
అసమానతలకు వ్యతిరేకంగా ఒక నిర్దిష్టకాలంలో జరిగిన మేధో తిరుగుబాటుపై రోసింకా చౌదరి వ్యాసాల ఆసక్తికర ప్రయాణం.

మేధోపరమైన మధనం వల్ల అనేక మార్పులు జరిగిన కాలం 19వ శతాబ్దపు బెంగాల్ గురించి తెలియజేసే రోసింకా చౌదరి పుస్తకాలు ఆసక్తికరంగా, జ్ఞానదాయకంగానూ ఉంటాయి. ఆమె తాజా పుస్తకం కూడా ఈ కోవకు చెందిందే. ఆమె తన సైద్ధాంతిక పత్రాన్ని ఆరు అధ్యాయాల్లో సంపూర్ణమైన విధంగా రచించారు. ఈ పుస్తకంలో ఆమె బెంగాల్ యువత క్రియాశీలతను రాజారామ్మోహన్ రాయ్, విలియం ఆడం విద్యాసాగార్ల జీవన ప్రయాణం గురించి ప్రస్థావించారు. అంతేకాకుండా బ్రహ్మసమాజం, నాటి సాహిత్యం, ఉద్యమాలు, బ్రిటనులో శాసనాల నేపథ్యంలో నుంచి విశాల చరిత్ర రచనను సూక్ష్మమైన ఆధార సూచికల అధ్యయనం ద్వారా వ్యక్తం చేస్తారు. ఈ కాలపు పురావస్తు ఆధారాలు దురదృష్ణవశాత్తు స్త్రీల గొంతుకలను వెలికి తీయలేకపోయాయని ఆమె చెప్తారు.
హిందూ కాలేజీలో హెన్రీ డిరోజియో శిష్యబృందపు యువబెంగాల్ బలమైన బంధాన్ని కలిగి ఉంది. ఆ కాలంలో భారతదేశంలోనే అది 436 మంది విద్యార్థులు(పేదరికం వల్ల వందమందికి రుసుము మినహాయింపు కూడా ఉంది) ఉన్న అతిపెద్ద సంస్థ. ఈ సమూహం సనాతనంతో పాటు అధికారంతో తలపడ్డానికి బయల్దేరింది. 1843 నాటికి దీని ప్రభావంపై దృష్టి కేంద్రికరిస్తూ రైతుల హక్కుల కొరకు, పోలీసు- న్యాయవ్యవస్థల అవినీతిపైనా కుల, జాతి, లింగ వివక్షతపైనా, క్రతువులు, పూజారిత్వం మూఢవిశ్వాసాలు, మతతత్త్వానికి వ్యతిరేకంగా జరిపిన సంస్థ కృషిని పరిశీలిస్తారు. ఈ కార్యక్రమాల వల్ల ఈ సంస్థ భారతదేశపు తొలి రాజకీయ పార్టీగా చెప్పుకోదగ్గదిగా పేర్కొంటారు. ఈ యువ బెంగాల్‌కు డిరోజియో, డేవిడ్ హరె, జార్జ్ థామ్సన్ స్ఫూర్తినిచ్చారు. తారాచంద్ చక్రవర్తి, కృష్ణమోహన్ బెనర్జి, రాంగోపాల్ ఘోష్, రాసిక్ క్రిష్ణ మల్లిక్, రామంతు లహరి, దక్షిణా రంజిన్ ముఖర్జి, రాదానాద్ సిక్దర్, ప్యారీ చంద్ మిశ్రా బృందంలో ముఖ్యులుగా ఉన్నారు. 19వ శతాబ్దాన్ని ఈ సంస్త చాలా పెద్దమొత్తంలో ప్రభావితం చేసింది.
1838- 1843 మధ్య కాలపు యువబెంగాల్ బృందం విశ్వజనీనతలోనూ, దేశం గురించి ఆలోచించడంలోనూ, ఆ తర్వాత వచ్చిన జాతీయవాదుల కంటే విప్లవాత్మకంగా ఉన్నారు. అది ద్విభాషత్వంపై నొక్కివక్కాణించింది. రోజువారీ భాషను సాహిత్యంలో ఉపయోగించడం ద్వారా బెంగాలీ భాషను ఆధునీకరించడానికి నాంది పలికారు. ఇందులో భాగంగా సమాంతర అనువాదాలను కూడా చేశారు. భద్రలోక్ అంటే నాగరికత, మర్యాదలు తెల్సిన వ్యక్తి అనే పదబంధం కూడా వీరిదే.
