
నిజానికి ఇది పిచ్చి ముదిరిన వాదన. (ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఖండాలు ప్రయాణించిన మార్గాన్ని అంచనా వేసే స్థాయిలో అభివృద్ధి చెందిన) భూగర్భ శాస్త్ర పరిజ్ఞానం గోల్వాల్కర్‌కు లేదని, అందువల్లనే ఇటువంటి పిచ్చి వాదనలు ముందుకు తెచ్చారని మనం అంగీకరిద్దామన్నా మనం ఒక చిన్న ప్రశ్న వేయాలి.
ఆయన చెప్పినట్లే నేటి బీహార్, ఒరిస్సాల ప్రాంతం ముందుకు కదిలి వెళ్లిపోయిందనుకున్నా, ఆయా ఖండాల మీద నివసిస్తున్న జనాభాను వదిలి ఎలా వెళ్లిపోయింది? ఒక భూఖండం కదిలితే దానిమీద సమస్త జీవరాశులు, నదీనదాలు దాంతోపాటే కదిలిపోతాయి. గోల్వాల్కర్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దిగటానికి, అన్నీ కదిలిపోయాక ప్రజలు మాత్రం ఆకాశంలో వేళాడుతూ ఉండరు కదా?
ఇటువంటి మోసపూరిత వాదనలు కేవలం ఆర్యులు భారతదేశంలోనే పుట్టారని, బయటి నుంచి వచ్చిన వారు కాదని నిరూపించటానికి మాత్రమే. ఫాసిస్టు హిందూ రాష్ట్రను నిర్మించాలన్న రాజకీయ లక్ష్యానికి ఈ వాదన అత్యంత కీలకమైనది.
గోల్వాల్కర్ తన వాదనలో అంతర్గత సామరస్యత సమకూర్చటానికి గాను చరిత్రను దారుణంగా వక్రీకరించటానికి పూనుకున్నారు. మహాభారతం కాలం నాటి వరకు కొనసాగిన హిందూ జాతి గొప్పదనాన్ని కీర్తిస్తూ, ఆ తర్వాత కాలంలో “చరిత్రలో మరో కొన్ని శతాబ్దాల పాటు ఏం జరిగిందన్నది తెలియని స్థితి ఉంది. గుర్తించబడ్డ చరిత్ర పరిశోధన కూడా ఆ కాలానికి సంబంధించిన చరిత్రను నిర్ధారించలేకపోయింది. అయితే, ఈ కాలంలో హిందూ జాతి ఎటువంటి తొట్రుపాటులు, ఒడిదుడుకులు లేకుండా తన మనుగడ సాగించిందని మాత్రం నిర్ధారించవచ్చని ముగిస్తారు.
ఆ తర్వాత బుద్ధుడు, గుప్త వంశానికి సంబంధించిన అశోకుడు, హర్షవర్ధనుడు, విక్రమాదిత్యుడు, పులకేశి వంటి చక్రవర్తులు వచ్చారు. వీరి కాలంలో భారతదేశంలో శాంతి, అధికారం, పుష్కలత్వం సాధించబడ్డాయని చెప్పటానికి కావల్సినన్ని చారిత్రక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. జగజ్జేత అలెగ్జాండర్ దండయాత్ర భారత జాతి చరిత్రలో ఒక మచ్చ మాత్రమే. ఆయన ఎంత త్వరగా వెనుదిరిగాడంటే, ఆయన ఈ దేశంపై దండయాత్ర చేశాడని చెప్పటానికి కూడా వీలులేని స్థితి నెలకొన్నది” అంటారు గోల్వాల్కర్. (గోల్వాల్కర్. 1939, పేజి 9)
చరిత్రను– శాస్త్ర విజ్ఞానాన్ని తిరస్కరించటం..
గోల్వాల్కర్ జీవించి ఉన్న సమయానికి అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను నిర్లక్ష్యం చేయటం, ఇంకా చెప్పాలంటే తిరస్కరించటం ద్వారా భారతదేశపు మధ్య యుగాలను హిందూ రాజుల పరిపాలనలో ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతున్న వ్యవస్థలుగా నిర్ధారించారు. ఆయన ప్రస్తావించిన రాజుల పేర్లకే పరిమితమై చూసుకున్నా, హర్షవర్ధనుని దండయాత్రలను నిలువరిస్తూ రెండో పులకేశి నర్మదా తీరంలో హర్షవర్ధనుడిని ఎందుకు ఓడించాడు?
