
భాష విషయంలో గోల్వాల్కర్ మోసకారితనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశంలో అనేక భాషలు ఉనికిలో వినియోగంలో ఉన్నాయి. ప్రతి భాషకు తనదైన చరిత్ర ఉంది. సంస్కృతి, వారసత్వం ఉన్నాయి. అటువంటి భాషల ప్రాతిపదికనే దేశంలో జాతులు ఆవిర్భవించాయి. అటువంటి భాష ప్రాతిపదికన ఆవిర్భవించిన భిన్న జాతులు సహజీవనం చేస్తున్నాయి. కానీ గోల్వాల్కర్ ఈ మొత్తాన్ని ఒక్కమాటలో కొట్టిపారేస్తాడు. “భాషా ప్రాతిపదికన ఐక్యత హర్షించదగ్గ విషయమనీ, భారతదేశంలో ఒకే జాతి కాక అనేక జాతులు ఉన్నాయనీ, ఈ జాతులన్నీ భాషా ప్రాతిపదికన విభజితమై ఉన్నాయని అనిపిస్తోంది. కానీ నిజానికి అది వాస్తవం కాదు.
భారతదేశంలో ఒకే భాష ఉంది. అది సంస్కృతం. ఇప్పుడు మనం చూస్తున్న భాషలన్నీ సంస్కృతం నుంచి పుట్టుకొచ్చినవే. ఒకే మాతృకకు పుట్టిన పిల్లలు. సంస్కృతం దేవ భాష, ఆసేతుహిమాచలం యావత్తు, తూర్పు పశ్చిమ సముద్రాల నడుమ ఉన్న దేశమంతటా ఈ భాష ఒక్కటే. ఆధునిక సోదర భాషలన్నీ సంస్కృతం మాధ్యమంగా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఆ విధంగా దేశంలో ఉన్న అన్ని భాషలు ఒక్కటే. వేర్వేరు భాషలు కాదు. ఏ గొంతుతో అయినా ఏ భాషలో అయినా ప్రావీణ్యం సంపాదించటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆధునిక భాషల్లో సైతం హిందీ ప్రజలందరికీ అర్థమయ్యే భాష, వివిధ రాష్ట్రాల్లో వాడకంలో ఉన్న భాష(5, 1939, 2.43)
అటువంటి తర్కం కేవలం భారతదేశానికి మాత్రమే వర్తిస్తుంది.అనేక యూరోపియన్ దేశాలు ఒకే భాషను ఉపయోగిస్తాయి. ఇండో యూరోపియన్ భాషా సముదాయానికి చెందిన వేర్వేరు భాషలు కూడా ఆయా దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. యూరప్ నేడు వేర్వేరు భాషల ప్రాతిపదికన ఏర్పడిన జాతులున్న దేశాలు, ఆయా దేశాల్లో ఉపయోగించే భాషలు, వాటికంటూ స్వతంత్ర చరిత్ర, సాంప్రదాయం వాటికి కొనసాగింపుగా ఉన్న సంస్కృతుల సమ్మేళనం వల్లనే ఆయా భాషలు తమ ఉనికిని కొనసాగిస్తున్నాయి. కానీ ఈ చారిత్రక, వర్తమాన ఆధారాలు, సాక్ష్యాలు గోల్వాల్కర్‌కు అవసరం లేదు. వాస్తవం పట్ల కళ్లు మూసుకుని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న చందంగా భారతదేశంలో ఉన్న వైవిధ్యాన్ని చూడ నిరాకరిస్తూ భారతదేశంలో ఒకటే భాష ఉందనీ, ఒకటే సంస్కృతి ఉందని నిరూపించటానికి మాట బిగువున గోల్వాల్కర్ ప్రయత్నించాడు.
గోల్వాల్కర్ అందించిన ఈ అవగాహనా వారసత్వంతోనే కాషాయదళం భారతదేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించటాన్ని వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తూ ఉంది. తమిళం, కశ్మీరీ భాషలు పుట్టుకకు సంస్కృతానికి మధ్య సంబంధం లేదన్న వాస్తవం కూడా వాళ్లకు పట్టదు.
