తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లు పైబడిన కాంగ్రెస్ పాలన ఒక విధ్వంసం నుంచి మరొక విధ్యంసానికి వెళ్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారు.
కొన్ని విషయాల్లో గతం కంటే మెరుగుదల ఉన్నప్పటికీ, హైడ్రా చర్యలు ప్రజల్లో అంతులేని ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
చెరువుల పునరుద్ధరణ ప్రశంసలు అందుకున్నది. పేదల గూళ్లను కూల్చడం విమర్శలకూ కేంద్రమైంది.
ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన వేలాది పేదల ఇళ్ల ధ్వంసం ప్రజా పాలనకు ఒక మచ్చలా మిగిలింది.
గత ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే చెప్పడం వల్ల ఈ ప్రభుత్వ లోపాలు జనం దృష్టిలోకి అంతగా రాలేదు.
వారిచ్చిన ఆరు గ్యారంటీల అమలు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే సందర్భంలో బడుగు జీవుల ఆశలపై, వారి నివాసాలపై జరుగుతున్న విధ్వంసాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలంగాణ సమాజం.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఏ ప్రస్థానానికి ఈ విధ్వంసమని ప్రజలు చర్చించుకుంటున్నారు.
చాలా విచారకరమైన పరిస్థితి..
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు భారీ స్థాయిలో ప్రభుత్వం చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదు.
ఆ ప్రణాళికా లేదు. విద్యా, వైద్యం, గిగ్ వర్కర్క్లు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల గురించి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.
కానీ నివాస సముదాయాలపైకి బుల్డోజర్లు వెళ్లడమే విచారణ కల్పిస్తున్న విషయం.
సీఎం క్యాంపు ఆఫీస్‌ను ఫూలే అంబేద్కర్ ప్రజా భవనంగా మార్చి పాలన ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో ప్రజా వ్యతిరేక చర్యల పరంపరకు తెరతీస్తోంది.
సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశం నుంచి ఖమ్మం జిల్లా పేదల ఇళ్ల వరకు ఇదే చర్చ కొనసాగుతునే ఉన్నది.
బాధితుల పక్షాన పార్టీగా, ప్రభుత్వంగా వారిస్తున్న హామీలు, వారిచ్చినా జనం నమ్మేలా లేరు. ఆ స్థితికి ప్రభుత్వం పడిపోయింది.

పాత కాలం కాంగ్రెస్ నాయకులు సైతం మౌనంగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే విపక్షంగా కొందరు గొంతు విప్పేవాళ్లు, ఇప్పుడు బాధితుల పక్షాన ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు.
అసలు ఎవరడిగారని?
ఎవరు అడగకుండానే గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రభుత్వం తెర మీదికి తెచ్చింది. ఎవరి ప్రయోజనాల కోసమో? ఇందులో ఉన్న ప్రజా క్షేమం ఏందో కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. 55 కిలో మీటర్ల మేర నగరంలో మూసీ పరివాహక ప్రాంతమున్నది. ఇందులో మెహిదీపట్నం పై భాగంలో ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతూ ఉన్నది.
ప్రజా ప్రభుత్వంలో తాము నిలువనీడలేని వారమవుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దని వేడుకుంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాడు పేదల పక్షాన మాట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మారుస్తున్నారని ఆవేదన చెందున్నారు బాధిత ప్రజలు.
రైతులు యూరియా సమస్యను ఇంకా ఎదుర్కుంటూన్నే ఉన్నారు. విద్యా, వైద్య రంగాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
కానీ, ఈ ప్రభుత్వం మాత్రం తమ పాలనకు హైప్ ఇచ్చుకుంటున్నది.
పెనంలో నుంచి పొయ్యిలోకి
ఆర్టీసీ ఉద్యోగులు టార్గెట్లను అందుకోలేక అవస్థలు పడుతున్నారు. ఉచిత బస్సు వద్దు మొర్రో అంటూ ఆందోళనలకు దిగుతున్నారు.
టార్గెట్లు రీచ్ అవ్వడం లేదని యాజమాన్యం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో ఒక రకమైన ఒత్తిడి ఉంటే ఇప్పుడు మరో రకమైన ఒత్తిడి ఉన్నదని కార్మికులు అంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంత జరిగిందో, ఎట్లా జరుగుతున్నదో తెలియదు కానీ- వేలాది ఇళ్లు కూలుతున్నాయనే ప్రచారమే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నది.
సగటు తెలంగాణ జనజీవితానికి ప్రతీకనుకున్న రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు దిగుతారని తాము ఊహించలేదని చాలామంది సోషల్ మీడియా వేదికగానే తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు.
మాట తప్పిన రేవంత్ రెడ్డి!
ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేయడానికి ముందు, ఆ తర్వాత ప్రజాకోణంలోనే ఆయన మాటలు ఉన్నాయి. ఇప్పుడవి ఆచరణలో అడ్డం తిరిగాయి.
ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఈ రేవంత్ రెడ్డి ప్రజలకు వాగ్దానం చేశారు. సగటు మనుషుల పక్షాన ఉంటానని హామీ ఇచ్చారు.
దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని చాలామంది ఆవేదన చెందుతున్నారు.
నిర్మాణాలకంటే విధ్వంసానికి ఎక్కువ జరుగుతున్నప్పుడు ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కావడం లేదని చాలామంది మాట. విపక్షాలు కూడా ఖమ్మం విషయంలో ఉదారంగా వ్యవహరించాయనే ఆరోపణలున్నాయి.
ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసింది. వాటికంటే కూడా పేద ప్రజల ఆందోళన, ఆవేదన ప్రజా హృదయాలలో ముద్రించబడింది.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడనే గ్రామీణ తెలంగాణ బలంగా కోరుకున్నది.
పెన్షన్లు నిరుద్యోగ భృతివంటివి పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ హైడ్రా చాలా వేగంగా పని చేస్తున్నది. మంచికైతే అభ్యంతరం లేదు.
కానీ పేదా మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలుస్తామనే గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
అభివృద్ధి అంటే రంగుల గోడలు, అద్దాల మేడలు కాదని రేవంత్ రెడ్డే చెప్పారు. ఈ మాటలను ఆయన మరోసారి మననం చేసుకోవాలని ఆయా సమూహాల ప్రజలు ఆయను సూచిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
