ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడి ప్రారంభమై ఇప్పటికి 39 రోజులు గడిచింది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ యుద్ధంలో అయినా నష్టపోయేది, భారాలు మోయాల్సింది ప్రజలే.
లాభపడేది ఆయుధ తయారీ కంపెనీలు, విడిభాగాలు, ముడి సరుకులు సరఫరాదారులు మాత్రమే.
అయితే ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో విజేతలు ఎవరు అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
పాశ్చాత్య మీడియా అంగీకారం..
ఈ యుద్ధంలో టెహ్రాన్ గెలుస్తోందని మనం ఇప్పుడు నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రధాన పాశ్చాత్య వార్తాపత్రికలు కూడా అంగీకరిస్తున్నాయి.
“శాంతి కోసం ట్రంప్ చేస్తున్న తీవ్ర ప్రయత్నం, ఆయన యుద్ధం నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్టు చూపిస్తోంది.
ఇరాన్ స్పష్టమైన విజేత” అనే శీర్షికతో ‘ది ఇండిపెండెంట్’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది నమ్మశక్యం కాని విషయం.
ఎందుకంటే చాలా పాశ్చాత్య మీడియా సంస్థలు దశాబ్దాలుగా అమెరికా చేసిన ప్రతి ప్రధాన యుద్ధానికి మద్దతు ఇచ్చాయి.
ఇరాక్‌పై రెండు యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, యెమెన్‌లపై యుద్ధాలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. కానీ, అనేక ప్రధాన మీడియా సంస్థలు మొదటి నుంచే విమర్శిస్తున్న మొదటి యుద్ధం ఇదే.
అమెరికా చేసిన వ్యూహాత్మక పొరపాటు..
ఉదాహరణకు 2003లో అమెరికా ఇరాక్‌పై చేసిన దాడి కన్నా, ఇరాన్‌పై అమెరికా ప్రస్తుతం చేస్తున్న యుద్ధం చాలా పెద్ద తప్పిదం, వ్యూహాత్మక పొరపాటు అని ‘పొలిటికో’ పత్రిక ఒక సంపాదకీయాన్ని ప్రచురించింది.
గతంలో ఇరాక్‌పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన నాటోకు అమెరికా మాజీ రాయబారి ఈ వ్యాసం రాశారు. కాబట్టి, జరగబోయేది స్పష్టంగా కనబడుతోంది.
ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తోందని అందరికీ సుస్పష్టం.
తప్పుబడుతున్న సాంప్రదాయ కొలమానాలు
అమెరికాకు చెందిన ఒక ప్రధాన విదేశాంగ విధాన సంస్థ అయిన ‘కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ అధికారిక ప్రచురణ అయిన ‘ఫారిన్ అఫైర్స్’ కూడా, ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తోందని అంగీకరిస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది.
ప్రతిష్టాత్మకమైన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఈ వ్యాసం రాశారు.
ఆ వ్యాసంలో “సాంప్రదాయ యుద్ధానికి సంబంధించిన సాంప్రదాయ కొలమానాలను ఉపయోగిస్తే, ఈ సంఘర్షణలో ఇరాన్ అంతగా రాణించడం లేదని అనిపించవచ్చు. కానీ ఇరాన్ స్థితిని అంచనా వేయడానికి ఇవి తప్పుడు కొలమానాలు”అని ఆమె పేర్కొన్నారు.
టెహ్రాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధిస్తోందా లేదా అన్నదే ప్రశ్న. ఇరాన్ అలా చేస్తోందని, అందువల్ల ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తోందని ఆమె అన్నారు.
ఇరాన్ వ్యూహాత్మక లక్ష్యాలు..
“ఇరాన్ ఇప్పుడు అమలు చేస్తున్న వ్యూహం అమెరికా- ఇజ్రాయెల్‌ల కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం” అని కూడా ఆమె తెలియజేశారు.
పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీయడం.
గణనీయమైన ఆర్థిక నష్టాన్ని కలిగించడం. అమెరికా, దాని గల్ఫ్ మిత్రదేశాల మధ్య చీలిక తీసుకురావడం” వంటివి. వీటిని ఇరాన్ ఇప్పుడు సాధించింది.
