
ఎంఎస్ గోల్వాల్కర్ రచించిన పుస్తకం “మనం, మన జాతీయ నిర్వచనం”(భారత్ పబ్లికేషన్స్- 1939. వెల రూ 1/-) మరోసారి వివాదాస్పదమైయ్యింది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న సంఘపరివారం లక్ష్యం, దాని ఫాసిస్టు స్వభావం ఈ పుస్తకం ద్వారా బట్టబయలయింది. ఇదే తాజా వివాదానికి కేంద్రంగా మారింది.
ప్రజాస్వామ్య బద్ధులుగా వ్యవహరిస్తామని ప్రజలను సంఘపరివారం మోసగించబూనుకుంది. ఈ నేపథ్యంలో ఈ రకంగా వాస్తవాలు వెలుగు చూడటం ద్వారా, వారి మోసపూరిత ప్రయత్నం బట్టబయలు కావటం ముఖ్యమైన పరిణామం.
వేర్వేరు పదజాలంతో వాస్తవాన్ని మరుగునపెట్టటానికి సంఘపరివారంలోని వివిధ తరగతులు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా అది గోల్వాల్కర్ రాసిన పుస్తకం కాదని, 1942 తర్వాత ప్రచురించబడలేదని వాదిస్తూ గోల్వాల్కర్ లేవనెత్తిన అంశాలు, ముందుకు తెచ్చిన ప్రతిపాదనల విషయంలో ఏ ఒక్కరూ వెనక్కు తగ్గకపోవటం విశేషం.
ఈ పుస్తకం గోల్వాల్కర్ విరచితం కాదని, వినాయక దామోదర సావర్కార్ సోదరుడు బాబురావు జీడీ సావర్కార్ మరాఠీలో రాసిన “రాష్ట్ర మీమాంస” గ్రంథానికి అనువాదం మాత్రమే అని వాదించేవారికి(ఢిల్లీకి చెందిన దీనదయాళ్ పరిశోధనా కేంద్రంలో పని చేసే సీనియర్ అధికారి 1993 జనవరి 7న జనసత్తా పత్రికలో రాసిన వ్యాసంలో ఈ వాదన ముందుకు తెచ్చారు.) జ్ఞానోదయం కలగటం కోసం 1939 మార్చి 22న మొదటి ప్రతికి రాసిన ముందుమాటలో గోల్వాల్కర్ రాసిన ఉపోద్ఘాతం నుంచి కొన్ని వాక్యాలు ప్రస్తావిస్తాను.
“ఈ పుస్తక రచనా క్రమంలో అనేకమంది మద్దతు తీసుకున్నాను. ఎంతమంది మద్దతు అంటే మద్దతు ఇచ్చిన వారందరి వివరాలు ఇక్కడ ప్రస్తావించటం సాధ్యంకానంత మంది. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దేశభక్తుడు జీడీ సావర్కార్కు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. ఆయన మరాఠీలో రాసిన “రాష్ట్ర మీమాంస” గ్రంథం నా ఈ ప్రస్తుత రచనకు ప్రధాన వనరు. స్ఫూర్తి కూడా. త్వరలో ఈ గ్రంథానికి ఆంగ్లానువాదం కూడా వెలుగు చూడనుంది. ఈ విషయానికి సంబంధించి మరింత వివరణ కోసం రాష్ట్ర మీమాంస చదవాల్సిందిగా పాఠకులను కోరుతున్నాను. 1938 నవంబరు నాటికే ఈ పుస్తకం రాతప్రతి తయారైంది. ఈ పుస్తకం ముందే వెలుగు చూసి ఉంటే బాగుండేది. కానీ, అనేక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు.” (గోల్వాల్కర్, 1939, పేజి 4)
ఈ పుస్తకానికి రచయిత ఎవ్వరనే ప్రశ్నకు ఇక్కడ తావు లేదు. ఈ పుస్తకం పునఃముద్రణను నిషేధించటం కానీ, మార్కెట్ నుంచి పుస్తకాన్ని వెనక్కు తీసుకోవటం కానీ జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. (పైన ప్రస్తావించిన ఆరెస్సెస్ అధికారి జనసత్తాలో ప్రచురించిన వాదనల ఆధారంగా, నవభారత్ టైమ్స్ సంపాదకమండలి, నేను రాసిన వ్యాసానికి ముగింపులో ఈ పుస్తకం మార్కెట్ నుంచి ఉపసంహరించబడిందని ప్రచురించేంత అనైతికతకు సిద్ధపడ్డారు)
ప్రస్తుతం నా చేతిలో 1947లో గోల్వాల్కర్ ప్రచురించిన నాల్గో ముద్రణ ప్రతి ఉంది. పలువురు ఫాసిస్టు ఆరెస్సెస్ వాదులు ఈ విషయాన్ని అంగీకరిస్తూ, 1942 తర్వాత కూడా ఈ పుస్తకం పలు ప్రచురణలకు నోచుకుందని స్పష్టం చేస్తున్నారు.(మధోక్ 1993).
