స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా దేశం బానిస మనస్తత్వంలోనే ఉందా? స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఆలోచించలేకపోతోందా? మరీ మెకాలేను గుర్తుచేసుకుని ఎందుకు భారత ప్రధాని బెంబేలెత్తిపోతున్నారూ? “మెకాలే భారతదేశాన్ని బానిస మనస్తత్వంలో ముంచేశాడని”ఎందుకు చెపుతున్నారు? ఆలోచించవల్సిన విషయమే!
అయితే, ఆయన మాటల్లో నిజం ఎంత?
ఇప్పుడున్న విద్యా వ్యవస్థను మార్చి- శూద్రులను, మహిళలను విద్యకు దూరం చేయాలని; మనుస్మృతిని మళ్లీ ప్రవేశపెట్టాలనే భావన ఆయన మాటల్లో ఏమైనా ధ్వనిస్తోందా?
ఆర్ఎస్ఎస్- బీజేపీ హిందుత్వ రాజకీయాలను గత న్నెండళ్లుగా ఈ దేశప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ కుట్రలు, కుతంత్రాలు, ఓట్ చోరీతో అధికారంలో కొనసాగుతూ ఉండడం ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచ పౌరులు కూడ అర్థం చేసుకున్నారు.
2025 నవంబరు 17న ఢిల్లీలో జరిగిన రామ్‌నాథ్ గోయెంకా సభలో, ఈ దేశ ప్రధాని మాట్లాడుతూ- థామస్ బాబింగ్టన్ మెకాలే(1800- 1859)ను గుర్తు చేసుకుని ఎందుకో ఎక్కువ ఆవేశపడిపోయారు. స్వతహాగా ఆయనకు మెకాలే ఎవరో కూడా తెలిసి ఉండదు. ఎవరో ఆర్ఎస్ఎస్ ఆఫీసు నుంచి పంపిన వ్యాసం టెలిప్రాప్టర్పై హిందీలో భావయుక్తంగా అభినయిస్తూ చదవడం మాత్రమే ఆయనకు వచ్చు.
ఒక విజ్ఞుడు, దార్శనికుడు, న్యాయ నిపుణుడు, కవి, రచయితయిన మెకాలే గురించి ప్రధాని స్థాయిలో ఉండి తక్కువ చేసి మాట్లాడడం బావుండదు కదా? అయినా అది- బ్రిటీషు పాలనలో దేశం ఉన్నప్పటి సంగతి!
అప్పుడు దేశం వారి పాలనలో ఉంది కాబట్టి, వారు ఈ దేశ ప్రజలతో వ్యవహారం నడపాలంటే- పౌరులు ప్రపంచ జ్ఙానం ఉన్నవారిగా ఉండాలని వారు కోరుకున్నారు. ఆ సందర్భానికి అది సబబే.
స్వరూపాన్నే మార్చేసిన నిర్ణయం..
సంస్కృతం, వేదాలు, ఫారసీ, ఖురాను, మూఢ విశ్వాసాలలో మునిగి ఉన్న ప్రజలతో బ్రిటీషు అధికారులు వ్యవహారాలు నడపలేకపోయారేమో! ప్రాయోగికంగా అప్పుడు వారికి ఏది అవసరమైందో వారు అది చేశారు.
అయితే అది ఈ దేశానికి దొరికిన గొప్ప అవకాశం. విద్యారంగానికి సంబంధించి మెకాలే తీసుకున్న నిర్ణయం దేశ సామాజిక స్వరూపాన్నే మార్చేసింది.
మతరాజకీయాలు చేసే సంస్థలకు, పార్టీలకు అలాంటి మార్పు నచ్చదు కదా! అందుకే ప్రధాని పదవిలో ఉన్నానన్నది కూడా మరిచిపోయి ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా ప్రస్తుత ప్రధాని మాట్లాడారు.
“శ్రీరాముడు ఒక కల్పన” అన్న మైండ్‌సెట్ ఈ దేశంలో ఉండకూడదని కూడా ఇటీవల గోవాలో మోదీ అన్నారు. గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించినందుకు- అయోధ్యలో కాషాయ జెండా ఎగరేసినందకూ ఈ దేశ ప్రజలు ఆయనను మహాత్మా మోదీజీగా గుర్తుపెట్టుకోవలా? తప్పేలా లేదు మరి?
