
వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలపై వ్యవస్థ ద్వారా ముసురుకుంటున్న కారుమేఘాలను కట్టడి చేసేందుకు రాజ్యం జోక్యం చేసుకోవాలి. అందువల్లన కేవలం శాంతిభద్రతలు కాపాడడం, పోటీతత్త్వంతో కూడిన పెట్టుబడిదారి విధానపు సూత్రాల అమలు వంటి మౌలిక లక్ష్యాలకు పరిమితం కాకుండా రాజ్యం వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాల సంరక్షణకై మరింత విస్తారమైన, చురుకైన, లోతైన పాత్రను పోషించాల్సి ఉంది. ఈ విధంగా చూసినప్పుడు దేశ ఆర్థికవ్యవస్థలో రాజ్యపు ప్రత్యక్ష జోక్యం వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు అవరోధం కలిగించే అంశం కాదు. నిజానికి ఈ రకమైన జోక్యం వ్యక్తులకు స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను మరింతగా అందుబాటులోకి తెస్తుంది.
ఉదార ప్రజాస్వామిక దేశాలలో(లిబరల్ డెమక్రసీస్) ఉదారవాదం ఒక సమగ్ర సిద్ధాంతంగా సుస్థాపితమైంది. యూరప్‌లో వెస్ట్ ఫాలియన్ ఒప్పంద అనంతర కాలం నాటి ఉదార ప్రజాస్వామిక దేశాలతో పోల్చితే, వర్తమానంలో ఈ దేశాలు ఎంతగానో పురోగమించాయనడంలో సందేహం లేదు. ఈ పరిణామక్రమంలో ఉదార ప్రజాస్వామిక దేశాలు నిర్దిష్ట ఆలోచనలు, అవగాహనలు, సూత్రాల ద్వారా ప్రేరేపితమైయ్యాయి(ఈ క్రమంలోనే ఆలోచనలు, అవగాహనలు, సూత్రాలు కూడా తమను తాము మార్చుకుంటూ వచ్చాయనడంలో సందేహం లేదు). నేను ఉదారవాదం అన్న పదాన్ని ఈ ఆలోచనలు, అవగాహనలు, సూత్రాలతో కూడిన అర్థంలోనే ఉపయోగిస్తున్నాను.
ఉదారవాద ప్రజాస్వామిక దేశాల ఆవిర్భావం, అభివృద్ధిలతో సమాంతరంగా పెట్టుబడిదారి వ్యవస్థ, ఆర్థిక పునాదులు కూడా బలోపేతం అవుతూ వచ్చాయి. ఉదారవాద సిద్ధాంతంలో అంతర్భాగమైన రాజకీయ ఆలోచనలు, అవగాహనలు, సూత్రాలు అనివార్యంగా పెట్టుబడిదారి వ్యవస్థ స్వభావానికి సంబంధించిన అవగాహనలతో సమ్మిళితమైయ్యాయి. ఉదారవాదమనే రాజకీయ, ఆర్ధిక సిద్ధాంత చట్రం పరిధిలో స్వేచ్ఛ అన్న భావన ఎలా పనిచేస్తుందో వివరించేందుకు ఈ పుస్తకంలో ప్రయత్నించాను.
ఉదారవాదమన్నది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అయితే, పైన ప్రస్థావించినట్టు ఉదారవాద సిద్ధాంత చట్రంలోనే రెండు స్రవంతులు ఉన్నాయి. వాటిలో ఒకటి పాత లేదా సాంప్రదాయక ఉదారవాదం. వ్యక్తుల ద్వారా కానీ, రాజ్యం ద్వారా కానీ, లేదా నానాటికీ విస్తరిస్తున్న ఆర్థిక గుత్త సంస్థల ద్వారా కానీ, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతుందని సాంప్రదాయక ఉదారవాదం అభిప్రాయపడుతోంది. అయితే, ఈ క్రమంలో పైన ప్రస్థావించిన నిర్దిష్ట శక్తులు- వ్యవస్థలకు ఆవల పని చేసే యావత్ ఆర్థిక వ్యవస్థ ఈ వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించే మౌలిక సాధనం అన్న విషయాన్ని సాంప్రదాయక ఉదారవాదం విస్మరిస్తోంది. ఇక రెండవ స్రవంతిని నూతన ఉదారవాదమని పిలుస్తాను. ఈ నూతన ఉదారవాదంలో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించేది కేవలం నిర్దిష్ట సాధనాలు మాత్రమే కాదని, యావత్ వ్యవస్థ వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రిస్తుందని జాన్ మేనార్డ్ కీన్స్ ప్రతిపాదిస్తారు.