ఇరాన్ వ్యూహాత్మక లక్ష్యాలలో మొదటిది, అత్యంత ప్రధానమైనది ప్రభుత్వ మార్పును, దేశ పతనాన్ని నిరోధించడం.
ఇరాన్ ప్రభుత్వంలోని రాజకీయ- సైనిక నాయకులందరినీ లక్ష్యంగా చేసుకుని, ‘శిరచ్ఛేద దాడులు’ చేయడం ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని నాశనం చేయగలమని అమెరికా, ఇజ్రాయెల్ మొదట్లో భావించాయి.
కానీ వారు అలా చేయడంలో విఫలమయ్యారు. వాస్తవానికి, ఇరాన్ ప్రభుత్వం తన దృఢత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఇప్పుడు మరింత బలపడింది. దానికి ప్రజల ఆమోదం కూడా పెరిగింది.
దేశంలోని ఇరాన్ ప్రభుత్వ విమర్శకులు సైతం ప్రభుత్వ జెండా వెనుక ఏకమై, దేశానికి మద్దతు ఇస్తూ, ఈ దురాక్రమణ యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా నిరోధిస్తున్నారు. దశాబ్దాలుగా ఇరాన్‌ను సైనికంగా అమెరికా చుట్టుముడుతూ వస్తోంది.
అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆత్మరక్షణ దాడులు..
అమెరికా, ఇరాన్‌ను చుట్టుముట్టి దాని పొరుగు దేశాలన్నింటిలోనూ దాదాపు రెండు డజన్ల స్థావరాలను నిర్మించింది.
కానీ అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధానికి ప్రతిస్పందనగా, ఇరాన్ ఆత్మరక్షణలో భాగంగా ఈ అమెరికా స్థావరాలలో చాలావాటిపై దాడి చేసింది.
టర్కీ ప్రభుత్వ మీడియా సంస్థ అయిన అనదోలు ఏజెన్సీ, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని సంకలనం చేసి మార్చి 30న విడుదల చేసింది.
ఈ యుద్ధం మొదలైన నెల రోజులలో- అమెరికాతో పొత్తు పెట్టుకున్న ఏడు అరబ్ దేశాలలోని అమెరికా స్థావరాలు, కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కనీసం 5,471 క్షిపణి- డ్రోన్ దాడులు జరిపింది. ఇరాన్ ఈ దాడులు అద్భుతంగా విజయవంతమయ్యాయి.
వాస్తవానికి, ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలన్నింటినీ దాదాపుగా ఖాళీ చేయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ఈ పత్రిక 2003 సంవత్సరంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, యెమెన్‌లపై అమెరికా చేసిన దురాక్రమణ దాడులను సంపూర్ణంగా బలపరిచింది.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏనాడు యుద్ధానికి వ్యతిరేకంగా లేదు. “ఇరాన్ దాడులు అమెరికా సైనికులను సుదూరంగా రహస్యంగా పనిచేసేలా తరిమికొట్టాయి” అనే శీర్షికతో వచ్చిన ఒక అద్భుతమైన వ్యాసంలో ఈ విషయం వెల్లడైంది.
“అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతీకారంగా ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ఉన్న అమెరికా స్థావరాలపై బాంబులు వేసింది. దీనివల్ల చాలా మంది అమెరికన్ సైనికులు ఆ ప్రాంతంలోని హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లవలసి వచ్చింది.”
ఆ ప్రాంతంలోని కొన్ని హోటళ్లపై ఇరాన్ ఎందుకు దాడి చేసిందో దీన్నిబట్టి అర్థమవుతున్నది.
ఈ పౌర హోటళ్లలో అమెరికా సైనికులు ఉన్నందువల్లనే ఇరాన్ పౌర ప్రాంతాలపై దాడులు చేసింది తప్ప పౌర ప్రాంతాలపై దాడులు చేయటం ఇరాన్ లక్ష్యం కాదు.
