భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు అది భారతీయ జనసంఘ్‌గా ఉండేది. దాని అధ్యక్షుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.
1968 ఫిబ్రవరి 11న తన మృతదేహం మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్లో కనిపించింది. రైల్లోంచి తనను ఎవరైనా తోసేశారా? లేక పరుగెడుతున్న రైల్లోంచి తనకు తానే దూకేశారా? తెలియదు. అది దుర్ఘటనా లేక హత్యా అన్నది ఇంత వరకు ప్రభుత్వం వెల్లడించలేదు. ఆ సంఘటన జరిగి సుమారు 58 ఏళ్ళయ్యింది.
దేశంలో ఇన్ని సార్లు ఇన్ని ప్రభుత్వాలు మారినా, అలాంటి ప్రముఖ వ్యక్తి మరణం గురించి వాస్తవాలు ఈ దేశ ప్రజలకు తెలియకుండా చేశారు.
విపక్షాలవి డ్రామాలని ఎద్దేవా చేసే మోదీ-షాలు తమ సొంత పార్టీ నాయకుడి మరణం గురించి ఎందుకు పట్టించుకోలేదు? కావాలనే ఆ విషయం బయటికి పొక్కకుండా తొక్కిపెట్టారా?
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు ప్రచారక్‌గా పనిచేసిన వారు. తర్వాత భారతీయ జనసంఘ్‌కు అధ్యక్షుడయ్యారు. “హిందూ రాష్ట్ర” సిద్ధాంతకర్త కూడా ఆయనే!
అలాంటి వారి మహానాయకుడికి ప్రతియేటా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారే కాని, తను ఉన్నఫళంగా ఎలా మాయమయ్యాడన్నది మాత్రం బీజేపీ నేతలే బయటికి రానియ్యలేదు.
గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లపై మోపింది. ఆర్ఎస్ఎస్ను నిషేధించింది కూడా.
రాజకీయ ప్రస్థానం నుంచి పుకార్ల వరకు..
గాంధీజీ హత్యలో సంఘ్ పాత్ర లేదని దీన్ దయాళ్, తమ ‘పాంచజన్య’ పత్రికలో ప్రకటించారు.
ఫలితంగా ప్రభుత్వం పాంచజన్యను కూడా నిషేధించింది.
దాని స్థానంలో దీన్ దయాళ్ ‘హిమాలయ’ పేరుతో మరో పత్రిక ప్రారంభించి నాటి ప్రభుత్వాన్ని విమర్శించ సాగారు.
ఆ రోజుల్లోనే నెహ్రూ మంత్రి వర్గంలో కామర్స్ మినిస్టర్‌గా ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ(1901-1953) నెహ్రూ విధానాలతో విభేదించి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
1951 అక్టోబర్ 21న ‘జనసంఘ్’ పేరుతో తను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. దానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కార్యదర్శి అయ్యారు.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానికి ఇతర పార్టీ నాయకులు కారణమన్నట్లుగా జనసంఘ్-ఆర్ఎస్ఎస్ శ్రేణులు గోలగోల చేశారు. తన మరణానికి కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. కాదు, కమ్యూనిస్టులే ఆ పనికి పూనుకున్నారని నోటికొచ్చింది మాట్లాడారు. పత్రికా ప్రకటనలిచ్చారు.
దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేసిన ఇందిరా..
ఆ కాలంలో ఇందిరా గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వెంటవెంటనే ఆ ప్రభుత్వం రెండు దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ దర్యాప్తులకు ఎవరెవరు ఎలాంటి ఆటంకాలు కలిగించారో తెలియలేదు. కానీ, ఉపాధ్యాయ మరణ రహస్యమేదీ బయటికి రాలేదు.
పోనీ 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది- మరి అందులో బీజేపీ భాగస్వామిగా ఉంది కదా? అప్పుడైనా వారు దర్యాప్తుకు సహకరించి దోషులను బయటపెట్టాలి కదా? నిజమేదో నిగ్గుతేల్చాలి కదా? ఆ పని ఎందుకు చేయలేకపోయింది? అంటే, కంచే చేను మేస్తే ఎలాగుంటుంది? అలాగన్నమాట!
ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్ పేయ్ 1996లో పదిహేడు రోజులు, ఆ తర్వాత 1998లో పూర్తి సమయం ప్రధానిగా ఉన్నారు.
