
విస్పష్టంగా కనిపిస్తున్న అసమంజసత్వాన్ని సైతం గోల్వాల్కర్ పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్యులు హిందువులు అయితే, హిట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యులు ఎవరు? వాళ్లు కూడా ఆర్యులే అయితే వాళ్లు భారతదేశం నుంచి జర్మనీ వలస వెళ్లారా? లేక జర్మనీ నుంచి భారతదేశానికి వలస వచ్చారా? గోల్వాల్కర్ సిద్ధాంతం ప్రకారం భారతదేశం, జర్మనీ ఒకే జాతికి చెందిన దేశాలా?
ఈ విధంగా ప్రస్తుతం కాషాయ దళం కార్యకలాపాలకు పునాదిగా ఉన్న ఫాసిస్టు హిందూ రాష్ట్రకు సంబంధించిన సైద్ధాంతిక పునాదులను నిర్మించటానికి జరిగిందే ఈ మొత్తం కసరత్తు.
హిందూయిజాన్ని హైజాక్ చేయటం..
ఈ ప్రయత్నంలో వాళ్ళు హిందూమతం, అందులోని సుసంపన్నమైన భిన్నత్వాన్ని తమ రాజకీయ లక్ష్యాల సాధనకు దుర్వినియోగం చేయబూనుకున్నారు. నాడు ఆరెస్సెస్ ఎజెండాకు గానీ, నేడు కాషాయదళం ఎజెండాకు గానీ హిందూమతంతో ఎటువంటి సంబంధమూ లేదు. ఉద్దేశ్యపూర్వంగా మతపరమైన విభజనను సృష్టించి, దాన్ని తన రాజకీయ లక్ష్యాల సాధనకు ఉపయోగించుకునే మతోన్మాద భావజాలమే తప్ప ఇది మరోటి కాదు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినవారి పట్ల విషప్రచారానికి పూనుకుంటుంది. అటువంటి విష ప్రచారాన్ని ప్రోత్సహిస్తోంది. దీనికి సంబంధించిన సమాధానం మతాచార్యుల నుంచే వచ్చింది. (ఫ్రంట్ లైన్ 1993 మార్చి 12న ప్రచురితమైన కుంద్రకుడి అదిగలార్ ఇంటర్వూ చదవండి).

సంఘపరివారం తమ రాజకీయ లక్ష్యాలు సాధించు కోవటానికి ప్రజల్లో మతం పట్ల ఉన్న భావాలను, అభిప్రాయాలను సొమ్ముచేసుకుంటోంది. తద్వారా మతాన్ని దుర్వినియోగం చేస్తూ హిందూమతంలో మానవతా విలువలకు ఈ శక్తులు శతృవులుగా మారారు.

గోల్వాల్కర్ రచనలోని మరో రెండు ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. మొదటి అంశం, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినది. నానాజాతి సమితి అల్పసంఖ్యాకవర్గాల పట్ల అనుసరించే వైఖరి గురించి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని విమర్శిస్తూ గోల్వాల్కర్ “అల్ప సంఖ్యావర్గాల సమస్యలకు మనం సూచిస్తున్న ఆధునిక సమస్యలు చాలా ప్రమాదకరమైనవి. నానాజాతి సమితి ఇచ్చిన నిర్వచనం ప్రకారం, ఒక సామాజిక సమూహం ఏదైనా దేశంలో నివసించే సమయాన్ని బట్టి లేదా వారి సంఖ్యను బట్టి అల్ప సంఖ్యాకులుగా పరిగణించాలి. కానీ దీనికంటే ఒకడుగు ముందుకేసి ఈ మధ్యకాలంలో అల్పసంఖ్యాక వర్గాల హక్కుల గురించి కుదుర్చుకున్న ఒప్పందం వారికి అవసరమైన దానికంటే మించిన స్థాయిలో హక్కులు దఖలు పరుస్తోంది. అటువంటి ఒప్పందాల పర్యవసానాలు హిందూ జాతి జీవనంలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. హిందూజాతి కకావికలైపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులను గమనించి మనం సన్నద్ధం కావాలి. (గోల్వాల్కర్ 1939, పేజి 40-50)
ఇంతకు ముందు భాగంలో ప్రస్తావించిన అల్పసంఖ్యాకవర్గాల పట్ల అసహనంతో కలిపి చూస్తే ఈ అవగాహన, వైఖరి కాషాయ దళం ఆశించిన విధంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మారిస్తే నాజీలు కూడా సిగ్గుపడే రీతిలో అల్పసంఖ్యాకవర్గాల ఊచకోతకు రంగం సిద్ధం చేస్తుందని అంచనాకు రావచ్చు.