నిజానికి “ఇప్పుడు ఉన్న అమెరికా సైన్యంలో చాలా భాగం రిమోట్‌గా పనిచేస్తూనే యుద్ధం చేస్తోంది” అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇంటి నుంచి ఎలా పనిచేస్తున్నారో నేడు అమెరికా సైనికులలో అత్యధిక భాగం ఆ విధంగా పనిచేయాల్సి వస్తోందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ఎందుకంటే ఇరాన్ వారి స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనం అమెరికా సైనిక అధికారులతో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించబడిందని రాసింది.
పెంటగాన్ ఇప్పుడు దీనిని అంగీకరిస్తోంది. అమెరికా దళాలను తాత్కాలిక ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
అమెరికా- ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు, పశ్చిమ ఆసియాలో, అంటే మధ్యప్రాచ్యం అని పిలవబడే ప్రాంతంలో- సుమారు 40,000 మంది అమెరికా దళాలు ఉండేవని అది పేర్కొంది.
ఇప్పుడు ఈ దళాలలో చాలా మందిని తరలించి, ఐరోపా వంటి సుదూర ప్రాంతాలకు పంపించారు.
కానీ, పశ్చిమ ఆసియాలో ఇప్పటికీ కొన్ని అమెరికా దళాలు ఉన్నాయి. అయితే, వారు తమ అసలు స్థావరాలలో లేరు.
ఇంకా తెలియజేస్తూ, “ఈ ప్రాంతంలో అమెరికన్ దళాలు ఉపయోగించే 13 సైనిక స్థావరాలలో చాలా వరకు నివాసయోగ్యం కాకుండా పోయాయి”అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
కాబట్టి, ఈ ప్రాంతంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన అమెరికా స్థావరమైన ‘అల్ ఉదీద్’ వైమానిక స్థావరంతో సహా, ఈ ప్రాంతంలోని అన్ని ప్రధాన అమెరికా స్థావరాలను ప్రాథమికంగా నాశనం చేయడంలో ఇరాన్ విజయం సాధించింది.
ఇది యూఎస్ సెంట్రల్ కమాండ్ వైమానిక ప్రధాన కార్యాలయం లేదా ఒకప్పుడు వైమానిక ప్రధాన కార్యాలయంగా ఉండేది.
అంతేకాకుండా, యూఎస్ నావికాదళంలో మరో ప్రధాన భాగమైన యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై కూడా ఇరాన్ దాడి చేసింది.
ఆ విధంగా పశ్చిమ ఆసియా నుంచి అమెరికా సైనిక ఆక్రమణదారులను తరిమికొట్టడంలో ఇరాన్ చాలా వరకు విజయం సాధించింది.
ఐరోపా కీలక పాత్ర..
అయితే ఈ అమెరికా సైనికులు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న తలెత్తుతుంది. ‘ఇరాన్ యుద్ధంలో ఐరోపా నిశ్శబ్దంగా కీలక పాత్ర పోషిస్తోంది’అనే శీర్షికతో వాల్ స్ట్రీట్ జర్నల్ మరో విశేషమైన వ్యాసం రాసింది.
ఈ వ్యాసం ప్రకారం, అమెరికా సైన్యం ఐరోపా అంతటా అనేక స్థావరాలను ఉపయోగిస్తోంది.
యూకే, జర్మనీ, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్‌లోని స్థావరాల ద్వారా అమెరికా బాంబర్లు, డ్రోన్లు- నౌకలకు ఇంధనం నింపి, ఆయుధాలు సమకూర్చి, వాటిని ప్రయోగించారని ఆ వ్యాసంలో పేర్కొంది.
యూరప్‌లోని ఈ స్థావరాలను అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా వినియోగించుకుంటోంది.
అంతేకాకుండా, ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి జర్మనీలోని రామ్స్టీన్ స్థావరం కీలక కేంద్రమని కూడా ఇది పేర్కొంది.
యూరోప్‌లోని యూఎస్ మిత్రదేశాలు “అత్యంత మద్దతుగా ఉన్నాయి” అని ఆయన చెప్పినట్టు నాటో అత్యున్నత సైనిక కమాండర్, ఒక యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మాటలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
యూరప్ అంతటా యూఎస్‌కు సుమారు 40 సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటిలో 80,000 మంది యూఎస్ సైనిక దళాలు ఉన్నాయి.