మరి అదే పాత దర్యాప్తును తిరగతోడాలి కదా? లేదా కొత్తగా మళ్ళీ దర్యాప్తు చేయించాలి కదా? ఎందుకంటే, అనుమానాస్పదంగా మరణించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి సొంత పార్టీ అగ్ర నాయకుడు! మహా మనిషిగా వారు పొగుడుకుంటున్న వ్యక్తి.
ఈ దేశ ప్రజలకు నిజమేదో తెలియజెప్పాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి, వారి ప్రభుత్వానికి, అందులోని ప్రముఖ నాయకులకు కానీ లేదా? అది అలా వదిలేసినా ఇప్పుడేమయ్యింది? గత పన్నెండేళ్ళుగా బీజేపీ-ఆర్ఎస్ఎస్లే అధికారంలో ఉన్నాయి కదా?
కుట్ర కోణం ఏమైనా ఉందా?
1968లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్యకు గురైనప్పుడు ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులే కదా గోల చేశారు? మరి అధికారం చేజిక్కగానే ఏం చేయలేక బిక్కచచ్చిపోయారెందుకు? అంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉందన్న మాట!
“మేం అధికారంలో ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించేవారం”అని అప్పుడు బీరాలు పలికిన వారు, అధికారంలో ఉండి – ఇప్పుడేం చేస్తున్నారు?
ఉట్టి మాటలు కాదు, నిజాయితీ – మాటల్లో కనిపించాలి. ఇప్పుడు గత పన్నెండేళ్ళుగా అన్ని విషయాల్లో దేశ నాయకుల ఉట్టి మాటలే తప్ప, నిజాయితీ అనేది పౌరులకు ఏ మాత్రమూ కనిపించడం లేదు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ శవమై కనిపించిన మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరు మార్చి, ‘దీన్ దయాళ్ జంక్షన్’ అన్నారు. కొన్ని పథకాలకు కూడా తన పేరు పెట్టారు తప్పించి, తన మరణ రహస్యాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం రహస్యంగానే ఉంచేసింది. ఈ విషయం దేశప్రజలు గుర్తుంచుకోవాలి.
అసలు విషయం బయటికి ఎలా వచ్చింది అంటే..
జరిగిన కుట్ర ఏమిటో తెలుసుకుందామని కొందరు స్వతంత్ర జర్నలిస్టులు పరిశీలించారు, పరిశోధించారు. విషయాన్ని రాబట్టారు. ఆ కాలంలో ఆ పార్టీ ప్రముఖులు రాసిన పుస్తకాలన్నీ అధ్యయనం చేశారు. చివరకు దొరికిన ఆధారాలని బయట పెట్టారు.
బలరాజ్ మధోక్(1920 ఫిబ్రవరి 25- 2016 మే 2) కశ్మీర్ నివాసి, శ్యామా ప్రసాద్‌కు అతి సన్నిహితుడు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడు. తన ‘జిందగీక సఫర్’ శీర్షికతో ఆత్మకథ రాసుకున్నారు. అది మూడు సంపుటాలుగా వెలువడింది.
మూడో సంపుటం శీర్షిక ‘దీన్ దయాళ్ హత్య నుంచి ఇందిరా గాంధీ హత్య వరకు'(దీన్ దయాళ్ హత్యా సే ఇందిరా గాంధీ కీ హత్యా తక్) లోపలి విషయాలేమైనా, శీర్షికలోనే ‘దీన్ దయాళ్ హత్య’ అని స్పష్టంగా ఉంది.
అయితే ఆ హత్య ఎవరు చేయించారో తెలుసుకోవాలంటే ఆ పుస్తకం లోపలి పేజీల్లోకి వెళ్ళాలి. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, అగ్రనేతలందరితో సన్నిహితంగా మెలిగిన బలరాజ్ మధోక్ మాటలను మనం ప్రామాణికంగా తీసుకుంటాం కదా? తీసుకోవాలి కదా?
అయితే, ఇక్కడ ఒక సమస్య ఎదురైంది. అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే ఆ పుస్తకం మార్కెట్ నుంచి మాయమైంది. అలా మాయం కావడం వెనక బలమైన కారణమే ఉండి ఉంటుందని అశోక్ పాండే అనే జర్నలిస్ట్ ఢిల్లీలోని పుస్తకాల షాపులు, లైబ్రరీలు గాలించి జల్లెడ పట్టారు. చివరకు ఒక కాపీ దొరకబట్టారు. అందులోని విషయమంతా బయట పెట్టారు.