గోల్వాల్కర్ మాటల్లో వీరిద్దరూ గొప్ప హిందూ రాజులు. ఒకే జాతికి చెందిన రాజులు, గోల్వాల్కర్ వాదన చరిత్రనే కాదు. సామాజిక అభివృద్ధి సూత్రాలను కూడా కాలదన్నుతోంది.
రాజులు పరస్పరం ఎందుకు యుద్ధాలు చేశారు? సామ్రాజ్యాలు ఎందుకు ఆవిర్భవించాయి? ఎందుకు పతనం అయ్యాయి? బానిస వ్యవస్థ భూస్వామ్య వ్యవసాయక వ్యవస్థకు ఎందుకు మారింది? లేదా బ్రిటిష్ సేనలు ఆధునిక ఆయుధాలతో హిందూ రాజులను ఎందుకు లొంగదీసుకున్నాయి? అంత గొప్ప హిందూ రాజ్యం అటువంటి ఆధునిక ఆయుధ శక్తిని ఎందుకు తయారు చేయలేకపోయింది?గోల్వాల్కర్ అభిప్రాయంలో ఇటువంటి ప్రశ్నలన్నీ అర్ధం లేనివి.
ఇదే తరహాలో అణచివేత స్వభావం కలిగిన హిందూ సాంప్రదాయాలకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన తిరుగుబాట్లు, ఉద్యమాలను కూడా ఆయన చూడ నిరాకరిస్తారు. బౌద్ధాన్ని కూడా హిందూమతంలో మరో పార్శ్వంగా ఆయన పరిగణిస్తారు. నిజానికి భారతదేశంలో పుట్టిన సిక్కిజం, జైనిజం వంటి అన్ని మతాలను హిందూమతం గొడుకు కిందకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తారు.
గత ఎనిమిది వందల సంవత్సరాలుగా, భారత దేశ చరిత్ర మొత్తం దురాక్రమణకు ప్రయత్నిస్తున్న ముస్లింలను ఎదుర్కొంటున్న హిందూ దేశ చరిత్ర తప్ప మరేమీ లేదని ఆయన నమ్మించబూనుకుంటున్నారు. అంతిమంగా ముస్లింలపై విజయం సాధించిన తర్వాత హిందూ జాతిని కొత్త శతృవు బ్రిటిష్ పాలకులు లొంగదీసుకుంటారని ఆయన సూత్రీకరిస్తారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఆయన “ దీర్ఘకాల యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు, దేశవ్యాప్తంగా జరిగిన ఆఖరి ప్రయత్నం”గా చెప్తారు. (గోల్వాల్కర్, 1939, పేజి9) (ఇక్కడ దీర్ఘకాల యుద్దం అంటే ముస్లిం రాజులకు వ్యతిరేకంగా 800 ఏళ్ల పాటు హిందూ రాజులు సాగించిన యుద్దంగా అర్థం చేసుకోవాలి- అను)
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ తిరుగుబాటులో ఆఖరికి రాణి ఝాన్సీబాయి వంటి హిందూ రాణి సైతం, మొఘల్ చక్రవర్తి బహదూర్ష్ జాఫర్‌ను తమ ప్రతిఘటనకు నాయకుడిగా గుర్తించిన విషయాన్ని కూడా గోల్వాల్కర్ చూడ నిరాకరిస్తారు. 1857 తిరుగుబాటు ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ రాజుల పోరాటమే స్వాతంత్య్రం కోసం భారతీయులు సాగించిన పోరాటమా? చరిత్రకు సంబంధించిన ఇటువంటి అనేక వాస్తవాలు, సత్యాలు గోల్వాల్కర్‌కు అనవసరం.
అంతేకాదు. ఒక జాతికి ఐదు లక్షణాలు ఉండాలని కూడా గోల్వాల్కర్ ప్రతిపాదిస్తారు. అవి భౌగోళిక ప్రదేశం, జాతి, మతం, సంస్కృతి, భాషలుగా ఆయన గుర్తిస్తారు. (గోల్వాల్కర్ 1939 పే33)
భారతదేశంలో నివసిస్తున్న హిందువులకు ఈ ఐదు లక్షణాలు ఉన్నాయని, అందువల్ల వారంతా ఒకటే జాతి అని నిరూపించే దిశగా ఆయన కసరత్తు ముందుకు సాగుతుంది.
