
లౌకిక ప్రజాతంత్ర భారత రిపబ్లికన్ను ఆరెస్సెస్ తన ఫాసిస్టు ఎజెండాతో, అసహనంతో కూడిన ఫాసిస్టు హిందూరాజ్యంగా మార్చాలని ఆరెస్సెస్ ఎజెండా ప్రతిపాదిస్తోంది.
ఆరెస్సెస్ ప్రతిపాదించిన జాతీయతావాదం, తన లక్ష్యమైన హిందూరాజ్య నిర్మాణాన్ని సమర్ధించేదిగా ఉంది తప్ప, భారతీయ భౌతికవాస్తవికతపై ఆధారపడింది కాదు(కనీసం మౌలిక హిందూమత ప్రవచనాలకు కూడా వ్యతిరేకం కాబట్టే దీన్ని హిందూ రాజ్యమని పిలవాలి).
దీనికి ఆధారమేంటంటే, “ఈ భూభాగం మీద ఏడెనిమిది వేల సంవత్సరాలుగా హిందువులు సంపూర్ణ ఆధిపత్యంతో నిరంతరాయంగా రాజ్యమేలుతున్నారు. ఆ తర్వాతనే విదేశీయులు భారతదేశంపై దండయాత్ర చేసి ఆక్రమించుకున్నారు” అన్న ఆరెస్సెస్ సిద్ధాంతకర్త చేసిన తప్పుడు సూత్రీకరణ.
ఈ విధంగా నిరంతరాయంగా ఈ భూమి హిందువుల ఏలుబడిలో ఉంది కనుక ఇది హిందూస్తాన్ అయ్యిందన్నది పై సూత్రీకరణకు కొనసాగింపే.(మనం, మన జాతీయత నిర్వచనం, ఎంఎస్ గోల్వాల్కర్ 1939, పేజీ 6). (ఆరెస్సెస్‌కు, వారి సిద్ధాంతకర్తలకు, దాని అనుయాయులకు చరిత్రలో ఏం జరిగిందన్నది పట్టింపు లేదు. హిందూస్తాన్ పదాన్ని ప్రప్రథమంగా ఉపయోగించింది అరబ్బులే. సింధు నదికి ఇవతలి ప్రాంతాన్ని గుర్తించేందుకు వాళ్లు పెట్టుకున్న పేరు అది. సింధు పదం ‘స’ అన్న అక్షరంతో మొదలవుతుంది. కానీ అరబ్బిక్ భాషలో ‘స’ అక్షరాన్ని హ అని పలుకుతారు. ఈ విధంగా సింధూ ప్రాంతం కాస్త హిందూ ప్రాంతం, సింధు దేశం కాస్తా హిందూ దేశం అయ్యింది.)
అహేతుకమైన, చారిత్రకంగా నిరూపణకు నిలవని వాదనలు, ఆధారాల ప్రాతిపదికన భారతదేశం నిరంతరాయంగా హిందువులకు మాత్రమే నివాస స్థానంగా ఉందన్న వాదనను ముందుకు తెచ్చిన హిందూత్వ ఆధిపత్యవాదులు ఈ దేశాన్ని పరమత సహనానికి తావులేని దేశంగానూ, చరిత్ర చూడని చీకటి యుగాల నాటి మూఢ విశ్వాసాలకు కేంద్రమైన దేశంగానూ మల్చేందుకు కంకణం కట్టుకున్నారు.
“ఈ నిర్ధారణకు అనివార్యమైన ముగింపు ఏమిటంటే, హిందూస్తాన్ ఉనికిలో ఉంది. ఉనికిలో ఉండాల్సిన అవసరం ఉంది. హిందూస్తాన్ అత్యంత ప్రాచీన దేశం. ఇది హిందూ దేశం తప్ప మరోటి కాదు. హిందూదేశంతో సంబంధం లేనివారంతా అంటే హిందూ జాతితో, మతంతో, సంస్కృతి, భాషలతో సంబంధం లేని వారంతా ఈ దేశపు జాతీయ జీవనానికి బయటే ఉంటారు. వెలివేయబడతారు” అన్నది భారతీయత గురించిన ఆరెస్సెస్ అవగాహన.
“హిందూ జాతిని ప్రస్తుతం ఉన్న కూపం నుండి బయటికి తెచ్చేందుకు, పునరుద్ధరింపచేసేందుకు, పునర్నిర్మించేందుకు సాగే ఉద్యమాలే నిజమైన జాతీయ ఉద్యమాలుగా ఉంటాయన్నది అనివార్యమైన తార్కిక ముగింపు. హిందూ జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసేందుకు కృషి చేసేవాళ్లూ, ఈ జాతిని తమ గుండెల్లో దాచుకునేవాళ్లూ తమ లక్ష్య సాధన కోసం అంకితమవుతారు. మిగిలిన వాళ్లంతా దేశ ద్రోహులు, ఈ దేశానికి, దేశ హితానికీ కీడు చేసే వాళ్లే. వారి గురించి కాస్తంత మర్యాదగా చెప్పాలంటే పనికిమాలిన వాళ్లు” గోల్వాల్కర్, 1939, 2 43-44).
భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆవిష్కృతమైన భారతీయత భావనకు ఆరెస్సెస్ అవగాహన పూర్తి విరుద్ధమైనది. జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో “చారిత్రకంగా ఒకదానితో ఒకటి అద్భుతమైన మేళవింపుతో ఒదిగిపోయిన భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, వారసత్వాల మేలుకలయికే భారతదేశం. ఈ విధంగా మేళవించిన సాంస్కృతిక వారసత్వంలో ఒక్కో పొరపైనా ఒక్కో భావజాలం లిఖించబడి ఉంటుంది. అయితే ఈ క్రమంలో అప్పటికి పూర్వమున్న చరిత్ర, సంస్కృతి, సాంస్కృతిక వారసత్వాలను సంపూర్ణంగా ధ్వంసం చేసేది కాదు. ఈ భారతీయ సాంస్కృతిక వారసత్వం.”
రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ “ఆర్యులు, ఆర్యేతరులు, ద్రావిడులు, చైనీయులు, సింథియన్లు, హూళులు, పఠానులు, మొఘలులు అందరూ తమతమ మూలాల నుండి వేరుపడి ఈ నూతన అస్తిత్వంలో సంపూర్ణంగా ఒదిగిపోయారు” అన్నారు. ఆ నూతన అస్తిత్వమే భారతదేశం. భారతీయత.
ఆరెస్సెస్ అవగాహన సమ్మిళిత జాతీయవాదమే భారతీయత అన్న అవగాహనకు పూర్తిగా భిన్నమైనది. ఆరెస్సెస్ నిర్మించదల్చుకున్న హైందవోన్మాద జాతీయత అంతిమంగా కరుడుకట్టిన విద్వేషాన్ని మనసంతా నింపుకున్న హిందూరాజ్యం తప్ప మరోటి కాదు.
దీని ప్రమాదకరమైన పరిణామాలు, పర్యవసానాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆరెస్సెస్ ప్రాజెక్టు పురోగమించాలంటే భారతీయ చరిత్ర స్థానాన్ని పురాణేతిహాసాలు, తత్వశాస్త్రం స్థానాన్ని హిందూ ధర్మశాస్త్రాలు ఆక్రమించుకోవాలి. విద్యార్ధులకు సద్భుద్ధులు నేర్పించే పాఠ్యాంశాలను ఓ పథకం ప్రకారం మార్చటం వెనక ఆరెస్సెస్, బీజేపీల మౌలిక లక్ష్యం ఇదే. తదనుగుణంగా ఆరెస్సెస్ చెప్పిన హిందూత్వ అవగాహనను ఆపాదమస్తకం ఆవహించుకుని ఉన్న వ్యక్తులను ఉన్నత సాంస్కృతిక, విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో స్థాయిల్లో బాధ్యతల్లో నియమిస్తోంది.
అహేతుకతకు పెద్దపీట..
తాత్వికరంగంలో అహేతుకతకు, నిర్హేతుకతకు పెద్దపీట వేయటమే ఈ తరహా ప్రజాకర్షక జాతీయవాదాలు చేసే పని, *జార్జి లూకాస్ “ధ్వంసం అవుతున్న హేతువు” అన్న గొప్ప రచన చేశారు. తాత్విక అహేతుకతను, నిర్హేతుకతను, వాటి ఫలితాలు, పర్యవసానాలను బట్టబయలు చేసే రచన అది.* సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ రచనను మనం పునశ్చరణ చేసుకోవాలి.
ఈ రచనలో అనేక కోణాలు వివరిస్తూ లూకాస్ జర్మనీలో హిట్లర్ మనకు తెలిసిన హిట్లర్‌గా మారే క్రమంలో తాత్వికరంగం పోషించిన పాత్రను పాఠకుల ముందుంచుతారు.
“నిర్హేతుకత ప్రపంచ సామ్రాజ్యవాదంతో విడదీయరానంతగా పెనవేసుకున్న ధోరణి” అని నిర్ధారిస్తారు.
నిర్వచనంగా చెప్పుకోవాలంటే హేతుబద్ధ ఆలోచనా ధోరణికి బద్ద శతృవే అహేతుకత.
హేతురాహిత్యం, యూరోపియన్ దేశాలు దాటి వచ్చిన పునరుజ్జీవన దశ మొదలు నేడు ప్రపంచం ప్రయాణిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దశ వరకూ అన్ని దశల్లోనూ మానవజీవనం, జీవితం హేతుబద్ధంగా సాగాలన్న మౌలిక సూత్రానికి వ్యతిరేకంగా సాగిన, సాగిస్తున్న పోరాటంలోనే ఈ అహేతుకత వ్యక్తమవుతూ వచ్చింది.