ఇంకా చెప్పాలంటే, సంస్కృత భాషే ఇండో యూరోపియన్ భాషా సమూహానికి చెందిన భాష. ఈ చెట్టు నుంచి పుట్టుకొచ్చిన మొక్క ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో, ఈ భాషా సమూహం నుంచి పుట్టిన వేర్వేరు భాషలు అభివృద్ధి చెంది వర్ధిల్లినట్లే ఈ ప్రాంతంలో సంస్కృతం అభివృద్ధి చెంది కొంత కాలం వర్థిల్లింది. కాషాయ దళం ఉర్దూ భాషను వ్యతిరేకిస్తుంది. భారతదేశంలో ఉన్న భాషలన్నింటిలో ఉర్దూ ఒక్కటే పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ధి అయిన భాష, ఈ కోణంలోనే దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలన్న ప్రయత్నాన్ని చూసినపుడు వారి ఉద్దేశ్యాలు స్పష్టమవుతాయి. వాళ్ళ నినాదం ‘హింద్, హిందీ, హిందూస్తాన్’ ను పరిశీలిస్తే రానున్న కాలంలో భారతదేశంలోని కోట్లాదిమంది హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజానీకం భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్ధమవుతుంది.
జాతి గురించి పాశ్చాత్య అవగాహనతోనే కాదు భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో ఇమిడి ఉన్న అవగాహనతో కూడా గోల్వాల్కర్ అవగాహన భిన్నంగా ఉంది. గోల్వాల్కర్ తనంతట తాను “రాష్ట్రం అన్న భావన సంపూర్ణం కావాలంటే అందులో దేశం, జాతి, ప్రజలు అంతర్భాగంగా ఉండాలి” అంటాడు. (గోల్వాల్కర్, 1939, పేజి 52)
తన వాదనను పై చేయి చేసుకోవటానికి, ఆయన ఈ అవగాహనను కలగాపులగం చేసి “ఇందులో మతం, భాష, సంస్కృతి గురించిన ప్రస్తావన లేనప్పటికీ ప్రజలు జనపదం అన్న భావనలో ఈ మూడు కలిసి ఉన్నాయి” అన్న వితండవాదన ముందుకు తెస్తాడు.
పెచ్చరిల్లిన అసహనం..
అశాస్త్రీయమైన వాదనలు, అహేతుకమైన చారిత్రక వాదనల ద్వారా భారతదేశంలో అనాది నుంచి హిందువులే నివసిస్తున్నారని, దేశం హిందూ దేశంగా ఉందని వాదనాపటిమతో ప్రతిపాదించిన తర్వాత అటువంటి దేశానికి సంబంధించిన సహనశీల రాహిత్యాన్ని, అందుకవసరమైన సరుకు సరంజామాను దట్టించటానికి ప్రయత్నిస్తాడు.
“ఒక విషయం మనముందు సాక్షాత్కారం అవుతుంది. హిందూస్తాన్లో కేవలం, ప్రాచీన కాలంలో లాగా హిందూ జాతి మాత్రమే ఉండగలదు. ఉండాలి. హిందూ జాతి, సంస్కృతి, భాషలకు చెందని ఇతర అన్ని రకాల ప్రజలు జాతీయ జీవనం పరిధికి బయటే ఉంటారు.”
