
”ఆగస్టు ఆరో తేదీన హిరోషిమా నగరంపై మబ్బులు లేవు. దక్షిణం దిక్కు చూస్తే ఆకాశం నిర్మలంగా ఉంది. కనీసం 10- 12 మైళ్ళు చూపు ప్రసరిస్తుంది.” ఉదయాన్నే ఏడు గంటల తొమ్మిది నిమిషాల సమయంలో భారీగా శబ్దం చేసుకుంటూ అమెరికాకు చెందిన నాలుగు బీ-29 శ్రేణి యుద్ధ విమానాలు దర్శనమిచ్చాయి. 7.31 గంటల సమయంలో వారికి ఆదేశాలు వచ్చాయి.
తమ జీవితాలు భద్రంగానే ఉన్నాయని భావించిన ప్రజలు ఎప్పటిలానే తమ దైనందిన పనులకు వెళ్లారు. అంతలో ఆకాశంలో ఉన్నట్లుండి తెలుపు, గులాబీ రంగు మేఘాలు ప్రత్యక్షమయ్యాయి. వాటివెంట భయంకరమైన, భూమి బద్దలవుతుందా అన్నట్టు చెవులు తూట్లు పడేలా శబ్దాలు. దానివెంట భరించలేనంత వేడి. ఒళ్ళు నిలువునా దహించి వేసేంత వేడి. ఆ శబ్దానికి గాలికి నేలమీద ఉన్నదంతా తుడిచి పెట్టుకుపోయింది.
తారుమారైన పరిస్థితులు..
రెప్పపాటులో పరిస్థితులు తలకిందులైపోయాయి. వీధుల్లో నడుస్తన్న జనం, ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు, ఫ్యాక్టరీలలో పని చేస్తున్న కార్మికులు, నగరం నడిబొడ్డున నడుస్తున్న వాళ్ళ ఒళ్లంతా నిప్పులమయమై కాలిపోయింది. చాలామంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలినవాళ్ళు భరించలేని బాధ, నొప్పితో నేల మీద పడిపోయారు. ఇది హిరోషిమా నాగసాకి గురించి ఇంగ్లీషు మీడియాలో వచ్చిన తొలి వర్ణనలో ఒకటి.
అడ్డూ అదుపూ లేని కండకావరం ఆవహించినపుడు, కలిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి, ఈ ఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఒక ఉదాహరణగా మనల్ని నేటికీ వెంటాడుతోంది.
జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించినప్పుడు, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్ మార్సెల్ జనాఫ్ అక్కడ లేరు. కానీ, అణుబాంబు ప్రయోగం తర్వాత హిరోషిమా- నాగసాకి పర్యటించిన తొలి విదేశీ వైద్యుడు ఆయన.
బాంబుదాడి జరిగిన తర్వాత, ఆ దాడుల్లో నుంచి బతికి బయట పడిన వాళ్ళు చెప్పిన వివరాల ఆధారంగా మార్సెల్ నమోదు చేసిన విషయాలు ఇవి.
వివరాల క్రోడీకరణ అర్థవంతమైన జర్నలిజానికి ప్రాణం పోసే చర్య. మానవజాతి చరిత్రలో అత్యంత క్రూరమైన, హేయమైన, నేరపూరిత చర్యగా రికార్డయిన ఈ రెండు ఘటనలను లోకానికి తెలియజెప్పే ప్రయత్నంలో, జర్నలిజంలోని ప్రామాణిక లక్షణం తెరమీదకు వచ్చింది.
మరో వైపు స్వతంత్ర పాత్రికేయులు- వ్యాఖ్యాతలు అమెరికా అణ్వాయుధ ప్రయోగంపై అమెరికా పాలకవర్గం, సైన్యం బిగించిన కథనాల పట్టుకు తూట్లు పొడిచారు. వాస్తవాలను లోకానికి వెల్లడించారు.
వాస్తవాలు వెలుగు చూసేంత వరకూ అమెరికా ప్రజలు అదంతా అమెరికా సైనిక సామర్థ్యమని అనుకున్నారు. అంతేకాకుండా కేవలం జపాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై మాత్రమే అమెరికా ఈ బాంబులు ప్రయోగించిందని బలంగా నమ్మారు.

