సనాతనం పేరుతో సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలకు లెక్కలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు, ఒకరిని మించి ఒకరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏం సందేశమిస్తున్నారో కూడా వారు తెలుసుకోవడం లేదు.
వైదికమతం గుప్పిట్లో సమాజం పూర్తిగా విలువలు కోల్పోయింది. వాళ్ళు చెప్పే పురాణాలు, గాథలు, సంప్రదాయ కీర్తనలు, భక్తి, మూఢత్వం సమాజాన్ని భ్రష్టు పట్టించాయి.
ఇంతకీ సనాతనంలో ఏముంది? అంటే, అందులో అసమానత ఉంది. నిజాయితీ, నైతికతలు లేవు. బ్రాహ్మణిజమనే కాదు; మతాలేవైనా సరే, మనుషుల సమాన స్థాయి గురించి మాట్లాడవు. అట్లాంటప్పుడు మతాలు ఇంకా అవసరమా? అనేది ఆలోచించుకోవాలి కదా?
అన్ని మంత్రాలు జీవనాధారం కోసమే..!
సనాతన ధర్మం ప్రకారం మగబిడ్డ పుట్టడానికి పుత్రకామేష్టి యాగం చేయాలి. శత్రువులను చంపడానికి శత్రుసంహార మంత్రం ఉండనే ఉంది. అమ్మాయిలను ఆకర్షించి వశపరుచుకోవడానికి వశీకరణ మంత్రముంటే లక్ష్మీదేవిని వశం చేసుకుని డబ్బు సంపాదించేందుకు లక్ష్మి మంత్రం ఉపయోగించాలి.
వర్షాలకు వరుణయాగం! అలాగే విజయానికి, ఆరోగ్యానికి, పెళ్ళికి, చావుకు అన్నింటికీ మంత్రాలే! మరి కష్టపడేది ఎప్పుడూ? కష్ట పడకుండా, చెమట చిందించకుండా, కూర్చుని పొట్ట పోసుకోవడానికి ఒక వర్గం వీటిని సృష్టించి, తమ జీవనాధారం తాము చూసుకున్నారు.
ఇవన్నీ సనాతన వాదుల బోధనలు జీర్ణించుకున్న, నేటి ఆధునికులు కూడా అనుసరిస్తున్నవి! నిజానికి ఏ మంత్రం వల్లా ఏ ఉపయోగమూ ఉండదు. కాయకష్టం చేసి గానీ, సొంత తెలివిని ఉపయోగించుకుని గానీ, భవిష్యత్తుకు దారులు వేసుకోవాల్సి ఉంటుంది.
మనువాదుల అశాస్త్రీయ ప్రచారాలు
సనాతన ధర్మం పేరుతో మనువాదులు చెప్పుకునే గొప్పలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా? ఉదాహరణకు వినాయకుడి తొండం ప్లాస్టిక్ సర్జరీ అంటారు. శివుడు గొప్ప పర్యావరణవేత్త అని చెప్తారు. సీతాదేవి టెస్ట్ ట్యూబ్ బేబీ అని, విమానాలు(పుష్పక) రామాయణ కాలం నాటికే ఉన్నాయనీ, శ్రీలంక వారధి కోతులు కట్టిందేనని చెప్పుకుంటారు.
అంతేకాదు ఇంటర్నెట్ సౌకర్యం మహాభారత కాలానికే ఉందని, సంజయుడు భారత యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడని కోతలు కోస్తారు. విచారించవల్సిన విషయమేమంటే చదువుకున్న మూర్ఖులే ఇలాంటి వివరణలు ఇస్తున్నారు.
సామాన్య పౌరులు తమ వ్యాఖ్యల్ని ఎలా స్వీకరిస్తున్నారోనన్న స్పృహ కూడా వీరికి ఉండదు. ఎంత చదువురాని వారికైనా, ఇంతో అంతో ఇంగిత జ్ఞానం, ఆలోచనా శక్తి ఉంటాయన్నది కూడా వీరు తెలుసుకోరు.