మనువాద భారతం..
రెండో అంశం హిందూరాష్ట్రలో ఉండబోయే సామాజిక నిర్మాణానికి సంబంధించిన అంశం. “మనువు ప్రపంచానికి మొట్టమొదటి న్యాయశాస్త్రాన్ని అందించిన అతి గొప్ప వ్యక్తి” అని ఆకాశానికెత్తేస్తాడు. అంతేకాదు “ఆయన తన స్మృతి ద్వారా ప్రపంచ ప్రజలందరూ హిందూస్తాన్ వెళ్ళి ఈ దేశంలోని బ్రాహ్మణ కుటుంబాల్లో ప్రథమ పుత్రుడి కాళ్ళ మీద పడి తమ విధులు, కర్తవ్యాలు నేర్చుకోవాలని” కూడా పిలుపునిస్తాడు. (గోల్వాల్కర్, 1939, పేజి 5-56)
మనుస్మృతి చెప్పేది ఏమిటి? వారసత్వంగా కులవ్యవస్థ ద్వారా వచ్చిన సామాజిక విభజనను సంఘటితం చేస్తూ మనుస్మృతి: “బ్రాహ్మణులకు సేవ చేయటం ఒక్కటే శూద్రుడు చేయగల, చేయాల్సిన అతి గొప్ప పని. ఇది కాక(శూద్రుడు) మరే పని చేసినా అతి నిష్ప్రయోజనం.” (123, పదవ అధ్యాయం). “వాళ్లు అతనికి (శూద్రునికి) తాము తినగా మిగిలిన ఆహారం, ముక్కిన ధాన్యం, పాతబడిన వస్తువులు ఇవ్వాలి.” (125, పదో అధ్యాయం) “ఒక శూద్రసేవకుడు తనకు సామర్థ్యం ఉన్నప్పటికీ సంపద కూడబెట్టకూడదు. ఒకవేళ శూద్రుడు సంపద కూడబెడితే ఆచార్యులకు ఆగ్రహం వస్తుంది.” (129, పదో అధ్యాయం). (ఈ వాక్యాలన్నీ 1991 నాటి దొనిగెర్ అనువాదం నుంచి స్వీరించబడినవి).
ఆ తర్వాత మనుస్మృతి సమాజంలో ఎటువంటి స్థానం పొందలేని అంటరానివారిని, కుల బహిష్కృతుల గురించి వారు చేయాల్సిన నీచమైన పనుల గురించి ప్రస్తావిస్తుంది. కుల వ్యవస్థలో ఉన్న అసహనమంతా గోల్వాల్కర్, కాషాయదళం రచనల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మనుస్మృతి కూడా ఆర్యుల సామాజిక నిర్మాణంపైనే ఆధారపడి ఉంది. “ఆర్యేతర ప్రవర్తన, కఠినత్వం, క్రూరత్వం, ఆచార వ్యవహారాలు పాటించటంలో పదే పదే విఫలం కావటం వంటివి కలుషితమైన గర్భం నుంచి పుట్టిన మనిషి లక్షణాలను నిరూపిస్తాయి. (58 పదో అధ్యాయం).
ఈ నాలుగు వర్ణాలలో ఇమడని వారు ఆదివాసులు, ద్రావిడులు, ప్రత్యేకించి ఆంధ్రులు: “కుల బహిష్కరణకు గురైన రాజు ద్వారా పుట్టిన సంతతి వస్తాదులు(ఝాళ్ల), మల్లులు, లిచ్ఛవీలు, నాట్యకారులు, కరణాలు, ఖాసాలు, ద్రావిడులు(22, పదో అధ్యాయం) అంతేకాకుండా “వేటగాళ్ళకు పుట్టినవారు చిన్న చిన్న పనులు, తక్కువ గుర్తింపు కలిగిన పనులు చేసేవారు. వీళ్లు చర్మపు పని చేస్తారు. విధాన్లకు పుట్టిన వారు(గంగానది ఒడ్డున ఉన్న ప్రాచీన కాలపు రాజ్యం విదేహ నుంచి వచ్చిన పేరు ఇది) ఆంధ్రులు, గ్రామాల బయట నివసించడం మెదలు పుట్టారు.” (36, పదో అధ్యాయం).
