
ప్రపంచీకరణ ఫలితాలు ఎట్లా ఉంటాయనేదానికి మరో పార్శ్వానికి ఇగ్లాండ్లో జరుగుతోన్న ఆందోళనలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ఎల్పీజీ(లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజెషన్) ప్రారంభ దశలో ప్రపంచమే కుగ్రామంగా మారబోతున్నదని భారతీయ సమాజంలో చర్చ జరిగింది. వాస్తవానికి గాట్ ఒప్పందం కంటే ముందే, మన దేశంలో సంస్కరణలు 1983- 84ల నుంచే ప్రారంభమైయ్యాయి. 2001 నాటికి ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ ప్రభావం ప్రబలంగా కనిపించింది. 2008 తర్వాత వర్ధమాన దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు ఐటీ నిపుణుల వలసలు పెరిగాయి. 1980లో ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు మన దేశంతోపాటు ఆసియా దేశాల నుంచి వలసలు విపరీతంగా పెరిగాయి. ఆయా దేశాల ఆర్థిక వృద్ధిపైన ఈ వలసల ప్రభావం కనిపించింది. ప్రధానంగా పారిశ్రామిక, సేవా రంగాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచాయి.
2025 సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ఆందోళనలు పలు రకాల చర్చలకు కేంద్రమైంది. అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెరగడం వలన ఆయా దేశాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిరసనలకు ప్రధాన కారణం సంస్కృతి- సంప్రదాయాలు దెబ్బతింటున్నాయనే వాదన.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మేధో వలసలను అమెరికా ప్రోత్సహించింది. ఇదే బాటను పలు యూరప్ దేశాలు అనుసరించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఆయా దేశాలకు వలస వెళ్లారు. ఇప్పుడు ఆ దేశాల నుంచి భారీ ఎత్తున నిరసనలు వస్తున్నాయి. “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” అనేది ట్రంప్ నినాదం కాగా, “మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా” పేరుతో ఆస్ట్రేలియాలో ఒక ఆందోళన మొదలైంది. ఇదే కోవలో “మేక్ యూరప్ గ్రేట్ ఎగైన్” నినాదం యూరప్ దేశాలలో వినిపిస్తోంది.
ఇట్లా ఎందుకు జరుగుతున్నది? ప్రపంచీకరణ ప్రభావం ఆయా దేశాలపై వ్యతిరేక ప్రభావం చూపించిందా? లేక ఆయా దేశాల రాజకీయ పార్టీల ఎన్నికల ఎజెండాలో నినాదంగా మారాయా? ఈ విషయాలపైన పరిశీలన పరిశోధన చేయాల్సి ఉన్నది.
యూరప్ దేశాలలో జరుగుతోన్న ఆందోళనలపై భిన్న రకాల చర్చ జరుగుతోంది. జాత్యాంహకరంతో అక్కడి వారు వ్యవహరిస్తున్నారని కొందరు బలంగా నమ్ముతున్నారు. తమ సంస్కృతి– సంప్రదాయాలు, జీవన విధానాలు మారుతున్నాయని ఆయా దేశాలలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. తమ ఆర్థికవ్యవస్థలపై తిరోగమన ప్రభావం పడుతోందని కూడా అంటున్నారు. అక్రమవలసలు, వలసదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం వల్ల ఆర్థికవ్యవస్థలపై భారాలు పడుతున్నాయని పేర్కొంటున్నారు.
అదేకాదు స్థానికుల ఉద్యోగ అవకాశాలు, సౌకర్యాల కల్పనపై తీవ్ర ప్రభావాన్ని ఈ వలసలు చూపిస్తున్నాయని కూడా అంటున్నారు. ఇట్లా అంటున్న ఐరోప దేశాలలో వార్సో, డుబ్లిన్, బెర్లిన్, యూకే తదితర దేశాలున్నాయి. యూకేలో టామీ రాబిన్సన్ ఆందోళన సందర్భంగా ఈ విషయాలను చర్చకు వచ్చాయి.
ప్రపంచీకరణతో అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ ప్రయోజనం..
వాస్తవానికి ప్రపంచీకరణతో ప్రస్తుతం ఆందోళన చేస్తున్న దేశాలకే ఎక్కువ ప్రయోజనం కలిగింది. ఆయా దేశాలకు మేధో వలసలు పెరగడం వల్ల ఆర్థికవృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, జీవన ప్రమాణాల పెరుగుదలలో మార్పులు వచ్చాయి.
అయితే, భిన్న దేశాల నుంచి, భిన్న సాంస్కృతిక నేపథ్యాల నుంచి– విభిన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక నేపథ్యాల నుంచి ప్రజలు ఆయా దేశాలకు వలస వెళ్లారు. తమ మూలా వాసనలు– సాంప్రదాయాలు అక్కడ కూడా కొనసాగించారు. ఈ విషయాన్ని యూరప్ దేశాల ప్రజలకు, వలస ప్రజలకు అంతరంగా భావించవచ్చు.
వలసలనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. పరిమాణంలో ఇప్పుడు దాని విస్తృతి ఎక్కువగా ఉండవచ్చు కానీ, ఆ మేరకు ప్రయోజనాలు వలస దేశాలకు, ఐరోప దేశాలకు ఉభయతారకంగా ఉండేవి.
నాలుగవ దశ ప్రపంచీకరణ అన్ని దేశాల ప్రజలను ఆలోచింపజేస్తున్నది. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో స్థానికుల వాట స్థానికులకు అనుకున్న స్థాయిలో లేదా వారి జనాభా నిష్పత్తికి భిన్నంగా అంతరాలు ఉంటున్నాయనే బలమైన భావన ఆయా దేశాల ప్రజలలో ఉన్నది. అక్కడ జరుగుతోన్న ఆందోళనకు ఇదో కారణం కావచ్చు.
ఇవే కాకుండా శ్వేతజాతియూల అహంకారపూరిత వైఖరి కూడా ఈ నిరసనలకు ఓ కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తమ సంస్కృతి, వర్ణ సంకరం అంశాలను అంతర్లీనంగా ప్రచారంలో పెడుతున్నారనే ఒక చర్చ ఉన్నది. ఆయా దేశాల రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ తరహా ఆందోళనల తీవ్రతరను మరింత పెంచుతున్నారని కొందరు భావిస్తున్నారు.
తాజాగా యూకే ర్యాలీని ఉద్దేశించి ఎలన్‌మస్క్ వర్చువల్(ఆన్లైన్లో)గా మాట్లాడారు. స్థానికులు తమ ఉనికి, అస్తిత్వాల కోసం పోరాడక తప్పదని పరోక్షంగా సూచన చేశారు. గడిచిన మూడు దశాబ్దాలకు పైబడిన ప్రపంచ నూతన ఆర్థికాభివృద్ధి నమూనా అంతిమ ఫలితం ఏమిటీ అనేదానికి ఇది ఒక ఉదాహరణా? లేక మూడవ ప్రపంచదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమదైన ఆర్థికాభివృద్ధి నమూనాను తయారు చేసుకొని ఆచరించాల్సిన అవసరం, అనివార్యతకు సంకేతమా? ఆలోచించాల్సింది ఐరోపేతర దేశల వాసులే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.