
హైదరాబాద్: ఓటు చోరీ అంశంపై ప్రతిరోజూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నేపథ్యంలో ఈ అంశంపై చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, పౌర సమాజం లేవనెత్తిన అనుమానాలు, అడుగుతోన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఒకే ఒక సమాధానం చెప్తోంది.
అన్ని విషయాలు పౌరసత్వ చట్టం- 1955లోనే ఉన్నాయని మొండిగా వాదిస్తుంది. ఈ పరిస్థితిలో అసలు పౌరసత్వ చట్టం- 1955లో ఏముందో తెలుసుకుందాం.
1955లో పౌరసత్వ చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పౌరులు భారత పౌరసత్వాన్ని పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
ఇందులో మొదటిది, విదేశీయులు భారత పౌరసత్వాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా లేకా సహజంగా పొందవచ్చు. ఉదాహరణకు ఒక విదేశీ మహిళ భారతీయ పురుషిడిని వివాహం చేసుకొని, ఇక్కడే నివసిస్తున్నట్టైతే ఆమె ఏడు సంవత్సరాల తర్వాత భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అలానే విదేశీయులు 11 సంవత్సరాలు దేశంలో నివాసం ఉన్నట్లైతే, ఆ తర్వాత దేశపౌరసత్వం సర్వసాధారణంగా లభిస్తుంది.
11 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు కుదింపు..
పౌరసత్వ చట్టాన్ని తొలిసారిగా 1986లో సవరించారు. ఆ తర్వాత 1992, 2003, 2005, 2015లో కూడా చట్టంలో సవరణలను తీసుకొచ్చారు.
2003లో నమోదైన కేసు ఆధారంగా దేశంలోకి అక్రమ వలసదారుల రాకను మొదటిసారి గుర్తించారు. ఆ తర్వాత 2005లో “ఓవర్సీస్ సిటిజన్షిప్”ను అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరసత్వాలను పొందిన వారిని మినహాయించి మిగితా దేశాలలో కొన్ని వర్గాలకు చెందిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు, భారతదేశ పౌరసత్వాన్ని పొందవచ్చు.
అయితే, 1955లో తీసుకువచ్చిన పౌరసత్వ చట్టాన్ని 2019లో ఎన్డీఏ ప్రభుత్వం అనేక సవరణలు చేసింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీనినే సీఏఏ అని కూడా అంటారు.
సీఏఏ దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఎందుకంటే, సీఏఏ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ కంటే ముందు వివిధ కారణాల వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాలలో విచారణను ఎదుర్కొంటున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ, క్రిస్టియన్ మైనార్టీలకు భారత దేశం పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఆయా దేశాల నుంచి ఈ జాబితాలో ముస్లింలను చేర్చకపోవడం పట్ల ఆందోళను జరిగాయి.
అంతేకాకుండా, 2019లో సవరించిన చట్టం ప్రకారం, విదేశీయులు సహజంగా పౌరసత్వాన్ని పొందే కాలవ్యవధిని 11 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.