వ్యాసంలో కీలకమైన విషయాలు..
“హత్యా కే పీఛే కౌన్ – గహరాతా రహస్య్” శీర్షికతో 16 వ పేజీ నుంచి 7, 8 పేజీలుగా సాగిన వ్యాసంలో చాలా కీలకమైన విషయాలున్నాయి.
“నేను చూసిన విషయాలు, తెలుసుకున్న విషయాల గురించి నన్ను చుట్టు ముట్టిన పత్రికా విలేకరులకు- ఇది దుర్ఘటన కాదు, హత్యేనని – స్పష్టంగా చెప్పాను. ఆ మరునాడు 1968 ఫిబ్రవరి 12 సాయంత్రం 30, రాజేంద్ర ప్రసాద్ రోడ్లో అటల్ బిహారీ నివాసానికి వెళ్ళాను. అక్కడ ఆయన ఇండియన్ ఎక్స్ ప్రెస్ విలేకరితో మాట్లాడుతున్నారు. నేను బయట కూర్చున్నాను. విలేకరి వెళ్ళిపోయిన తర్వాత నేను లోనికెళ్ళాను. నన్ను చూడగానే అటల్ జీ మండిపడ్డారు. “దీన్ని నువ్వు హత్య అని ఎందుకంటున్నావు? దీన్ దయాళ్ జగడాల మారి. రైల్లో ఎవరితో ఏ గొడవ పెట్టుకున్నాడో. ఏ గలాటా జరిగిందో ఎవరికి తెలుసు? ఎవరో తోసేస్తే కింద పడి చచ్చుంటాడు. అంత మాత్రం దానికి ‘హత్య’ అని అంటావెందుకూ?” అని చివాట్లేశారు. జన సంఘ్‌లో మహా నాయకుడైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గూర్చి అటల్ బిహారీ అంత నీచంగా మాట్లాడడం నాకు వింతగా తోచింది. ఆయన అలా మాట్లాడగలరని ఊహించలేక పోయాను. ఆ మరునాడు ఫిబ్రవరి 13న ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక వార్త ప్రచురించింది. ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయది హత్య అని అనడానికి వీల్లేదు. దుర్ఘటనే కావచ్చు’ అన్నది దాని సారాంశం! అంతకు ముందు రోజు అటల్ బిహారీ ఎక్స్‌ప్రెస్ విలేకరికి విషయం నూరిపోసింది నేను స్వయంగా చూసిందే కాబట్టి, ఆ వార్తలో నాకు విశేషం కనిపించలేదు. అయితే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి అటల్ బిహారీ వాజ్ పాయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం అర్థమైంది”అని అందులో బలరాజ్ మధోక్ రాసుకున్నారు.
సమాధానం లేని సందేహాలు..
అదేగనక దుర్ఘటన అయితే, మృత దేహం రైలు పట్టాల పక్కన పడి ఉండాలి. కానీ, అది ఐదారు వందల మీటర్ల దూరంలో ఉంది. ఎవరైనా మామూలు దొంగ అయితే జేబుల్లోని డబ్బు, చేతి గడియారం, ఉంగరం వగైరా దోచుకుపోవాలి. కానీ, ఏవీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
దీన్ దయాళ్ మరణంతో వెంటనే లాభం జరిగింది కేవలం ఇద్దరికే! ఒకటి అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి రెండు నానాజీ దేశ్ ముఖ్కు. అప్పటికి అటల్ బిహారీ గొప్ప నాయకుడేమీ కాదు. పైగా పార్టీలో ఎక్కడా ఆయన లైన్లోనే లేరు. అయినా కూడా ఉన్నపళంగా భారతీయ జనసంఘ్‌కు అధ్యక్షుడై కూర్చున్నారు. అధ్యక్షుడు కాగానే అంతకు ముందున్న మహా మంత్రిని తొలగించి, నానాజీ దేశ్ ముఖ్‌ను జనసంఘ్ మహా మంత్రిగా నియమించారు.
ఇదంతా లోలోపల గూడూపుఠాణీ జరిగిందనడానికి బలమైన సాక్ష్యం కాదా?