బ్రిటీషు విధానాలు మార్చాలని, హిందూ సమాజాన్ని మెరుగయిన సమాజంగా మార్చాలని ఈ యువబెంగాల్ అభిలషించింది. దాని కోసం స్వేచ్ఛావ్యాపారం, పత్రికా స్వేచ్ఛ, లింగ, సామాజిక వివక్షతలు లేకుండా విద్య కోసం చురుకుగా పనిచేశారు. కవితలు, వచనం, నవలలు, నాటకాలు రాశారు. ఈస్ట్ ఇండియా పాలనను, దోపిడీ చేసే భూస్వాములను, హిందూ ఛాందసత్వాన్ని వ్యతిరేకించారు. ఆ కాలంలో సంస్కరణలపట్ల సానుకూలత ప్రదర్శించే ఇండియా గెజిట్, ఈస్ట్ ఇండియన్, జ్జానావేశన్, ఎంక్వైరర్, బెంగాల్ స్పెక్టెటర్ వంటి పత్రికలలో అచ్చైయ్యే వార్తలపై వలస ప్రభుత్వం పెద్ద ఎత్తున నిఘా ఉంచింది.
ఈ భూమ్మీద అత్యంత పేదవారు, నిస్సహాయులైన రైతులకు యువబెంగాల్ తమ మద్దతు పలికింది. శాశ్వత స్థిరనివాసపు అధికారం తమ గుప్పిట పట్టుకున్న జమిందార్ల కింద వీరు అణిచివేతకు గురవుతున్నారు. రైతు దున్నే భూమి మీద రైతుకే హక్కుండాలని ఈ బృందం వాదించింది. ఓర్పుగా భరించే వ్యక్తిత్వం గల వారు భారతదేశ ప్రజలనే భావం 1830 ఆఖర్లో 1840 ప్రారంభంలో ఏర్పడసాగింది. దానినే యువబెంగాల్ మార్పుకు శీర్షికగా రచయిత రేఖాంకితం చేశారు. నిమ్నకులాలు, స్త్రీలు, కూలీలు, రైతులు, చిన్న రైతుల హక్కుల కోసం వీరు పిడికిలి బిగించారు. మతపరమైన, వర్ణపరమైన ఇతర వివక్షతలనేవి హేతువు విముక్తికి సంబంధించిన పరిపూర్ణ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి వాటిని వ్యతిరేకించారు. కులాన్ని హిందూ సమాజ ప్రత్యేక సమాఖ్యగా గుర్తించారు. సామాజిక, రాజకీయ రంగాల్లో పురోగతికి మతంతో పనిలేదని పక్కన పెట్టిన ఖచ్చితమైన అవగాహనకు మొట్టమొదట భారతదేశంలో ఈ యువబెంగాల్ బృందమే వచ్చింది. వాళ్లని యువబెంగాల్ జాతీయవాదులనడం అంటే, అది తర్వాతి కాలపు ఆపాదింపు మాత్రమేనని చౌదరి అంటారు. కానీ, 1843 నాటికి దేశం, దేశ ప్రజల గురించి ఆలోచనలు ఉనికిలోకి వచ్చాయి. ఆ సంవత్సరమే భారతదేశపు తొలి రాజకీయ సంస్థ- బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ(బీబీఐఎస్) ఏర్పడింది. దానిలో మిశ్రమ జాతుల భారతీయులు, అనధికారిక బ్రిటిషు పురుషులు చేర్చుకోబడ్డారు.
కలకత్తాలో సంస్కరణల కోసం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్న సంపదలేని విద్యావంతులు, సానుకూల అభిప్రాయపరులతో కూడిన వృత్తికారుల శ్రేణులకేమి కొదవ లేదు. బ్రిటిషు వారి నుంచి బీబీఐఎస్ స్వతంత్యం కోరలేదు, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం అడగలేదు. నిర్దిష్టమైన బాధలు తొలగించడానికి, సంస్కరణలను కోరుతూ ఓటమి పాలయ్యే చర్యలతో వెనుక నుంచి వాళ్లు చిన్నచిన్న పోరాటాలు చేశారు. సిపాయిల తిరుగుబాటు దేశాన్ని మొత్తం మార్చేదాకా ఇదే విధానాన్ని అనుసరించారు. రంగు, జాతి, తరగతి తేడా లేకుండా అందరి కోసం వారు తలుపు తెరిచారు. కేవలం 3 సంవత్సరాల అల్పకాలమే పార్టీ మనుగడలో ఉంది. అయినప్పటికీ ఇది జాతీయ వాదపు తొలి అర్థానికి మారుపేరుగా నిలుస్తుంది. 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావంతో ఈ భాష, వ్యాకరణం ప్రతిధ్వనించాయి.