ప్రకృతి విపత్తులు – పాలకుల బాధ్యతారాహిత్యం
ఈ ప్రపంచంలోని సృష్టి సమస్తం, ఆ భగవంతుడిదే అని విశ్వసించే సనాతన వాదులు, కరోనా మాత్రం చైనా సృష్టి అని ఎందుకు చెపుతున్నట్టు? అంటే వారి వాదనల్లోని విషయాల మీద వారికే నమ్మకం లేదని తెలుస్తూనే ఉంది కదా? దేశ భక్తి పేటెంట్ తమదే అయినట్టు గొంతు చించుకునే ఆరెస్సెస్, బీజేపీ నేతలూ, కార్యకర్తలు ఏరీ ఎక్కడా? వరద బాధితులను ఆదుకోవడానికి ఒక్కడైనా కనబడరెందుకూ? వారు విశ్వసించే వారి ధర్మ పరిరక్షకుడైనా వచ్చి ఏ సహాయమూ చేయడెందుకూ?
దేశంలో ఒకచోట క్లౌడ్ బరస్ట్(మేఘవిస్ఫోటనం) అయి వరదలొస్తున్నాయి. మరోచోట కొండ రాళ్ళు విరిగి పడి జనం చచ్చిపోతున్నారు. గుజరాత్‌లోనే బోయింగ్ విమానం మెడికల్ హాస్టల్ మీద కూలి, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోనే వంతెన కూలింది. ఈ సంస్థ, పార్టీ కార్యకర్తలు ఒక్కడైనా ఆయా చోట్ల కనబడలేదు. బాధ్యత గల మంత్రులెవరూ రాజీనామా చేయరు సరికదా, దేశ పౌరులకు క్షమాపణలు కూడా చెప్పుకోరు. తమది మోడల్ రామరాజ్యమని ధీమాగా ఉన్నారేమో?
స్వాముల ఆధిపత్య ధోరణి – యోగ పట్టాలు
సనాతన ధర్మానికి కొందరు అధికారిక ప్రవక్తలుంటారు. వారు తమ వేషభాషలు మార్చుకుని, సామాన్యులకన్నా ఉన్నతులమన్నట్లు ప్రవర్తిస్తుంటారు. నుదుటిమీద, భుజాల మీద గుర్తులు పెట్టుకుని, విచిత్రమైన భాష మాట్లాడుతుంటారు. తాము అధికులమనే భావన కలిగించడానికి నానా తంటాలు పడుతుంటారు.
ఉదాహరణకు స్వాములుగా మారిన వారు పెట్టుకునే పేర్లు గమనించండి. తమ పాత పేర్లను వదిలేసి, సన్యాసి అని తెలిసే విధంగా కొత్త పేరు స్వీకరిస్తారు. దాన్నే “యోగ పట్టం” అని అంటారు.
ఈ యోగ పట్టం పది రకాలుగా ఉండొచ్చని శంకరాచార్య నిర్దేశించారు- అవి: తీర్థ, గిరి, పురి, ఆశ్రమ, వన, భారతి, సరస్వతి, అరణ్య, పర్వత, సాగర-వంటివి; అందుకే చూడండి మనకు నృసింహభారతి, ఆనంద తీర్థ, చంద్ర శేఖర సరస్వతి, విద్యారణ్య వంటి పేర్లు కనబడుతుంటాయి.
పునరావృతమౌతున్న పురాణ సంస్కృతి..!
సనాతన ధర్మ ప్రాశస్త్యం తెలుసుకుందామని ఎవరైనా పొరపాటున పురాణాల్లోకి తొంగి చూస్తే, అక్కడ వారికి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. కారణం అందులో అనైతిక అంశాలు కోకొల్లలుగా ఉంటాయి. మచ్చుకు కొన్ని మాత్రమే తెలియజేస్తాను.
చంద్రుడు చదువు నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ గురువు భార్య తార కనిపిస్తుంది. అంతే, చంద్రుడు ఆమెతో సంబంధం పెట్టుకుని, బుధుడు అనే కొడుకును కంటాడు.
బృహస్పతికి రుచికుడు అనే అన్న ఉంటాడు. ఆయనకు మమత అనే భార్య ఉంటుంది. తన అన్న భార్య మమతతో బృహస్పతి జతకడతాడు.
ఆకుతీరుచి ప్రజాపతికి ఇద్దరు పిల్లలుంటారు. యక్షుడనే మగపిల్లవాడు, సుదక్షిణ అనే ఆడపిల్ల! ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు పెరిగి పెద్ద వారై పెండ్లి చేసుకుని భార్యా భర్తలవుతారు. ఇక సుదర్శనుడనేవాడు సొంత మనుమరాలితో పిల్లల్ని కంటాడు.
