బీహార్ రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఒక బీహార్ రాష్ట్ర శాసనసభకు మాత్రమే, అయినప్పటికీ ఇక్కడ వెలుగు చూసి- సంచలనం సృష్టించిన “ఓటు చోరీ” అంశం- దేశం దృష్టిని ఈ ఎన్నికలవైపు తిప్పింది.
ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది, ఒకవైపు ఎన్డీఏ మరోవైపు ఇండియా కూటమి రాష్ట్రంలో ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలోని తమ ముఖ్యమంత్రులను కలుపుకొని, 44 మంది స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ రంగంలోకి దింపింది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు తగ్గేదేలేదంటూ దాదాపు అంతే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి.
మారుతున్న రాజకీయాలలో బీహార్ రాష్ట్ర ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఎటువైపు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. బీహారులో ముస్లిం ఓట్లు కీలకమైనవి. అయినప్పటికీ వారికి అంతగా ప్రాధ్యాన్యత, గుర్తింపు లభించడం లేదన్నది వాస్తవం. రాష్ట్ర జనాభా సుమారు 14 కోట్లు ఉండగా అందులో ముస్లిం జనాభా సుమారు 17.7%. ఈ 17.7శాతంలో 70% మంది ముస్లింలు ఉత్తర బీహార్‌లో నివసిస్తున్నారు.
రాష్ట్రంలోని సుమారు 87 శాసనసభ నియోజికవర్గాలలో 20 శాతానికి పైగా ముస్లింలున్నారు. ఇటీవల కాలంలో సీమాంచల్‌తో పాటు పొరుగు జిల్లాలైన కతిహార్, పుర్నియా, అరారియా జిల్లాలలో దాదాపు 40% వరకు ముస్లింల జనాభా పెరిగింది. కిషన్ గంజ్ జిల్లాలో ముస్లింలదే మెజారిటీ, ఈ జిల్లాలో 68శాతం ముస్లింలున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే, 1952- 2020 వరకు జరిగిన 17 శాసనసభ ఎన్నికల వరకు కేవలం 390 మంది మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు. ఈ సంఖ్య మొత్తం శాసనసభ్యులను కలుపుకుంటే 7.8% మాత్రమే ఉంది. అయితే చివరిసారిగా 1985లో 324 మంది సభ్యులతో ఉన్న ఉమ్మడి బీహార్ శాసనసభలో మొదటిసారిగా 34 మంది ముస్లిం నాయకులు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లోనే మొట్టమొదటిసారిగా అది కూడా ఒకేఒకసారి 10 శాతానికి మించి ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. అంతకు ముందెన్నడూ, ఆ తర్వాత ఇంతవరకు ఇది చోటుచేసుకోలేదు.
2020 జరిగిన ఎన్నిల్లో 243లో కేవలం 19 మంది ముస్లిం నాయకులు శాసనసభకు ఎన్నికయ్యారు. బీహార్‌లో ఇంతవరకు ఒక్కసారి మాత్రమే ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ముఖ్యమంత్రి పదవి వరించింది. అదీ కూడా 1970లో అబ్దుల్ గఫూర్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ ఆయన ఆ పదవిలో రెండేళ్లు కూడా కొనసాగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ముస్లిం సామాజికవర్గానికి వరించలేదు. బీహార్ శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కేవలం నలుగు, ఐదుగురికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. శాసనసభ స్పీకర్‌గా గులాం సర్వర్, శాసనమండలి ఛైర్మన్‌గా జబీర్ హుస్సేన్‌కు అవకాశం లభించింది.
ఇవన్నీ అప్పుడెప్పుడో దక్కిన అవకాశాలు, కానీ గడచిన నాలుగు దశాబ్దాలుగా బీహార్ ముస్లిం ప్రజలకు రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లభించడంలేదని స్పష్టంగా తెలుస్తుంది. అనేక నియోజకవర్గాలలో అభ్యర్ధుల గెలుపు- ఓటములను ముస్లిం సామాజిక వర్గం నిర్ణయించే స్థితిలో ఉన్నప్పటికీ, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది.
బీహారులో ఎక్కవ శాతం ముస్లిం ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత వల్ల చాలా వరకు వెనకబడి ఉన్నారు. వారిని “పస్మందా” అని కూడా అంటారు. ముస్లింలలో అణిచివేతకు గురైన వారిని “పస్మందా ముస్లింలు”గా తెలియజేస్తారు. ఈ వర్గం దాదాపు 73 శాతం వరకు ఉంటుంది. ఈ అత్యంత వెనకబడిన పస్మందా ముస్లింలలోంచి ఇంత వరకు 18% మంది శాసనసభకు ఎన్నుకోబడ్డారు. వారిలో 2020లో ఐదుగురు ఉన్నరు- నలుగురు(మజ్లిస్), ఒకరు(ఆర్జేడీ) నుంచి ఎన్నికయ్యారు. అయితే ఈ ఐదుగురు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత బీహారు ఎన్నికల్లో బీజెపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. మిగితా పార్టీల నుంచి ఎటువంటి స్పష్టత ఇంకానూ రాలేదు. వీటికి తోడు ఎస్ఐఆర్ పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో ఎక్కువశాతం ముస్లింల, మహిళల ఓట్లు ఉన్నాయని పలు వార్తా పత్రిక కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ముస్లింల ఓటు ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