ఒక వ్యక్తి స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను మరో వ్యక్తి హరిస్తున్నప్పడు వాటిని కాపాడాల్సింది రాజ్యమే. ఈ అవగాహనతో సాంప్రదాయక ఉదారవాదం రాజ్యాన్ని సమర్థిస్తుంది. గుత్త సంస్థల పదఘట్టనల నడుమ నలిగిపోతున్న వ్యక్తులను సంరక్షించేందుకు రాజ్యం చైనా గోడలా పోషించే పాత్రను కూడా సాంప్రదాయక ఉదారవాదం సమర్థిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, సాంప్రదాయక ఉదారవాదం శాంతి భద్రతలు, పోటీతో కూడిన ఆర్థిక వ్యవస్థ విధివిధానాలను సమర్ధించడమే రాజ్యం పాత్ర అని భావిస్తోంది. కానీ, ఎప్పుడైనా ఎవరైనా తీసుకునే చర్యలు పాటించే విధానాలు వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతమని భావిస్తే అటువంటి సందర్భాల్లో రాజ్యం జోక్యం చేసుకోవాలని అవగాహనను సాంప్రదాయక ఉదారవాదం ముందుకు తెస్తుంది.
సూత్రప్రాయంగా చూసినప్పుడు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే పోటీతత్త్వంతో కూడిన పెట్టుబడిదారి ఆర్థికవ్యవస్థను వెనుకేసుకోనిరావడంగా కనిపించదు. కానీ, అనివార్యంగా సాంప్రదాయక ఉదారవాదం ఈ పోటీతత్త్వంతో కూడిన పెట్టుబడిదారి ఆర్థికవ్యవస్థను ఆమోదిస్తుంది. పెట్టుబడిదారి ఆర్థికవ్యవస్థలోనే వేతన శ్రామికుడు, యజమాని మధ్య ఉండే సంబంధం వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంగా భావించదు. అంటే వేతన శ్రామికుడు, యజమాని మధ్య ఉండే సంబంధం పెట్టుబడిదారి వ్యవస్థలో శాశ్వతమైన వ్యవస్థాగత సంబంధంగా మారిందన్న అవగాహన కంటే, ఆయా ప్రత్యేక సందర్భాలలో వారిద్దరి మధ్య కుదిరే తాత్కాలిక ఒప్పందమని భావిస్తుంది. అదే నిజమైతే, వ్యక్తిగతకోణంలో చూసినప్పడు పెట్టుబడిదారి వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్దపీట వేయడం ద్వారా ఆయా వ్యక్తుల జీవన స్థితిగతులలో మెరుగుదలకు దారి తీయాలి.
యజమాని- వేతన కార్మికుడి మధ్య యూదృచ్ఛిక సంబంధం..
సంక్షిప్తంగా చెప్పాలంటే, మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా పెట్టుబడిదారి వ్యవస్థ ఆవిర్భావం, యజమాని- వేతన కార్మికుడి మధ్య సంబంధం యాదృచ్ఛికాలేనని సాంప్రదాయక ఉదారవాదం విశ్వసిస్తోంది. ఇటువంటి యాదృచ్ఛికమైన వ్యవస్థలో వ్యక్తులు స్వచ్ఛందంగానే తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. పోటీతత్త్వంతో కూడిన పెట్టుబడిదారి వ్యవస్థలోనే వ్యక్తులు తమ సంపూర్ణమైన స్వేచ్ఛ- స్వాతంత్య్రాలను అనుభవించగలరన్నా విశ్వాసంలోనే సాంప్రదాయ ఉదారవాదపు ఈ అవగాహనకు మూలాలు ఉన్నాయని అర్థమవుతోంది.
సాంప్రదాయక- నయా సాంప్రదాయక ఆర్థిక విధానాలు, సాంప్రదాయక ఉదారవాదానికి కావాల్సిన సైద్ధాంతిక, ఆర్థిక పునాదిని సమకూర్చుతాయి. ఈ రెండు ధోరణుల మధ్య ప్రత్యేకించి పోటీతత్త్వంతో కూడిన పెట్టుబడిదారి వ్యవస్థ గురించిన అవగాహనలో మౌలికమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఈ రెండు ధోరణులు వ్యక్తిగత స్వేచ్ఛకు ఇతర వ్యక్తులు గుత్తాధిపత్య సంస్థలు, మితిమిరిన రాజ్య జోక్యం కారణంగానే వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతోందని విశ్వసిస్తాయి. సాంప్రదాయక ఆర్థిక విధానాలు స్వేచ్ఛాయుతమైన పోటీతత్త్వంలో నమ్మకం ఉంచితే, నయా సాంప్రదాయక అవగాహన సంపూర్ణమైన పోటీతత్త్వాన్ని నమ్ముతుంది. అన్ని రంగాలలోను వేతనాల పెరుగుదల రేటు, లాభాల పెరుగుదల రేటు సమాంతరంగా ఉంటాయని సాంప్రదాయక ఆర్థిక విధానాలు విశ్వసిస్తే, సంపూర్ణ పోటీతత్త్వాన్ని పాటించే నయా సాంప్రదాయక ఆర్థికవిధానాలు ఈ వ్యవస్థలో లాభమే ఉండదని వాదిస్తాయి. ఈ రెండు ధోరణులు తమతమ అవగాహనలను సామాజిక అవగాహనలుగా మార్చేందుకు అవసరమైన సైద్ధాంతిక వ్యవస్థలను నిర్మించుకుంటాయి. తమ వాదనలను ముందుకు తీసుకెళ్తాయి.