“మేము పునరుద్ఘాటిస్తున్నాము. హిందూస్థాన్ హిందువుల భూమి మాత్రమే. జాతికి సంబంధించిన ఆధునిక అవగాహనలో ఉన్న ఐదు అంశాలును తృప్తిపర్చే విధంగా హిందువుల దేశంగానే ఉంది. ఉండాలి. ఉంటుంది. అదేవిధంగా హిందూ జాతిని ప్రస్తుత దుస్థితి నుంచి పునఃశక్తివంతం చేసి, పునఃనిర్మించే ఉద్యమాలు మాత్రమే జాతీయ ఉద్యమాలుగా ఉంటాయి. హిందూ జాతి కీర్తి పతాకాన్ని పైకెత్తి పట్టే వారు మాత్రమే జాతీయ దేశ భక్తులుగా ఉంటారు. ఈ లక్ష్య సాధన కోసం వారు రంగంలోకి దూకుతారు. మిగిలిన వారంతా జాతీయ లక్ష్యాలకు విఘాతం కలిగించే విద్రోహులుగా గానీ, శతృవులుగా గానీ ఉంటారు. వారి పట్ల కాస్తంత దయతో మాట్లాడాలంటే అటువంటి వాళ్లను మూర్ఖులని చెప్పవచ్చు.” (గోల్వాల్కర్, 1939, పేజి 43-44)
తన వాదనను గోల్వాల్కర్ కొనసాగిస్తూ, ” ఒక విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. జాతికి సంబంధించినంత వరకు, ఐదు మౌలిక లక్షణాలు పరిధికి బయట ఉన్నవారికి ఈ జాతీయ జీవనంలో ఎటువంటి స్థానం, పాత్ర ఉండదు. అలా పాత్రను, స్థానాన్ని కోరుకుంటే వారు అనుసరిస్తున్న భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలను వదులుకోవాలి. ఈ జాతికి సంబంధించిన మతం, సంస్కృతి, భాషలను ఆమోదించి సంపూర్ణంగా ఈ జాతితో విలీనం కావాలి. వారు భిన్నమైన జాతిగా కొనసాగుతున్నంత కాలం మత పరమైన సాంస్కృతిక వైవిధ్యం కొనసాగిస్తున్నంత కాలం వాళ్లు విదేశీయులుగానే ఉంటారు.” (గోల్వాల్కర్, 1939, పేజి 45)
తన అసహజపూరిత వాదనను మరింత బలోపేతం చేసుకుంటూ, “(దేశంలో ఉన్న) విదేశీయులకు రెండే మార్గాలు ఉన్నాయి. వాళ్లు ఈ జాతితో విలీనం కావటం, ఈ జాతి సంస్కృతి, సాంప్రదాయాలను అలవర్చుకోవటం, లేదా దేశీయ జాతి అంగీకరించినంతకాలం వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకులు వెళ్ళదీసుకోవటం, దేశీయ జాతి పొమ్మన్నప్పుడు మూట ముల్లె సర్దుకుని దేశం విడిచి వెళ్లిపోవటం. వివిధ దేశాల అనుభవం ఆధారంగా ఈ కోణం నుంచి చూసినపుడు హిందూస్తాన్లో ఉంటున్న హిందువులు కాని జాతి, హిందూ సంస్కృతి– భాషలను అనుసరించాలి. హిందూ జాతిని, సంస్కృతిని ఆరాధించటం పూజించటం మినహా వాళ్ల మనసుల్లోకి మరో భావన రాకూడదు. వాళ్లు తమ ప్రత్యేక గుర్తింపును వదులుకోవాలి. హిందూ జాతిలో విలీనం అయిపోవాలి. లేదా హిందూ జాతి అధిపత్యానికి లోబడి లొంగిపోయి బతకాలి. వాళ్లకు హక్కులు, అవకాశాలు, అధికారాలు ఏమీ ఉండవు. అటువంటివి ఏవీ కోరకూడదు. తమను ప్రత్యేకంగా చూడాలన్న ఆలోచన వదులుకోవాలి. కనీస పౌర హక్కులు కూడా ఆశించకూడదు. ఇది మినహా వాళ్లకు మరో ప్రత్యామ్నాయమార్గం అంటూ ఏమీ లేదు. ఉండకూడదు. మనది ప్రాచీన జాతి. ఆయా దేశాల్లో నివసించదల్చుకున్న విదేశీయుల పట్ల ప్రాచీన జాతులు ఎలా చేశాయో, చేస్తాయో, చేసేవో మనం కూడా అలానే చేయాలి. వ్యవహరించాలి. (గోల్వాల్కర్, 1939, పేజి 47-48)
ఫాసిజమే వీరికి స్పూర్తి..
