ఫ్రొఫెసర్ హనీబాబు. ఆయన పేరు ఇప్పుడు గుర్తు చేసుకోవటం కూడా కష్టమే. తన వ్యక్తిగత లైబ్రరీలో కుల వివక్ష వ్యతిరేక రచనలు, సామాజిక అణచివేతకు సంబంధించిన పరిశోధనా గ్రంధాలు, ఇతర పెత్తందారీ పోకడలను ప్రశ్నించే రచనలు ఉన్నాయనీ; ఇవన్నీ నక్సలైట్లు, మావోయిస్టుల ప్రచార అంశాలనీ ఆరోపిస్తూ నేషనల్ ఇన్వెనిస్టిగేషన్ ఏజెన్నీ అతన్ని అరెస్టు చేసింది. పూనేలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వాంఖడే ఈ ఆరోపణలు తీవ్ర స్వభావం కలిగినవనీ, తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఎకు అప్పగిస్తున్నట్లు 2019లో ఆదేశించారు. అప్పటి నుంచీ ఎటువంటి న్యాయ విచారణ లేకుండానే హనీబాబు ఐదేళ్లకుపైగా జైల్లో గడిపారు.
భీమాకొరెగాం సంబంధిత కేసుల్లో అరెస్టయిన పన్నెండవ వ్యక్తి ఫ్రొఫెసర్ హనీబాబు. ఎల్గార్ పరిషత్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన బాబును తొలుత పూనే పోలీసులు విచారించారు. తర్వాత కేసు ఎన్ఐఏకు బదలాయించారు. ఈ సందర్భంగా 2019 నవంబరులో కారవాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఇంటర్వ్యూయర్‘‘ఎవరైనా నిన్ను దేశవ్యతిరేకి అని ముద్రవేస్తే, దేశ వ్యతిరేకతనే పదానికి నిర్వచనం ఏమిటి? కొన్ని విషయాల గురించి ప్రశ్నిస్తే దేశవ్యతిరేకి అవుతామా? దేశమనే పదాన్ని ఎవరు నిర్వచించారు’’ అని హనీబాబును ప్రశ్నించారు.
తనను అరెస్టు చేసే క్రమంలో, ఎన్ఐఏ తన లైబ్రరీ నుంచి సేకరించిన పరిశోధనాత్మక రచనలను జాగ్రత్తగా గమనిస్తే తనపై ఆరోపణలు రూపొందించటానికి ఓ పథకం ప్రకారం ప్రయత్నం జరిగిందన్నది అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
హనీబాబు కేరళలోని శ్రీ కేరళ వర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కాలికట్ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తి చేస్తారు. ఆయన అధ్యయనాంశం ఇంగ్లీషు లిటరేచర్. తర్వాత హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేసి అక్కడే 2007 వరకూ లెక్చరర్‌గా పని చేశారు. ఆ తర్వాత అసోసియేట్ ఫ్రొఫెసర్‌గా ఢిల్లీ యూనివర్శిటిలో పని చేయటం మొదలుపెట్టారు. అరెస్టయ్యే నాటికి ఆయన ఢిల్లీ యూనివర్శిటీలో పని చేస్తూ నోయిడాలో నివాసం ఉంటున్నారు.
భాషాశాస్త్రంలో ప్రవీణుడుగా ఉన్న హనీబాబు ఇంగ్లీషు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన ఇంగ్లీషు గ్రామర్ పుస్తకంపై ఆడియో సమీక్ష వెలువరించారు. రత్నసాగర్ అనే పుస్తక ప్రచురణ సంస్థకు ఇంగ్లీషు గ్రామర్‌పై ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ఫార్మల్ సొసైటీ ఆన్ స్టడీ ఆఫ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అనే భాషా పరిశోధనా సంస్థకు సంయుక్త కార్యదర్శిగా కూడా పని చేశారు.
గత సంవత్సరం మరణించిన ఫ్రొసెసర్ జీ ఎన్ సాయిబాబ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏర్పాటైన కమిటీలో హనీబాబు ముఖ్య పాత్రధారి. 2015లో మద్రాస్ ఐఐటీలో నడుస్తున్న అంబేద్కర్– పెరియార్ స్టడీసర్కిల్‌ను ఐఐటీ యాజమాన్యం మూసేయించింది. ఈ సందర్భంగా రాసిన ఓ పరిశోధాత్మక వ్యాసంలో హనీబాబు దేశంలో పేట్రేగుతున్న రిజర్వేషన్ వ్యతిరేక భావజాలం గురించి చర్చించారు.
‘‘ భారతదేశంలో వెనకబాటుతనానికి కులం ఓ ముఖ్యమైన కారణమనే వాస్తవం నిర్వివాదంగా రుజువయిన తర్వాత కూడా ఆధిపత్య వర్గాలు రిజర్వేషన్ల ద్వారా సమానత్వ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు, ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16ల్లో ఉన్న స్ఫూర్తికి ఆచరణ రూపం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం(యూపీఏ) రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పుడు దేశంలోని అగ్రకులాధిపత్యంలో నిండిన మీడియా తీవ్రంగా దుమ్మెత్తి పోసింది. చివరకు రిజర్వేషన్ల వల్లనే దేశంలో కులవ్యవస్థ నిర్మూలన సాధ్యం కాని విషయంగా మారిందన్న వితండ వాదన ప్రచారం చేసేంతవరకూ వీరు ప్రయత్నం చేశారు’’అని ఈ వ్యాసంలో రాశారు.
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహ్యతకు దారితీసిన పరిస్థితుల గురించి విశ్లేషిస్తూ రాసిన వ్యాసంలో, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినపుడు ఆధిపత్య వర్గాలు కూడా గొంతెత్తక తప్పని పరిస్థితి తలెత్తిందని గుర్తు చేస్తూ:
‘‘ అన్ని జీవన పార్శ్వాలలో వేధింపులకు, వివక్షకు గురవుతున్న దళిత– బహుజనులు సమానత్వం కోరుకుంటున్నారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన వారికి కులం ప్రాతిపదికన వివక్ష వేధింపులు గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి వాళ్లు ఇటువంటి పోరాటాల్లో భాగస్వాములు కావటం లేదు. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగినప్పుడు మాత్రం తమ ముందున్న సమస్య ఏమిటో వారికి అవగతమవుతుంది. ఈ విషయంలో సమానత్వం ఆశిస్తున్న పౌరులుగా భావప్రకటన స్వేచ్ఛ ప్రాధాన్యతను గురిస్తున్నారు’’ అని విశ్లేషించారు.
ఛార్జిషీటు దాఖలు చేయటంలో తీవ్రమైన జాప్యం జరిగినందున హనీబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