అయితే గోల్వాల్కర్‌కు ఈ మాత్రం నిరూపించటం కూడా అంత తేలికైన పనికాదు. వీటన్నింటిలోకీ ఆసక్తికరమైన లక్షణం మతం, కొంతవరకు భాష (గోల్వాల్కర్ 1939 పే33)అని ఆయన అభిప్రాయపడతారు. ఆయన దృష్టిలో జాతి అత్యంత ప్రాధాన్యత కలిగిన లక్షణం. ఈ కారణంగానే ఆయన హిందువులు, ఆర్యులు అనే పదాలను పర్యాయపదాలుగా తరచూ ప్రయోగిస్తారు. చారిత్రక ఆధారాలతో ఆయనకు పనిలేదు.
ఆర్యులను స్వంతం చేసుకోవటం..
ఆయన వాదన మొత్తంలో సింధు నాగరికత దేశీయంగా ప్రారంభమైన ఆర్యుల నాగరికత. అదే నిజమైతే మరి సింధు నాగరికత ఎందుకు పతనం అయ్యింది? దాని పతనానికి సంబంధించిన అంతర్గత కారణాలు ఏంటి? బయటి శక్తుల దాడుల వల్ల ఈ నాగరికత పతనం అయితే, బయటి నుంచి దాడి చేసిన శక్తులేంటి? ఈ ప్రాంతంపై దాడి చేసిన తర్వాత విజేతలు ఇక్కడే నివసించారా, వెనక్కు వెళ్లిపోయారా? ఇక్కడే నివసిస్తే పుట్టుకొచ్చిన మిశ్రమ జాతి ఏంటి?
చారిత్రక వాస్తవాలు ఇప్పుడు సంఘపరివారానికి అసౌకర్యం కలిగించినట్లే, నాడు కూడా ఇటువంటి ప్రశ్నలన్నీ గోల్వాల్కర్‌కు అసౌకర్యాన్ని కలిగించాయి. అటువంటి ప్రశ్నలన్నింటినీ ఎదుర్కోవటానికి ఆయన “నమ్మకం ఆధారం” అన్న వాదనను ముందుకు తెచ్చారు.
ఉదాహరణకు ప్రసిద్ధి గాంచిన చరిత్ర పరిశోధకురాలు రొమిల్లా థాఫర్, “వైదిక సంస్కృతంలో ఉన్న భాషను గమనిస్తే, ఇండో యూరోపియన్ భాషల సముదాయం నుంచి ఈ భాష భారతదేశానికి వచ్చిందని రుజువు అవుతుంది. అంతే తప్ప భారతదేశమే ఆర్యుల మాతృభూమి అన్న వాదనను బలపర్చేదిగా లేదు” అని వివరించారు. (సెమినార్– 400. డిసెంబరు, 1992. 1989 నాటి సెమినార్ పత్రిక 364వ సంచికను కూడా చూడవచ్చు).
గోల్వాల్కర్ తన పుస్తకంలో ఇటువంటి చారిత్రక ఆధారాలన్నింటిని తిరస్కరిస్తూ, పాదపీఠికల్లో “అర్యులు కాస్పియన్ సముద్రం, ఆర్కిటిక్ లేదా మరో ప్రాంతం నుంచి గుంపులు గుంపులుగా వచ్చి దండయాత్రలు చేశారని, తర్వాతి కాలంలో పంజాబ్ ప్రాంతంలో స్థిరపడి తూర్పు దిశగా గంగా పరీవాహక ప్రాంతానికి విస్తరించారని, అలా విస్తరించటం ద్వారానే అయోధ్య పట్టణానికి చేరుకున్నారని చరిత్రకారులు పదేపదే చెప్తూ ఉంటారు. తద్వారా పశ్చిమాన ఉన్న హస్తినాపురం కంటే తూర్పున ఉన్న రామాయణంలో చెప్పబడ్డ అయోధ్య ప్రాచీన నగరమన్న అర్థం కూడా వస్తుంది. కానీ చరిత్రకారులు మహాభారతం రామాయణం కంటే పూర్వపు కాలానికి చెందినదని కూడా బోధిస్తుంటారు. దురదృష్టవశాత్తూ ఇటువంటి భావనలు వివిధ విశ్వవిద్యాలయాలు రూపొందించిన బోధనాంశాల ద్వారా మన యువతరం బుర్రల్లో కుక్కబడుతున్నాయి. అందువల్ల మన చరిత్రను మనమే అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. రాసుకోవాలి. తద్వారా పైన చెప్పినటువంటి ఉద్దేశ్యపూర్వకంగా గానీ, ఉద్దేశ్య రహితంగా గానీ బోధించబడుతున్న చరిత్ర వక్రీకరణను తిరస్కరించాలి” అని ప్రతిపాదిస్తారు. (గోల్వాల్కర్, 1939, పేజి 5–6)
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారానికి వచ్చీ రాగానే పాఠ్యపుస్తకాలు, బోధనాంశాలు మార్చటమే మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోవటానికి గల పునాది ఈ వాదనలే. ఈ సిద్ధాంతాలు, వాదనలు ఎంతగా ఆమోదయోగ్యం కానివైనా, వీటి ఆధారంగానే గోల్వాల్కర్ సామాజిక జీవితంలో మతానికి పెద్దపీట వేస్తారు.