అమెరికా ఆయుధ ప్రయోగం అంతా జపాన్ పెరల్ హార్బర్‌పై చేసిన దాడికి సమాధానంగా జరిగిన ప్రతిచర్య మాత్రమేనని అనుకున్నారు. అమెరికా ప్రయోగించిన బాంబు దాడుల వల్లనే జపాన్ లొంగిపోయిందనీ రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయిందని, లేకపోతే యుద్ధం మరింత కాలం కొనసాగి ఎంతో మంది ప్రాణాలు తీసేదని అమెరికా ప్రజలు భావించారు.
అమెరికా ప్రజల ముందు ఉంచిన ఈ వాదనలు అన్నీ మోసపూరితమైనవి. నిష్పాక్షిక పరిశోధనల తర్వాత మాత్రమే అమెరికా కథనాల అదరగొండి తనం లోకానికి వెల్లడైంది.
ప్రాణాలతో బయటబడిన హైబకుషాలు..
హిరోషిమా, నాగసాకికి సంబంధించిన కఠోర సత్యాలను ప్రపంచానికి తెలియజేయటంలో కేవలం పరిశోధకులు, చరిత్రకారులు, జర్నలిస్టులు మాత్రమే కాదు. ఆ దాడుల నుంచి బతికి బయటపడ్డ జపాన్ ప్రజలు కూడా ఎంతగానో దోహదం చేశారు. ఈ అణుబాంబు దాడుల నుంచి బతికి బట్ట కట్టిన వారిని హైబకుషాలు అని పిలిచేవారు.
ఇలా బతికి బట్ట కట్టినవారు తమ అనుభవాలు, జ్ఞాపకాలు లోకానికి తెలియజేయటానికి కుడ్య చిత్రాలు, చిత్రలేఖనం వంటి పద్ధతులను అనుసరించారు.
హిరోషిమా బాంబు దాడిలో బతికి బట్టకట్టిన ఆరుగురి జీవితాల గురించి అమెరికాకు వివరించేందుకు, 1946లో న్యూయార్కర్ తన ప్రత్యేక సంచికలో అన్ని వ్యాసాలు విశ్లేషణలను కాదని, పూర్తిగా జాన్ హర్శి రాసిన హిరోషిమా పుస్తకాన్ని చర్చించేందుకు కేటాయించింది.
హిరోషిమా బాంబు దాడి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా హర్శి శిష్యుడు, సాహితీకారుడు, జేన్ మేయర్ సైనిక అధ్యయనాల చరిత్రకారుడు స్టీఫెన్ హిన్నర్షిత్ ఇంటర్యూలోని ఒక భాగాన్ని న్యూయార్కర్ పత్రికలో ప్రస్తావించారు.
ఆ ఇంటర్వ్యూలో స్టెఫెన్ “హిరోషిమా గురించి తాను సాగించిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా, అణ్వాయుధాల ప్రయోగం గురించిన చర్చను మార్చేయటమే కాక ఓ నూతన చర్చకు దారితీసింద”ని వ్యాఖ్యానించారు.
తన పరిశోధన వెలుగు చూసేవరకూ అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమాన్ హిరోషిమా, నాగసాకిలపై అమెరికా చేసింది వ్యూహాత్మక దాడి అని గొప్పగా చెప్పునేవారు. ఆ దాడిలో జరిగిన నరమేధం గురించి ప్రస్తావించలేదు. అమెరికా విధించిన సెన్సార్షిప్ తెరను హర్శి తొలగించారని వివరించారు. అలాంటివారిలో ఇద్దరినీ – మత్సునాగ షిజుకో, ఇషిక్వారిత్సుకోలను- ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు కలిగింది. శాంతి పడవ ఎక్కిన పదిమందిలో వీరు ఇద్దరు కూడా ఉన్నారు. (శాంతి పడవ ప్రయోగం అద్భుతమైనది. అణ్వాయుధాల కు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి సాధన ప్రాధాన్యత వివరించటానికి రూపొందించిన కార్యక్రమం అది).