మొత్తంగా వ్యవస్థ పనితీరులోనే వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు ముప్పు తెచ్చి పెట్టే స్వభావం, లక్షణాలు ఉన్నాయని అర్థం చేసుకునే ఉదారవాదంలోని రెండో ధోరణి కూడా ఉంది. ఈ అవగాహన ఆధారంగా “లైజే ఫేయిర్”(స్వేచ్ఛాయుత) పెట్టుబడిదారి వ్యవస్థ వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు దోహదం చేసేది కాదని ఈ రెండో ధోరణి భావిస్తోంది. ఎందుకంటే, కీన్స్ చెప్పినట్టు “లైజే ఫేయిర్” పెట్టుబడిదారి వ్యవస్థలో అడపాదడపా కనిపించే ఉద్యోగాల కల్పన తప్ప, విస్తారమైన నిరుద్యోగం శాశ్వత లక్షణంగా ఉంటుంది. ఈ శాశ్వత నిరుద్యోగం వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను ధ్వంసం చేస్తుంది.
ఈ కోణంలో చూసినప్పుడు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సాంప్రదాయ ఉదారవాదంలో మొదటి ధోరణికి, రెండవ ధోరణికి మధ్య వ్యత్యాసాలున్న మాట వాస్తవమే. అదే సమయంలో, విస్తారమైన కార్మికులు దీర్ఘకాల లేదా శాశ్వత నిరుద్యోగంతో సతమతమవుతున్నప్పడు వారు ఎటువంటి అడ్డంకులు లేని స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నారని చెప్పటం వారి జీవితాలను అపహాస్యం చేయడమే అవుతోంది. మరో మాటలో చెప్పాలంటే, ఇసయ్యా బెర్లిన్ చెప్పినట్లు వ్యక్తుల ‘ప్రతికూల స్వాతంత్య్రం’, అంటే, ఇతరుల జోక్యం లేకపోవడం కేవలం అసంపూర్ణమైన స్వాతంత్య్రం మాత్రమే. వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు అవరోధం తెచ్చిపెట్టే మార్గాలు- వ్యక్తులు, రాజ్యం, గుత్తపెట్టుబడిదారి సంస్థలు- కంటికి కనిపించేవి. కానీ, కంటికి కనిపించని ఆర్థికవ్యవస్థ చలన సూత్రాలు, కంటికి కనిపించే పై మూడు సాధనాలు- మార్గాల కంటే పెద్ద ఎత్తున వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను హరిస్తూ ఉంటాయి. అందువల్లన వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలపై కంటికి కనిపించే శక్తులు- వ్యక్తుల కంటే, కంటికి కనిపించని వ్యవస్థాగత శక్తుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలపై వ్యవస్థ ద్వారా ముసురుకుంటున్న కారుమేఘాలను కట్టడి చేసేందుకు రాజ్యం జోక్యం చేసుకోవాలి. అందువల్లన కేవలం శాంతిభద్రతలు కాపాడడం, పోటీతత్త్వంతో కూడిన పెట్టుబడిదారి విధానపు సూత్రాల అమలు వంటి మౌలిక లక్ష్యాలకు పరిమితం కాకుండా రాజ్యం వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాల సంరక్షణకై మరింత విస్తారమైన, చురుకైన, లోతైన పాత్రను పోషించాల్సి ఉంది. ఈ విధంగా చూసినప్పుడు దేశ ఆర్థికవ్యవస్థలో రాజ్యపు ప్రత్యక్ష జోక్యం వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు అవరోధం కలిగించే అంశం కాదు. నిజానికి ఈ రకమైన జోక్యం వ్యక్తులకు స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను మరింతగా అందుబాటులోకి తెస్తుంది. అందుకనే ఈ అవగాహనను కీన్స్ నూతన ఉదారవాదమని పిలిచారు.
అనువాదం: కొండూరి వీరయ్య
(ప్రపంచీకరణ దశలో ప్రపంచవ్యాప్తంగా రానురానూ రాజ్యమే వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను హరించే సాధనంగా పరిణామం చెందుతోంది. గత దశాబ్దానికి పైగా భారతదేశంలో ఈ లక్షణం మరింతగా విజృంభిస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి వ్యవహరిస్తే రాజ్యం వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాల సంరక్షణకు వాహకంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం సరళీకరణ ఆర్థిక విధానాలు ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వాలే వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను హరించి వేస్తూ, ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలకు చెదలు పట్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ రచన “ఉదారవాదానికి ఆవల” వర్తమాన పరిస్థితులలో వ్యక్తిగత స్వేచ్ఛా- స్వాతంత్రాల నేపథ్యంలో మారుతోన్న రాజ్యం పాత్రను అర్థం చేసుకోవడానికి ఒక ఆయుధంగా పనికొస్తుంది. ఈ పుస్తకంలోని ముందుమాటలోని కొంత భాగాన్ని పాఠకుల సౌకర్యార్థం అందిస్తున్నాము. – సంపాదకులు)
పుస్తకం : బియాండ్ లిబరలిజం- ఎకనామక్స్, ఫిలాసఫీ, పాలిటిక్స్; రచన: ప్రభాత్ పట్నాయక్
ప్రచురణ: తులికా బుక్స్, వెల: 950/-
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.