తప్పులు సరిదిద్దుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ అధికారంలో కొనసాగుతూ ఉండడానికి ఎంతకైనా తెగించే పని, ఈ ధనిక రాజకీయ పార్టీ ఎందుకు చేయదూ? ఆ ఉద్దేశంతోనే మెకాలేపై మోదీ దుమ్మెత్తి పోస్తున్నాడనే విషయం రూఢీగా తెలిసిపోయింది. తాము ప్రవేశపెడదానుకుంటున్న మనువాదానికి మెకాలేనే అడ్డుపడుతున్నాడన్న అక్కసు- బాధ.. పాపం!
ఆర్ఎస్ఎస్- బీజేపీ ఆలోచనా విధానానికి విరుద్ధంగా ఎవరేది చెప్పినా, ఎవరేమి చేసినా అదివారికి నచ్చదు. సమకాలీనంలోనే కాదు, గతంలో బతికిన వాళ్లు కూడా వీళ్లు సమాధుల్లోంచి తవ్వి తీసి, వారి మీద నింద మోపుతారు. అందుకే కదా పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీరికి నచ్చనిది. అంతటితోనైనా ఆగారా? టిప్పు సుల్తాన్, ఔరంగజేబ్‌ల వరకు వెళ్లారు కదా?
అవగాహనలేని ఆవేశపూరిత మాటలు..
సరే, ఇప్పుడు 2025 నవంబర్ 17న రామ్‌నాథ్ గోయెంకా సభలో ఈ దేశ ప్రధాని చెప్పిన ముఖ్యాంశాలు, వాడిన మాటలు ఇవి-
” ‘మెకాలేనే ఆత్మవిశ్వాస్ తోడా’- మెకాలే భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని విరిచేశాడు. ‘ఉన్హోనే హీన్ భావనా పైదాకియా’- ఆయన భారతయుల్లో హీన భావనను పెంచాడు. ‘గులామీకి మానసికత’- బానిసత్వ మనస్తత్వాన్ని పెంచాడు. ‘ఆజాదీ మిల్నేకే బాద్ అవుర్ భీ పుక్తా’- స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఈ బానిస భావ మరింతగా బలపడింది” అని చెపుతూ దేశవాసులకు ఒక గొప్ప సందేశమిచ్చారు.
అదేమిటంటే- “భారతీయులు మానసికంగా సిద్ధపడి పదేళ్లలో 2035 నాటికి మళ్లీ మన భారతీయ మూలాలను వెనక్కి తెచ్చుకోవాలి”-అని! అంటే అప్పటి మనవాదాన్ని మళ్లీ వెనక్కి తెచ్చుకుని బతుకుదాం- అనే కదా ఆయన చెప్పింది?
“మెకాలే ప్రసాదించిన బానిస మనస్తత్వం నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవాలి. సంస్కృతం, ఫారసీవంటి భాషల్ని పునరుద్ధరించుకోవాలి. గురుకులాలు, వేద పాఠశాలలు, మదరసాల్ని మళ్లీ బలోపేతం చేసుకోవాలి. భారతీయ మూలాల్ని మళ్లీ దృఢపరుచుకోవాలి”అని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
“1835లో బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు మెకాలే భారతీయ విద్యా విధానాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించారు. దాన్ని పునరుద్ధరించుకోవడానికి భారతీయులందరూ కంకణ బద్దులు కావాలి”అని ఆయన మరీమరీ ఉద్భోదించారు.
ఈ దేశ ప్రధాని చెప్పిన దాంట్లో నిజాయితీ ఎంత? కపటత్వం ఎంత?
మెకాలే విద్యా సంస్కరణలు నిజంగానే భారతీయుల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేశాయా? లేక ప్రగతి పథాన నడిపించాయా? అన్నది ప్రతి భారతీయ పౌరుడూ విశ్లేషించుకోవాల్సిన తరుణం వచ్చింది.
