
స్వాతంత్య్ర సాధన సమయంలో ఈ దేశాన్ని మెజారిటీ మతాధారిత రాజ్యంగా మల్చాలన్న లక్ష్యాన్ని సాధించటంలో విఫలమైన ఆరెస్సెస్ ఆధునిక ప్రజాతంత్ర లౌకిక భారతాన్ని కరుడుకట్టిన మతోన్మాద జాతీయత ఆధారిత దేశంగా, ఫాసిస్టు హిందూరాజ్యంగా మల్చేందుకు గత వంద సంవత్సరాల నుంచి కసరత్తు చేస్తూనే ఉంది.
భారత స్వాతంత్య్రోద్యమం ఆరెస్సెస్ ప్రతిపాదించిన అవగాహనను తిరస్కరించిందన్న చారిత్రవాస్తవాన్ని దిగమింగుకోలేక, ఆ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీని హతమార్చటం ద్వారా ఆరెస్సెస్ తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
ఈ మూడు దృక్పథాల మధ్య ఉన్న సైద్ధాంతిక ఘర్షణలోనే స్వతంత్ర భారతంలో గత ఏడున్నర దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ సైద్ధాంతిక ఘర్షణలకు పునాది వుంది.
భారతీయత భావనను సాకారం చేసుకునే లక్ష్య సాధన ఈ మూడు దృక్పథాల మధ్య జరుగుతున్న పోరాట ఫలితం, పర్యవసానాలపైనే ఆధారపడి ఉంటుంది.
భారతీయత భావనను ఏర్పాటులో వామపక్షాల పాత్ర..
భారతీయత భావనను నిర్మించటంలో భారత కమ్యూనిస్టులు అమోఘమైన కృషి చేశారు. సుదీర్ఘకాలం సాగిన స్వాతంత్య్రోద్యమ సంగ్రామంలో కమ్యూనిస్టులు తీసుకున్న వైఖరి దూరదృష్టి, నిబద్ధత కలిగినదైనందున సమకాలీన పరిస్థితుల్లో భారతీయత భావనను సంరక్షించుకోవడంలోనూ, సాకారం చేయటంలోనూ వామపక్షాల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.
భారతీయత భావనలో నేటికీ అంతర్భాగంగా ఉన్న మూడు కీలకమైన అంశాల గురించిన వామపక్షాల అవగాహన నేపథ్యంలో ఈ భావనను కాపాడుకోవటంలో వామపక్షాల పాత్ర ప్రాధాన్యతను పరిశీలించాలి.
భూ సమస్య: స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ఆధర్యంలో భూసమస్య మీద సమరశీల పోరాటాలు జరిగాయి. ప్రత్యేకించి 1940 దశకంలో సాగిన కేరళలోని పున్నప్ర వాయలార్ పోరాటం, బెంగాల్లో రైతాంగం సాగించిన భాగ ఉద్యమం, అస్సాంలోని సుర్మాలోయ రైతాంగ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ రైతులు సాగించిన పోరాటం వీటన్నిటికీ శిఖరాయమానంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం. దేశంలో భూ సమస్యను ప్రధాన సమస్యగా మార్చటంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ పోరాటాల పర్యవసానంగా తర్వాతి కాలంలో ప్రభుత్వాలు జమీందారీ రద్దు, ఎస్టేట్లను స్వాధీనం చేసుకుని ఆ భూములను దున్నేవానికే పంచటంతో విశాల గ్రామీణ ప్రజానీకం, ప్రత్యేకించి రైతాంగం ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వామి అయ్యింది. ఈ పోరాటాలు కోట్లాదిమంది గ్రామీణ ప్రజానీకాన్ని భూస్వామ్యపు నిరంకుశత్వం నుంచి విముక్తి చేశాయి.
నేటి భారతంలో మెజారిటీ మధ్యతరగతి తెరమీదకు రావటం కూడా ఈ పోరాటాల ఫలితం, పర్యవసానమే.
ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీల తరఫున ప్రభుత్వం సాగిస్తున్న బలవంతపు భూసేకరణ అనూహ్యరీతిలో ప్రమాదకర స్థాయికి చేరుతోంది.
