఉండాల్సిందే, ఇది ప్రజల మనోభావన.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