బ్రిటీషు వారు రాక ముందు- ఇప్పుడు మన తరానికి అందుబాటులో ఉన్న ఈ విద్యా విధానం లేదు. బ్రాహ్మణిజం విభజించినట్లుగా సమాజంలో నిచ్చెనమెట్ల సంస్కృతి చలామణిలో ఉండేది. విద్య- కేవలం అగ్రవర్ణం వారికే అందుబాటులో ఉండేది. అది కూడా మతానికి సంబంధించిన విద్య మాత్రమే!
గురుకులాల్లోనైనా, మదరసాల్లోనైనా మత విద్య తప్ప- ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన విద్య ఉండేది కాదు.
దేశ పౌరులకు విద్యనందించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తించిన అప్పటి సుప్రీం కౌన్సిల్ మెంబరు, న్యాయ నిపుణుడు థామస్ మెకాలే- భారతదేశంలో మతపరమైన విద్యను రద్దు చేసి, ప్రపంచ జ్ఞానాన్ని పెంచే విద్యను తొలిసారి ప్రవేశపెట్టాడు. దీంతో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళం, సామాజికశాస్త్రం వంటివి భారతీయ విద్యార్థులకు అందుబాటులోకొచ్చాయి. ఫలితంగా దేశం త్వరితగతిన అభివృద్ధి పథాన నడవడం ప్రారంభించింది. జనంలో వివేకం పెరుగుతూ వచ్చింది.
విద్య అందిరికీ సమానంగా అందుబాటులోకి రావడం వల్ల, నిచ్చెనమెట్లు కుల సంస్కృతి బలహీన పడింది. తెలివిగల పిల్లలు నిమ్నకులాలవారైనా సరే, విద్యా రంగంలో ఉన్నత స్థాయిని సాధిస్తూ వచ్చారు. ఫలితంగానే పెరియార్, జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలేవంటి సంఘసంస్కర్తలు ఎంతోమంది తయారయ్యారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్‌పటేల్ బీఆర్ అంబేడ్కర్‌వంటి జాతీయనాకులు తయారయ్యారు.
జగదీశ్ చంద్రబోస్, సీవీ రామన్, డా మహేంద్రలాల్ సర్కార్, జమ్‌షట్‌జీ టాటా, అశుతోశ్ ముఖర్జీవంటి శాస్త్రవేత్తలు; రాహుల్ సాంకృత్యాయన్, ఎంఎన్ రాయ్‌వంటి మేధావులు కూడా తయారయ్యారు.
దేశంలో అందుబాటులో ఉన్న చదువును చాలామంది పూర్తి చేసుకుని, విదేశాలలో ఇంగ్లీషులో ఉన్నత విద్యనార్జించి వచ్చారు. వారిలో అనేక మంది మళ్లీ స్వాతంత్ర్య సమరయోధులయ్యారు. వీరిలో ఫూలే దంపతుల కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు బాలికల విద్య కోసం తమ జీవితకాలాన్ని సమర్పించారు. ఇలా ఎంతో మంది త్యాగధనుల కృషి వల్ల మనకు ఈరోజు విద్యారంగంలో ఈ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
దేశాన్ని వైజ్ఞానికంగా ముందుకు తీసుకుపోయిన మన ప్రథమ ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికలు విజయవంతమై- భారతదేశం ప్రపంచంలో తలెత్తుకు నిలబడింది.
ఒకప్పుడు బౌద్ధ దేశంగా ఉన్న కాలంలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించుకుని, ప్రపంచ దేశాలకు విద్యనందించిన ఈ దేశం- మనువాదుల ప్రాబల్యం వల్ల సర్వనాశనమైంది. నూతిలో కప్పలా ఉండిపోయింది.
ఇక్కడి ప్రజలకు భూగోళ స్వరూపం, ప్రపంచ స్థితి గతులు తెలియక; విజ్ఞానశాస్త్ర ప్రసక్తి కూడా లేక, బతుకుతున్న స్థితిలో మెకాలే ఈ దేశ వాసులందరికీ ఆధునిక విద్యను అందించాడు. ఆ తర్వాత భారతీయ విద్యార్థులు విరివిగా విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యనార్జించడం- అక్కడ బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించడం జరుగుతూ ఉంది.