యూరప్‌ను “మధ్యప్రాచ్యం, ఆఫ్రికా రెండింటిలోనూ యూఎస్ కార్యకలాపాలకు ఒక లాంచ్‌ప్యాడ్”గా వాల్ స్ట్రీట్ జర్నల్ అభివర్ణించింది.
ఇరాన్‌పై ఈ యుద్ధం చేయడానికి యూరప్‌లో యూఎస్ ఉపయోగిస్తున్న కొన్ని స్థావరాలను చూపే ఒక మ్యాప్‌ను కూడా ఆ వార్తలో ప్రచురించింది.
ఈ స్థావరాలు అన్నీ యూకే, జర్మనీ, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్‌లలో ఉన్నాయి.
అందువల్ల, ఈ దేశాలన్నీ యుద్ధంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నట్టే లెక్క అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
తాము తటస్థంగా ఉన్నామని, యుద్ధంలో తమ ప్రమేయం లేదని యూరప్‌లోని కొన్ని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. కానీ అది నిజం కాదు. వారు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములే. ఇరాన్‌పై ఈ దురాక్రమణ యుద్ధం చేయడానికి అమెరికా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వారు అనుమతిని ఇస్తున్నందువల్ల వారు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములే.
పశ్చిమ ఆసియా నుంచి అమెరికా సైన్యాన్ని తరిమివేయడంలో ఇరాన్ చాలా వరకు విజయం సాధించిందని నిశ్చయంగా చెప్పవచ్చు.
ఇప్పుడు, ఈ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా ఈ సైనిక స్థావరాలలో కొన్నింటిని తిరిగి పునర్నిర్మించి, ఆ ప్రాంతానికి అమెరికా దళాలను పంపడం కొనసాగించే అవకాశం కచ్చితంగా ఉంది.
గల్ఫ్ దేశాల పునరాలోచన..
ఇరాన్ మరో ప్రధాన లక్ష్యం ఏమిటంటే, అమెరికా- ఇజ్రాయెల్‌తో తమ పొత్తును పునఃపరిశీలించుకునేలా పర్షియన్ గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు నెట్టబడ్డాయి.
ఎందుకంటే, ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి.
ఆ అమెరికా సైనిక స్థావరాలు తమను రక్షిస్తున్నాయని వారు గతంలో భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ అమెరికా సైనిక స్థావరాలు వాస్తవానికి వారి ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తున్నాయి.
భవిష్యత్తులో మరో యుద్ధం జరిగినప్పుడు, ఈ పర్షియన్ గల్ఫ్ ప్రభుత్వాలు అమెరికా యుద్ధానికి సహకరిస్తున్నందున ఇరాన్ వాటిపై దాడి చేసే అవకాశం ఉంది.
అందుకే టెహ్రాన్ ఆత్మరక్షణలో ప్రతీకారంగా వాటిపై దాడి చేసింది.
కాబట్టి భవిష్యత్తులో అమెరికా ఈ స్థావరాలను పునర్నిర్మించడానికి ప్రయత్నించినప్పుడు, ఇది సహజంగానే వారిని పునరాలోచించేలా చేస్తుంది.
“మాకు ఈ స్థావరాలు నిజంగా వద్దు, ఎందుకంటే మీరు మమ్మల్ని రక్షిస్తున్నారని మేము అనుకున్నాము. కానీ వాస్తవానికి మీరు మమ్మల్ని రక్షించడం లేదు, కాబట్టి వద్దు”అని ఈ గల్ఫ్ దేశాలలో కొన్ని అనవచ్చని ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు చేస్తున్న వాదన ఇది. అది వాస్తవం కాదు.
నిజాయితీగా చెప్పాలంటే, ఒకవేళ అమెరికా ఈ స్థావరాలను పునర్నిర్మించాలనుకోవడమంటే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాలు, అమెరికా సైన్యం తమ దేశాలను ఆక్రమించుకోవడాన్ని అనుమతించడమే అవుతుంది.
ఈ దేశాలు చాలా అపఖ్యాతి పాలైనవి. నిజాయితీగా చెప్పాలంటే వాటికి చట్టబద్ధత చాలా తక్కువ.
గల్ఫ్ దేశాల అంతర్గత సంక్షోభం..