నాల్గో ముద్రణకు మొదటి ముద్రణకు మధ్య కొంత వ్యత్యాసం ఉంది. మొదటి ముద్రణలో ఉపయోగించినంత పరుషపదజాలాన్ని ఉపయోగించలేదు(ఉదాహరణకు మూర్ఖులు అన్న పదానికి బదులు దారితప్పినవారు అన్న పదం ఉపయోగించబడింది).
భాషలో మార్పు ఉన్నా సారాంశంలో మార్పు లేదు. భాషలో ఇటువంటి మార్పు అత్యల్పమైన విషయమని భావించాడు కనకనే, ఈ మార్పుల గురించి రచయిత తన ముందుమాటలో ప్రస్తావించనైనా ప్రస్తావించలేదు. ఇటువంటి మార్పులు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప కనిపించేవి కాదు. మొదటి ప్రచురణకు నాల్గో ప్రచురణకు మధ్య ముఖ్యమైన మినహాయింపు ఏమిటంటే, లోక్ నాయక్ ఎంఎస్ అనే పేరుతో రాసిన ముందుమాట.
ఆయనే ముందుమాటను తొలగించటం వెనక గల కారణాలు తెలుసుకోవటం కష్టమేమీ కాదు. “నేను ఇక్కడ ఒక విషయాన్ని జోడించదల్చాను. జాతీయత వంటి సంక్లిష్ట సమస్యను శాస్త్రీయంగా అధ్యయనం చేసేటప్పుడు రచయిత ప్రబోధించిన జాతీయత సిద్ధాంతాన్ని అంగీకరించని వారి పట్ల ఆయన ఉపయోగించిన పరుష పదజాలం సరికాదు. ముందుమాటలో ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి రావటం ఇబ్బందికరమైన అంశమే.” (గోల్వాల్కర్ 1939, పేజి XVIII)
దేశవిభజన నేపథ్యంలో తలెత్తిన మతోన్మాద ఉద్రిక్తతల ద్వారా ఆరెస్సెస్ విశేష లబ్ది పొందుతుంది. ఈ సమయంలో ఇటువంటి అభిప్రాయాలకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం లేదు. ఇటువంటి ముందుమాటల ద్వారా పుస్తకానికి ఉన్న రెచ్చగొట్టుడు ప్రచార ధోరణిని తగ్గించాల్సిన అవసరం లేదు.
నేడు సంఘపరివారం బృందం అనుసరిస్తున్న సమాచారం, కప్పిపుచ్చే ప్రచారం ద్వారా తన వాస్తవిక సైద్ధాంతిక పునాదులను మరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేడు సంఘపరివారం అనుసరిస్తున్న విధానాలకు గోల్వాల్కర్ పుస్తకం నిజమైన దర్పణంగా నిలుస్తుంది.
ఆరెస్సెస్ ‘బైబిల్’..