దీనికి దొరికిన మరో ఆధారం..
హత్యకు ముందురోజు అంటే 1968 ఫిబ్రవరి 10న ఒక సామాన్య జనసంఘ్ కార్యకర్తకు సమాచారం తెలిసింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆ మరునాడు శేల్దా ఎక్స్ ప్రెస్‌లో లక్నో నుంచి పాట్నా వెళుతున్నారనీ, నానాజీ దేశ్ ముఖ్ హత్య చేయించబోతున్నారనీ – ఎవరైనా ఆపగలిగితే మంచిదనీ- ఆ సమాచారం.
అయితే, ఆ కార్యకర్త అశక్తుడు గనక పెద్దవాళ్ళతో పని తానేం చేయగలడని ఆలోచిస్తూ ఉండి పోయాడు. ఆ తర్వాత కుమిలిపోతూ మిత్రులకు చెప్పుకుంటూ ఉంటే విషయం బయటపడింది.
దీన్ దయాళ్ హత్యలో నానాజీ దేశ్ ముఖ్ పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే, అటల్ బిహారీ వాజ్ పాయ్ పాత్ర పరోక్షంగా కనిపిస్తోంది.
గుజరాత్, మణిపూర్ మారణకాండలు, ఓట్ చౌరీ, నోట్ బందీ, జీఎస్టీలతో గత పన్నెండేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్న వారిని చూస్తూనే ఉన్నాం కదా? వీరి ముందు తరం నాయకులు మాత్రం మరోలా ఎలా ఉంటారు? ఇదిగో ఇలాగే ఉండి ఉంటారు!
రాజకీయ పార్టీలలో తిరుగుబాట్లు, వెన్నుపోట్లు చూశాం కానీ, ఇలా హత్యలు కూడా చేసుకుంటారని ఇదిగో ఇప్పుడే తెలిసింది.
అయితే, సొంత పార్టీ బాగోతం బట్టబయలు చేసిన బలరాజ్ మధోక్లాంటి వారు కూడా మనలోనే ఉన్నందుకు సంతోషించాలి.
ఇంతకూ దీన్ దయాళ్ హత్య కేసు ఎలా మూసేశారంటే..!
భరత్ లాల్ – రాం అవధ్ అనే ఇద్దరు దొంగలు ఆ ఎక్స్ ప్రెస్ రైల్లో వీఐపీ కేబిన్‌లో చొరబడి దీన్ దయాళ్ ఉపాధ్యాయ బ్యాగు ఎత్తుకు పోవడానికి ప్రయత్నిస్తుంటే, ఆయన పోలీసును పిలుస్తానన్నారట- అంతే! వారు దీన్ దయాళ్ను రైల్లోంచి తోసేశారట- 1969లో ఆ ఇద్దరు దొంగలకు శిక్ష విధించారు. ఆ రకంగా ఆ ప్రహసనం ముగిసిందనిపించారు.
అంతే కాదు రాజనీతిజ్ఞుడైన అటల్ బిహారీ వాజ్ పాయ్‌కు 2015లో, సామాజిక సేవ చేసినందుకు నానాజీ దేశ్ ముఖ్కు 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది.
నీతి, నైతికత, క్రమశిక్షణ, దార్శనికత లేని నాయకుల పట్ల దేశ పౌరులకు గౌరవభావం కలుగుతుందా? గౌరవమనేది చేసే పనులతో రావాలి. బలవంతంగా బిరుదులతో రాదు. వచ్చిన వాటికి ఉండాల్సిన విలువ ఉండదు.
ఉన్నత స్థానాలకు ఎగబాకిన వారంతా ఉన్నతులు కారు – అని ఇంగిత జ్ఞానం గల ఈ దేశ ప్రజలంతా ఎప్పుడో గ్రహించారు.
అయితే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్యకు గురైన ఫిబ్రవరికి 11ను “సమర్పణ్ దివస్”గా ఘనమైన పేరు పెట్టుకుని నిర్వహించుకుంటున్నారు. నలుపును తెలుపు చేయడం ఎలాగో ఎవరైనా సరే – వీరి నుంచి నేర్చుకోవాల్సిందే.
వ్యాసకర్త నేషనల్ బుక్ ట్రస్ట్ సలహా సంఘ పూర్వ సభ్యుడు, సాహితీవేత్త.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