పర్షియన్ గల్ఫ్ దేశాలను పరిశీలిస్తే, ఆ ప్రాంతంలోని జనాభాలో అధికశాతం మందికి స్థానిక పౌరసత్వం లేదు. వారంతా విదేశీ జాతీయులే.
ముఖ్యంగా ఖతార్, యూఏఈ దేశాలలో నివసించే ప్రజలలో దాదాపు 90% మంది విదేశీ జాతీయులే. కేవలం 10% మందికి మాత్రమే పౌరసత్వం ఉంది.
వీరు దేశంలోని భారీ చమురు, సహజ వాయు నిల్వల నుంచి ప్రయోజనం పొందే సంపన్న ఉన్నత వర్గాలు.
ఉదారమైన సంక్షేమ రాజ్యాల రాచరిక వ్యవస్థలకు వీరు లంచాలు ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఆ అవకాశాలు మూసుకుపోతాయో అప్పుడు చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచి వారికి గణనీయమైన ఆదాయం ఉండదు.
అప్పుడు వారు సంక్షేమ ప్రభుత్వాలు నడుపుతున్న రాజులకు ఈ కంపెనీలు లంచాలు ఇవ్వవు.
ఈ కొద్దిమంది ఉన్నత వర్గాలు రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది.
జనాభాలో అధికశాతం మందిగా ఉన్న వలస కార్మికులు భయంకరమైన, బానిసత్వపు పరిస్థితులలో పనిచేస్తుంటారు. వారి పాస్‌పోర్ట్‌లను కూడా వీరు లాగేసుకుంటారు.
వారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు చేయవచ్చు. కాబట్టి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లలోని ప్రజాదరణ లేని రాచరిక, నియంతృత్వ, వంశపారంపర్య నియంతృత్వాలను నిలబెట్టడానికే ఈ అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయని భావించాల్సి వస్తోంది.
ఒకవేళ అమెరికా సైన్యం ఈ ప్రాంతాన్ని విడిచిపెడితే, ఈ ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం చాలా ఉంది.
ముఖ్యంగా బహ్రెయిన్ వంటి దేశాలలో అధిక సంఖ్యలో షియా జనాభా ఉంది. కానీ ప్రజాదరణ లేని సున్నీ మైనారిటీ వర్గ ప్రభుత్వం అక్కడ ఉంది.
ఈ యుద్ధం ఫలితంగా ఈ ప్రభుత్వాలలో కొన్ని కూలిపోయే అవకాశం కూడా ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగించవద్దని గల్ఫ్ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం టెహ్రాన్ లక్ష్యాలలో ఒకటిగా ఉంది. టెల్ అవీవ్‌తో సంబంధాలను సాధారణీకరించాలని సౌదీ రాచరికంపై అమెరికా ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో చర్చలు జరిపి ఒత్తిడి తెచ్చింది.
ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ఒత్తిడి..
2020లో మొదటి ట్రంప్ ప్రభుత్వం, అబ్రహం ఒప్పందాలు అని పిలవబడే వాటి ద్వారా యూఏఈ, బహ్రెయిన్‌లపై ఒత్తిడి తెచ్చి, ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సంబంధాలను అధికారికంగా సాధారణీకరించేలా చేసింది.
అప్పటి నుంచి, అమెరికా ఇతర గల్ఫ్ దేశాలపై కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సంబంధాలను సాధారణీకరించేలా ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది కేవలం ట్రంప్ హయాంలోనే కాదు, జో బైడెన్ హయాంలో కూడా జరిగింది.
ఇజ్రాయెల్‌ను గుర్తించాలని సౌదీ అరేబియాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ రియాద్ అందుకు విముఖంగా ఉంది. ఇప్పుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మరోసారి ఇదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే ఏ అవకాశాన్నైనా పునరాలోచించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలను ఇరాన్ నెట్టింది.
ఒకవేళ ఇరాన్‌తో మరో యుద్ధం జరిగితే, అమెరికా- ఇజ్రాయెల్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వారు ఇప్పుడు గ్రహించారు. అప్పుడు ఈ ప్రాంతం నివాసయోగ్యం కానిదిగా మారగలదని వారు గుర్తిస్తున్నారు. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