మహిళలను అత్యంత అమానుషంగా చూస్తుంది మనుధర్మం, “బాల్యంలో స్త్రీలు తండ్రి ఆధీనంలోనూ, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త చనిపోయిన తర్వాత కుమారుల ఆధీనంలోను జీవించాలి. ఆమెకు స్వాతంత్ర్యం ఉండరాదు.” (148, పదో అధ్యాయం) ఇంకా “అందంగా కనిపించాలనుకోరాదు. యవ్వనం గురించి వాళ్లు పట్టించుకో కూడదు. ఓ పురుషుడా అని సంబోధిస్తూ అతను అందగాడైనా అందవిహీనుడైనా అతనితో సంభోగాన్ని సంతోషంగా అనుభవించాలి. (14) “పురుషుల వెంటపడే మహిళలు మనోనిబ్బరం లేని వారు. ఆప్యాయత లేని వీరు తమ భర్తల పట్ల కూడా విశ్వాసంతో ఉండరు.” (15) “వాళ్ల స్వభావమే ఇలా ఉంటుందని తెలిసి- సకల జీవులను సృష్టించిన ఆ భగవంతుడికే ఈ విషయం తెలుసు – పురుషుడు వాళ్లను కాపాడుకోవటానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేయాలి. (16).”, “మంచం, కుర్చీ, ఆభరణాలు, కామం, క్రోధం, క్రూరత్వం, మోసపూరిత స్వభావం, చెడు ప్రవర్తన వంటి లక్షణాలు మహిళలకు ఉంటాయని మనువు నిర్ధారిస్తాడు(18).”
అంతేకాకుండా, “మహిళకు సంబంధించి వేదాల్లో ఎటువంటి క్రతువులు ప్రస్తావించలేదు. న్యాయసూత్రాలలో ఈ విషయం ఉద్ఘాటించబడింది. అశక్తులైన, వేదాల్లో ప్రస్తావనకు నోచుకోని మహిళలు అసత్యపూరణులు. ఈ విషయం కూడా రూఢీ అయినది(19, పదో అధ్యాయం)”
స్త్రీలతో పురుషుల సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయానికి సంబంధించి మనుస్మృతిలో పెద్దగా వివరాలు ఉండవు. స్త్రీలకు మాత్రం సవివరమైన ప్రవర్తనా నియమావళిని నిర్దేశిస్తాడు మనువు. “తమ భర్త పట్ల గౌరవం, అంకితభావం లేని మహిళలను ఈ ప్రపంచం ఛీత్కరించుకుంటుంది. అటువంటి మహిళలు నక్కల కడుపున పుట్టి నానా రోగాలతో బాధపడతారు. ఈ రోగాలన్నీ ఆమె గత జన్మలో చేసిన పాపాలే. (30, అధ్యాయం 10). వితంతు వివాహాల నిషేధం లాంటి ఇంకా అనేక షరతులు, ఆంక్షలు, ఆదేశాల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. (64-65, అధ్యాయం 9)
మనుస్మృతి పట్ల గోల్వాల్కర్‌కు ఉన్న గౌరవం ఈ ఒక్క రచనకే పరిమితం కాలేదు. చాలాకాలం తర్వాత ప్రచురించిన “ఆలోచనల సారం”లో కూడా “బ్రాహ్మణులు తలకాయ, క్షత్రియులు భుజాలు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు. ఈ విధంగా నాలుగు అంగాలుగా ఉన్న హిందువులే మన దేవుడు” (గోల్వాల్కర్ 1966, పే25)అని స్వాతంత్య్రానంతరం పార్లమెంట్ ముందుకు వచ్చిన హిందూ స్మృతి బిల్లును ఆరెస్సెస్ వ్యతిరేకించటానికి ఈ అవగాహనే కారణం. ఇదే అవగాహనతో కాషాయదళం మనుస్మృతిని భుజానికెత్తుకొంటోంది. 1992 డిసెంబరులో జరిగిన ధర్మసంసద్ భారత రాజ్యాంగాన్ని హిందూయేతర రాజ్యాంగమని విమర్శించటం గమనించాల్సిన విషయం.
ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో(1992నాటి మే 10వ సంచిక)లో వచ్చిన విశ్లేషణను గమనిద్దాం. “మధురైలో 1992 ఏప్రిల్ 18- 19లో జరిగిన హిందూ న్యాయవాదుల రెండో మహాసభ రాజ్యాంగాన్ని సమీక్షించాలని, తిరిగి రాయాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీవీ కేఎస్ చౌదరి ఇచ్చిన కీలకోపన్యాసంలో మనుస్మృతి అందరికీ న్యాయం చేసే స్మృతి అని వక్కాణించారు. తరతరాల మొత్తం మానవాళి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మనువు ఈ స్మృతిని రచించాడు. మనుస్మృతి అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, విశ్వ మానవాళికి వర్తించే స్మృతి.”