కేఏ కుర్రన్ “భారత రాజకీయాల్లో సమరశీల హిందూయిజం- ఆరెస్సెస్‌పై ఓ అధ్యయనం” అన్న ఆరెస్సెస్ అనుకూల రచన నుంచే ఇక్కడ ప్రస్తావించుకుందాం. “ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ ప్రతిపాదించిన సూత్రాల ప్రాతిపదికనే సంఘ్ మౌలిక సిద్ధాంతం రూపొందింది. మనం మన జాతీయత నిర్వచనం అన్న చిన్న పుస్తకంలో ప్రస్తుత నాయకుడు వ్యవస్థాపక నేత అందించిన సూత్రాలను క్రోడీకరించి విపులీకరించారు. ఈ పుస్తకాన్ని ఆరెస్సెస్ బైబిల్ అని చెప్పవచ్చు. సంఘ్ వాలంటీర్లకు బోధించే మొదటి సైద్ధాంతిక పత్రం ఇది. ఈ పుస్తకం భిన్నమైన జాతీయ పరిస్థితుల నేపథ్యంలో 12 ఏళ్ల క్రితం రాశారు. అయినప్పటికీ పుస్తకంలో ప్రతిపాదించబడిన ప్రతి అంశమూ యధాతథంగా అమలు సాధ్యమని ఆరెస్సెస్ సభ్యులు విశ్వసిస్తున్నారు”(కుర్రన్- 1979, పేజీ 39. వక్కాణింపు కుర్రన్)
ఆరెస్సెస్ చరిత్రలో గోల్వాల్కర్ పాత్రను గమనిస్తే, ఆయన రాసిన ఈ పుస్తకం ప్రాధాన్యత కూడా అర్థమవుతుంది. గోల్వాల్కర్ 1940లో ఆరెస్సెస్ అధినేతగా నియమితుడయ్యాడు. రెండేళ్ల క్రితం అంటే 1938లో ఆయనను ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా హెడ్గేవార్ నియమించాడు. నిజానికి పదవీ విరమణ చేస్తున్న సర్సంఘ్ చాలక్ తన వారసుడిని నియమించి పోతాడు. అలా నియమితులైన వారు బతికున్నంతకాలం ఆ పదవిలో కొనసాగుతారు. ఇవీ వారి ప్రజాస్వామ్య విలువలు.
1973 వరకు గోల్వాల్కర్ ఆరెస్సెస్ అధినేతగా కొనసాగాడు. 1930- 54 మధ్య కాలంలో ఆయన నిర్వహించిన పాత్రను క్లుప్తీకరిస్తూ, “గోల్వాల్కర్ నాయకత్వం నేటికీ ఆరెస్సెస్ శ్రేణులకు చారిత్రక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన నాయకత్వం ప్రత్యేక పరిస్థితులకు, ప్రత్యేక ప్రేక్షకులకు వర్తించేదిగా ఉంది.(ప్రత్యేకించి మతోన్మాద దాడుల కాలంలో) భారతదేశంలో హిందూత్వ విజయం అంటే ఏమిటో అర్ధం చేసుకోవటానికి బాగా ఉపయోగ పడుతుంది.(బసు, దత్తా, సర్కార్, సర్కార్- సేన్ 1993, పేజి 25).
కాషాయదళం గోల్వాల్కర్ ప్రభావానికి కట్టుబడి ఉంది. సైద్ధాంతికంగా ఆలోచనలు, సూత్రాలు ప్రతిపాదించటమే కాదు. ఫాసిస్టు హిందూ రాష్ట్ర నిర్మాణానికి అవసరమైన యంత్రాంగాన్ని కూడా ఆయన రూపొందించారు.
మహాత్మా గాంధీని హత్య చేసిన తర్వాత ప్రభుత్వం ఆరెస్సెస్‌పై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాతి రోజుల్లో ఈ విషయం మరింత రూఢీ అయ్యింది. 1948 ఫిబ్రవరి 4 నుంచి 1949 జూలై 12 వరకు ఆరెస్సెస్‌పై నిషేధం కొనసాగింది. తమపై ఉన్న నిషేధాన్ని సాధ్యమైనంత త్వరగా ఎత్తివేయించుకోవటం కోసం మోసపూరితమైన రాజీకి సిద్ధపడింది ఆరెస్సెస్.
కుర్రన్ మాటల్లో, ప్రభుత్వానికి ఎటువంటి హామీ ఇవ్వలేదని, వాగ్దానం చేయలేదనీ నిషేధం ఎత్తివేసిన వెనువెంటనే గోల్వాల్కర్ ప్రకటించడం తమ సంస్థ పరువు నిలుపుకునేందుకు చేసిన విఫల ప్రయత్నమే.
సంఘ్ అంతర్గత నిర్మాణంలో ఎన్నికలు, మతోన్మాదాన్ని విడనాడతామన్న వాగ్దానం, ఇతర మతాలకు చెందిన ప్రజల పట్ల సహనంతో వ్యవహరిస్తామన్న వాగ్దానం వంటివి సంఘ్ వ్యవహార శైలికి భిన్నమైనవి. అయినప్పటికీ ప్రభుత్వం ఒత్తిడి మీద అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆచరణలో ఈ వాగ్దానాలు ఏమీ అమలు జరపలేదు. ప్రభుత్వానికి ఇచ్చిన ఈ వాగ్దానాలను సంఘ్ శ్రేణులు ఎప్పటికప్పుడు విస్మరిస్తూ వచ్చాయి.(కుర్రన్, 1979 పేజి 31-32).
ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆరెస్సెస్ తనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఆమోదించింది.(ఇప్పటి వరకు ఈ రాజ్యాంగం ప్రతులు బహిరంగ సమీక్షకు అందుబాటులో లేవు) సదరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో “హిందూ సమాజంలోని భిన్న స్రవంతులను ధర్మం, సంస్కృతి ప్రాతిపదికన భరతవర్షం అన్ని కోణాల్లో అభివృద్ధి చెందే విధంగా ఏకం చేయటం(కుర్రన్ ప్రస్తావన, పేజి 35). అయితే మరోవైపున, “సమరశీల, అసహనపూరితమైన హిందూ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన ఏదీ ఆరెస్సెస్ రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో చెప్పిన విషయాలకు నామమాత్రంగా కట్టుబడ్డ సంఘపరివారం ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సంఘపరివారం తన లక్ష్యాలు, ఆ లక్ష్యాలు సాధించటానికి అనుసరించే మార్గాల పట్ల ఏనాడూ గోప్యత ప్రదర్శించలేదు. కానీ తన రాజ్యాంగంలోని సహనశీలతతో కూడి హిందూతత్వానికి, ఆచరణలో హిందూయేతరుల పట్ల వారు అనుసరించే విద్వేషపూరిత వైఖరికి మధ్య ఏనాడూ పొంతన లేదు. సంఘపరివారపు నిజమైన లక్ష్యాలను గమనిస్తే, ప్రకటిత లక్ష్యాలు పేలవంగా ఉండటమే కాదు. నిజానికి మోసపూరితంగా కూడా ఉన్నాయి. సంఘ్ లక్ష్యాలను బహిర్గతపరిస్తే ఆరెస్సెస్ అణచివేతకు గురవుతుంది. పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నపుడు ప్రభుత్వంతో ఘర్షణ పడటాన్ని ఆరెస్సెస్ నేతలు తెలివిగా దాటవేశారు(కుర్రన్, 1979, పేజీలు 35-36 వక్కాణింపు కుర్రన్‌దే)”అని కుర్రన్ జోడించాడు.
ఈ కోణం నుంచే గోల్వాల్కర్ 1949 సెప్టెంబరులో లక్నోలో జరిగిన ఒక సభలో తొలిసారిగా భారత రాజ్యాంగం గురించి వ్యాఖ్యానిస్తూ అది “భారతేతర” రాజ్యాంగం అని విమర్శించాడు. సమకాలీన విశ్వహిందూ పరిషత్ నేతలు “హిందూయేతర” రాజ్యాంగం అని చేస్తున్న విమర్శకు నాటి గోల్వాల్కర్ విమర్శకు మధ్య పోలికను ఇట్టే గమనించవచ్చు.
నిర్మాణపరంగా ద్వంద్వ ముఖాలు..
పైన పేర్కొన్న తరహా ఎత్తుగడలతో పాటు గోల్వాల్కర్ పలు నిర్మాణ పనులు కూడా చేపట్టాడు. ఆరెస్సెస్‌పై నిషేధాన్ని ఎత్తివేయటానికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే నేడు మనం సంఘపరివారంగా పిల్చుకుంటున్న అనేక సంస్థలను, వ్యవస్థలను ఆయన నెలకొల్పాడు. వ్యూహం స్పష్టంగానే ఉంది.
ప్రజల దృష్టిలో ఆరెస్సెస్ “సాంస్కృతిక కార్యక్రమాలకు” మాత్రమే పరిమితం అవుతుంది. కానీ, దాని అనుబంధ సంస్థలు మాత్రం హిందూ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన వేర్వేరు కోణాల్లో పని చేస్తూ వేర్వేరు తరగతుల ప్రజానీకాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తాయి. బయటికి స్వతంత్రంగా కనిపిస్తున్న ఈ సంఘాలు, సంస్థలన్నీ అంతర్లీనంగా ఆరెస్సెస్‌తో బలమైన బంధాన్ని పెనవేసుకుని ఉంటాయి. ఈ నిర్మాణం నేడు మన కళ్ల ముందు కనిపిస్తోంది.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం ఆరు భాగాలుగా ప్రచురితం అవుతుంది. ఇది మొదటి భాగం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.