షీజుకో మాటల్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఆమె మెదడు పని చేయలేదు. అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన ప్రపంచమంతా శిథిలమైపోయి, బూడిదగా మారింది.

“చుట్టూ అంతా బూదర బూదరగా కనిపించింది. పక్షుల కిలకిలా రావాలు వినిపించలేదు” అని ఆమె వివరించింది. ఆమెకు ఒక చెంప కాలిపోతున్న భావనతో పాటు తన జుట్టు కాలిపోతున్న కమురు వాసన వస్తోంది.
“13 ఏళ్ల బాలిక కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. కానీ చుట్టూ మిడుతల దండు కమ్ముకుంది. నగరంపై ఆకాశమంతా ఆ మబ్బులతో చీకటి కమ్మింది. నగరం నడిబొడ్డున అన్ని స్తంభాలు భూమిలోకి కూరుకుపోతున్నాయి. మబ్బులు నన్ను మింగేస్తాయా అన్నట్టుంది వాతావరణం” అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె వివరించారు.
“చుట్టూ శిథిలాలు, ఎటు చూసినా ఎగసిపడుతున్న మంటలు. ఈ అమ్మాయిని గుర్తు పట్టిన కొందరు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, దాదాపు అందరూ అదే తరహా షాక్‌కు గురైనట్లు ఉన్నారు. ఇంటికి చేరేసరికి ఇంటి చుట్టూ ఎంతో మంది స్త్రీ పురుషులు దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నార”ని చెప్పుకొచ్చారు.
రిత్సుకో సాన్ అప్పటికి పసిపాప కావడంతో షీజుకోకు ఉన్న ప్రత్యక్ష అనుభవాలు లేవు. కానీ హిరోషిమా ఆమె మస్తిష్కంపై కూడా మాయని గాయాలు చేసింది. బాంబు దాడి తర్వాత ఆమె తండ్రి మేనత్త కనపడకుండా పోయారు. తల్లి అనారోగ్యం పాలై ఏడేళ్ల తర్వాత చనిపోయింది. మిగిలిన హిరోషిమా అనాథలలాగానే షీజుకోను ఆమె అక్క, చెల్లెలిని వాళ్ళ నానమ్మ పెంచి పెద్ద చేసింది. హిరోషిమా గురించి అంతగా వెలుగు చూడని మరో కోణాన్ని షీజుకో వివరించింది.
అణు బాంబు బాధితుల పట్ల సమాజం ప్రదర్శించిన వివక్ష. ఆ వివక్ష ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న వాస్తవం ఈ కోణం. ఆమె పెళ్లి చేసుకోలేదు. పెళ్ళీడుకొచ్చాక పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయితే ఆమె బాంబుడాడి బాధితురాలని తెలుసుకుని వచ్చిన పెళ్లి కొడుకులు అందరూ వెనక్కు వెళ్లారు. ఇలాంటి వివక్ష ఇంకా అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే మరీ బాహాటంగా కాదు కానీ ఉంది.
ఈ కథనాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అణ్వస్త్ర ప్రయోగం మానవాళిని ఎంతలా ప్రభావితం చేస్తుందో గుర్తు చేయటానికి. తొలి అణ్వస్త్ర ప్రయోగం జరిగిన 80 ఏళ్ల తర్వాత ఈ విషయాలు చర్చించుకోవడం మరింత తక్షణ అవసరంగా మారింది.
హిరోషిమా తర్వాత ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచం ఎన్నడూ లేదు. గాజాలో జరుగుతున్న మారణహోమం కానీ, భారత్ సరిహద్దుల్లో చిలిచిలికి వానగా మారుతున్న ఘర్షణలు కానీ, ప్రపంచంలో అనేక చోట్ల రాజుకుంటున్న కుంపట్లు కానీ ప్రపంచం అణ్వస్త్ర ప్రయోగ ప్రమాదం నుంచి శాశ్వతంగా విముక్తి కాలేదని రుజువు చేస్తున్నాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.