ఎన్సీఈఆర్టీ కొత్తగా చేర్చిన గజనీ అధ్యాయం, పాఠశాల చరిత్రలో దశాబ్దాలుగా సాగిన “తక్కువగా చూపించే” విధానానికి స్పష్టమైన విరామాన్నిచ్చింది. ఇది విద్యార్థుల అవగాహనను లోతుగా పెంచుతుందా? లేకా వారి మీద ఎక్కువగా బరువును మోపుతుందా అన్నదే ప్రస్తుత చర్చకు ప్రధానమైన అంశం.
చాలా సంక్షిప్తంగా, సున్నితంగా మహ్మద్ గజినీని చిత్రించిన రూపంలోనే దశాబ్దాల పాటు విద్యార్థులు చదివారు. భారత ఉపఖండంపై తను పలు మార్లు దాడులు చేసిన మధ్యయుగ ఆక్రమణదారుడిగా మాత్రమే పాఠ్యపుస్తకాల్లో కనిపించేవాడు. సోమనాథ దేవాలయంపై దాడి జరిగిన విషయాన్ని కూడా సాధారణంగా ఒక్క లైన్లో అలా ప్రస్తావించి ఇలా వదిలేసేవారు.
ఆ రచనా విధానం చాలామట్టుకు ఎముకల గూడులా- తేదీలు, ప్రాంతాలు, దాడుల సంఖ్య వరకే పరిమితమై ఉండేది. హింస ఉందని పరోక్షంగా సూచించేవారు- కానీ, వివరాల్లోకి వెళ్లేవారు కాదు. విధ్వంసం జరిగిందని అంగీకరించేవారు- కానీ దాని ప్రభావాన్ని వివరించేవారు కాదు. ఈ దాడుల వల్ల ప్రజలు అనుభవించిన మానవీయ నష్టాలు తరగతి గదిలో దాదాపుగా చర్చకు రాకపోయేవి.
ఈ విధానం తరతరాల విద్యార్థుల ఆలోచనలన మీద ప్రభావం చూపించింది- ఇది అనుకోకుండా జరగిన విషయం కాదు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో చాలా కాలం పాటు పాఠ్యపుస్తకాలు, అసౌకర్యకరమైన విభేదాలకన్నా “నిరంతరత”కే ప్రాధాన్యమిచ్చే వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ఘర్షణను తప్పించలేని చోట కూడా దానిని మృదువుగా చూపించేవారు. అది కూడా ఒక ఆలోచిత నిర్ణయమే- సామాజిక సమైక్యత, గుర్తింపు రాజకీయాలు, జాతీయ ఐకమత్యం పట్ల ఉన్న ఆందోళనల నుంచే వచ్చిన ఎంపిక.
కానీ 2025 చివరికి వచ్చేసరికి ఆ స్వరం స్పష్టంగా మారిపోయింది.
పాఠ్యక్రమంలో ఏం మారింది?
ఎన్సీఈఆర్టీ సవరించిన 7వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో ఇప్పుడు “గజనవీదుల ఆక్రమణలు” అనే అంశానికి ఆరు పేజీల ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు. ఇంతకు ముందు ఒక్క పేరాగ్రాఫ్‌గా ఉన్న అంశం, ప్రస్తుతం- మహ్మద్ గజినీ భారత ఉపఖండంపై చేసిన 17 దండయాత్రలను పూర్తిగా వివరిస్తుంది.
ఈ అధ్యాయం మథుర, కన్నౌజ్‌లోని ప్రముఖ దేవాలయ సముదాయాల ధ్వంసం, గుజరాత్‌లోని సోమనాథ దేవాలయ విధ్వంసం గురించి స్పష్టంగా ప్రస్తావిస్తుంది. దోచుకున్న సంపదను గజినీకి తీసుకెళ్లిన విషయాలు; అప్పటి చరిత్రకారుల వర్ణనల ప్రకారం- జరిగిన పౌరుల హత్యలు, అనేక మందిని బంధీలుగా పట్టుకుని వెళ్లిన విషయాలను కూడా ఇందులో పొందుపరిచారు.
