పారిశ్రామిక విప్లవంతో మత గోడలను దాటుకొని, యూరప్ దేశాల దశ తిరిగి సంపన్న దేశాలుగా అభివృద్ధి చెందాయి. ఆధునిక శాస్త్ర- సాంకేతిక యుగం, యూరపు వైజ్ఞానిక విప్లవం. పోగుబడ్డ సంపద, వలసల కోసం సముద్రాధిపత్యం, సాంస్కృతిక పునరుజ్జీవనాలు కలిసి ప్రపంచం ఎప్పు డూ ఎరగని కొత్త శాస్త్ర- సాంకేతిక శకాన్ని యూరపులో ఆవిష్కరించాయి.
ఆవిరియంత్రాలు, విద్యుత్తు మోటార్లు, రైళ్ళు, విమానాలు, నౌకలు ప్రజాజీవనాన్ని ఆనవాళ్లు పట్టలేనంతగా మార్చేశాయి. యంత్రాలు వచ్చి వస్తువులు గుట్టలు పడి యూరపు ప్రపంచాధిపత్యానికి చేరుకుంది. కానీ, ప్రపంచ యుద్ధాల్ని నెత్తికెత్తుకొని చతికిలపడ్డంతో ఆ హోదాను కాస్తా అమెరికా తన్నుకెళ్ళింది.
ప్రస్తుతం ఆధునిక శాస్త్ర విజ్ఞానమంతా అమెరికా గుప్పిట్లో ఉంది. అణుశక్తి నుంచి అంతరిక్ష విజ్ఞానం దాకా దాన్ని ఢీ కొనగలవారు లేరు. సమాచార సాంకేతికత నుంచి కృత్రిమమేధ దాకా దానికి తిరుగులేదు. ఆధునిక వైద్యం నుంచి రోబోట్స్ దాకా దానికి ఎదురులేదు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సింహభాగం అమెరికాలోనే వున్నా యి. వివిధ దేశాలకు చెందిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు వాటిలోనే వున్నా రు. ప్రతి ఏటా నోబుల్ అవార్డు గ్రహీతల్లో సగానికి సగం అమెరికన్లే. అది పరిశోధనల మీద(2023) పెట్టే ఖర్చు 834 బిలియన్ల డాలర్లు.
ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ప్రపంచాధిపత్యమంతా దాని వైజ్ఞానికశక్తి మీదనే ఆధారపడివుంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆవిష్కరణలు చేస్తూ పరిశోధనా రంగాన్ని పరుగులు పెట్టించడంపైనే వుంది. ఈ పోటీలోకి మరెవ్వరూ దరిదాపులకు కూడా రాలేరని ఇప్పటి దాకా అందరం అనుకున్నాం.
కానీ ఇటీవల చూస్తే వ్యవహారం ఉల్టా అయ్యేలా వుంది. దాని సంకుచిత తిరరోగామి తత్వం, పెత్తందారీవిధానం, ఆర్థికమాంద్యం, విదేశీసంబంధాలు, పెట్టుబడులు, రాజకీయ దృక్పథం- ఇలా ప్రతిదీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికా అగ్రస్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాయి.
ట్రంప్ రాకతో పరిస్థితులు తారుమారు..
ట్రంపు అధికారంలోకి వచ్చాక 1000 శాస్త్ర సాంకేతిక సంస్థలకు నిధులు నిలిచిపోయాయి. జాతీయ క్యాన్సర్ సంస్థకు బడ్జెట్లో 30% కోతబడింది. 4,000 పరిశోధనలకు గ్రాంట్లు నిలిచి పోయాయి. చివరకు 2023లో నోబుల్ అవార్డు సంపాదించి పెట్టిన ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రాజెక్టు కూడా ఆర్థికంగా కష్టాల్లోకి పోయింది. ఇక హెచ్ఐవీ, టీబి, మలేరియా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై పరిశోధన సైతం క్రమంగా అటకెక్కుతోంది. దీంతో జాన్ హాప్కిన్స్లాంటి గొప్ప విశ్వవిద్యాలయం నుంచి సైతం విద్యార్థులు ఆక్స్ఫర్డ్ వంటి సంస్థలకు క్యూ కడుతున్నారు. దాదాపు 1.50 లక్షల విద్యా ర్థులు అమెరికాకు మొహం చాటేస్తున్నారని “గార్డియన్” పే ర్కొంటే, దీనివల్ల 7 బిలియన్ల డాలర్లు నష్టమని “ఫోర్బ్స్” చెప్పుకొచ్చింది.