చారిత్రక రైతాంగ పోరాటానికి తలొగ్గి నల్ల చట్టాలుగా గుర్తింపు పొందిన మూడు వ్యవసాయక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయిననప్పటికీ బలవంతపు భూసేకరణనూ, లక్షలాదిమంది రైతాంగాన్ని బేదఖళ్లు చేయటాన్నీ చట్టబద్ధం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్న వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఈ పరిణామాలు మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భూ సమస్య వామపక్షాల కార్యాచరణకు కీలకమైన ఎజెండాగా మిగిలే ఉంటుంది. వర్తమాన భారతదేశంలో అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాల కారణంగా సాధారణ ప్రజల జీవనం చితికిపోతోంది. ఈ నయా ఉదారవాద విధానాలు అడ్డూ అదుపులేని రీతిలో పెట్టుబడిసంచయానికీ, లాభాలు పోగేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దీనికి విరుగుడుగా రైతాంగ పోరాటాలను ఉద్యమాలనూ నిర్మించాల్సి ఉంది. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగల ఏకైక రాజకీయ శక్తి వామపక్షమే.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు: స్వతంత్ర భారతంలో కమ్యూనిస్టులు నిర్వహించిన మరో మహోద్యమం- భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమం. ఈ విధంగా మరికొన్ని శక్తులతో కలిసి భారతరాజకీయ చిత్రపటాన్ని సాధ్యమైనంతవరకూ శాస్త్రీయంగా, ప్రజాతంత్రయుతంగా నిర్వచించి నిర్ధారింపచేయటంలో కమ్యూనిస్టుల పాత్ర అద్వితీయం.
విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కేరళ కోసం సాగిన పోరాటంలో పాల్గొన్న అనేకమంది తర్వాతి కాలంలో ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనేతలుగా ఎదిగారు. ఈ పోరాటాలే అనేక భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడటానికి, రాజ్యాంగంలోని సమాఖ్య భావనకు రక్తమాంసాలు సమకూర్చడానికి, ఆయా రాష్ట్రాల మధ్య సమానత్వం, సహోదరత్వం నెలకొనటానికి తద్వారా ఆధునిక భారతీయత భావన మరింతగా వేళ్లూనుకునేలా చేయటానికి పునాదులు వేశాయి.
సుదీర్ఘ సమరశీల పోరాటాల ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈశాన్య భారతంతో సహా వివిధ ప్రాంతాల్లోని విలక్షణ అస్తిత్వాలకు సమానహక్కులు, హెూదా దక్కకపోవడం వల్లనే ఆయా వేర్పాటువాద ఉద్యమాలు, ప్రత్యేక ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి.
గుర్తింపు, గౌరవం, సమాన హోదా, ఆర్థికాభివృద్ధి, సమాన అవకాశాలు ప్రాతిపదికన ఆయా భాషాపరమైన అస్తిత్వాలనూ, జాతిపరమైన అస్తిత్వాలను పునఃసమీకరించటం, ఈ లక్ష్యాల సాధనకు అవసరమైన ఆర్థిక వనరులు సరిపడా కేటాయించటం ద్వారానే అసమానతలను అధిగమించగలం. ఈ పోరాటాలు రూపొందించి, నిర్మించి, నిర్వహించగలిగింది కేవలం వామపక్షాలు మాత్రమే. ఆ విధంగా వామపక్షాలు మాత్రమే సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన ఆధునిక భారతదేశపు సమైక్యత, సమగ్రతలను సంరక్షించగలవు.
లౌకికతత్వం: భారతదేశపు ప్రత్యేకతలు, నిర్దిష్టతలను కమ్యూనిస్టులు గుర్తించారు. కాబట్టే లౌకికవాదానికి కట్టుబడి ఉన్నారు. ఓ విషయాన్ని స్పష్టం చేయకతప్పదు.
భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతల నడుమ ఏకత్వానికి, ఐకమత్యానికి ఉపకరించే పరిస్థితులు, భావాలు, అవగాహనలను పెంపొందించటం ద్వారా మాత్రమే ఈ దేశపు సమైక్యత, సమగ్రతలను సరంక్షించుకోగలం. సమదృష్టి, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాన అవకాశాలు కల్పించటం ద్వారానే ఇది సాధ్యం.