భయానకంగా కాకుండా భాష నేరుగా ఉంది. రక్తపాతం వివరాల్లోకి వెళ్లదు, కానీ హింసను పేరు పెట్టి చెప్పకుండా తప్పించుకోదు. మొదటిసారి మధ్య- పాఠశాల విద్యార్థులకు “ఆక్రమణ” అంటే భౌతికంగానూ, మానవీయంగానూ ఏంటో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది.
ఉదాహరణకు, పుస్తకంలోని 103వ పేజీలో గజినీ దండయాత్రలు “విధ్వంసం, దోపిడీ మాత్రమే కాకుండా, పదివేల సంఖ్యలో భారతీయ పౌరుల హత్యలు, పిల్లలను కూడా కలుపుకుని అనేక మందిని బంధీలుగా పట్టుకుని మధ్య ఆసియా బానిస మార్కెట్లలో అమ్మడం” గురించి వివరిస్తుంది.
గజినీ జీవిత చరిత్రకారులు తనను శక్తివంతమైనప్పటికీ క్రూరమైన, నిర్దయుడైన సేనాధిపతిగా వర్ణించారు. ‘అవిశ్వాసులు’(అంటే హిందువులు, బౌద్ధులు, జైనులు)నే కాకుండా, ఇస్లాం మతంలోని ప్రత్యర్థి వర్గాల విశ్వాసులను కూడా తను హత్య చేయడంలో వెనుకాడలేదని పేర్కొంటారు.
106వ పేజీలో, “తను వెళ్లిన ప్రతి చోట దేశాన్ని పూర్తిగా నాశనమయ్యే వరకు దోచి ధ్వంసం చేశాడు. భవనాలను తవ్వి తగలబెట్టాడు, అవిశ్వాసులను చంపాడు; వారి పిల్లలు, పశువులను దోపిడి వస్తువులుగా తీసుకెళ్లాడు. చాలా ప్రాంతాలను జయించి, దేవాలయాలు- పవిత్ర కట్టడాలను కూల్చి, వాటి స్థానంలో మసీదులను నిర్మించి, ఇస్లాం వెలుగును ప్రసరింపజేశాడు”అని అల్-ఉత్బీ తెలియజేశాడు.
మునుపటి పాఠ్యపుస్తకాల్లో గజినీ దాడులను ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాల కోణంలోనే చూపించేవారు. విధ్వంస పరిమాణం లేదా స్థానిక ప్రజలపై ప్రభావం దాదాపుగా కనిపించేది కాదు. ఆ దృష్టిలో చూస్తే, ఈ సవరణ ఒక పాత లోపాన్ని సరిచేసినట్టే అవుతుంది.
ఈ కొత్త అధ్యాయం విప్లవాత్మకం కాదు- కానీ పునరుద్ధరణాత్మకం. గతంలో మర్చిపోయిన విషయాలను తిరిగి తీసుకొచ్చింది.
ఈ సవరణ ఎందుకు ముఖ్యమైంది?
మహ్మద్ గజినీ దాడుల్లో విస్తృతమైన విధ్వంసం, బలవంతం జరిగిందన్న విషయంలో ఏ గంభీర చరిత్రకారుడికీ సందేహం లేదు. దీన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం తటస్థత కాదు- అది ఎంపిక మాత్రమే.
ఈ అంశాలను ఎదుర్కోవడంలో గతంలో ఉన్న సంకోచం, స్వాతంత్య్రానంతర చరిత్ర రచనలోని విస్తృత అసౌకర్యాన్ని ప్రతిబింబిస్తుంది. తరగతి, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతుల సమ్మేళనం వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల, గుర్తింపు రాజకీయాలను రెచ్చగొట్టే ఘర్షణలను తగ్గించి చూపడం జరిగింది.