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బ్రాహ్మణ అగ్రవర్ణాలకు చెందిన వారే ఇంతవరకు ఆరెస్సెస్ ప్రధాన నాయకత్వ స్థానాల్లో ఉండటం కూడా గమనించాల్సిన విషయం. “1920 దశకంలో హిందూత్వ సిద్ధాంతం, దాని నిర్మాణంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించటం ఆశ్చర్యం కలిగించవచ్చు. మహారాష్ట్రలో ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏ రూపేణా హిందూ ప్రజలకు నష్టం కలిగించే శక్తి వారికి లేదు. 1920 కాలంలో చెప్పుకోదగ్గ మతకలహాలు కూడా చోటుచేసుకోలేదు.
కానీ, జ్యోతిబా ఫులే సత్యశోధక సమాజం నెలకొల్పిన 1870లలో బ్రాహ్మణ్యానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో వెనకబడిన తరగతులు శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్వహించాయి. 1920 దశకం నాటికి దళితులు కూడా అంబేద్కర్ నాయకత్వంలో సంఘటితం అయ్యారు. 1990- 91లో లాగానే 1920లో కూడా పతనమవుతున్న అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నమే హిందూత్వ ప్రాజెక్టు ముందుకొచ్చింది(బసు, దత్త, సర్కార్, సేన్, 1993, పే 10-11).
అమానుషమైన కుల వ్యవస్థను చట్టబద్ధం చేయటం, మహిళలకు కనీస మానవ హక్కులు లేకుండా చేయటం హిందూ రాష్ట్రం ఊహిస్తున్న సమాజంలో ఉండబోయే సామాజిక నిర్మాణం. అటువంటి పరిస్థితుల్లో నేరపూరిత స్వభావం కలిగిన సతి వంటి సాంప్రదాయాలకు ఊతం దొరకటమే కాదు. కీర్తించటం కూడా జరుగుతుంది.
హిందూరాష్ట్రకు సంబంధించిన తమ ఆలోచనలను ఆవిష్కరించటంలో కాషాయ బృందానికి గోల్వాల్కర్ ప్రతిపాదించిన మౌలిక సూత్రాలు శిరోధార్యంగా ఉన్నాయి. 1950 తర్వాతి కాలంలో గోల్వాల్కర్ పుస్తకాన్ని పునర్ముద్రించలేదని వాదించినంత మాత్రాన, ఆయన అవగాహనను తిరస్కరించినట్లు కాదు.
ఆ రోజుల్లో ఆ పుస్తకాన్ని పునర్ముద్రించలేదంటే దానికి కారణం ఫాసిస్టు శక్తులు ఓడిపోవటం, భారతదేశం స్వాతంత్య్రం పొందటం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గోల్వాల్కర్ వూహించిన ఆశా సౌధం కుప్పకూలిపోవటంతో ఆ ఆలోచనలు ప్రచారం చేయటానికి కాషాయదళం ముందడుగు వేయలేకపోయింది.
దేశీయంగా గాంధీజీని హత్య చేసిన తర్వాత కాంగ్రెస్ పట్ల ఆరెస్సెస్ చేసిన వ్యాఖ్యలు హర్షణీయం కాదు.
కానీ గోల్వాల్కర్ రచనలో ప్రతిపాదించిన మౌలిక దృక్పథం, ఇంతకు ముందే ప్రస్తావించిన విధంగా నేటి కాషాయ దళానికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఈ దృక్పథం రెండు లక్ష్యాలు: దేశంలో ఉన్న వైవిధ్యాన్ని తొలగించి ఏకీకృత హిందూ సమాజ నిర్మాణం, ఒకటి హిందూ సమాజం బయట ఉన్న వారు- ముస్లింల పట్ల విద్వేషం రెచ్చగొట్టడం. (ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడానికి కాషాయదళం అనుసరించిన వ్యూహాల గురించి మరింత వివరంగా తెలుసుకోవటానికి ‘కుహనా హిందూత్వం నిజస్వరూపం: కాషాయ దళం కల్పించే భ్రమలు, వాస్తవాలు’ అన్న 1993 నాటి సీపీఐ(ఎం) ప్రచురణ చూడండి.)
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం ఆరు భాగాలుగా ప్రచురితం అవుతోంది. ఇది ఐదవ భాగం, నాలుగో భాగం కోసం “హిందూ రాష్ట్ర అంటే ఏంటి?” మీద క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.