పురోభివృద్ధి దిశగా చైనా..
మరో ప్రక్క చైనా తన విద్యార్థులందరినీ విదేశాల నుంచి వెనక్కిరప్పించుకుంటోంది. బయోసైన్సు, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, భూపర్యావరణ శాస్త్రాలు, ఆరోగ్య శాస్త్రాల్లో చైనా పరిశోధనలతో సరితూగేవి నేడు ఏ దేశంలో లేవు.
పరిశోధనారంగంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని ‘చైనా సై న్సు అకాడమీ’ ఇప్పటికే వెనక్కి నెట్టేసింది. చైనాలో 2015నాటికే ఓ డజను దాకా ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలున్నాయి.
అంతర్జాతీయ వైజ్ఞానిక పరిశోధనారంగానికి చైనా దోహదం అమెరికాను అధిగమించే రోజులు అతి సమీపంలో ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఉటంకించబడే అత్యంత ప్రామాణిక పరిశోధనా పత్రాల్లో 27.2% చైనావి. పరిశోధనారంగానికి చైనా బడ్జెట్ కూడా 780.7 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది ప్రతి ఏటా 8.7% పెరుగుతోంది. అదే అమెరికా పెరుగుదల మాత్రం 1.7శాతానికి మించి లేదు.
ఇక అత్యాధునిక శాస్త్ర పరిశోధనా రంగాల్లోనూ చైనా దూ కుడు ఇలానే వుంది. శాన్ ఫోర్డ్ యూనివర్శిటీ ఏఐ ఇండెక్స్ రిపో ర్టు(2023) ప్రకారం, కృత్రిమ మేధ పరిశోధనా పత్రాల్లో 40% చైనావి; అమెరికా వాటా కేవలం 10%. క్వాంటం రీసెర్చ్, సెమీ కండక్టర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇన్ఫర్మే షన్, నానో మెటీరియల్స్, స్మార్ట్ రోబోట్స్ ఫ్యూయల్ సెల్స్, కాస్మిక్ డిటెక్టర్స్లాంటి రంగాల్లో కేంద్రీకరించి పరిశోధనలు చేసేందుకు ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక విశ్వవిద్యాలయాలకు, శాస్త్ర పరిశోధనా సంస్థలకు పుష్కలంగా నిధులందించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే పరిశోధనా రంగానికి అత్యంత భారీ పెట్టుబడి త్వరలోనే చైనాది కానుంది. దూరదృష్టితో ఆధునిక శాస్త్రసాంకేతికరంగాల పునాదిని చైనా పటిష్టం చేసుకుంటోంది.
అందరితో పని చేయిస్తోంది. అందరికీ తిండి పెడుతోంది. మరో ప్రక్క ప్రపంచంలో పోటీకి నిలబడుతోంది.
మరి ఒకప్పుడు చైనాతో సమఉజ్జీగా వున్న భారతదేశం ఇప్పుడీ నూతనశాస్త్ర అభివృద్ధిలో ఎక్కడుంది? మనకు మనం ఎన్ని బడాయిలు చెప్పుకున్నా ప్రపంచం మాత్రం మన వైపు చూడ్డం లేదన్నది సత్యం!
సైన్స్‌ను పూర్వపక్షం చేస్తున్నాం. డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాలలో ఎత్తి వేయడమే అందుకు నిదర్శనం. బడ్జెట్లో ఆర్ధిక కేటాయింపులు కూడా నామ మాత్రమే.
విగ్రహాలకు, కుంభమేళాలకు, విచ్ఛిన్న ధోరణులకు, అశాస్త్రీయ ధోరణులకు, పరమత ద్వేషాగ్నీ రగిల్చేందుకు, దేశాభివృద్ధికి పనికిరాని పద్ధతులతో రాజకీయరంగం కాలక్షేపం చేస్తుంది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులను ప్రపంచస్థాయి కుబేరులలో చేరుస్తోంది. ఆర్ధిక అంతరాలతో పేదరికాన్ని మరింత పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో మనం వెనుకబడుతున్నాం.
మన దేశంలోని అభివృద్ధికాముకులు, దేశాభివృద్ధి కోరుకునే శక్తులు, ప్రజాతంత్రవాదులు, వామపక్ష శ్రేణులు దేశాన్ని అభివృద్ధి పంథాన నడిపించేందుకు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