దీనికి కారణాలు ఉండొచ్చు, కానీ ఫలితం మాత్రం అసంపూర్ణ చరిత్ర చిత్రణ.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఎన్సీఈఆర్టీ సవరించిన అధ్యాయాన్ని ప్రతివాద సిద్ధాంతాన్ని మోపే ప్రయత్నంగా కాకుండా, సమతౌల్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా చూడవచ్చు. హింస జరిగిన చోట దాన్ని పేరు పెట్టి చెప్పడం చరిత్రపరమైన నిజాయితీ కూడా కావచ్చు.
ఎక్కడ జాగ్రత్త అవసరం?
అయితే బోధనా సమస్యను నిజాయితీ ఒక్కటే పరిష్కరించదు. మధ్యయుగ చరిత్రను మొదటిసారి చదువుతున్న 12 ఏళ్ల పిల్లల కోసం, ఏ అంశంపై ఎంత బరువు పెట్టామన్నది చాలా ముఖ్యం. ఒక అధ్యాయం విధ్వంసం, దోపిడీని ప్రధానంగా చూపిస్తే, అది అవగాహనకన్నా జ్ఞాపకానికి ఎక్కువగా ఆకారమిస్తుంది. ఈ వయసులో విద్యార్థులు సారాంశాలకన్నా స్పష్టమైన కథనాలను ఎక్కువగా గుర్తుంచుకుంటారు.
అందుకే సమస్య హింసను ప్రస్తావించడంలో కాదు- అది మొత్తం కాలాన్ని అర్థం చేసుకునే ఏకైక కంటిచూపుగా మారిపోతుందా అన్నదే అసలు ఆందోళన.
ఎన్సీఈఆర్టీ ప్రస్తుతమున్న సమాజాలను గతంతో ముడిపెట్టి నిందించకూడదని స్పష్టంగా హెచ్చరించింది. ఇది అవసరమైన, స్వాగతించదగిన విషయం. అయినప్పటికీ, మొత్తం కథనం బరువు మాత్రం ఘర్షణ, విధ్వంసంవైపే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. అది ఉద్దేశపూర్వకమై ఉండకపోవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం తప్పించుకోలేనిది.
నిలుపుకోవాల్సిన మధ్యమార్గం
భారతదేశానికి గతాన్ని ప్రక్షాళన చేసి చూపించే పాఠ్యపుస్తకాలు అవసరం లేదు; అలాగే చరిత్రను కేవలం అఘాయిత్యాల జాబితాగా మార్చే పుస్తకాలు కూడా అవసరం లేదు.
ఈ సవరించిన గజినీ అధ్యాయం, దశాబ్దాలుగా కొనసాగిన మౌనాన్ని ఛేదించింది. ఈ సవరణ అవసరమైనదే. విధ్వంసాన్ని పట్టించుకోకపోవడం దాన్ని మాయం చేయలేదు; అది తరగతి గది వెలుపల రాజకీయ అసంతృప్తిగా మారింది అంతే.
అదే సమయంలో, చిన్న వయసు విద్యార్థులకు చరిత్ర అంటే సమాజాలు ఎలా ధ్వంసమయ్యాయో కాకుండా ఎలా పనిచేశాయో అర్థం చేయాలి. సమతౌల్యం ఉందో లేదో అనేది హింసను చేర్చామా లేదా అన్నదానిలో కాదు- దాన్ని ఎంత మేరకు, ఏ సందర్భంలో ఎలా కలిపామనేదాంట్లో ఉంటుంది.
ఈ కోణంలో చూస్తే, ఎన్సీఈఆర్టీ సవరణ ఒక ముందడుగు. కానీ అది విద్యను బలపరచాలంటే, తరగతి గదిలో ఉపాధ్యాయుల జాగ్రత్తతో కూడిన మధ్యవర్తిత్వం తప్పనిసరి. లేదంటే అది అవగాహన కలిగించకుండా భారంగా మారే ప్రమాదం ఉంది.
ఈ వ్యాసం ఇండియా టుడే సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