1831 ప్రారంభం నుంచి యువ బెంగాల్ తిరుగుబాటు ప్రధానంగా సామాజిక సమస్యలపైనే కానీ, 1843 నాటికి అది రాజకీయ సంస్కరణల కోసం కదిలింది. ఈ సభ్యులు కేవలం ఆదర్శవాదులు కాదు. వారు కార్యాచరణ చేసే పనిమంతులు. ఈ పుస్తకంలో మూడు అధ్యాయాలు ఇద్దరు నిబద్ధత గల యువకులకు కేటాయించబడ్డాయి. వారు దక్షిణరంజన్ ముఖర్జీ, రాధానాద్ సిక్దర్.
భావప్రకటన స్వేచ్ఛపై 1843లో ఎస్ఏజీకేలో ముఖర్జీ ఇచ్చిన ఉపన్యాసం ఎన్నదగినది. ఈస్ట్ఇండియా కంపెనీ న్యాయవ్యవస్థ, పోలీసు పద్ధతుల్లో బ్రిటిషు పాలన నేరారోపణను బట్టి అందరికీ సమన్యాయం జరగాలని పిలుపిచ్చాడు. తర్వాతికాలంలో బర్ద్వాన్ రాజు విధవను కులాంతర వివాహం చేసుకున్నాడు. అది కూడా పౌర వివాహపద్ధతిలో, పునర్వివాహ సమర్ధనను తెలియజేస్తూ చేసుకోవడం సాంప్రదాయ నియమాలపట్ల అతనికున్న తిరస్కారాన్ని తెలియజేస్తుంది. లింగవివక్షతను వ్యతిరేకించే యువ బెంగాల్ విధానాలకు అనుగుణంగా అతను బాలికల విద్య కోసం జాన్ బెతూన్ పాఠశాలను స్థాపించడానికి సహాయపడ్డాడు. డిరోజియో సన్నిహిత అనుచరుల్లో దాదాపు ప్రతీ ఒక్కరూ చదువు చెప్పడమో లేదా స్కూలు పెట్టడమో చేశారు.
భారతదేశపు చరిత్రలో సిక్దర్ పడిన శ్రమ ద్వారా యువబెంగాల్కు సమానత్వంపై గల భావాలు వెల్లడవుతాయి. అతని సహోద్యోగులకంటే అతని వేతనం చాలా తక్కువగా ఉండటమే కాదు. వర్ణవివక్ష వల్ల అతనికి సాంకేతిక సమర్థత ఉన్నప్పటికీ గుర్తింపును అడ్డుకున్నారు. వెనకడుగు వేసే స్వభావం లేని సిక్దర్ భారత శ్రామికులపట్ల అనుచిత వ్యవహారానికి గాను ఒక బ్రిటీషు మెజిస్ట్రేటుపై కేసు వేయటం ద్వారా బ్రిటిషు వారితో వైరం తెచ్చుకున్నాడు. ఈ ఒక్క చర్యతో అతన్ని ఎవరెస్టు శిఖరం ఎత్తుతో పోల్చడానికి కారణమైంది.