అయితే, మతాన్ని ఆచరించటానికి, ఇలా పెద్దపీట వేయటానికి మధ్య సంబంధం లేదు. ఇది కేవలం ఆరెస్సెస్ కోసం తాను ప్రతిపాదించిన రాజకీయ లక్ష్యాన్ని సాధించటం కోసమే. మతాన్ని రాజకీయాలు, ప్రభుత్వం నుంచి వేరు చేసి, మతం వ్యక్తిగతమని ప్రతిపాదించే ఆధునిక లౌకిక భావనను కూడా ఆయన తిరస్కరిస్తారు.
లౌకికతత్వం నిజానికి ఉన్మాదం అని వాదిస్తూ, ” మతం వ్యక్తిగతం అని భావించే పద్ధతి ఉంది. ఈ వాదన మతానికి రాజకీయాల్లో స్థానం లేదని చెప్తోంది. మతం గురించి తప్పుడు అభిప్రాయం ఆధారంగా ఇటువంటి వాదనలు ముందుకొస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే మనకు ప్రజలు పాటించే చెప్పుకోదగ్గ ఏ ఒక్క మతమూ దొరకదు”అని (గోల్వాల్కర్, 1939, పేజి 23) ఆయన అంటారు.
హిందూమతం తప్ప మరో చెప్పుకోదగ్గ మతం ఏమీ లేదని ఘంటాపథంగా చెప్తున్న గోల్వాల్కర్, “చెప్పుకోటానికి అటువంటి మరో మతం లేదు- వ్యక్తిగత జీవితంలో గానీ, సామాజిక జీవితంలోగానీ దాని పాత్రను చూడ నిరాకరించటానికి ఏ కారణమూ లేదు. రాజకీయాల్లో మతానికి ఉన్న విస్తృతమైన పాత్రకు అనుగుణంగా దానికి ప్రాధాన్యత ఉండాలి. నిజానికి అటువంటి మతాల విషయంలో చూసుకున్నపుడు రాజకీయాలే అత్యంత పరిమితమైన అంశాలుగా కనిపిస్తాయి. కేవలం మతం ఆదేశాలను పాటించే ఒకానొక సాధనంగా మాత్రమే కనిపిస్తాయి.” (గోల్వాల్కర్ 1939 పే33)
ఇటువంటి వాదనల ద్వారా ఆయన చారిత్రక అనుభవాలను తిరస్కరిస్తారు. ఒకే మతాన్ని గుర్తించిన ప్రభుత్వాలున్న దేశాలు, బహుళ మతాలను గుర్తించిన ప్రభుత్వాలున్నదేశాలు, అసలు ఏ మతాన్ని అధికారిక మతంగా గుర్తించని ప్రభుత్వాలున్న దేశాలు మన ముందుంచిన అనుభవాలను పరిగణించటానికి గోల్వాల్కర్ సిద్ధపడటం లేదు.
ఏ రూపేణా చూసుకున్నా ఏ దేశంలోనూ మతం ఒక్కటే జాతిని ఐక్యం చేసిన సంఘటనలు లేవు. వాస్తవాలు గోల్వాల్కర్ ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెండూ ముస్లిం మతాన్ని అవలంబించే దేశాలే, అయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రజలు తమకు స్వతంత్ర దేశం కావాలని పోరాడి విముక్తి పొందారు. ఇటువంటి వాస్తవాలు పరిశీలించటానికి గోల్వాల్కర్ లాంటి వాళ్లకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం మతాన్ని సాధనంగా వాడుకోవటం గోల్వాల్కర్క్కు అత్యావశ్యకం.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం ఆరు భాగాలుగా ప్రచురితం అవుతుంది. ఇది మూడో భాగం, రెండో భాగం కోసం “హిందూ రాష్ట్ర అంటే ఏంటి?” మీద క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.