
ప్రాతినిధ్య చిత్రం
ఇద్దరు తెలుగువారే, ఇద్దరు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నవారే. అందులో ఒకరు పేదోడుకాగ ఇంకొకరు పెద్దోడు. పేదోడేమో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దోడు విషయానికి వస్తే, బ్యాంకు నుంచి తీసుకున్న వేలకోట్ల రుణాల్లో నుంచి కొంత చెల్లించి, మిగితా కట్టలేనని చేతులెత్తేసి మొత్తం రుణాన్ని మాఫీ చేయించుకోని స్వేచ్ఛగా తిరుగుతన్నాడు.
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన దండువుల రాజు అనే పేదవ్యక్తి ఇళ్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి కేవలం ఆరున్నర లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు సకాలంలో దఫాలవారిగా కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారుల వేధింపులకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక పెద్దోడి విషయానికి వస్తే, ఆయన మాజీ కేంద్రమంత్రి. కళాబంధు, దాతగా పేరుపొందిన తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఏకంగా బ్యాంకుల నుంచి సుమారు 5,700 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించలేక బ్యాంకులకు నానా తిప్పలు పెడుతూ, చివరికి విశ్వగురువు పెద్దరాయుడు సహాయంతో తీసుకున్న అప్పులో నుంచి సుమారు 2,400 కోట్లు తిరిగి చెల్లించడానికి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇలా 2014 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దోళ్లకు దాదాపు రూ 16.5 లక్షల కోట్లు రుణాలను మాఫీ చేసింది. ఈ ప్రభుత్వం హయాంలోనే కొందరు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోయారు.
రుణాలను మాఫీ చేయించుకున్న వారి జాబితాలో, ఇప్పుడు మన పెద్దోడు సుబ్బిరామిరెడ్డి కూడా చేరాడు. ఈ డబ్బంతా ఎవరిది? డబ్బున్నోడు ఇలా బ్యాంకుల ద్వారా ప్రజల సొమ్మును తీసుకొని ఆ తర్వాత ఎగొట్టి, మరింత సంపన్నుడిగా ఎదుగుతున్నాడు. అదే పేదోడు మాత్రం ఇంకా పేదోడుగానే మిగిలిపోతున్నాడు.
కళాబంధు రుణాలను తీసుకున్న బ్యాంకుల చిట్టా..
“నాగార్జున సాగార్ డ్యాం కట్టింది నేనే” అని గర్వంగా చెప్పుకునే ఈ కళాబంధు రెండు సార్లు ఎంపీగా గెలిచిన పెద్దోడు. ఆయన చిత్ర నిర్మాత కూడా. అప్పుడప్పుడు పెద్దెత్తున సినిమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. స్వచ్ఛమైన శివభక్తుడిగా గుర్తింపు పొందిన ఈ పెద్ద మనిషి వైజాగ్ ఆర్కే బీచ్‌లో ప్రతీయేట శివరాత్రి సందర్భంగా లక్ష శివలింగాలతో భక్తిరంజని కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్ట్సు సంస్థ ఈ అప్పులను ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషన్ బ్యాంకు నుంచి ఈ రుణాలను తీసుకుంది.
రుణమాఫీ సెటిల్మెంట్..
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని కోరుతూ, గతంలో ఈ బ్యాంకులు పలుమార్లు రామిరెడ్డికి నోటీసులను కూడా పంపించాయి. అయినప్పటికీ, సరైన స్పందన లేకపోవడంతో బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటీషన్లను వేశాయి. ఈ విషయాలను ఎలానో తెలుసుకున్న పెద్దరాయుడు కళాబంధును పిలిచి ఆరా తీశాడు. పెద్దరాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి, తీసుకున్న అప్పులో నుంచి రూ 2,400 కోట్ల వరకు తిరిగి చెల్లించగలమని, అంతకన్నా మించి కట్టలేమని తేల్చి చెప్పాడు. దీంతో రుణమాఫీ సేటిల్మెంట్ కుదిరింది.
పెద్దరాయుడు, రుణదాతలైన బ్యాంకు అధికారులు, రుణగ్రహీత బాగానే ఉన్నారు. కానీ, ఇదంతా జనం సొమ్ము- రుణమాఫీ చేయడానికి, చేయించుకోవడానికి మీరెవరని అడిగేదెవరు? ప్రశ్నించేదవరు?
ఇళ్లు కట్టుకోవడానికో లేదా పొలం పనుల కోసమో? చిన్నచిన్న అప్పులు తీసుకొని, తిరిగి సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకు అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాన్య ప్రజల కుటుంబ పరిస్థితి ఏంటి?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.