మోదీ చెప్పిన విధంగా భారతీయ మూలాల్ని అంటే- మనువాదాన్ని పునరుద్ధరించుకుంటే ఏమిటీ లాభం? భారతీయ మూలాలు అంటే మనువాదం కాదనీ- అవి బౌద్ధ మూలాలని గ్రహించే శక్తి ఆయనకు లేకపాయే? కేవలం మత గ్రంథాలు చదివి పండితులనిపించుకున్న వారు సమాజాన్ని మూఢవిశ్వాసాల్లోకి తోసేశారు తప్పించి, సమాజానికి వారుచేసిన మేలు ఏమీ లేదు. అలాంటి పండితుల్ని ప్రపంచ ఎప్పుడూ ఎక్కడా గుర్తుంచుకున్న దాఖలాలు కూడా లేవు.
ఇక ఆ రోజుల్లో మహిళల విషయం మరీ దారుణం! వారికి పురుషులతో సమానమైన స్థాయి లేదు. విద్య లేదు. భర్త చనిపోతే, ఏ వయసు ఆడపిల్లయినా “సతీ సహగమనం” చేయాల్సిందే! అంటే మోదీ మళ్లీ సతీసహగమనాన్ని పునరుద్దరించుకుందామని అంటున్నాడా? మనం ఆలోచించాలి.
1834- 1839 మధ్య ఈ దేశంలో ఉండి భారతీయ శిక్షాస్మృతి(ఇండియన్ పీనల్ కోడ్)ను అందించిన మెకాలే- తన మినట్స్ ఆన్ ఎడ్యూకేషన్(1835)లో పొందుపరిచిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. ఇంగ్లీషు భాషకు, విజ్ఞాన శాస్త్రానికి, సాహిత్యం, దర్శనాలువంటి వాటికి భారతీయ విద్యావిధానంలో ప్రాముఖ్యమివ్వాలి. ఈ విషయాలు బోధించే విధ్యాలయాలకు మాత్రమే ప్రభుత్వ నిధులను కేటాయించాలి. సంస్కృతం, ఫారసీ భాషల్లో బోధించే మత విద్యకు నిధులు ఖర్చు చేయకూడదు.
2. 1800 సంవత్సరంలో తీసుకున్న లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత సుమారు 5- 15శాతం. ఇందులో అందరూ బాలురే. బాలికల శాతం శూన్యం.
3. ఆ రోజుల్లో అత్యంత విద్యావంతులుండే బెంగాల్లోనే 1835లో 13శాతం మంది బాలురు మాత్రమే పాఠశాలలకు పోయేవారు.
4. 1872లొ జరిగిన జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తమ్మీద అక్షరాస్యులు 3.2శాతం మాత్రమే-
ఈ పరిస్థితిని గమనించి మెకాలే విద్యారంగంలో, న్యాయవ్యవస్థలో కొన్ని సంస్కరణలు చేశాడు. అవి అధిక సంఖ్యాకులైన ఈ దేశ బహుజనులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో మేలు జరిగింది.
దేశంలోని వేరువేరు ప్రాంతాలలో(రాష్ట్రాలలో) న్యాయవ్యవస్థ బలపడింది. జాతి, మత, ప్రాంత, వివక్షతలు లేకుండా అందిరికీ ఒకే రకమైన శిక్షలు ఉండాలనే నిర్ణయం జరిగింది.
మనుస్మృతి ప్రకారం విద్యావకాశాలు, శిక్షలు వేరువేరుగా ఉండేవని మనకు తెలుసు. ఆ స్థితిని మార్చి- ఒకరకంగా సమాజాన్ని సమానత్వంలోకి తెచ్చినవాడు మెకాలే. అలాంటి మెకాలేను దూషిస్తూ మోడీ ప్రధానిగా కాకుండా అర్ఎస్ఎస్ కార్యకర్తగా, మనువాదిగా మాట్లాడటాన్ని ఈ దేశ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
