న్యూఢిల్లీ: ఉర్దూ భాషపై జరిగే ఒక కార్యక్రమానికి ఫిబ్రవరి మొదట్లో ముంబై విశ్వవిద్యాలయం తనను ఆహ్వానించిందని, అయితే చివరి నిమిషంలో ఆ ఆహ్వానాన్ని ఉపసంహరించుకుందని నటుడు నసీరుద్దీన్ షా చెప్పారు.
ఈ అనుభవం తనను అవమానానికి, నిరాశకు గురి చేసిందని ఆయన వివరించారు.
తాజాగా సీనియర్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్ నుంచి కూడా ఇలాంటి ఆరోపణలే రావడంతో ముంబై విశ్వవిద్యాలయం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.
విశ్వవిద్యాలయంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని పట్వర్ధన్ తెలిపారు.
క్యాంపస్‌లో నిరసనలకు సంఘీభావం
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, నిరసన సాగిస్తున్న మాజీ విద్యార్థి భంటే విమాంసకు సంఘీభావం తెలియజేయడానికి గత ఫిబ్రవరి 28న డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత ఆనంద్ పట్వర్ధన్ రాగా, ముంబై విశ్వవిద్యాలయం కలీనా క్యాంపస్ ప్రధాన గేటు వద్ద ఆయనను భద్రతా సిబ్బంది నిలిపివేశారు.
గతంలో రాజేష్ బాల్కండేగా పిలవబడిన భంటే విమాంస ఒక మాజీ రీసెర్చ్ స్కాలర్. పీహెచ్డీ పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం దాటిపోయిందన్న కారణంతో 2023లో ఆయన ప్రవేశాన్ని వర్సిటీ రద్దు చేసింది.
పాలీ భాషా విభాగానికి ప్రభుత్వ నిధులు, బాలుర హాస్టల్ మరమ్మతులు తదితర డిమాండ్లతో ప్రస్తుతం ఆయన క్యాంపస్ లోపల బైఠాయించి నిరసన సాగిస్తున్నారు.
పాలన, పరిపాలనా యంత్రాంగం, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చిత్రాలు తీయడంలో పట్వర్ధన్ గుర్తింపు పొందారు. విశ్వవిద్యాలయంలోకి ఆయన ప్రవేశాన్ని నిరోధించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
పట్వర్ధన్- సామాజిక కార్యకర్తల స్పందన
ఈ సంఘటనపై సామాజిక కార్యకర్త సందేశ్ గైక్వాడ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ- శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ పట్ల ఈ ఘటన ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఒక సీనియర్ చిత్ర నిర్మాత ప్రవేశాన్ని నిరాకరించడం “దురదృష్టకరం” అని పేర్కొంటూ, దీనిపై విశ్వవిద్యాలయం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పత్రికతో మాట్లాడిన ఆనంద్ పట్వర్ధన్, క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా తనను అడ్డుకోవడానికి సరైన కారణం ఏమీ చెప్పలేదన్నారు.
చివరకు, ఆయన విశ్వవిద్యాలయం గేటు వద్దే భంటే విమాంసను కలిసి, సంఘీభావంగా ఒక గులాబీని బహూకరించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విశ్వవిద్యాలయం వివరణ
అయితే, పట్వర్ధన్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నామనే విషయాన్ని ముంబై విశ్వవిద్యాలయం ఖండించింది.
పట్వర్ధన్ రాక గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని పరిపాలనా విభాగం ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
ఒకవేళ తమకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే, ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి తమ వైఖరిని వివరించి ఉండేవాళ్లమని పేర్కొంది.
ప్రస్తుతం క్యాంపస్‌లో కొనసాగుతున్న నిరసనను “చట్టవిరుద్ధం” అని, దానివల్ల భద్రతాపరమైన ముప్పు ఉందని విశ్వవిద్యాలయం పేర్కొంది.
కలీనా క్యాంపస్‌లో 5 వేల మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువుతున్నారని, అలాగే అంతర్జాతీయ విద్యార్థుల వసతిగృహాలు, ఫ్యాకల్టీ నివాసాలు, పరిపాలనా కార్యాలయాలు కూడా అక్కడే ఉన్నాయని తెలిపింది.
అనధికారికంగా జరుగుతున్న ఈ నిరసనల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసమే, లోపలికి ప్రవేశం కోరే వ్యక్తులందరినీ విచారించిన తర్వాతే అనుమతిస్తున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది.
అనువాదకులు: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