గోల్వాల్కర్ పేర్కొన్న ప్రాచీన రాజ్యాలు వ్యవహరించిన తీరు ఏంటి? ఈ క్రింద ప్రస్తావించిన గోల్వాల్కర్ మాటల్లో ఫాసిస్టు జర్మనీ పట్ల ఆయనకున్న ఆరాధనా భావం స్పష్టంగా సూటిగా కనిపిస్తుంది. ” మొత్తం యూరప్‌ను తిరగదోడిన జర్మనీ తెగల ప్రాచీన జాతీయతా స్ఫూర్తితోనే ఆధునిక జర్మనీ తిరిగి తలెత్తుకోవటానికి దోహదం చేసింది. తత్ఫలితంగా తమ పూర్వీకులు వదిలి వెళ్ళిన నిర్దిష్ట సాంప్రదాయాలు, ఆశలకు జర్మన్ జాతి ఊతమిచ్చింది. మన విషయంలో కూడా అదే జరిగింది. మన జాతి కూడా మరోసారి పునరుత్సాహం పొందింది. ఈ జాతి సృష్టించిన సమ్మున్నతమైన మత ప్రచారకులు నేడు ప్రపంచాన్ని తమ అద్భుత శక్తి సామర్ధ్యాలతో కుదిపేస్తున్నారు. ( గోల్వాల్కర్, 1939, ລ້ 32)
ఇంకా, “జాతి, సంస్కృతుల స్వచ్ఛతను కాపాడటానికి జర్మనీ తమ దేశంలోని సెమెటిక్ జాతులకు చెందిన యూదులను ఊచకోత కోయటం ద్వారా ప్రపంచాన్ని నిర్ఘాంతపర్చింది. ఈ సందర్భంలోనే (జర్మనీ) జాతి ప్రతిష్ట అత్యున్నత శిఖరానికి చేరింది. తుదికంటా భిన్నత్వం కలిగిన జాతులు, సంస్కృతులను తమలో ఎలా విలీనం చేసుకోవాలో జర్మనీ నిరూపించింది. హిందూస్తాన్ వాసులమైన మనం నేర్చుకోవటానికి, లబ్ది పొందటానికి ఒక మంచి అనుభవం ఇది. (గోల్వాల్కర్, 1939, పేజి 35) ఈ విధంగా హిట్లర్ “ గురూజీకే గురువు”గా మారతాడు. నిజానికి ఇది ఆరెస్సెస్ రాజకీయ లక్ష్యం గురించి నిజస్వరూపాన్ని వెలుగులోకి తెచ్చే అంశం. ప్రాచీన హిందూ సమాజాన్ని పరిరక్షించే పేరుతో పూర్తిగా ఆధునికమూ, పాశ్చాత్యమూ అయిన ఫాసిజాన్ని అక్కున చేర్చుకోవటానికి ఆరెస్సెస్‌కు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వెరపూ లేదు. కానీ ఫాసిజం తప్ప మిగిలిన పాశ్చాత్య అభివృద్ధి, భావనలు, నాగరికతలు అన్నీ విదేశీ అన్న పేరుతో దూరంగా నెట్టారు.
ఈ విధంగా ఫాసిస్టు సూడో హిందూయిజాన్ని నగ్నంగా ఆరాధించే కొందరు ఫాసిజాన్ని నగ్నంగా సమర్థించేందుకు పూనుకున్నారు. “1939 నాటికి యూదుల విషయంలో ఫాసిజం అనుసరించిన వైఖరి గురించి అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు చాలా పరిమితం. అందువల్ల ఆ రోజుల్లో ఫాసిజం గురించి ఎవరైనా మాట్లాడితే అటువంటి వారిని చూసీ చూడనట్లు వదిలేయాలి.” (మధోక్, 1993, పేజి 11)
ఈ వాదనే నిజమైతే 1947లో అచ్చయిన సంచికలో కూడా అదే పేరాగ్రాఫ్ ఎందుకు కొనసాగిందో వివరించగలరా? 1939కి భిన్నంగా 1947లో హిట్లర్ ఘోరాల గురించి ప్రపంచానికి సంపూర్ణంగా తెలుసు. ఆ తర్వాతి ముద్రణల్లో ఈ పేరాగ్రాఫ్‌ను గోల్వాల్కర్ ఎందుకు తొలగించలేదు. ఎందుకంటే ఆయన ఫాసిజం గురించి సరైన సమాచారం లేక రాసిన మాటలు కావు అవి. దీనికి భిన్నంగా నాడు గోల్వాల్కర్గానీ, నేడు కాషాయ దళంగానీ హిట్లర్ పద్ధతులను సంపూర్ణంగా బలపరుస్తున్నారు. అందువల్లనే ఆయన రచనలో హిట్లర్ చర్యలను గురించి కీర్తించే ఈ వాక్యాలు కొనసాగాయి.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం ఆరు భాగాలుగా ప్రచురితం అవుతుంది. ఇది నాలుగో భాగం, మూడో భాగం కోసం “హిందూ రాష్ట్ర అంటే ఏంటి?” మీద క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.