19వ శతాబ్దపు మొదటి భాగంలో బెంగాల్ పట్టణ ప్రాంతపు సామాజిక విప్లవంలో యువబెంగాల్ ఒక భాగంగా ఉంటుంది. ఇది హిందూ ఛాందసత్వపు నిరంకుశత్వంపైనా, కంపెనీ పాలనపైనా దాడి చేసింది. భారతదేశ ఆధునికత ప్రారంభ వికాసపు చరిత్ర నుంచి దీన్ని విడదీయలేము. బ్రిటిషు అధికారులకు అభ్యర్థనలు ఇవ్వడం కంటే భారత ప్రచురణలు, సమావేశాలు బ్రిటనులోని ప్రజాభిప్రాయాన్ని కదిలించడంలో మెరుగ్గా పనిచేస్తాయని ఈ బృందం గ్రహించింది. దాంతో వారి వాదనను వినిపించే పద్ధతిలో గణనీయమైన మార్పు వచ్చింది. తోటి బ్రిటిషు పౌరుల మధ్య చురుకుగా ప్రచారం చేయటానికీ తద్వారా బ్రిటిషు ప్రజాభిప్రాయం ద్వారా బ్రిటను పార్లమెంటును ప్రభావితం చేసి, ఈస్టిండియా కంపెనీ తమ పద్ధతులు మార్చుకునేలా ఒత్తడి చేయడానికి ప్రయత్నించారు. అయితే, బ్రిటిషువారికి భారతదేశ వ్యవహారాలపై ఎటువంటి ఆసక్తి లేదు. బ్రిటిషు పౌరుల ఈ ఉదాసీనధోరణిని అర్ధంచేసుకోవడానికి భారతీయులకు కనీసం మరో 70 ఏళ్లు పట్టింది.
వాస్తవంగా చెప్పాలంటే, సారాంశంలో ప్రాతినిధ్యంలేని ప్రభుత్వపు సమస్య విషయంలో యువబెంగాల్ సాధించిందేమీ లేదు. యువబెంగాల్కు వ్యతిరేక పవనాలు వీచసాగాయి. రానున్న శతాబ్దంలో ఈ పదం మరింతగా సాగిసాగి చివరికి కపటవేషధారులకు ఆశ్రయం ఇచ్చేదిగా అయిపోయింది. ఆ పేరే ఒక విమర్శనాత్మక శబ్దంగా, మందలింపుగా, ఎగతాళిగా, వ్యంగ్యంగా మారింది. విక్టోరియా కాలపు సామాజిక రీతికి ఆధారంగా తిరగడం నుంచి చెప్పాలంటే యువ బెంగాల్ అసంబద్ధత అనేది ఒక కుంభకోణంగా, గతంలో ఎన్నడూ చూడని విధమైన మధ్యతరగతి రాజకీయ నాటకంగా మిగిలింది. మతాన్ని నైతికతను ఉల్లంఘించినందుకు “ఆమోదయోగ్యం కానీ తనం ఎన్నడూ పెరగటం ఆగదు” అంటూ ఛాందస్సుల్లోనే కాదు ఆధునిక బృందాల్లో కూడా ఆగ్రహం, అపహాస్యం వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సామాజిక, రాజకీయ వ్యవహారాల్లో ఈ బృందం నిజంగా చేసిన కృషి పూర్తిగా అస్పష్టంగా తయారయ్యింది. ఆధునిక భారతీయుల్లో అగ్రగాములుగా వారి పాత్ర గుర్తింపు లేకుండా పోయింది. అధ్యయనపరమైన ఈ నిర్లక్ష్యాన్ని రొసింకా చౌదరి పుస్తకం సరిచేస్తుంది. ఆ యుగపు ముఖ్య లక్షణాలను వెలికి తీయటంలో తాను సాటిలేని విశేషజ్ఞత గల దానినని ఆమె రేఖాకింతం చేస్తుంది.
బెంగాలీయేతరులకు కొన్ని సమస్యలు ఉంటాయి. పేరుల్లో బెంగాలీ, ఇంగ్లీషు రెండు రకాలని ముఖర్జీ/ ముఖోపాధ్యాయ వంటివి వాడటం, లేదా కేవలం ముందు పేరు వాడటం(రెండూ కాకుండా) కొన్ని సార్లు ఒకే పేరాలో అలా వాడటం ఒక పేరు భిన్నరకాలుగా రాయటం ఇత్యాదులు ఉన్నాయి. వచనం ప్రస్తావనలతో వాదనలతో కూడి పునరావృతం అవడం-(ఎందుకంటే ప్రతి అధ్యాయం స్వీయ సమగ్రంగా చేయటం వలన) ఉంది. అనేక ప్రతికూలతల మధ్య ఒక తక్కువ కాలవ్యవధిలో జరిగిన ఒక మేధో తిరుగుబాటు ప్రయాణాన్ని ఈ పుస్తకం చాటి చెబుతుంది.
అనువాదం: పీఏ దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.