విశాల భారతంలో ఏదో ఒక మతాధిపత్యాన్నో, ప్రాంతాధిపత్యాన్నో, భాషాధిపత్యాన్నో సుస్థాపితం చేయటం ద్వారా ఈ సమైక్యత సమగ్రతలను సంరక్షించుకోలేము. కానీ మతోన్మాద శక్తుల ఆలోచన, ఆచరణ, అవగాహన దీనికి పూర్తిగా భిన్నంగానూ, విరుద్ధంగానూ ఉంది. అందువల్లనే మతాలు- మతాల మధ్య సంబంధాల విషయంలో లౌకికతత్వం భావన మరింత అవసరం.
దేశ విభజన, తదనంతర రావణకాష్టం వంటి అనుభవాల నేపథ్యంలో ఆధునిక భారతీయత భావన సాధనలో లౌకికతత్వం అనివార్యమైన అంతర్భాగంగా మారింది.
కమ్యూనిస్టుల దృష్టిలో లౌకికతత్వం అంటే రాజ్యపు దైనందిన వ్యవహారాల నుండి మతాన్ని వేరుచేయటం. మతాన్ని మత సంబంధ విషయాలను కేవలం వ్యక్తిగత జీవనానికి విశ్వాసానికి పరిమితం చేయటం. ఈ తరహా లౌకికతత్వం సాధనలో భారతీయ పాలకవర్గాలు ఓ మోస్తరుగానే ముందడుగు వేశాయి.
ప్రజలందరూ తమకు నచ్చిన మత విశ్వాసాన్ని అనుసరించేందుకు సమాన హక్కులు అవకాశాలు కలిగి ఉండాలి. ప్రభుత్వం ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించి ప్రాచుర్యంలోకి తీసుకు రాకూడదు. కానీ ఆచరణలో భారతీయ పాలకవర్గాలు అన్ని మతాలనూ సమానంగా ప్రోత్సహించటమే లౌకికతత్వం అన్న అవగాహనకు దీన్ని కుదించాయి. ఈ ఆలోచన, అవగాహనలోనే ఓ లోపం, పొరపాటు ఉంది. ఈ అవగాహన అనివార్యంగా సంఖ్యాబలం ఉన్న మతానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా చేస్తుంది. ఈ అవగాహన నిజానికి మతోన్మాదులు, ఛాందసవాదులకు సహాయపడుతుంది.
హిందూత్వ మతోన్మాద రాజకీయాలు ఉధృతమవుతున్న ఈ రోజుల్లో, లౌకికత్వానికి కట్టుబడి మతోన్మాద రాజకీయాలకు విరుగుడుగా విశాల ప్రజా వేదికలను నిర్మించి, నికరంగా పోరాడుతున్నది కేవలం వామపక్షాలు మాత్రమే. మతపరంగా అల్పసంఖ్యాకుల హక్కులకోసం రక్షణగా నిలుస్తోందీ, అన్ని తరగతుల ప్రజలకు కనీస జీవన భద్రత, భౌతిక భద్రతల కోసం పోరాడుతోందీ వామపక్షాలు మాత్రమే.
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక దోపిడీకి, అణచివేతకూ, ప్రత్యేకించి కాలం చెల్లిన కులాధారిత పీడనకు బలవుతున్న వారినీ, వైవిద్యమైన భాషలు మాట్లాడేవారిని, బహుమత విశ్వాసాలకు చెందిన వారిని, అన్నిటినీ మించి సామాజిక ఆర్థిక రాజకీయ సమ్మిళిత అభివృద్ధికి దూరమవుతున్న వారిని చైతన్యపరచి సమీకరించటం ద్వారా భారతీయత భావనను బలోపేతం చేసే లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. ఈ అసంపూర్ణ లక్ష్యాన్ని సాధించటం సీపీఎం ఇతర వామపక్షాల ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. భారతీయత భావవ సాకారం చేసుకోవడంలో ఈ లక్ష్య సాధనే కీలకం.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతోంది. ఇది రెండవ భాగం మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)