హేతువు అన్నది మనిషికి విజ్ఞానాన్ని అందించటంతో పాటు వాస్తవాలను విప్పి తెలుసుకునేందుకు మార్గం, సాధనంగా ఉంటుంది. మనిషి హేతుబద్ధంగా ఆలోచన చేయలేని రోజు మూర్ఖుడుగా మిగిలిపోవటమే కాక కళ్లముందున్న వాస్తవాలను కూడా గుర్తించలేడు.
లూకాస్ చెప్పినట్లు మనకు తెలిసిందే యావత్ జ్ఞాన సాగరం కాదు. మన అవగాహన సామర్ధ్యాలకు బయట శోధించి మధించాల్సిన విశాలమైన, లోతైన జ్ఞానసాగరం ఉంది. మనకు తెలిసిన దానికీ, తెలుసుకోవల్సినదానికీ మధ్య వారధి హేతుబద్దమైన ఆలోచనే. ఇటువంటి హేతుబద్ధమైన ఆలోచనను పెంచి పోషించటానికి బదులు ఏ ఒక్కరూ సంపూర్ణ జ్ఞాని కాలేరు. కాబట్టి దానికోసం వెంపర్లాట అనవసరం.
సంచిత జ్ఞానాన్ని స్వీకరించటమే కర్తవ్యంగా పెట్టుకోవాలని, స్వతంత్రంగా ప్రశ్న వేసుకుని ఆలోచన చేయటం మానుకోవాలని అహేతుకత బోధిస్తోంది. నిర్ధారిస్తోంది.
నమ్మకం ద్వారానే యావత్ జ్ఞానాన్ని ఆర్జించవచ్చనీ అందువలన గుడ్డిగా అనుసరించటమే అన్నిటికంటే మెరుగైన ఉత్తమమైన జ్ఞానార్జన సాధనమని నమ్మింప చూస్తోంది. హిందూత్వం కూడా జనానికి అటువంటి నమ్మకం, అంధ విశ్వాసం అన్న తియ్యటి గోళీలనే పంచుతోంది. దీని వల్ల హిందూత్వం రెండు లక్ష్యాలు సాధిస్తోంది. ఈ తరహా కార్యాచరణతో ద్వారా హిందూత్వ శక్తులు సాధించుకున్న మొదటి లక్ష్యం సయాఉదారవాద దోపిడీని మరింత ఉధృతం చేసే మార్గాలు అవకాశాలకు పూర్వ రంగాన్ని సిద్ధం చేయటం అయితే, రెండో లక్ష్యం ఈ దేశాన్ని ఫాసిస్టు ధార్మిక రాజ్యంగా మార్చటం.
ఫాసిస్టు ఆరెస్సెస్ ముందుకు తెచ్చిన హిందూత్వ ఎజెండాను సాధించే దిశగా దేశంపై మితవాద శక్తులు చేస్తున్న ఉదృతమైన దాడికి ప్రతిరూపమే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం. ఈ శక్తులు భారతీయత భావనపై బహుముఖ దాడి చేస్తున్నాయి. అడ్డు అదుపు లేని నయా ఉదారవాద విధానాల రూపంలోనూ, నానాటికీ పెరుగుతున్న కార్పొరేట్ శక్తులు, మతోన్మాద శక్తుల మధ్య ఐక్యత రూపంలోనూ, జాతీయ వనరులను దోచుకోవడంలోనూ, అవినీతికి చట్టబద్ధత కల్పించే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రూపంలోనూ ఈ బహుముఖ దాడులు ముందుకొస్తున్నాయి. భారత రాజ్యపు మూల స్థంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్యతత్వం, సామాజిక న్యాయం, సార్వభౌమత్వాలపై ఈ శక్తులు ఓ పథకం ప్రకారం దాడి చేస్తున్నాయి. చట్టం ద్వారా నిర్మితమైన

పార్లమెంట్, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు, వ్యవస్థలను కూలదోయడం తద్వారా హిందూత్వ రాజ్య నిర్మాణానికి ఎటువంటి అడ్డుగోడలూ లేకుండా చేసుకునేందుకు ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో మోడీ ప్రభుత్వం పని చేస్తోంది. పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ, ప్రజాతంత్ర హక్కులపై దాడి పేట్రేగిపోతోంది.
ఈ పరిస్థితుల్లో బీజేపీని గద్దె దింపటం మౌలిక కీలక లక్ష్యంగా ఉంటుంది. ఈ కర్తవ్య నిర్వహణలో తమతమ మధ్య ఉండే చిన్న చిన్న విబేధాలు పక్కన పెట్టి ఐక్యంగా పని చేయాల్సిన బాధ్యత రేపటి కోసం మెరుగైన భారతాన్ని నిర్మించాలనుకునే దేశభక్తులు, సంస్థలు, పార్టీలు, శక్తులపై ఉన్నది.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమైంది. ఇది మూడో భాగం, రెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.