సమకాలీన సమాజంలో కూడా ఇలాంటి అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు వింటుంటాం కదా? అంటే ఏంటి? పునరావృతమౌతున్న పురాణ సంస్కృతి అన్న మాట?
ఘనమైన సనాతన ధర్మాన్ని ఇంకా కొందరు నిలబెడదామని ప్రయత్నిస్తున్నారన్నమాట! అయితే, ఇలాంటి వారికి కఠినమైన శిక్షలెందుకు పడుతున్నాయో సంప్రదాయ వాదులే చెప్పాలి.
పురాణాల్లో అక్రమ సంబంధాలు- ద్వాదశ పుత్రులు
అక్రమ సంబంధాల వల్ల పుట్టిన వారికి పురాణ రచయితలు మంచి మంచి బిరుదులు కూడా ఇచ్చారు.
కానీనుడు: పెండ్లి కాక ముందే అక్రమంగా పుట్టిన వాడు.
గూఢోత్పన్నుడు: గూఢంగా అంటే రహస్యంగా పుట్టిన వాడు. భర్తకు తెలియకుండా అక్రమ సంబంధంతో పుట్టిన వాడు.
క్షేత్రజుడు: భర్త అనుమతితోనే అక్రమ సంబంధానికి పుట్టినవాడు.
ఇలా మనకు పన్నెండు రకాల పుత్రులు కనిపిస్తారు. వారినందరినీ కలిపి ద్వాదశ పుత్రులు అని అన్నారు. (దశ- పది, ద్వా-రెండు మొత్తం పన్నెండు రకాలు). ఆడ-మగ భేదం తప్ప ఇందులో వావి వరుసలు లేవు.
ఆనాటి పురాణ రచయితలు ఇవి రాశారంటే అర్థం చేసుకోవచ్చు. అది అనాగరిక సమాజం. వారికి సైన్సు, చరిత్ర, లోక జ్ఞానం వంటివి ఏవీ తెలియవు. ఆ కాలానికి వాళ్ళు అలా రాసుకున్నారని పరిణతి చెందిన ఆధునికులు అర్థం చేసుకోవాలే తప్ప – అవి గొప్ప రచనలనీ, వాటిని ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలనీ చెప్పే మూర్ఖ సనాతనవాదులను ఏమందాం?
వర్ణ వ్యవస్థ- కుట్రపూరిత కట్టుకథలు
ముఖం నుంచి పుట్టిన వాడు ఎంతటి మూర్ఖుడయినా, అతను అస్పృశ్యుడు కాడు. పాదాల నుంచి పుట్టిన వాడు ఎంతటి విద్వాంసుడైనా అతను అస్పృశ్యుడే!- ఇదే బ్రాహ్మణిజం సూక్తి.
సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి. ఇవి నేటి యువతరానికి నచ్చవు- అయినా ముఖం నుంచి, పాదాల నుంచి ఎవరికి ఎవరూ పుట్టరు కదా? అవన్నీ కుట్రపూరితంగా రాసుకున్న కట్టుకథలని ఈ తరం గ్రహించింది.
దేవాలయాలు – భక్తి పేరుతో దోపిడీ
దేవాలయ ప్రాంగణంలో కూర్చున్న ప్రతివాడూ బిచ్చగాడే! తేడా ఒక్కటే ఇంగితం ఉన్నవాడు మనుషుల్ని బిచ్చమడుగుతాడు. అది లేనివాడు రాతివిగ్రహాల్ని అడుగుతాడు.
అయితే, విగ్రహాల్ని బిచ్చమడిగేవాడు పెద్ద మోసగాడు. విగ్రహాల ముందు నిల్చొని ప్రార్థిస్తున్నట్టు నటిస్తూ, భక్తుల్ని నమ్మిస్తూ – వారినే దోచుకుంటాడు. ఇవన్నీ గమనించిన ప్రసిద్ధ తెలుగు కవి గురజాడ అప్పారావు “వర్ణ ధర్మమధర్మ ధర్మంబే” అన్నాడు. నియోగి బ్రాహ్మణుడయినా హేతువాదిగా, సంఘసంస్కర్తగా మారి బ్రాహ్మణిజం పట్ల తనకు ఉన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా వెల్లడించాడు.
బహుజనుల విద్యపై ఆంక్షలు – గుడ్డి నమ్మకాలు
అందరూ చదువుకుంటే వేల సంవత్సరాలుగా మనువాదుల ఆధిపత్యం ఎలా కొనసాగేది? కొంచెం లోతుగా ఆలోచించిన వారికి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వారు శూద్రుల, మహిళల చదువు మీద ఆంక్షలు పెట్టారు. బహుజనుల పిల్లలకు పాలు అందకుండా చేశారు.
పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవుపాలు తెచ్చి, భక్తి పేరుతో, అభిషేకాల పేరుతో రాళ్ళమీద, రప్పల మీద పోయించారు. మట్టి పాలు చేయించారు. దానివల్ల ఏం సాధించినట్టు? చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఇప్పుడేమో ఆవు పేడ తినాలి, ఆవు మూత్రం తాగాలి అని ఆవుమూత్రం ఔషధమని ప్రచారం చేస్తున్నారు. వారు మాత్రం పేడ తినరు. మూత్రం తాగరు కానీ, బహుజనుల్ని ప్రభావితం చేసి, వారితో పేడ తినిపించి, ఆవుమూత్రం తాగించాలన్న కుట్ర వారిది!
ఈ రకంగా బహుజనులు బలహీనులుగా, బానిసలుగా ఉండిపోవాలన్నది వారి కుట్ర.
విషయం అర్థం చేసుకోని కొందరు మూర్ఖ బహుజన నాయకులు బ్రాహ్మణిజ ప్రభావంలో ఇంకా కొట్టుకుపోతూనే ఉన్నారు.
రాజకీయాల్లో మతం వాడుక
బల్లి రాత్రంతా వందల పురుగుల్ని తిని, తెల్లవారగానే శ్రీరాముడి ఫొటో వెనుక దాగుందట! ఇదిగో ఇదే పని ఒక శతాబ్దంగా ఆరెస్సెస్-బీజేపీ చేస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో అదే పని మోదీ- షాలు కొనసాగిస్తున్నారు. ఆధునిక ఆయుధాల పేర్లు కూడా తెలుసుకోని మన దేశనాయకులు దేశాన్ని రక్షించుకునేందుకు తమవద్ద “సుదర్శన చక్రం” ఉందని ప్రకటిస్తారు. పురాణాల్లోని ఒక కల్పిత ఆయుధం తమ దేశాన్ని రక్షిస్తుందనడం హాస్యాస్పదం!
బ్రాహ్మణిజం – భవిష్యత్తు కోసం ఒక సమీక్ష
ఈ వ్యాసంలో బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం వంటి పదాలు వాడినందువల్ల, సమకాలీన బ్రాహ్మణులను ద్వేషిస్తున్నట్టు కాదు. ద్వేషించమని చెప్పడం కూడా కాదు. మనుషులందరిలాగానే వారు కూడా సమానస్థాయి గల మానవులే!
అయితే ఒకప్పుడు బ్రాహ్మణిజం బహుజనుల, మహిళల జీవితాల్ని ఎంత దుర్భరం చేసిందనేది సమీక్షించుకోవడం ఎందుకంటే, గతం తెలుసుకోకుండా కొంతమంది యువతీయువకులు ఒకనాటి బ్రాహ్మణిజపు ప్రభావంలో పడుతున్నారు. అవేవో గొప్ప భారతీయ సంప్రదాయాలన్నట్టు వాటిని అనుసరిస్తున్నారు.
అందుకే వారు గతం తెలుసుకోవాలి! తెలుసుకుంటేనే, సమకాలీనం అర్థమవుతుంది కాబట్టి! వ్యక్తిగతంగానైనా, సమాజపరంగానైనా బ్రాహ్మణిజాన్ని నాశనం చేస్తేనే దేశ భవిష్యత్తు అభ్యుదయ పథంలో వైజ్ఞానికంగా ముందుకుపోతుంది.
సనాతన ధర్మమంటే నేటి హిందుత్వ-హిందూ రాష్ట్ర నినాదాలకు వెన్నెముకలాంటిదన్నది ఈ దేశప్రజలు గ్రహించారు. దాన్ని తరిమి కొట్టడానికి సంసిద్ధులై ఉన్నారు.
సుప్రసిద్ధ సాహితీ వేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
